కాంగ్రెస్‌ విషాదయోగం

13 Mar, 2021 00:54 IST|Sakshi

‘అదృష్టం అందలమెక్కిస్తానంటే... బుద్ధి బురదలోకి లాగింద’ని సామెత. కేరళలో కాంగ్రెస్‌ పరిస్థితి అలాగేవుంది. అది ముఠా పోరుతో సతమతమవుతోంది. మరో 25 రోజుల్లో... అంటే వచ్చే నెల 6న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. గత నాలుగు దశాబ్దాలుగా అక్కడ అధికారంలో వున్న పార్టీ వరసగా రెండోసారి గెలిచిన ఆనవాయితీ లేదు గనుక... ఈసారి కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఐక్య ప్రజా తంత్ర కూటమి (యూడీఎఫ్‌)కి అవకాశం వుండొచ్చని కొందరు చెబుతున్నారు. మరోపక్క అధికార వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డీఎఫ్‌) వరసగా రెండోసారి అధికారంలోకి రావటం ఖాయమని సర్వేలంటున్నాయి. ఎవరి అంచనాలెలావున్నా ఎన్నికల సమరాంగణానికి వెళ్లే పార్టీకి విజయసాధనే ప్రధాన లక్ష్యంగా వుంటుంది. కానీ అదేం ప్రారబ్ధమో...ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ఆ కర్తవ్యాన్ని విడనాడి, తనకలవాటైన అంతర్గత పోరుతో సతమతమవుతోంది. సారధ్యం వహించాల్సిన పార్టీయే ఈ దుస్థితిలో పడటం చూసి యూడీఎఫ్‌లోని ఇతర పార్టీలు సహజంగానే నీరుగారుతున్నాయి.  జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్ష పదవికి ఎవరినో ఒకరిని నియమించమని, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని నిరుడు సెప్టెంబర్‌లో కోరిన 23మంది సీనియర్‌ నేతల అభీష్టం ఇంకా నెరవేరలేదు. వీలు కుదిరినప్పుడల్లా వారిని అవమానించటానికీ, పక్కకు నెట్టేయటానికీ పార్టీ అధిష్టానం చేయని ప్రయత్నమంటూ లేదు. వీరంతా సోనియాగాంధీకి వీర విధేయులు. అధినేత మెప్పు పొందటానికి వీరిలో ఎవరికెవరూ తీసిపోరు. కానీ నానాటికీ పార్టీ ప్రాభవం అడుగంటుతుంటే...సమీప భవి ష్యత్తులో అది జవసత్వాలు పొందే అవకాశాలు కనబడకపోవటంతో బెంబేలెత్తి ఆ లేఖ రాశారు. ఎని మిది నెలలు కావస్తున్నా వారికి జవాబూ లేదు సరిగదా... వారి పదవులు వరసబెట్టి ఊడబెరకటం మాత్రం రివాజైంది.

‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయద’టారు. కేరళ పీసీసీలో జరుగుతున్నది అదే. ఈ అంతర్గత పోరుతో విసిగిన సీనియర్‌ నేత పీసీ చాకో పార్టీకి ఓ దణ్ణం పెట్టి నిష్క్రమించారు. ఆయన చిన్న స్థాయి నాయకుడేమీ కాదు. రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్రాలకు పార్టీ ఇన్‌చార్జిగా పనిచేసిన వ్యక్తి. 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణంపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ఆయన చైర్మన్‌గా వ్యవహరించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీలకు సన్నిహితుడు. కానీ చాకోను సైతం ఆ 23మంది నేతల ఖాతాలో వేశారు. ఎందుకంటే ఆయన కూడా కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం అడుగంటిందంటున్నారు. కేరళలో పార్టీ రెండు వర్గాలుగా చీలి పదవుల కోసం కీచులాడుకుంటుండగా, సరిచేయాల్సిన పార్టీ నిర్లిప్తంగా వున్నదంటున్నారు. ఫలితంగా కేరళలో ఓటమి ఖాయమని వాపోతున్నారు.  140 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీలో యూడీఎఫ్‌ ప్రధాన భాగస్వామిగా కాంగ్రెస్‌ 91 నుంచి 95 వరకూ స్థానాలు తీసుకునే అవకాశంవుంది. మిత్రపక్షాల్లో ప్రధానమైన ఐయూఎంఎల్‌కు 27, కేరళ కాంగ్రెస్‌ (జోసెఫ్‌)కు 10 ఇవ్వాల్సివుంటుంది. అవి తమ వాటాను పెంచమని అడిగే ఛాన్సుంది  కూడా. ఇవిగాక చిన్నా చితకా పార్టీలు మరో అయిదు వున్నాయి. ఇంతక్రితం యూడీఎఫ్‌లో భాగస్వామిగా వున్న కేరళ కాంగ్రెస్‌(మణి) వర్గం ఈసారి ఎల్‌డీఎఫ్‌ వైపు వెళ్లిపోయింది. గతంలో ఆ పార్టీకి రివాజుగా ఇచ్చే 11 స్థానాల్లో ఎవరెవరికి ఏయే స్థానాలివ్వాలో తేల్చాలి. ఇవన్నీ ఇంకా కొలిక్కి రాలేదు. భాగస్వామ్య పక్షాల సంఖ్య తగ్గినా, తమ అభ్యర్థులెవరో ఇంకా ప్రకటించలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్‌ వుంటే...ఎల్‌డీఎఫ్‌ మాత్రం చురుగ్గా కదులుతోంది. ప్రధాన భాగస్వామ్య పక్షం సీపీఎం తమకు కేటాయించిన 85 స్థానాల్లో 83 స్థానాలకు అభ్యర్థుల్ని కూడా ప్రకటించి, చాలా ముందుగానే ప్రచారం మొదలుపెట్టింది. ఫ్రంట్‌లోని ఇతర పార్టీలను కూడా తొందరపెడుతోంది. ‘మెట్రో మ్యాన్‌’ శ్రీధరన్‌ను సీఎం అభ్యర్థిగా ఘనంగా ప్రకటించిన బీజేపీ... అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయలేదు. ఈ రెండు ప్రధాన కూటముల జాబితాలూ ఖరారై, అటునుంచి ఎవరైనా వస్తారేమో చూశాకే ఆ పని చేసే అవకాశం వుంది.

కాంగ్రెస్‌కు సంబంధించినంతవరకూ కేరళకు ప్రత్యేక స్థానముంది. స్వస్థలంలో ఓడిపోయిన పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌గాంధీ ఆ రాష్ట్రంనుంచే ఎంపీగా నెగ్గారు. కనీసం అందుకోసమైనా ఈసారి కేరళలో అధికారం దక్కకపోతే పరువుపోతుందని ఆయన భావిస్తున్నట్టు లేరు. అవినీతి ఆరోపణలపై తొలి రెండు సంవత్సరాల్లోనే ముగ్గురు ఎల్‌డీఎఫ్‌ మంత్రులు తప్పుకోవాల్సిరావటం, లాకప్‌ మరణాలు, బంగారం స్మగ్లింగ్‌ స్కాం వంటి ఆరోపణల విషయంలో నిలదీసి ఎల్‌డీఎఫ్‌ను ఇరకాటంలో పెట్టాలని యూడీఎఫ్‌ చూస్తోంది. శబరిమల వివాదం విషయంలో సీపీఎం తన మౌలిక సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవహరించిందని యూడీఎఫ్‌కానీ, బీజేపీకానీ ఎటూ విమర్శించే అవకాశం లేదు. అలా చేస్తే అది ఎల్‌డీఎఫ్‌కు మేలు చేయటమే అవుతుంది. వీటి సంగతలావుంచి సీట్ల ఖరారు కోసం యూడీఎఫ్‌ ప్రధాన నేతలంతా ఇంకా ఢిల్లీలోనే ప్రదక్షిణాలు చేస్తున్నారు. బీజేపీ సైతం తన ప్రచార భేరి మోగించిన తరుణంలో చాకో రాజీనామా వార్త యూడీఎఫ్‌ను కుంగదీసిందనటంలో సందేహం లేదు. అధికారంలోకి రావటానికి అంతో ఇంతో అవకాశముందనుకున్నచోట పార్టీ మసకబారుతుంటే తలకలవాటైన రీతిలో కాంగ్రెస్‌ అధిష్టానం చోద్యం చూస్తున్న వైనం ఆ పార్టీ నిర్వా్యపకత్వానికీ, నిస్తేజానికీ అద్దం పడుతోంది. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు