జర్నలిస్టు రచయిత

11 Sep, 2023 00:00 IST|Sakshi

ప్రపంచంలోని గొప్ప రచయితల్లో కొంతమంది వృత్తిరీత్యా జర్నలిస్టులుగా పనిచేశారు. ఒక రచయిత జర్నలిస్టు అయితే తన రోజువారీ ‘స్టోరీ’లకు కథనబలాన్ని ఇవ్వగలడు. కానీ తమలోని రచయితనూ, జర్నలిస్టునూ వేరుగా ఉంచుకోవడానికే చాలామంది ప్రయత్నించారు. అనివార్యంగా ఆ రెండు పాత్రలూ కలిసిపోయే సందర్భాలు రావొచ్చు.

అయితే, పూర్తి స్పృహతో తనలోని రచయితతో జర్నలిస్టును మేళవించినవాడు ట్రూమన్‌ కపోటి. ఆ మేళన ఫలితంగా నాన్‌–ఫిక్షన్‌ నవల ఉద్భవించింది. సాహిత్యానికి ఒక కొత్త ప్రక్రియను ‘పరిచయం’ చేసిన ట్రూమన్‌ కపోటి (30 సెప్టెంబర్‌ 1924 – 25 ఆగస్ట్‌ 1984) శతజయంతి సంవత్సరానికి ప్రారంభం ఇది.

యూఎస్‌లోని లూసియానా రాష్ట్రంలో జన్మించిన ట్రూమన్‌ కపోటీ ఐదేళ్లప్పుడే బడికి నిఘంటువు మోసుకెళ్లేవాడు. ఎనిమిదేళ్ల వయసులోనే రచయిత అవుతాననుకున్నాడు. చాలామందికి జీవితం సగం ముగిసేదాకా తమకు ఏం కావాలో తెలీదు. కానీ తాను ఆ కోవలోకి చెందని ప్రత్యేక జీవినని కపోటికి తెలుసు.

‘ద న్యూయార్కర్‌’ సహా ఇతర పత్రికలకు పనిచేస్తూనే, కథలు రాశాడు. ఇరవైల్లోకి వచ్చేనాటికే ఆయన సెలబ్రిటీ. ‘ఆధునిక సాహిత్యపు ఆశాదీపం’ అని మెచ్చుకున్నాడు సోమర్‌సెట్‌ మామ్‌. ‘బ్రేక్‌ఫాస్ట్‌ ఎట్‌ టిఫనీస్‌’ (1958) నవలికతో కపోటి పేరు మార్మోగిపోయింది. 

రోజూ కనబడే చంద్రుడు కొన్నాళ్లుగా వార్తల్లో ఉన్నాడు. 1959లో రష్యా చంద్రుడి మీద దిగింది. అదే ఏడాది అమెరికాలో పెరోల్‌లో ఉన్న ఇద్దరు నేరస్థులు కాన్సాస్‌లోని ఒక ధనిక రైతును దోచుకోవడానికి పథకం వేశారు. ఇంట్లోకి ప్రవేశించి, యజమాని, ఆయన భార్య, వాళ్ల ఇద్దరు కౌమార కూతుళ్లను బంధించారు. తీరా నగదు రూపంలో ఏమీ దొరకదు. కేవలం సాక్ష్యంగా మిగిలిపోతారని నలుగురినీ హత్య చేశారు.

అది అమెరికాలో పెను సంచలనం సృష్టించిన నేరవార్తల్లో ఒకటి. దాని ఆధారంగా ఆరేళ్ల పరిశోధన అనంతరం ‘ఇన్‌ కోల్డ్‌ బ్లడ్‌’ (1965) రాశాడు కపోటి. దీనికి వాడిన కథనాత్మక పాత్రికేయ టెక్నిక్‌ను ‘నాన్‌ఫిక్షన్‌ నవల’ అన్నాడు. జర్నలిజం, కథనం కలిసి కొత్త కళారూపానికి దారి తీయగలదని భావించాడు.

సృష్టించే సామర్థ్యం ఉన్నప్పుడు, వాస్తవ కథనం కోసం శ్రమ పడటం దేనికి అన్న వైఖరి కొందరు రచయితల్లో ఉంటుంది. సీరియస్‌ రచయితల కళాత్మక స్థాయికి జర్నలిజం తగనిది అన్న అభిప్రాయమూ ఉండకపోదు. ఇదంతా కాదన్నా, ఒక మనిషి వ్యక్తిత్వాన్ని వడగట్టి రచనలోకి తేవడం అంటే చాలా రకాలుగా సిద్ధపడాలి.

