ఇది ‘సుప్రీమ్‌’ దర్యాప్తు!

12 Nov, 2021 01:05 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని లఖిమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలో రైతులపై మంత్రి గారి పుత్రరత్నం కారు పోనివ్వడంతో, నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు, తదనంతర హింసలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, డ్రైవర్‌– మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయి నెల దాటిపోయింది. అక్టోబర్‌ 3 నాటి ఆ అమానుష ఘటనపై కోర్టు ఒత్తిడితో కొందరిని అరెస్టు చేసి, వారాలవుతోంది. రాష్ట్ర పోలీసుల ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్‌) దర్యాప్తు జరుపుతోంది. నత్తనడకన, అష్టవంకరలు పోతున్న దర్యాప్తుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం పదే పదే జోక్యం చేసుకొని, అసంతృప్తి వ్యక్తం చేయాల్సి వస్తోంది. దాని అర్థం ఏమిటి? ఓ నిందితుడికి కాపు కాయడం కోసం దర్యాప్తులో ఒకటికి రెండు ఎఫ్‌ఐఆర్‌లపై సాక్ష్యాలను కలగాపులగం చేస్తున్నారని కోర్టే అభిప్రాయపడిందంటే ఆ అవమానం ఎవరికి? ప్రభుత్వ దర్యాప్తుపై నమ్మకం లేదనీ, రాష్ట్రసర్కారు వేసిన జ్యుడిషియల్‌ కమిషన్‌ వద్దనీ, ఛార్జిషీట్లు దాఖలయ్యే దాకా రిటైర్డ్‌ హైకోర్ట్‌ జడ్జి రోజువారీ పర్యవేక్షణలో దర్యాప్తు సాగితే మంచిదని భావిస్తున్నామనీ ముగ్గురు సభ్యుల సుప్రీమ్‌ ధర్మాసనం సోమవారం పేర్కొంది. అదీ పొరుగు రాష్ట్రాల రిటైర్డ్‌ జడ్జిని పెడదామన్నదంటే అంతరార్థం ఏమిటన్నట్టు? యూపీలో పోలీసు వ్యవస్థ, పరిపాలన ఎలా ఉన్నట్టు? 

ప్రజాస్వామ్య వాదులందరినీ కలవరపరుస్తున్న యూపీ వ్యవహారంలో జవాబు తెలిసిన ప్రశ్నలివి. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులను బలిగొన్న ఘటనలో ప్రధాన నిందితుడు – సాక్షాత్తూ కేంద్ర హోమ్‌ శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా. రైతులపైకి ఎక్కిన మూడు వాహనాల కాన్వాయ్‌లో ఒక వాహనం సాక్షాత్తూ సదరు మంత్రి గారిదే. అందుకే, ఈ కేసు ఇంత సంచలనం. దర్యాప్తులో ఇంతటి నత్తనడక. కోర్టు జోక్యంతోనే జనం మర్చిపోకుండా, ఈ కేసు ఇవాళ్టికీ దేశవ్యాప్త చర్చల్లో నిలిచిందనుకోవాలి. ఆ ఒత్తిడి వల్లే అనేక రోజుల తరువాతైనా మంత్రి గారి కొడుకుపై కేసు పెట్టి, అతనితో సహా 17 మందిని అరెస్టు చేశారు. అలహాబాద్‌ హైకోర్ట్‌ రిటైర్డ్‌ జడ్జితో ఏకసభ్య న్యాయవిచారణ సంఘాన్ని యూపీ సర్కారు వేయాల్సి వచ్చింది. కానీ స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు సాగుతున్న దాఖలాలు లేవు. అందుకే, కొట్టిపారేయలేని అనుమానాలతో సుప్రీమ్‌ తాజా వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు యూపీ ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీసుల పనితీరు మొదలు కేంద్రం దాకా అందరికీ వర్తిస్తాయి. 

