సాహితీ శరత్తు

3 Oct, 2022 00:25 IST|Sakshi

ప్రాచీన కవులు మొదలుకొని నవీన కవుల వరకు శరదృతు వర్ణన చేయని కవులు సాహితీలోకంలో అరుదు. వర్షకాలం నిష్క్రమించి, కరిమబ్బులు తొలగిన స్వచ్ఛగగనంలో రాత్రివేళ కనిపించే చంద మామ కురిపించే వెన్నెల సోనల జడిలో మనసు తడిసి మురిసిన కవులు నిలువెల్లా పులకించి పుంఖాను పుంఖాలుగా పద్యాలు రాశారు.

‘శారదరాత్రు లుజ్జ్వల లసత్తర తారక హార పంక్తులం/ జారు తరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో/ దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క/ ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరపూరితంబులై’– భారతంలో నన్నయ చివరి పద్యం ఇది. వెన్నెల ధగధగలతో నిండిన శారద రాత్రులు నక్షత్రాల పట్ల దొంగల య్యాయని ఈ పద్యంలో చమత్కరించాడాయన.

వెన్నెల వెలుగుల్లో నక్షత్రాలు అంత స్పష్టంగా కనిపించవు కదా! కర్పూరపు పొడిలా వెన్నెల కురుస్తోందని, వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలితో, పూల పరాగంతో ఆకాశం వెలిగిపోతోందంటూ శరద్రాత్రులను కళ్లకు కట్టాడాయన.

శరదృతువును ‘న భూతో న భవిష్యతి’ అనే రీతిలో వర్ణించిన కవి ఆంధ్రభోజుడు కృష్ణదేవ రాయలు. ఆయన కావ్యం ‘ఆముక్త మాల్యద’లో శరదృతువును వర్ణించే పద్యాలు అనేకం ఉన్నాయి. వాటిలో మచ్చుకొకటి చూద్దాం.

‘గగనలక్ష్మి నిజోరు నక్షత్రమాలి/ కలు, వియన్నది జలముల గడుగ బిసుక/ నెఱయు కుంకుడు బండుల నుఱువులనగ/ బలపలని పాండురాంబుద పంక్తులమరె’– గగనలక్ష్మి తన ఇరవైఏడు నక్షత్రాల ముత్యాల సరాలను ఆకాశగంగలో కుంకుడురసంతో కడుగు తోందట. ఆ కుంకుడు నురుగులా ఉన్నాయట శరదాకాశంలో తేలియాడే తెలిమబ్బులు. ఇంతటి వర్ణన ప్రాచీన సంస్కృత సాహిత్యంలో సైతం ఎక్కడా కనిపించదు.

రుతువర్ణనలోనూ వికటకవి తెనాలి రామకృష్ణుడి పద్ధతే వేరు! ‘పాండురంగ మాహాత్మ్యము’లో తెనాలివారి శరదృతు వర్ణనకు ఒక మచ్చుతునక– ‘కలుగకుండిన నేమి కడిమి పువ్వుల తావి/ ననిచిన మరువమెంతటికి నోప?/ దొదవకుండిన నేమి మదకేకి నటనంబు/ చాలదె యంచల సంభ్రమంబు?/ మెరవకుండిననేమి మెరుగుల పొలప మే/ తన్మాత్రములె శాలిధళధళములు?/ సుడియకుండిన నేమి సోనవానల పెల్లు/ గజదాన వృష్టికి గడమ కలదె?/ కారుకాలాన కలిగిన గౌరవంబు/ చౌకౖయె తోచె శరదృతు సౌష్ఠవమున/ నురిలి తొల్లిటి యధికారి యోసరిలిన/ వెనుక యధికారి యవికావె విభవకళలు?’.

వర్షకాలంలోని కడిమిపూల పరిమళం లేదుగాని, శరత్తులో మరువం సుగంధం ఉంది కదా! నెమళ్ల నాట్యం లేకపోతేనేం హంసల సంరంభముంది కదా? మెరుపులు మెరవకపోతేనేం శాలిధాన్యాల తళతళలున్నాయి కదా! చిరుజల్లులు కురవకపోతేనేం ఏనుగులు మదజలాలను వర్షిస్తున్నాయి కదా! వర్షాకాలంలో దొరికేవి శరత్తులో మరింత చౌకగా దొరుకుతున్నాయి. శరత్తు తన ధర్మాలతో పాటు వర్షాకాల ధర్మాలనూ చూపుతోంది. ఒక అధికారి వైదొలగాక వచ్చే అధికారికి పాత అధికారి వైభవం దక్కినట్లే, శరత్తుకు వర్షరుతు వైభవమూ దక్కిందని చమత్కరించడం తెనాలి రామకృష్ణుడికే చెల్లింది.

