అలా చేస్తే... మహమ్మారికే పండుగ!

21 Jul, 2021 00:31 IST|Sakshi

అప్రమత్తతతో వివేకంగా వ్యవహరించాల్సిన సమయంలో విస్మయపరిచేలా ప్రవర్తిస్తే ఏమనాలి? అవును. కొన్నిసార్లు... కొన్ని ప్రభుత్వాల నిర్ణయాలు చూస్తే అవాక్కవుతాం. పవిత్రమైన బక్రీద్‌ పండుగ సందర్భంగా కేరళ సర్కార్‌ మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ సడలించి, వివిధ దుకాణాల్లో వ్యాపారాలకూ, ప్రార్థనలకూ ఇచ్చిన అనుమతులు చూసి, సాక్షాత్తూ సుప్రీంకోర్టే ఇప్పుడు నోరు నొక్కుకుంది. వ్యాపారుల ఒత్తిడికి తలొగ్గి, ఇలాంటి పని చేయడం దారుణమని వ్యాఖ్యానించింది. కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ ముందు ప్రాణాలతో జీవించి ఉంటే, తరువాతే వ్యాపారం, జీవనోపాధి. అందుకే, రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రసాదించిన ‘జీవించే హక్కు’కు తలొగ్గా లంటూ సుప్రీంకోర్టు మంగళవారం కేరళ సర్కార్‌కి గట్టిగానే చెప్పాల్సి వచ్చింది. ఉత్తరాదిలో కావడ్‌ (కావడి) యాత్ర వివాదం, అనేక ప్రభుత్వాలు దీన్ని రద్దు చేసినప్పటికీ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఈ నెల 25 నుంచి యాత్రను కొనసాగించాలనుకోవడం, సుప్రీం తనకు తానుగా జోక్యం చేసుకొని అడ్డుకట్ట వేయడం... ఇవన్నీ కొద్దిరోజులుగా చూస్తూనే ఉన్నాం. ఇంతలోనే దక్షిణాదిన కేరళ ఇలా బక్రీద్‌ పండుగ పేరుతో కరోనా జాగ్రత్తలకు నీళ్ళొదలడం ఎలా చూసినా అభ్యంతరకరమే! 

ముస్లింలకు ఎంతో ముఖ్యమైన బక్రీద్‌ పండుగను జరుపుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కాకపోతే, కరోనా జాగ్రత్తలన్నీ అందరూ పాటించేలా ప్రభుత్వాలు కల్పించాలంటారు. కానీ, ఏదో ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పరిస్థితులను వాడుకోవాలని చూస్తేనే ఇబ్బంది. రాష్ట్ర జనాభాలో దాదాపు 27 శాతం మంది ముస్లిములున్న కేరళలోని పాలక ‘వామపక్ష ప్రజాస్వామ్య కూటమి’ (ఎల్డీఎఫ్‌) ప్రభుత్వం చేసింది అదే అన్నది తాజా విమర్శ. దేశంలోని పది అగ్రశ్రేణి కరోనా బాధిత రాష్ట్రాల్లో కేరళ రెండో స్థానంలో ఉంది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైందీ అక్కడే. అదే వ్యక్తి ఇటీవలే రెండోసారీ కరోనా బారినపడ్డారు. అవన్నీ తెలిసి కూడా కరోనా అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పండుగ కొనుగోళ్ళ కోసమంటూ దుస్తులు, చెప్పులు, ఆభరణాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌ పరికరాల దుకాణాలకు 3 రోజుల పాటు కేరళ సర్కార్‌ ఎలా అనుమతించిందన్నది ప్రశ్న. కేరళ, మహారాష్ట్రల్లో ఇప్పటికే థర్డ్‌వేవ్‌ వచ్చేసిందా అని కూడా అనుమానిస్తున్నారు. అందుకే, మహారాష్ట్ర ఏమో షరతులు పెట్టి, ప్రతీకాత్మకంగా ఈ ‘త్యాగాల పండుగ’ను ఇళ్ళల్లోనే జరుపు కోవాలని చెబుతోంది. కానీ, కేరళ అందుకు పూర్తి భిన్నమైన మార్గం ఎంచుకోవడం విచిత్రం. 

