నూరేళ్ల స్రవంతి

9 May, 2022 00:26 IST|Sakshi

మానవ అంతరంగపు సంక్లిష్టతను మహాద్భుతంగా చిత్రించిన మహారచయితలు ఎందరో ఉన్నారు. అయితే ఆ అంతరంగపు సంక్లిష్టతకు తగిన మరింత దగ్గరి రూపాన్ని సాహిత్య ప్రపంచం ఎప్పటికప్పుడు వెతుక్కుంటూనే ఉంది. అట్లా ఆధునిక వచనపు అత్యున్నత సృజనశీలతకు ప్రతి రూపంగా చైతన్య స్రవంతి టెక్నిక్‌ ఉద్భవించింది. ఆ సృజన ప్రక్రియలో శిఖరప్రాయమైన రచన – ‘ఉలిసేస్‌’ నవల. చైతన్య స్రవంతి అనగానే మొట్టమొదలు గుర్తొచ్చే ఈ నవలకు ఇది శతాబ్ది సంవత్సరం. 1922 ఫిబ్రవరి 2న దీని తొలి ఎడిషన్‌ వచ్చింది – జేమ్స్‌ జాయిస్‌ నలభయ్యో (1882–1941) పుట్టినరోజుకు సరిగ్గా అందేట్టుగా!

గ్రీకులో హోమర్‌ విరచిత ‘ఒడిస్సీ’ కావ్యానికి ఆధునిక రూపంగా ఐరిష్‌ రచయిత అయిన జేమ్స్‌ జాయిస్‌ ఆంగ్లంలో ఈ ‘ఉలిసేస్‌’ రాశాడు. ట్రోజన్‌ యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి తన రాజ్యమైన ఇతకాకు వెళ్తూ, పదేళ్లపాటు ఎన్నో కష్టాలను ఎదుర్కొని, చివరకు అన్నేళ్లుగా తనకోసమే వేచివున్న భార్య పెనలోపి, కొడుకు తలామకస్‌ను చేరుకుంటాడు హోమర్‌ కావ్యనాయకుడు ‘ఒడిస్సీస్‌’. దీన్ని లాటిన్‌లో ఉచ్చరించే విధానం ‘ఉలిసేస్‌’. అదే పేరును తన నాయకుడికి ఎంచుకున్నాడు జాయిస్‌. నవలలోని లియోపాల్డ్‌ బ్లూమ్, ఆయన భార్య మోలీ బ్లూమ్, ఇంకా స్టెఫాన్‌ డిడాలస్‌... ఈ మూడు పాత్రలూ ‘ఒడిస్సీ’లోని ఉలిసేస్, పెనలోపి, తలామకస్‌కు ఆధునిక రూపాలు. అయితే ఈ సాధారణ మనుషులు ఎదుర్కొనే కష్టాలు మాత్రం రోజువారీ అతి అల్పమైన, ‘నీచమైన’ అంశాలే. 

ఈ నవల ఒక్కరోజులో 1904 జూన్‌ 16న ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌ కేంద్రంగా సాగుతుంది. లియోపాల్డ్‌ బ్లూమ్‌ ఆ ఒక్క సుదీర్ఘరోజులో ఉదయం లేచినప్పటి నుంచీ ఏ రాత్రికో కొంపకు చేరుకోవడం దాకా సాగే అనుభవాల సారం ఇది. పెంపుడు పిల్లి కోసం దుకాణంలో మాంసం కొనుగోలు చేయడం, పత్రికాఫీసుకు వెళ్లడం, ఒక చావుకు హాజరు కావడం, ఒక పుట్టుకను చూడటం, ఒక యూదుడిగా పరాయివాడి ముద్రను ఎదుర్కోవడం, మ్యూజియం దర్శించడం, తినడం, తాగడం, వ్యభిచార గృహం చేరుకోవడం, కొడుకు లాంటి తలామకస్‌కు తారసపడటం, ‘విశ్వాసం’ లేని భార్య గురించి క్షోభపడటం... ఈ ప్రతి సందర్భంలోనూ అతడి అంతరంగపు అగాథాలనూ, తాత్విక వివేచననూ, ప్రతి సూక్ష్మ వివరం సహా జాయిస్‌ దర్శింపజేస్తాడు.

