గుర్తుంచుకోవాల్సిన సందర్భం

8 Sep, 2020 00:48 IST|Sakshi

ఒక పీఠాధిపతి తమ హక్కు కోసం న్యాయస్థానానికెళ్లడం, ఈ పోరాటంలో ఆయన విజయం సాధిం చలేకపోయినా, తన వ్యాజ్యం ద్వారా దేశంలో ప్రజాస్వామ్య పటిష్టతకు ఆయన దోహదపడటం ఊహకందని విషయం. ఒక వ్యాజ్యం ప్రపంచ దేశాల సర్వోన్నత న్యాయస్థానాలు ప్రస్తావించదగ్గ కేసుగా మారడం, మన న్యాయశాస్త్ర విద్యార్థులకు ఈనాటికీ ఒక బోధనాంశం కావడం విశేషం అనిపిస్తుంది. అలాగే చట్టాలు చేయడంలో ప్రభుత్వాల పరిమితులను సవాలు చేసినప్పుడల్లా ఈ కేసు తీర్పు చర్చకొస్తుంది. ఆ వ్యాజ్యానికి కారకుడైన కేరళలోని ఎదనీర్‌ మఠం పీఠాధిపతి కేశవానంద భారతి ఆదివారం కన్నుమూసిన నేపథ్యంలో నాటి సుప్రీంకోర్టు ఈ కేసులో ఇమిడివున్న కీలకాంశా లను లోతుగా అధ్యయనం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థకు రాగల ముప్పును నివారించడానికి చరిత్రా త్మకమైన తీర్పునివ్వడం ప్రస్తావించుకోవాలి. అంతకు ఏడాదిక్రితం కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సంస్కరణల చట్టం కారణంగా తమ ఆశ్రమానికి వున్న భూమి కోల్పోవలసి వచ్చినప్పుడు 1970లో కేశవానంద భారతి కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అక్కడ సంతృప్తికరమైన తీర్పు రాకపోవడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భూముల ద్వారా లభించే ఆదాయం తోనే ఆశ్రమం మనుగడ సాగిస్తోందని, భూ సంస్కరణల చట్టం కారణంగా దాన్ని కోల్పోయామని ఆయన పిటిషన్‌ సారాంశం. ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగానికి తీసుకొచ్చిన 24, 25, 29 సవరణల కారణంగా మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు(25వ అధికరణ), ఆశ్రమ నిర్వహ ణకూ, దాని ఆస్తుల నిర్వహణకూ ఉన్న హక్కు(26వ అధికరణ), ఆస్తిహక్కు( 31వ అధికరణ) వగైరాలు ఉల్లంఘనలకు గురవుతున్నాయని కేశవనాంద భారతి వాదించారు.  

దేన్నయినా పార్లమెంటులో వున్న మెజారిటీ నిర్ణయించాలి తప్ప, అందులో న్యాయస్థానాల జోక్యం వుండరాదని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ పట్టుదలగా వున్నప్పుడు న్యాయవ్యవస్థ అది సరికాదని దృఢంగా చెప్పగలిగింది. నాలుగో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో అధికారం వచ్చినా, వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో తొలిసారి కాంగ్రెసేతర కూటముల ప్రభుత్వాలు ఏర్పడటం ఆమెకు రుచించలేదు. అందుకే ఇందిర ఈ సవరణలకు పూనుకున్నారు. 1967 నుంచి 1973 వరకూ సాగిన ఈ తంతును... కేశవానంద భారతి కేసు తీర్పులో ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ అనే ఒక కొత్త పదబంధాన్ని పొందుపరిచి సుప్రీంకోర్టు జయప్రదంగా అడ్డుకోగలిగింది.

