దిగ్దర్శకుడు విశ్వనాథ్‌

4 Feb, 2023 03:40 IST|Sakshi

‘బలమైన కళ మన ఆత్మగత సుగుణాలను శక్తిమంతంగా, విజయవంతంగా తట్టిలేపుతుంది. ఈ ప్రపంచానికి విజ్ఞాన శాస్త్రం మేధ అయితే... కళ దాని ఆత్మ’ అంటాడు విశ్వవిఖ్యాత రచయిత మక్సీమ్‌ గోర్కీ. అయిదున్నర దశాబ్దాలపైగా తన సృజనాత్మక శక్తితో వెండితెరపై అనేకానేక విలక్షణ దృశ్య కావ్యాలను సృష్టించి, ప్రేమ కలోకాన్ని మంత్రముగ్థుల్నిచేసి వారిలో ఉత్తమ సంస్కారాన్ని ప్రేరేపించిన కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్‌ సినిమాను అక్షరాలా సమాజాన్ని ప్రభావితం చేయగల కళారూపంగా భావించారు. కనుకే అన్ని ఉత్తమ చిత్రాలు అందించగలిగారు. ఆ చిత్రాలన్నీ దివికేగిన ఆ మహనీయుణ్ణి అజరామరం చేసేవే. చలనచిత్ర చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని చ్చేవే. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టిన కుర్రాడు వాహినీ సంస్థలో పనిచేస్తున్న తన తండ్రి ప్రభావంతో చలనచిత్ర రంగంవైపు దృష్టి సారించకుంటే వెండితెరపై తెలుగువారు ఎప్పటికీ గర్వించదగ్గ ఆణిముత్యాలు ఆవిష్కృతమయ్యేవి కాదు. వాహినీ స్టూడియోలో సౌండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేస్తూనే తన నిశిత పరిశీలనతో స్క్రీన్‌ప్లే రచనలో మెలకువలు గ్రహించి అంచెలంచెలుగా ఎదిగి దర్శకత్వం వహించే స్థాయికి చేరుకున్న సృజనకారుడు విశ్వనాథ్‌. ‘మాలపిల్ల, మల్లీశ్వరి, మాయాబజార్‌’ వంటి చిత్రాలు దర్శకులకు కీర్తిప్రతిష్ఠలు తెచ్చి వారిని ఉన్నత శిఖరాల్లో నిలిపితే మళ్లీ శంకరాభరణం చిత్రంతో విశ్వనాథ్‌కు అంతటి గౌరవం దక్కింది.

శంకరాభరణం చిత్రానికి ముందు...ఆ మాటకొస్తే దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఆత్మగౌరవం మొదలుకొని ఆయన చేతుల్లో రూపుదిద్దుకున్న చిత్రాలన్నీ ప్రశంసలందుకున్నవే. కాక పోతే శంకరాభరణం ఆయన ఆత్మ. తెలుగు చలనచిత్ర చరిత్రంటే శంకరాభరణం చిత్రానికి ముందూ, తర్వాతా అని అందరూ అనుకుంటున్నారంటే దాని వెనకున్న ఆయన కృషి అసామాన్య మైనది. ఒక సంగీత విద్వాంసుణ్ణి ప్రధానపాత్రగా మలిచిన శంకరాభరణం చిత్రం ఆయన నిర్మించుకున్న బలమైన దుర్గం. అనంతరకాలంలో దాన్ని దాటి ఆయన బయటకు రాలేకపోయారన్న విమర్శలు లేకపోలేదు. అయితే అవన్నీ కథాపరంగా వేటికవే విలక్షణమైనవి. వాటిలో అంతర్లీనంగా ఉండేసందేశాలూ భిన్నమైనవి. ఏ కులవృత్తయినా గౌరవప్రదమైనదని, దాని ముందు ఎంతటి సిరి సంపదలైనా వెలవెలబోతాయని చాటే ‘స్వయంకృషి’, ఎంతో ఎత్తు ఎదగటానికి ఆస్కారమున్న నృత్య కళాకారుడు జీవితంలో ఓడిపోయిన వైనాన్ని చూపే ‘సాగరసంగమం’, పెళ్లంటే ప్రేమంటే తెలియని అమాయక యువకుడికి నిస్సహాయ యువతితో ముడివేసిన ‘స్వాతిముత్యం’, కులాల అంతరాలను పెంచిపోషించే ఆచారాలను ప్రశ్నించే గుణమే అన్నిటికన్నా ప్రధానమైనదని చాటి చెప్పే ‘సప్తపది’, ఎంత ఎత్తుకు ఎదిగినా శిష్యుణ్ణి చూసి అసూయపడి, అతని ప్రాణాన్నే బలిగొన్న గురువు వైనాన్ని చూపిన ‘స్వాతికిరణం’... ఇలా ఎన్నెన్నో విలక్షణ చిత్రాలు ఆయనవి.