నవల ఒక్క రోజులో జరిగేదైనప్పటికీ దీన్ని రాయడానికి జాయిస్‌కు ఏడేళ్లు పట్టింది. ఇరవైల్లో ఉన్నప్పుడు తన మాతృదేశంలోని పరిస్థితుల మీది విముఖతతో తనకు తాను స్వీయ బహిష్కరణ విధించుకున్నాడు జాయిస్‌. అట్లా ట్రీఎస్ట్‌(ఇటలీ), జ్యూరిక్‌(స్విట్జర్లాండ్‌) నగరాల్లో గడిపాక ప్యారిస్‌(ఫ్రాన్స్‌) చేరుకున్నాడు. ఆ మూడు నగరాల్లోనూ రచన సాగింది. ఒక విధంగా తనకు ఎంతో ఇష్టమైన డబ్లిన్‌ను దూరం నుంచి అపురూపంగా చూసుకున్నాడు. అందుకే అక్కడి ప్రతి వీధీ ఇందులో దర్శనమిస్తుంది. దీనిలోని కొన్ని భాగాలు 1920లో యూఎస్‌ మ్యాగజైన్‌ ‘లిటిల్‌ రివ్యూ’లో అచ్చయినాయి. అయితే అశ్లీలంగా ఉందన్న కారణంగా ఆ పత్రిక సంపాదకులు విచారణను ఎదుర్కొన్నారు. జరిమానా విధిస్తూ తర్వాతి ప్రచురణను నిలిపివేయమని ఉత్తర్వులిచ్చింది కోర్టు. గ్రేట్‌ బ్రిటన్‌లో కూడా ఇలాంటి నిందలే మోపారు. ఐర్లాండ్‌లో మాత్రం ఇది నిషేధానికి గురికాలేదు. దాన్ని ఎటూ చదివేది గుప్పెడు మంది; మళ్లీ దానికోసం నిషేధం అవసరమా అన్నది అప్పుడు వారి ఆలోచన. చాలాకాలం జాయిస్‌ను ఐర్లాండ్‌ పూర్తిగా సొంతం చేసుకోలేదు కూడా!

చివరకు ప్యారిస్‌లో ఇంగ్లిష్‌ పుస్తకాలు అమ్మే సిల్వియా బీచ్‌ దీన్ని ఏకమొత్తంగా పుస్తకంగా తెచ్చింది. ‘షేక్‌స్పియర్‌ అండ్‌ కంపెనీ’ పేరుతో పుస్తకాల దుకాణం నడిపేదామె. ప్రింటర్‌కు చెల్లించ డానికి తాను ప్రతి చిల్లిగవ్వా దాచానని పేర్కొంది. తానొక మాస్టర్‌ పీస్‌ను ప్రచురిస్తున్నానన్న నమ్మకం ఆమెను ముందుకు నడిపింది. పుస్తకం వచ్చాకా విమర్శలు ఆగలేదు. రచయిత్రి వర్జీనియా వూల్ఫ్‌ దీన్ని చెత్తగా కొట్టిపారేసింది. పైగా దీన్ని చదవడం ఏమంత సుఖమైన అనుభవం కాదు. అత్యంత సంక్లిష్టంగా ఉండి, శ్లేషలు, ప్రతీకలు, వ్యంగ్యం పరుచుకుని ఉంటాయి. అంతర్ముఖమైన గొంతుకలు వినిపిస్తుంటాయి; స్టెఫాన్, మోలీ అంతరంగాలు సహా. అందుకే ఆదరణ అంతంతే ఉండింది. అయినా జాయిస్‌ ‘కనీసం జనాల అభిరుచికి తగ్గట్టుగా కామాను మార్చడానికి కూడా’ ఇష్టపడలేదు. ఏమైనా నెమ్మదిగా తన మాతృదేశంతో సహా ప్రపంచమంతటా జేమ్స్‌ జాయిస్‌ ‘కల్ట్‌’ మొదలైంది. ‘చైతన్య స్రవంతి’ అనే పేరుతోనే తెలుగులో బుచ్చిబాబు ఈ టెక్నిక్‌ను పరిచయం చేయడానికి కథ రాశాడు. నవీన్‌ ఈ ప్రక్రియలో రాసిన నవలతో ‘అంపశయ్య’ నవీన్‌ అయ్యాడు.

2,65,000 పదాలు గల ‘ఉలిసేస్‌’ కష్టం అనే మాటతో జోడింపబడింది; నిజానికి అక్కడ ఉండాల్సిన మాట ఆనందం అంటాడు విమర్శకుడు స్టీఫెన్‌ ఫ్రై. ఈ నవల వీరాభిమానులు దీన్ని చదవడానికి కొన్ని మార్గాలు చెబుతారు: విమర్శలను చదవొద్దు, పుస్తకం చదవాలి. వేగంగా చదవొద్దు, గట్టిగా చదువుతుంటే దానికదే సజీవంగా ఆవిష్కృతమవుతుంది. నాలుగో అధ్యాయం చదవడానికి అవసరమైన క్లూస్‌ మూడో అధ్యాయంలో ఉండే డిటెక్టివ్‌ నవల కాదిది; కాబట్టి వరుస పెట్టి చదవాల్సిన పని కూడా లేదు. నెమ్మదిగా అందులో మునిగిపోతే ఇది ఇవ్వగలిగే పఠనాను భవాన్ని ఇంకో పుస్తకం ఇవ్వలేదు. ఒక్కటైతే గట్టిగా చెప్తారు. సులభంగా ఒక పుస్తకం చదివి పక్కన పెట్టేయాలనుకునేవారికి మాత్రం ఇది తగినది కాదు!

మరిన్ని వార్తలు