నవీనుల్లో చూసుకుంటే, ‘ఓ సఖీ! ఓ సుహాసినీ! ఓ శరద్వి/భావరీ నర్తకీ! కవిభావనా వి/లాసినీ! నిత్యసైరంధ్రి! ఓ సమస్త/ లోక మోహినీ! ఓ స్వప్నలోకరాజ్ఞి!’ అంటూ శరదృతువును అపూర్వంగా సంబోధించారు ‘గౌతమీ కోకిల’ వేదుల సత్యనారాయణశాస్త్రి. ఆరు రుతువుల్లోనూ అత్యంత ఆహ్లాదకరమైనది శరదృతువు. వర్షాలు తగ్గుముఖం పట్టి, నిర్మలాకాశం కనిపిస్తుంది. నేల మీద చిత్తడి తగ్గుతుంది. వాతావరణం సమశీతలంగా ఉంటుంది. ఉక్కపోతా ఉండదు, వణికించే చలీ ఉండదు. పనిపాటలకు మాత్రమే కాదు, విహార విలాసాలకూ కాలం అనుకూలంగా ఉంటుంది. 

‘పెరిగిన శాలిసస్యముల బెంపువహించిన భూతలంబులన్‌/ సరసతృణాభితృప్తమయి, స్వస్థములై తగు గోకులంబులన్‌/ వరకలహంస సారసరవంబులకుం బ్రతిపల్కు సీమలం/ బరగుచు నెందు జూచినను భవ్యములయ్యెను నేడు క్షేత్రముల్‌’– అంటూ కాళిదాసు ‘ఋతు సంహారం’లోని శరద్వర్ణనను తిరుమల కృష్ణదేశికాచార్యులు తెలుగులోకి అనువదించారు. ఇక ‘ఋతుఘోష’లో శేషేంద్ర ‘ముల్లోకములు ఏలు ముద్దుహరిణాంకుడు/ విరజాజి తీవలకు విరహిణీ జీవులకు/ తరిపి వెన్నెల పాలు త్రాగించుచున్నాడు’ అని శరత్‌ చంద్రుడి విలాసాన్ని వర్ణించారు.

నింగీ నేలా ఆహ్లాదభరితంగా ఉండే అద్భుతమైన రుతువు ఇది. ఈ ఆహ్లాదభరితమైన రుతువు లోనే శరన్నవరాత్రులు జరుపుకోవడం ఆనవాయితీ. మన సంస్కృతిలో వసంత నవరాత్రుల కంటే శరన్నవరాత్రులకే ప్రాశస్త్యం ఎక్కువ. శరన్నవరాత్రుల్లో దేశం నలుమూలలా ఘనంగా దేవీపూజలు చేస్తారు. విజయదశమి దసరా పండుగగా ఆబాల గోపాలానికీ ప్రీతిపాత్ర మైన పండుగ. ఒకప్పుడు దసరా పండుగ రోజుల్లో పిల్లల సందడి ఎక్కువగా ఉండేది.

గురువుల వెంట పిల్లలు విల్లంబులు పట్టుకుని ఇంటింటికీ వెళ్లేవారు. ‘ఏదయా మీ దయా మామీద లేదు/ ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు... అయ్యవారికి చాలు ఐదు వరహాలు/ పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు’ అంటూ పద్యాలు పాడేవారు. ఇంటివారు ఇచ్చే కానుకలు తీసుకుని సంతోషంగా కేరింతలు కొడుతూ వెళ్లేవారు. అదొక ముచ్చట.

నాలుగైదు దశాబ్దాల కిందటి వరకు తెలుగునాట ఊరూరా సజీవంగా ఉన్న ఈ సంస్కృతి ఇప్పుడు  కనుమరుగైపోయింది. భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో ప్రకృతి కొంత గతి తప్పుతోంది. అలాగని ప్రకృతి తన రుతుధర్మాన్ని నెరవేర్చు కోవడాన్ని మానుకోలేదు. అందుకే మనం ఇంకా శరత్తుల సౌందర్య సౌరభాలను ఎంతో కొంత ఆస్వాదించగలుగుతున్నాం. 

మరిన్ని వార్తలు