కోర్టు పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నా, పాలకులకు చీమ కుట్టినట్టయినా లేకపోవడం విచిత్రం. ఓ నిందితుణ్ణి కాపాడడానికే... రైతు మరణాల కేసులో సాక్ష్యాలనూ, అనంతర హింసాకాండ కేసులో సాక్ష్యాలనూ – రెంటినీ కలిపి, ఖంగాళీ చేస్తున్నారన్న సుప్రీమ్‌ వ్యాఖ్య తీవ్రమైనది. కోర్టు నేరుగా పేరు ప్రస్తావించకపోయినా, ఆ నిందితుడెవరో తెలియనిది కాదు. అయినా సరే ఇటు యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కానీ, అటు కేంద్రంలోనూ అధికారంలో ఉన్న ఆయన పార్టీ కానీ ఏమీ ఎరగనట్టే, జరగనట్టే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాయి. నిందితుడి తండ్రే దేశ హోమ్‌ శాఖ సహాయ మంత్రి గనక... సర్వరోగ నివారిణి కాదంటూ సీబీఐ దర్యాప్తు కోరికను సుప్రీమ్‌ తోసిపుచ్చడం అర్థం చేసుకోదగినదే. కానీ, ఈ సుప్రీమ్‌ తీవ్ర వ్యాఖ్యలనూ, చేతలనూ యోగి, మోదీ సర్కార్లే సరిగ్గా అర్థం చేసుకుంటున్నట్టు లేవు. అయినవాళ్ళను ఆదుకోవడమే యోగిపుంగవుడి లక్ష్యమనీ, అజయ్‌ను కేంద్రమంత్రిగా కొనసాగిస్తుండడం మోదీ – షా మార్కు రాజకీయమని విమర్శలు వస్తున్నాయి.

రైతు ఆందోళనకారులే అనంతర హింసాకాండలో ఓ టీవీ జర్నలిస్టును కొట్టి చంపారన్నది యోగి సర్కారు పోలీసుల తొలి కథనం. చివరికిప్పుడు కారు మీదకు దూసుకువెళ్ళడంతోనే ఆ విలేఖరి మరణించినట్టు ఒప్పుకోక తప్పలేదు. అలాగే, ఒకటికి రెండుసార్లు పోస్ట్‌మార్టమ్‌ చేయించినప్పటికీ రైతులందరూ అంతర్గత గాయాలతోనే మరణించారనీ, వారి ఒంటిపై బుల్లెట్‌ గాయాలేవీ లేవనీ చెబుతూ వచ్చారు. తీరా ఘటనాస్థలిలో లేనే లేనన్న పుత్రరత్నం అక్కడే ఉన్నట్టూ తేలింది. అసలక్కడ కాల్పులే జరగలేదన్నది మంత్రి గారి మాట. ప్రధాన నిందితులైన ఆయన కుమారరత్నం బృందం నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీల నుంచే తూటాలు పేలినట్టు తాజా ఫోరెన్సిక్‌ నివేదిక తేల్చింది. ఇక, రైతులపైకే ఆ తుపాకీలు కాల్చారన్న సంగతి అధికారికంగా వెలికిరావడమే ఆలస్యం. దాచేస్తే దాగని సత్యాలెన్నో ఒక్కొక్కటిగా బయటకొస్తున్నా, అధికారులు, పాలకులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తుంటే వ్యవస్థపై ఏం నమ్మకం మిగులుతుంది? పోలీసుల ప్రాథమిక కర్తవ్యమైన దర్యాప్తు బాధ్యతలను కోర్టు గుర్తు చేస్తోందంటే, అంత కన్నా నగుబాటు ఏముంది?

మరో నాలుగు నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ప్రాథమిక పరీక్ష. ఈ తక్షణ పోరులో అధికారాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకీ, యోగికీ కీలకం. 1950లలో జీబీ పంత్‌ తర్వాత ఇప్పటి వరకు ఏ సీఎం పూర్తికాలం పదవిలో ఉండి, వెంటనే రెండోసారీ పీఠమెక్కిన చరిత్ర లేదు. ఆ చరిత్రను తిరగరాస్తే, మోదీ అనంతర బీజేపీలో అత్యున్నత పదవికి యోగి గట్టి పోటీదారు అవుతారు. కాబట్టి, ఇప్పటికిప్పుడు ఇలాంటి ఘటనల్ని కప్పిపుచ్చి, మరక అంటకుండా చూసుకోవడమే పాలకుల తక్షణ కర్తవ్యమైంది. కానీ అది అంత సులభమా? అమాయక రైతులపై అధికార దాష్టీకాన్ని ఓటర్లు ఇట్టే మర్చిపోతారా? పాలకుల మాటెలా ఉన్నా, సుమోటోగా ఈ ఘటనపై దృష్టి పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం మాత్రం జరిగిన దారుణాన్ని జనం మర్చిపోనిచ్చేలా లేదు. సత్యం గెలుస్తుంది, ధర్మం నిలుస్తుంది అన్న అమాయక రైతుల నమ్మకానికి ఇప్పుడు ఆశాదీపం అదొక్కటే!  

మరిన్ని వార్తలు