బైడెన్‌ కర్తవ్యాలు

20 Jan, 2021 00:42 IST|Sakshi

మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని జో బైడెన్‌ అధిరోహించబోతున్నారు. సాధారణంగా ప్రమాణస్వీకారోత్సవంనాడు కాబోయే అధ్యక్షుడి ప్రాముఖ్యతలు, విధానాలు మీడియాలో ఎక్కు వగా ప్రస్తావనకొస్తాయి. కానీ నిష్క్రమిస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ పుణ్యమా అని అందరి దృష్టీ ఇప్పుడు బైడెన్‌కు కల్పించే భద్రతపై పడింది. ఆయనకు ఎవరైనా హాని తలపెట్టే ప్రమాదం వుండొచ్చన్న సమాచారంతో ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ) కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. ఎవరి ఊహకూ అందనివిధంగా ఈనెల 6న కేపిటల్‌ భవంతిలో ట్రంప్‌ మద్దతు దారులు విధ్వంసం సృష్టించటం, అందుకు పోలీసు అధికారుల్లో కొందరు తోడ్పాటునీయటం వంటివి చూశాక ఈ చర్యలు అవసరమని మొదటే అనుకున్నారు.

ప్రమాణస్వీకారాన్ని ఒక ప్రత్యేక సందర్భంగా పరిగణించి వాషింగ్టన్‌ డీసీలో నేషనల్‌ గార్డ్‌కు చెందిన బలగాలను వినియోగించటం సర్వసాధారణమే అయినా ఈసారి ఆ బలగాల సంఖ్య రెండున్నర రెట్లు అధికం. ఇప్పుడున్న పరిస్థి తుల్లో 15,000మంది అవసరం పడొచ్చని మొదట్లో అనుకున్నారు. అదే చాలా ఎక్కువనుకుంటే అదిప్పుడు 25,000కు పెరిగింది.  సైన్యంనుంచి, వైమానిక దళంనుంచి ఎంపిక చేసిన కొందరిని ఈ కార్యక్రమం కోసం వినియోగించటం ఆనవాయితీ. ఎంపికలో అప్రమత్తంగా వుండాలని ఆ రెండు విభాగాలకూ చెప్పటంతోపాటు, వారు పంపిన జాబితా ఆధారంగా ప్రతి ఒక్కరి నేపథ్యాన్నీ ఈసారి జల్లెడపట్టారు. ఎవరికైనా తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయేమోనని ఒకటికి రెండుసార్లు ఆరా తీశారు.

బైడెన్‌ను తీవ్రంగా వ్యతిరేకించే మితవాద జాత్యహంకార బృందాల కార్యకలాపాలు ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్‌వంటి సామాజిక మాధ్యమాల్లో నిలిచిపోయాయి. వారంతా నిఘాకు దొరకని టెలిగ్రామ్, సిగ్నల్‌వంటి మాధ్యమాల్లో చేరి కార్యకలాపాలు సాగిస్తున్నారని తెలియటంతో ఎఫ్‌బీఐ మరింత అప్రమత్తమైంది. జనం తీర్పును గౌరవించటం, పదవినుంచి హుందాగా నిష్క్ర మించటం అమెరికాలో ఇన్నాళ్లుగా వస్తున్న సంప్రదాయం.  కొత్తగా బాధ్యతలు తీసుకోబోయే అధ్య క్షుడు వైట్‌హౌస్‌కు సతీసమేతంగా రావటం, వారిని ఆహ్వానించటం, ఆ తర్వాత వారితో కలిసి కేపిటల్‌ భవన సముదాయానికి వెళ్లటం, ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొని వెనుదిరగటం ఆనవా యితీ. కానీ ట్రంప్‌ ఇందుకు భిన్నమైన వారసత్వాన్ని మిగిల్చిపోతున్నారు. ప్రమాణస్వీకారోత్సవ సమయానికి వాషింగ్టన్‌ నుంచే వెళ్లిపోతున్నారు. 

వీటి సంగతలావుంచి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టింది మొదలు బైడెన్‌ చేయాల్సిన పనులు చాలావున్నాయి. కరోనా వైరస్‌ మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేం దుకు 1.9 లక్షల కోట్ల డాలర్ల ఉద్దేశించిన ఉద్దీపన ప్యాకేజీ సాధ్యమైనంత త్వరగా కాంగ్రెస్‌ ఆమోదం పొందేలా చూడటం, ఆ వ్యాధి నియంత్రణకు పకడ్బందీ చర్యలు ప్రారంభించటం, వాతావరణ మార్పుల విషయంలో కొత్త విధానాలను ప్రకటించటం, జాతి వైషమ్యాలను అరికట్టే కార్యాచరణకు పదునుపెట్టడం వగైరాలు అందులో కీలకమైనవి. చైనా, రష్యాల నుంచి సవాళ్లు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అలాగే వలసలపై, మరీ ముఖ్యంగా కొన్ని ముస్లిం దేశాలనుంచి వచ్చేవారిపై విధించిన నిషేధాలను సమీక్షించి సరిదిద్దటం, ఆరోగ్య బీమా పరిధిని పెంచటం, నేర న్యాయవ్యవస్థ సంస్కర ణలు ఆయన సమీక్షించాల్సివుంది. మాస్క్‌లు ధరించటం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సి వుంది.