అయిదేళ్ళకోసారి యూడీఎఫ్, ఎల్డీఎఫ్‌ల మధ్య అధికారం మారిపోవడం ఆనవాయితీ అయిన కేరళలో ఆ మధ్య శబరిమల వివాదం లాంటివి చూశాం. బీజేపీ పుంజుకోవడమూ గమనించాం. వాటన్నిటినీ తట్టుకొని, ఈ ఏప్రిల్‌లో కేరళలో వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్నారు సీఎం పినరయి విజయన్‌. ఆయన తన లౌకికవాద ప్రమాణాల ప్రదర్శనకు బక్రీద్‌ పండుగ వేళను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. కానీ, కరోనా మహమ్మారికి ఆచారం, పండుగ ఏముంటుంది! గత ఏడాది నాటి తబ్లిగీల సమావేశమైనా, ఈ ఏడాది మొదట్లో లక్షలాది మంది ఒక్కచోట చేరిన కుంభ మేళా అయినా, నిన్నగాక మొన్న యూపీ సర్కార్‌ అనుమతించాలని చూసిన వేలాది శివభక్తుల ‘కావడ్‌ యాత్ర’ అయినా, ఇప్పుడు మసీదుల్లో గణనీయ సంఖ్యలో చేరి జరుపుకొనే బక్రీద్‌ అయినా... కరోనా కోరల వ్యాప్తికి ఒకటే! హిందూ, ముస్లిం తేడా లేకుండా గుమిగూడిన జనం ఆసరాగా విస్తరించడమే దాని లక్షణం. ఆ ప్రాథమిక అంశాన్ని పాలకులు విస్మరించి, నిబంధనలకు తూట్లు పొడిస్తే, ఎవరికి నష్టం? ఆ తరువాత ఎవరి ప్రాణానికి ఎవరు పూచీ? కరోనా జాగ్రత్తలు పాటించేలా చూస్తామని పాలకులు చెబుతున్నారు. కానీ, ఒడిశా రథయాత్ర మొదలు తెలంగాణలో బోనాల దాకా జనం మాస్కులు, భౌతికదూరం లేకుండా ఎలా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలుసు. నిరక్షరాస్యత, ధార్మిక పిడివాదం ఎక్కువగా కనిపించే పలు ఉత్తరాది రాష్ట్రాల బాటలోనే అక్షరాస్యత, అభ్యుదయం తొణికిసలాడే కేరళ ప్రయాణించడం నిజంగా విచిత్రం, విషాదం. 

ఎవరి భక్తి విశ్వాసాలు వారివి. సాటి మనుషులకు సమస్యలు తేనంత వరకు ఎవరి ధర్మం మీదనైనా వేరెవరికీ అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. కానీ, ఆ ధార్మికతను రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకు అనువుగా వాడుకోవాలని చూస్తేనే అసలు చిక్కు. బక్రీద్‌ వేళ... కేరళ సర్కార్‌ వ్యవహరించిన తీరు అంతే బాధ్యతారాహిత్యంగా ఉందనేది విమర్శకుల మాట. దైవభూమిగా పేరున్న కేరళలో కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ 15 శాతం దాకా కరోనా పాజిటివిటీ రేటు ఉంది. అలాగే జికా వైరస్‌ కేసులు మళ్ళీ తలెత్తాయి. మూడున్నర కోట్ల జనాభా ఉన్న ఆ రాష్ట్రంలో ఇప్పటికి పూర్తిగా టీకా పడింది 45 లక్షల మందికే. అలాగే, 1.2 కోట్లమందికే, అంటే రాష్ట్ర జనాభాలో మూడోవంతు మందికి మాత్రమే తొలి డోసు టీకా పడింది. ఉన్నట్టుండి ఇప్పుడు షరతుల గేట్లు ఎత్తేయడం సరి కాదనడానికి ఈ గణాంకాలే సాక్ష్యం. అందుకే, థర్డ్‌వేవ్‌ ప్రమాదాన్ని హెచ్చరిస్తున్న ‘ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌’ ఫిర్యాదుతో కేరళ సర్కారును కోర్టు నిలదీయాల్సి వచ్చింది. కరోనా పూర్తిగా దూరం కాకముందే జాగ్రత్తలు గాలికొదిలేయడం, ఆర్థికవ్యవస్థను దృష్టిలో పెట్టుకొని అనేక రాష్ట్రాలు ఇస్తున్న నిబంధనల సడలింపు ఇప్పుడు కేరళ సహా అన్నిచోట్లా భయపెడుతున్నాయి. ఇవి మరిన్ని విపరిణామాలకు దారితీస్తే, అప్పుడు ఏ కోర్టులొచ్చి ఎవరిని నిలదీసినా ప్రయోజనం ఉండదు. జరిగిన తప్పులకు ప్రజలు, పాలకులు తమను తామే నిలదీసుకోవాల్సి వస్తుంది. 

మరిన్ని వార్తలు