పాత సాహిత్యపు తాజాదనం

6 Sep, 2021 00:42 IST|Sakshi

ఎప్పుడో 160 ఏళ్ళ క్రితం కనిపించింది బోడో పక్షి. పిచ్చిది ఆ తర్వాత ఏమైందో తెలీదు. మళ్లీ కనిపించలేదు. ఏమైందా అని ఆరా తీస్తే  ఆ జాతే అంతరించిపోయిందని తేలింది. పచ్చదనంతో సయ్యాటలాడే ఉడతలు కొంత కాలంగా కనిపించడం లేదు. వాటి సంఖ్య కూడా తగ్గిపోతోందన్న వాస్తవం గుండెను ఎవరో గుచ్చినట్లే అనిపిస్తుంది. మన బాల్య నేస్తం ఊర పిచ్చుక శ్రవణానందకర కిల కిలారావాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి. మరి కొన్నేళ్లు ఇలాగే ఉంటే ఎన్నో అందమైన జీవజాతులు ఒకదాని తర్వాత ఒకటి అంతర్ధానమైపోవడం ఖాయమని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అన్ని జీవులూ భూమికి గుడ్‌ బై చెప్పి వెళ్లిపోతే ఒంటికాయ శొంఠికొమ్ములా మనిషి ఒక్కడే ఉండాలి. ఈ సృష్టిలో ప్రతీదానికీ చుట్టుపక్కల జీవరాశులపై ఆధారపడే మనిషి మాత్రం ఎంతకాలం మనగలుగుతాడు? ఎందుకిలా  జరుగుతోంది? మనుషులే విచక్షణారహితంగా కాలుష్యాన్ని వెదజల్లి, భూతాపాన్ని పెంచి, చెట్లను నరికి భూతల స్వర్గంలాంటి భూమిని నరకంగా మార్చేస్తున్నారు.
 
పర్యావరణం అనగానే అదేదో మేధావులకు సంబంధించిన ఓ బ్రహ్మపదార్థం అనుకుంటారు. మన ఊపిరితో సమానంగా పర్యావరణం ముఖ్యమైనదని గుర్తించడం లేదు. రకరకాల సందేశాలు అందించే సాహిత్యాలకు లోటు లేదు. కానీ సాహిత్యంలో పర్యావరణానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నాం? చిత్రం ఏంటంటే కాలుష్యం అంటే తెలీని ప్రాచీన కాలంలో వచ్చిన సాహిత్యం పర్యావరణానికి పెద్ద పీట వేస్తే, కాలుష్య కాసారాలతో కాగిపోతోన్న ప్రస్తుత సాహిత్యంలో పర్యావరణానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. వేల సంవత్సరాల క్రితం రామాయణాన్ని రచించిన వాల్మీకి, మహాభారతాన్ని రచించిన వ్యాసుడు తమ సాహిత్యంలో పర్యావరణాన్ని కీలకంగా చిత్రీకరించడం విశేషం. ప్రకృతి పైన  ఎంతో ప్రేమ ఉంటేనే కానీ వాల్మీకి, వ్యాసుడు అంత గొప్పగా రాయడం సాధ్యమయ్యేది కాకపోవచ్చు. 

రామాయణంలో అడుగడుగునా ప్రకృతిపై ప్రేమ కనిపిస్తుంది. చెట్టూ చేమపైనా నదులు వాగులు వంకలపైనా ఆరాధన కనిపిస్తుంది. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే ఎంతగా నష్టపోతామో వివిధ పాత్రల చేత వాల్మీకి, వ్యాసుడు పదే పదే చెప్పించిన తీరు ఆకట్టుకుంటుంది.  కబంధుడనే రాక్షసుని ఉద్దేశించి, నువ్వు చనిపోతే అక్కడక్కడ ఏనుగులు విరిచి పడేసిన కట్టెలను ఏరితెచ్చి, పెద్ద గొయ్యి తవ్వి, నీ శరీరానికి  దహనకాండ జరిపిస్తా అంటాడు. అంటే చెట్టును నరక్కూడదన్న జాగ్రత్త, అడవిని మండించకూడదన్న స్పృహ  రాముడి పాత్ర ద్వారా వాల్మీకి చూపించాడు.  అంధులైన తల్లిదండ్రులను కావట్లో మోసుకెళ్లే శ్రావణుని దశరథుడు పొరపాటున బాణం ఎక్కుపెట్టి చంపిన తర్వాత దశరథుడు పశ్చాత్తాపంతో  ఒక చెట్టును  నరికేస్తుండగా– పక్కనే ఉన్నప్పటికీ మరో చెట్టు ఏం చేయగలదు? నడవడానికి శక్తిలేని ఆ  బాలుడి తల్లిదండ్రులు కూడా అంతేకదా అని వ్యాఖ్యానిస్తాడు. నీటివనరులను ఎంతగా గౌరవించాలో వాల్మీకి బాగా చెప్పాడు. రామున్ని వనవాసం పంపించడంలో తన కుట్ర ఏమీ లేదని కౌసల్యకు భరతుడు వివరణ ఇస్తూ, ఆ పాపం నేనే చేశానని భావిస్తే– తాగునీటిని పాడు చేసిన వాడికి ఎంత పాపం వస్తుందో అంత పాపం చుట్టుకుంటుంది అంటాడు. నీటిని కలుషితం చేయడం మహాపాపం అన్నమాట. మరి ఇప్పుడు నదులు, కాలువలు,  సరస్సులు, బావులు ఒక్కటేమిటి జలవనరులన్నింటినీ ఇష్టారాజ్యంగా కలుషితం చేస్తున్నాం. 

