Jallianwala Bagh: విషాద స్మారకస్థలిని వినోదపర్యాటకంలా మారుస్తారా?

2 Sep, 2021 00:42 IST|Sakshi

ఆత్మలేని ఆడంబరం

కేంద్రంపై ప్రతిపక్షాల ధ్వజం

చారిత్రక స్ఫూర్తిని పదికాలాలు కాపాడే పరిరక్షణ, పునరుద్ధరణ వేరు. స్ఫూర్తిని మింగేసి, చరిత్రనే కనుమరుగు చేసేటంత సమూల మార్పుల సుందరీకరణ వేరు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో బహుశా అతి ప్రాచీన స్మారకస్థలి జలియన్‌వాలా బాగ్‌లో చేయిపెట్టినప్పుడు ప్రభుత్వం ఈ చిన్న తర్కం మర్చిపోయినట్టుంది. కేంద్రం అక్కడ చేసిన తాజా మార్పులు, కొత్త నిర్మాణాల చేర్పులు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న ఓ విషాద స్మారకస్థలిని ఫక్తు వినోదపర్యాటకంలా మారుస్తున్నారని ప్రతిపక్షాలు, పౌరసమాజం అందరూ ధ్వజమెత్తుతున్నారు.  

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జలియన్‌వాలా బాగ్‌ స్మారకస్థలం ప్రపంచదేశాల స్వాతంత్య్ర చరిత్రలో ప్రత్యేకమైనది. తొలి ప్రపంచ యుద్ధకాలంలోని అణచివేత చర్యలను కొనసాగిస్తున్న రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా 10 – 12 వేలమంది భారత స్వాతంత్య్ర ప్రియులు 1919 ఏప్రిల్‌ 13న జలియన్‌వాలా బాగ్‌లో సమావేశమయ్యారు. నిరాయుధులైన ఆ శాంతియుత ఉద్యమకారులు బయటకు వెళ్ళడానికి ఉన్న దారిని మూసేసి మరీ, బ్రిగేడియర్‌ జనరల్‌ డయ్యర్‌ సారథ్యంలోని బ్రిటీష్‌ సైన్యం పది నిమిషాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపింది.

కాల్పులను తప్పించుకొనే మార్గం లేక పక్కనే ఉన్న బావిలోకి జనం దూకిన విషాద సందర్భం అది. వైశాఖి పర్వదిన వేళ జరిగిన ఆ అమానుష కాల్పుల్లో అధికారిక లెక్కల ప్రకారమే 379 మంది చనిపోయారు. అంతకు మూడురెట్లు గాయపడ్డారు. అసలైతే అమరులు, క్షతగాత్రుల సంఖ్య వేలల్లోనే! అప్పట్లో గాంధీ తదితర జాతీయనేతలు జనం నుంచి విరాళాలు పోగుచేసి, దాన్ని స్మారకోద్యానంగా మార్చారు. 

ఆ ప్రాంగణం మధ్యలో ఇప్పుడున్న అతి పెద్ద స్తూపాన్ని 1961లో కట్టి, అధికారిక స్మారకస్థలి నిర్మించారు. ఆనాటి అమానుషానికి నేటి బ్రిటీషు వారసులు దాదాపు క్షమాపణ కోరినంత పని చేయడం మరో చరిత్ర. జాతి రక్తం ఉప్పొంగే ఆ చారిత్రక విషాదస్థలిని ఇప్పుడేమో వినోద పర్యాటక స్థలంలా మార్చేశారన్నది విమర్శ. ఏడాదిన్నరగా నవీకరించిన ఆ స్మారకాన్ని ఆగస్టు 28న ప్రధాని మోదీ జాతికి అంకితం జేశారు. ‘చరిత్రను కాపాడుకోవడం బాధ్యత’ అనీ ఆయన సెలవిచ్చారు. మరి చరిత్రను కాపాడాల్సిన సర్కారు తీరా చేసిందేమిటి? నాటి విషాదాన్ని కళ్ళకు కట్టే ఇరుకుదారిని మార్చేసి, అందమైన కుడ్యశిల్పాలు, త్రీడీ ప్రొజెక్షన్లు, లేజర్‌ అండ్‌ సౌండ్‌ షోలు పెట్టింది. 