ఇందిరాగాంధీ అధికారంలోకి రావడానికి ముందు శంకరీ ప్రసాద్‌ కేసులో అయిదుగురు సభ్యుల ధర్మాసనం రాజ్యాంగంలోని ఏ భాగాన్నయినా సవరించడానికి కేంద్రానికి హక్కుంటుందని చెప్పింది. ఆ తర్వాత గోలక్‌నాథ్‌ కేసులో ఏర్పాటైన 11మంది న్యాయమూర్తుల ధర్మాసనం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల జోలికి మాత్రం పోరాదని 1967లో తీర్పునిచ్చింది. ఆదేశిక సూత్రాల అమలు ప్రభుత్వం బాధ్యత అయినా, అందుకోసం ప్రాథమిక హక్కుల్ని త్యాగం చేయరాదని తేల్చిచెప్పింది. రాజ్యాంగం లోని  ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఎలాంటి చట్టాలనూ పార్లమెంటు చేయరాదని 13వ అధికరణ చెబుతుండగా, దానికి భిన్నంగా 368వ అధికరణ రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్ల మెంటుకు ఉన్నదని స్పష్టం చేస్తోంది. గోలక్‌నాథ్‌ కేసు ఈ సందిగ్ధతను సరిదిద్దింది. 368కింద చేసే ఏ చట్టమైనా 13వ అధికరణ వెలుగులోనే చూడాల్సివుంటుందని తీర్పునిచ్చింది. అయితే దీన్ని వమ్ము చేసేందుకు ఇందిర రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చారు. ఇందులో 24వ సవరణ గోలక్‌నాథ్‌ కేసు స్ఫూర్తికి భిన్నంగా ప్రాథమిక హక్కులను సవరించే అధికారం కూడా పార్లమెంటుకు ఇచ్చింది.

కేశవనాంద భారతి సవాలు చేసిన 29వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటు అవుతుందని సుప్రీం కోర్టు తెలిపింది. కేరళ చేసిన భూ సంస్కరణల చట్టాలు రెండూ తొమ్మిదో షెడ్యూల్‌ పరిధిలోకి తీసుకురావడం సరైందేనని అంటూనే... 368వ అధికరణ కింద చేసే చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగంవాటిల్లే విధంగా ఉండరాదని తేల్చింది. వాస్తవానికి ఈ కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే పదబంధానికి ధర్మాసనం భాష్యం చెప్పలేదు. ఏయే అంశాలు ఈ ‘మౌలిక స్వరూపం’ పరిధిలోకొస్తాయో జాబితా ఇవ్వలేదు. కానీ ప్రభుత్వాలు చేసే చట్టాలు న్యాయ సమీక్షకొచ్చినప్పుడల్లా ఎప్పటికప్పుడు ఏది రాజ్యాంగ మౌలిక స్వరూపం కిందికొస్తుందో, ఏది రాదో సుప్రీంకోర్టు చెబుతోంది. ఆ గీటురాయితో చట్టాల చెల్లుబాటును నిర్ధారిస్తోంది. ప్రాథమిక హక్కులు, రిపబ్లికనిజం, సెక్యులరిజం, స్వతంత్ర న్యాయవ్యవస్థవంటివి ఈ పదబంధం పరిధిలోకొస్తాయన్నది రాజ్యాంగ నిపుణుల మాట. ఈ సంగతలావుంచితే...ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎం సిక్రీ ఈ కేసు విషయంలో చూపిన శ్రద్ధనూ, మెజారిటీ పేరుతో ప్రజాస్వామ్యానికి రాగల ముప్పునూ గ్రహించి 13మంది న్యాయమూర్తులతో ధర్మాసనం ఏర్పాటు చేసి ఈ కేసును విచారించిన తీరునూ మెచ్చుకోవాలి.  ఈ కేసులోని 13మంది న్యాయమూర్తుల్లో 11మంది వేర్వేరు తీర్పులద్వారా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా, జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా ఇచ్చిన తీర్పులో ఈ ‘మౌలిక స్వరూపం’భావన వుండటం, దానికే ఏడుగురు న్యాయమూర్తులు మొగ్గుచూపడంతో చరిత్రాత్మకమైన తీర్పు వెలువడింది. ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి రావలసివున్నా విలువ లకు కట్టుబడి, ఈ తీర్పులో భాగమై ఆ అవకాశాన్ని కోల్పోయిన జస్టిస్‌ షెలాత్, జస్టిస్‌ ఏఎన్‌ గ్రోవర్, జస్టిస్‌ కేఎస్‌ హెగ్డేలను స్మరించుకోవాలి. వారికంటే జూనియర్‌ జస్టిస్‌ ఏఎన్‌ రే ప్రధాన న్యాయ మూర్తిగా పదోన్నతి పొందడంతో వీరు పదవులకు రాజీనామా చేశారు. తదనంతరకాలంలో జస్టిస్‌ ఖన్నాను కాదని, ఆయన జూనియర్‌ జస్టిస్‌ ఎంహెచ్‌ బేగ్‌కు పదోన్నతి ఇవ్వడంతో ఆయన సైతం తప్పుకున్నారు. ఒక పరీక్షా సమయంలో న్యాయవ్యవస్థ దృఢంగా నిలబడిన తీరుకు కేశవానంద భారతి కేసు అద్దం పడుతుంది. 

మరిన్ని వార్తలు