‘బ్రేక్‌ఫాస్ట్‌ ఎట్‌ టిఫనీస్‌’ తన క్యారెక్టర్‌నే పెట్టి రాశాడని ఒకావిడ 8 లక్షల డాలర్లకు తెచ్చిన (విఫల) దావాను ఎదుర్కొన్న చేదు అనుభవం అప్పటికే కపోటికి ఉంది. పైగా, ఎంత నిజజీవిత కథనానికైనా ఊహాశక్తి లేకపోతే ప్రాణం పోయలేము. ‘లిటెరరీ ఫొటోగ్రాఫర్‌’లా సూక్ష్మాంశాలను మనసులోకి ఎక్కించుకోవాలి. ‘హ్యూమన్‌ టేప్‌ రికార్డర్‌’లా మారాలి.

మరి విషయ సేకరణ ఎట్లా? తలుపులు తట్టడం సరే, వాళ్ల మనసులను మీటడం ఎలా? కపోటి ముందు ఆ ప్రాంతానికి వెళ్లి, అక్కడ కొన్నాళ్లు ఉన్నాడు. ఒక ఇంటర్వ్యూలా మాట్లాడితే అసౌకర్యం కాబట్టి, టేప్‌ రికార్డర్లు ఉపయోగించలేదు. వెళ్లేముందు ఒక సాధన చేశాడు: స్నేహితుడు ఓ పుస్తకంలోని పేజీలను చదివి వినిపిస్తాడు. దాన్ని కపోటి విని, తిరిగి రాసేవాడు. ‘దాదాపు 95 శాతం కచ్చితత్వం’ సాధించాడు.

ఇన్ని చేసినా వార్తా కథనాలకు కాలం చెల్లిపోయే ప్రమాదం ఎక్కువ. వాస్తవ ఘటన ఒక తార్కిక ముగింపునకు వస్తే తప్ప రచనను ముగించలేం. ఈ సందర్భంలో తార్కిక ముగింపు అంటే, నేరస్థుల ఉరిశిక్ష అమలు కావడమే. రచయిత ఆ క్షణం కోసం ఎదురుచూడాలి.

‘ఇది హింస,’ అంటాడు కపోటి. ఆఖరికి 6,000 పేజీల నోట్సుతో– హంతకులు, బాధితులు, గ్రామీణ సమాజపు మనుషులు– మూడు కోణాల్లో చిత్రించిన 340 పేజీల ‘ఇన్‌ కోల్డ్‌ బ్లడ్‌’ తక్షణ బెస్ట్‌ సెల్లర్‌గా, కపోటి అత్యుత్తమ రచనగా సాహిత్య చరిత్రలో నిలిచిపోయింది. నాన్‌–ఫిక్షన్‌ నవల అనే ప్రక్రియను తాను పరిచయం చేయడం అనడం కంటే, అప్పటికే ఉన్నదాన్ని తాను అత్యున్నత స్థితికి తీసుకెళ్లానని మాత్రమే అనేవాడు కపోటి. 

చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో, బంధువుల ఇంట్లో పెరిగాడు కపోటి. ఎప్పుడూ వ్యాకులతతో ఉండేవాడు. ఆయన ఒంటరితనంలో స్నేహపు సెలయేరు పొరుగున ఉండే హార్పర్‌ లీ. అనంతర కాలంలో ‘టు కిల్‌ ఎ మాకింగ్‌బర్డ్‌’ నవలా రచయిత్రి. అందులోని ‘డిల్‌’ పాత్రను ఆమె కపోటి నమూనాగా తీర్చిదిద్దారు.

కపోటి రచన ‘అదర్‌ వాయిసెస్, అదర్‌ రూమ్స్‌’లో ఇడాబెల్‌ పాత్రకు లీ ప్రేరణగా నిలిచారు. వారి బాల్య స్నేహం చివరిదాకా కొనసాగింది. ‘ఇన్‌ కోల్డ్‌ బ్లడ్‌’ క్షేత్రస్థాయి పరిశోధనలో లీ సహాయం చేశారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలు సాధించడంలో. హోమోసెక్సువల్‌ అని ప్రకటించుకున్న కపోటి, దాని తాలూకు తిరస్కరణను ఎదుర్కొన్నాడు.

ఆ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. తన జీవితాన్ని పునర్నిర్మించుకునే అవకాశమే ఉంటే, వ్యాకులత లేకుండా చూసుకుంటానన్నాడు. ‘ఒక కథను ఎంత సహజంగా చెప్పవచ్చో ఆ రూపాన్ని రచయిత కనుక్కున్నాడనేదానికి పరీక్ష ఏమిటంటే– ఆ కథ చదివాక, నువ్వు దాన్ని ఇంకోలా ఊహించగలుగుతున్నావా లేక అది నీ ఊహను నెమ్మదించేలా చేసి, అదే సంపూర్ణమూ, అంతిమమూ అనిపిస్తోందా? ఒక నారింజ ఫలాన్ని ప్రకృతి సరిగ్గా ఎలా చేసిందో అలా’ అన్నాడు కపోటి. సాహిత్య జీవితం గురించి సరేగానీ, అరవై ఏళ్లు నిండకుండానే కన్నుమూసిన కపోటి జీవితం సంపూర్ణ ఫలమేనా అంటే చెప్పడం కష్టం! 

మరిన్ని వార్తలు