వేల సంవత్సరాల క్రితం నాటి తెలివిడి కానీ, సంస్కారం కానీ మనకు లేదు. ఇప్పటి సాహిత్యంలోనూ ఈ స్పృహ కనిపించదు. అక్కడక్కడా పర్యావరణంపై ప్రేమతో రాసేవాళ్లు ఇప్పుడూ ఉన్నారు. కాకపోతే ఆ సాహిత్యం చదివేవాళ్లే లేరు. కానీ ఇప్పటికీ రామాయణ, భారతాల్ని చదివేవాళ్లు ఉన్నారు. మహాభారతంలోనూ ప్రకృతితో మనుషులను మమేకం చేస్తూ ఎన్నో మంచి మాటలు చెప్పారు వ్యాసుడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఒక్కొక్కరి రథంపైనా ఒక్కో జెండా ఉండేది. ఒక్కో జెండాపైనా ఒక్కో గుర్తు. శల్యుడి జెండాపై అరటి చెట్టు, భీష్ముడి జెండాపై  తాడి చెట్టు, అభిమన్యుడి జెండాపై కొండగోగు పువ్వు, గన్నేరు చెట్టు   ఉంటాయి. చెట్లను అంతగా ప్రేమించేవారన్నమాట అప్పట్లో. మరి ఇప్పుడు ఎలాంటి చెట్టునైనా నిర్దాక్షిణ్యంగా  నరికేయడమే తెలుసు మనకు. శ్రీకృష్ణుడు ఓ సారి మండుటెండకి చెమటలు కక్కుతూ ఉంటే ఓ పెద్ద చెట్టు వచ్చి నీడనిచ్చిందట. అప్పుడు కృష్ణుడు  ఇతరులకు ప్రయోజనం చేకూర్చడమే ఈ చెట్ల లక్ష్యం కాబోలు. గాలి, వాన, ఎండ, మంచుల తీవ్రతను అవి భరిస్తూ,  వాటి ప్రభావం  ఇతర జీవరాశులపై  పడకుండా కాపాడతాయి. వీటి జన్మ ఎంత గొప్పది!  వీటి దగ్గరకు వచ్చేవారికి పండ్లు, పూలు, బెరడు, వేళ్లు, జిగురు, చివరకు కట్టెలు ఇస్తాయి. చెట్లలాగే మనం కూడా సాటి మనుషులకు  సహకరిస్తూ, మన జీవితాలను సార్థకం చేసుకోవాలని హితవు పలికాడు. భాగవతంలోనూ ప్రకృతితో మానవజాతిని  మమేకం చేస్తూ ఎన్నో ఘటనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్పటి రచయితల  ఆలోచనలే. ఆ కాలం నాటి మనుషుల ఆలోచనలే. ఎందుకంటే ఏ సాహిత్యం అయినా  ఆ కాలంనాటి  పరిస్థితులకు అద్దం పడుతుంది. నాటి సాహిత్యం, అప్పటి మనుషుల ఆలోచనల నుంచి నేటి కాలం రచయితలు  నాలుగు మంచి ఆలోచనలు అంది పుచ్చుకోవాలి. ప్రజలూ నాలుగు మంచి పనులకు శ్రీకారం చుట్టాలి. 

>
మరిన్ని వార్తలు