102 ఏళ్ళ క్రితం జలియన్‌వాలా బాగ్‌ దమనకాండలో అమరులైనవారికి ప్రధాని ఒక పక్కన శ్రద్ధాంజలి ఘటిస్తుండగానే, పొరుగున ఆయన పార్టీ ప్రభుత్వమే నడుస్తున్న హర్యానాలో పోలీసు లాఠీలు రైతు ఉద్యమకారులను రక్తమోడేలా బాదడం విరోధాభాస. ప్రశాంతంగా సమావేశమైన స్వాతంత్య్ర సమరవీరుల్ని ‘కాల్చిపారేయ’మన్న ఆనాటి జనరల్‌ డయ్యర్‌కూ, రైతుల ‘బుర్రలు బద్దలు కొట్టండి’ అన్న నేటి ప్రభుత్వ ప్రతినిధులకూ తేడా ఏముంది? ఏడాది క్రితం పంజాబ్‌లో మొదలైన రైతు ఆందోళనలు 9 నెలలుగా ఢిల్లీ శివార్లలో సాగుతున్నాయి. రౌలత్‌ చట్టాన్ని వ్యతిరేకించిన అప్పటి అమరులదీ, కొత్త సాగుచట్టాలను వ్యతిరేకిస్తున్న ఇప్పటి రైతులదీ – ఇరు వర్గాలదీ శాంతియుత ఉద్యమమే. కానీ, ప్రభువుల ప్రవర్తన మాత్రం నూరేళ్ళు దాటినా మారలేదన్న మాట. 

జలియన్‌వాలా బాగ్‌ స్మారకానికి కేంద్రం చేసిన మార్పులను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, సీపీఎం నేత సీతారామ్‌ ఏచూరి సహా పలువురు విమర్శించారు. ఈ మార్పులు ‘అమరవీరులను అవమానించడమే. బలిదానానికి అర్థం తెలియని వ్యక్తే ఇలా చేయగలర’ని రాహుల్‌ విరుచుకుపడ్డారు. జరిగిన కథకు ప్రతీక అయిన జలియన్‌వాలా బాగ్‌ ఇరుకైన దారిని సమూలంగా మార్చేయడం ‘చరిత్రను ధ్వంసం చేయడమే’ అని జనంలో చర్చ రేగింది.

డిస్కో లైట్లు – బొమ్మలు పెట్టి, సందర్శకుల నుంచి రుసుము వసూళ్ళతో వినోదాత్మక పర్యాటక ప్రదేశంలా మార్చడం జలియన్‌వాలా బాగ్‌ విషాదబీభత్సానికి ఒక రకంగా అగౌరవమే. అయితే, అధిష్ఠానం ఆశీస్సులున్న సిద్ధూతో అస్తుబిస్తు అవుతున్న పంజాబ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ మాత్రం తమ అధినేత రాహుల్‌ అభిప్రాయానికి విరుద్ధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘అక్కడేం తొలగించారో నాకు తెలీదు కానీ, ఆ స్మారకం నాకైతే బాగుంది’ అన్నారాయన. రాష్ట్రంలోని కీలక స్మారకాన్ని కేంద్రం మార్చేస్తుంటే, అమరిందర్‌ ఎందుకు అడ్డుకోలేదన్నది ఇప్పుడు మరో విమర్శ.

కారణాలేమైనా, చారిత్రక ప్రదేశాల్ని పరిరక్షించే బదులు అందంగా చరిత్రని పునర్నిర్మించాలనుకుంటేనే సమస్య. అందంగా లేదని అమ్మనైనా, చరిత్రనైనా మార్చలేం. కానీ, పాలకులు మారినప్పుడల్లా చరిత్రను తమ కళ్ళతోనే అందరూ చూడాలనుకోవడం, ఎవరి రంగులు వాళ్ళు పులమాలనుకోవడం కొన్నేళ్ళుగా జరుగుతున్న తంతు. భారత స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రిసెర్చ్‌’ విడుదల చేసిన పోస్టర్‌లో నవభారత నిర్మాత నెహ్రూ లాంటి వాళ్ళ బొమ్మ లేదని ఇటీవలే వివాదం రేగింది. ఇప్పుడీ స్మారకస్థలి వ్యవహారం వచ్చింది.

అన్నిటా పైపై పటాటోపానికి ప్రాధాన్యమిస్తే ఇలానే ఉంటుంది. భావితరాలకు అందించాల్సింది ఆలోచింపజేసే స్ఫూర్తినే తప్ప, అందమైన ఊహల అనుభూతిని కాదు. అలా ప్రతిదీ మార్కెట్‌ చేసుకొనే యావలో పడ్డ పాలకుల వల్ల చరిత్రకు ప్రమాదమే. చరిత్రకారుడు కిమ్‌వాగ్నర్‌ అన్నట్టు ‘జలియన్‌వాలాబాగ్‌ చరిత్ర ఇప్పుడు చరిత్రలో కలిసిపోయింది’. అవును... ఆత్మ పోయింది. ఆడంబరమే మిగిలింది. స్వాతంత్య్ర సమరంలో అసువులు బాసిన అమరవీరుల స్మారక సాక్షిగా ఇది మరో తీరని విషాదం.  

మరిన్ని వార్తలు