ఏ తరాన్నయినా ప్రభావితం చేయగల, స్ఫూర్తినింపగల కథనాలతో విశ్వనాథ్‌ చిత్రాలు నిర్మించటం యాదృచ్ఛికం కాదు. సినిమా ఎంత పదునైన ఆయుధమో గ్రహించి, దాన్ని చాలా బాధ్యతా యుతంగా ఉపయోగించాలని తొలినాళ్లలోనే గ్రహించాడాయన. ‘సమాజానికి మంచి చేయక పోయినా ఫర్వాలేదు...చెడు చేయకుండా జాగ్రత్త వహించటం నా కర్తవ్యమని భావిస్తాను’ అని ఒక ఇంటర్వ్యూలో విశ్వనాథ్‌ చెప్పిన వైనాన్ని గుర్తించుకుంటే ఆయన ఔన్నత్యం అర్థమవుతుంది. ఈ క్రమంలో ఆయనకు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుతోసహా ఎన్నో పురస్కారాలు లభించాయి. ఎన్టీఆర్, అక్కినేని మొదలుకొని కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్‌ వరకూ ఎందరో హీరోలతో ఆయన సినిమాలు రూపుదిద్దుకున్నాయి. వీరిలో అత్యధికులకు అప్పటికే ఉన్న ఇమేజ్‌కు భిన్నమైన పాత్రలిచ్చి, వారి అభిమానులతో సైతం ప్రశంసలు పొందటం సామాన్యమైన విషయం కాదు. అదే సమయంలో అంతక్రితం ఎవరికీ పరిచయం లేని సోమయాజులు వంటివారిని సైతం ప్రధాన పాత్రల్లో నటింపజేసి వారికి ఎనలేని కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టారు. ఆరోజుల్లో ఎక్కడికెళ్లినా సోమయాజులుకు పాదాభివందనాలు ఎదురయ్యేవంటే శంకరశాస్త్రి పాత్ర ప్రజల్లో ఎంతటి బలమైన ముద్రవేసిందో తెలుస్తుంది.

ఆయన నిర్మించిన చిత్రాలకు పనిచేసిన నటీనటులైనా, గీత రచయిత లైనా ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యారంటే... తదనంతరం ఆ చిత్రాల పేర్లే వారి ఇంటిపేర్లుగా మారి పోయాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి, శుభలేఖ సుధాకర్, శంకరాభరణం రాజ్యలక్ష్మి తదితరులు ఇందుకు ఉదాహరణలు. ఇక నటుడు సోమయాజులకైతే శంకరాభరణంలోని శంకరశాస్త్రి పాత్ర పేరే అసలు పేరుగా స్థిరపడిపోయింది. సంగీత, సాహిత్యాలకు పెద్ద పీట వేసే నైజం కనుకే విశ్వనాథ్‌ చిత్రాల ద్వారా వేటూరి, సీతారామశాస్త్రి వంటి అపురూపమైన గీత రచయితలు పరిచయ మయ్యారు. సుదీర్ఘకాలంపాటు చిత్ర పరిశ్రమలో దిగ్గజాలుగా వెలుగులీనారు. జాతీయ స్థాయిలో తెలుగువారికి తొలిసారి ఉత్తమ చిత్రంగా స్వర్ణకమలంతోపాటు మరో 3 అవార్డులు కట్టబెట్టిన చిత్రం శంకరాభరణం. ఇక ఆస్కార్‌కు భారత అధికారిక నామినేషన్‌గా వెళ్లిన తొలి తెలుగు చిత్రం స్వాతిముత్యం. 93 ఏళ్ల వయసులో కన్నుమూసే ముందురోజు కూడా ఆయన ఓ పాటను కుటుంబ సభ్యులకు చెప్పి రాయించారని విన్నప్పుడు విశ్వనాథ్‌ గొప్పతనం అర్థమవుతుంది. నిరంతర అధ్య యనం, నిశిత పరిశీలన ఉన్నవారి మెదడు ఎప్పటికీ సారవంతమైనదే. వారు ఎప్పటికీ సృజన కారులే. నిత్య యవ్వనులే. చిరంజీవులే. ఆయన స్మృతికి ‘సాక్షి’ వినమ్రంగా నివాళులర్పిస్తోంది. 

మరిన్ని వార్తలు