వాతావరణ మార్పులకు సంబంధించి ఒబామా హయాంలో పారిస్‌ ఒడంబడికపై అమెరికా సంతకం చేయగా, ట్రంప్‌ దాన్నుంచి బయటికొస్తున్నట్టు నిరుడు ప్రకటించారు. అందులో చేరుతున్నట్టు లాంఛనంగా బైడెన్‌ ప్రకటించి, సభ్యత్వం కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు తీసుకున్న రుణాల చెల్లింపుపై విధించిన మారటోరియం గడువు గత నెలతో ముగిసి పోయింది. దాన్ని పొడిగించాల్సివుంది. తన కేబినెట్‌ అమెరికా వైవిధ్యతకు అద్దం పట్టేలా వుంటుం దని ఇప్పటికే బైడెన్‌ ప్రకటించారు. జాతి, రంగు, జెండర్‌ వంటి అంశాలను దృష్టిలో వుంచుకుని ఆయన కేబినెట్‌ను రూపొందిస్తున్నారు. కొన్ని కీలక పదవుల్లో వుండబోయేవారెవరో ఇప్పటికే ఆయన ప్రకటించారు. ఈ నియామకాలన్నిటినీ సెనేట్‌ ఓకే చేయాల్సివుంది. ఇన్నిటిపై నిర్ణయాలు తీసుకోవాల్సిన బైడెన్‌ ట్రంప్‌ అభిశంసన విషయంలో పట్టుదలగా వున్నారు. సెనేట్‌లో అందుకు సంబంధించిన తీర్మానంపై సాధ్యమైనంత త్వరగా చర్చ ముగిసి, అది ఆమోదం పొందాలని కోరు కుంటున్నారు. అయితే సెనేట్‌ రిపబ్లికన్‌ నాయకుడు మెక్‌ కానిల్‌ అంత తేలిగ్గా వదలరు. జాప్యం జరి గేలా చూస్తారు. చేయాల్సిన పనులు చాలావుండగా ఈ తీర్మానం బైడెన్‌కు ఎంతో కొంత ఆటంకంగా మారుతుందనే చెప్పాలి. 

అమెరికాలో ఇప్పుడున్న వైషమ్య వాతావరణం ట్రంప్‌ సృష్టి కాదు. సమాజంలో అప్పటికే వున్న పగుళ్లను ఆయన మరింత విస్తరించేలా చూశారు. వివిధ వర్గాల మధ్య వున్న అపోహలను పెంచారు. నివారణ చర్యలు మాట అటుంచి తన మాటలతో, చేతలతో వాటిని వున్నకొద్దీ పెంచుతూ పోయారు. పాశ్చాత్య సమాజం ప్రవచించే ప్రజాస్వామ్యంపై ప్రపంచం మొత్తం సంశయపడే స్థితిని కల్పించారు. గత పాలకులు చాలా విషయాల్లో నిర్లక్ష్యంగా వున్నారు. సంపద పెంచుకుంటూ పోవటం తప్ప, దాని పంపిణీలో వున్న అసమానతల్ని పట్టించుకోవడంలేదు. ఒకప్పుడు పారిశ్రామిక నగరాలుగా వర్థిల్లిన ప్రాంతాలు శిథిల నగరాలను తలపించాయి. పర్యవసానంగా ఏ వర్గాలు ఎలా నష్టపోయాయో ఆరా తీసి ఆదుకున్నవారు లేకపోయారు. ప్రపంచీకరణవల్ల నష్టపోయిన వర్గాలు ఎంత అసంతృప్తితో వున్నాయో గ్రహించలేకపోయారు. ట్రంప్‌ అభిశంసనకన్నా వీటిని సరిచేయటం అత్యవసరమని బైడెన్‌ గ్రహించాలి. లేనట్టయితే ట్రంప్‌ తరహాలోనో, ఆయన్ను మించిన విధానాల తోనో ఎవరో ఒకరు రంగప్రవేశం చేయటం ఖాయం. ఆ ప్రమాదాన్ని నివారించటం ముఖ్యం. 

మరిన్ని వార్తలు