అందరి భద్రత ఉమ్మడి బాధ్యత

12 May, 2021 01:03 IST|Sakshi

కట్టడి (లాక్‌డౌన్‌) మంచిదా? చెడ్డదా? అన్న మీమాంస, పండిత చర్చ పక్కన పెట్టి అనివార్య మౌతున్న ఈ స్థితి నుంచి ‘కనీస నష్టం–గరిష్ట ప్రయోజనం’ గురించి అందరూ ఆలోచించాలి. ప్రభు త్వాలు ఎంత వ్యూహాత్మకంగా, వేగంగా కదలాలి, పౌర సమాజం ఎలాంటి నిర్మాణాత్మక సహకారం అందించాలన్నదే ప్రస్తుతం ఉమ్మడి లక్ష్యం కావాలి. కరోనా రెండో ఉధృతి దేశంలో సృష్టిస్తున్న అలజడి అసాధారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో) భారత వైవిధ్య వైరస్‌ విశ్వప్రాము ఖ్యత కలిగిందని, వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ఈ వైరస్‌ (బి.1.617) పట్ల స్పృహతో ఉండాలని హెచ్చరించింది.

అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతో సహా పలు హైకోర్టులు కోవిడ్‌ నియంత్రణ విషయంలో ఎప్పటికప్పుడు తమ ఆరడి, ఆదుర్దాని వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలను పరుగెత్తిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి, ఏకరీతి కట్టడి కన్నా క్షేత్ర పరిస్థితుల్ని బట్టి ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో పరిమిత కట్టడి మంచిదని నిపుణులంటున్నారు. తెలంగాణ రాష్ట్రం నేటి నుంచి అధికారికంగా ప్రకటించడంతో, రెండు తెలుగు రాష్ట్రాలూ ఏదో రూపంలో కట్టడి పరిధిలోకి వచ్చినట్టయింది. లాక్‌డౌన్‌ అనకపోయినా, రోజూ ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు, ఆరుగంటల సడలింపుతో దాదాపు కఠిన కర్ఫ్యూని ఏపీ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించి, అమలు చేస్తోంది.

సడలింపును తెలంగాణ ప్రభుత్వం ఉదయం ఆరు గంటల నుంచి పది వరకు, అంటే నాలుగు గంటలకే పరిమితం చేసింది. బుధవారం నుంచి ఈ కట్టడి అమల్లోకి వస్తుంది. అత్యవసర సేవలకు మినహాయింపునిస్తూ రెండు ప్రభుత్వాలు స్పష్టమైన విధి–నిషే ధాలను ప్రకటించాయి. ఒకవైపు టీకాల ప్రక్రియ సాగుతున్న ఈ తరుణంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా పరిమిత కట్టడి అనివార్యమైనట్టు ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. ఆర్థిక కార్యకలాపాలకు, నిరుడు విధించిన కట్టడి వల్ల దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణకు ఇది కొంత విఘాతమే అయినా, విషమిస్తున్న పరిస్థితుల దృష్ట్యా తప్పట్లేదని పేర్కొన్నాయి.

టీకా మందు (వ్యాక్సిన్‌) తగినంత అందుబాటులో లేక దేశంలో ఈ ప్రక్రియ మందగించింది. ఇప్పటివరకు దాదాపు 17 కోట్ల పైచిలుకు (12 శాతం) మందికి టీకాలిచ్చారు. ఇంచుమించు అన్ని రాష్ట్రాలు ‘మాకు తగినంత టీకా మందు కావాల’ని కేంద్ర ప్రభుత్వానికి వినతి, ఉత్పత్తిదారులకు మనవి చేస్తూనే ఉన్నాయి. టీకా మందు హక్కులు పొందిన రెండు కంపెనీలు భారత్‌ సీరమ్‌ సంస్థ (కోవీషీల్డ్‌), భారత్‌ బయోటిక్స్‌ (కోవాక్సిన్‌) ఉత్పత్తిని రమారమి పెంచితే గాని రాష్ట్రాల అవసరం తీర్చలేవు. క్రమంగా ఉత్పత్తి పెరుగుతోంది. ప్రస్తుత వేగంతోనే టీకాల ప్రక్రియ సాగితే, దేశంలో సామాజిక రోగనిరోధకత (హెర్డ్‌ ఇమ్యూనిటీ) రావడానికి, అంటే కనీసం 70 శాతం ప్రక్రియ పూర్తవడానికి మూడున్నరేళ్లు పడుతుందని ఒక అంచనా!

కరోనా మహమ్మారి విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా... ఇప్పుడున్న పరిస్థితుల్లో సంపూర్ణ టీకాయే ఉత్తమ పరిష్కారమనే ఏకాభి ప్రాయం వ్యక్తమౌతోంది. ఈ లోపున వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోకపోతే, టీకా కృషి కూడా ఆశించిన ప్రయోజనం ఇవ్వదని నిపుణులంటున్నారు. సదరు ప్రక్రియ జాప్యం జరిగి, ఇంకోవైపు ఉత్పరి వర్తనాల్ని పెంచుకుంటూ వైరస్‌ పలు వైవిధ్య రూపాల్లోకి మారుతూ, విశృంఖల వ్యాప్తి జరిగితే నియంత్రణ కష్టమనేది వారి భావన. వైరస్‌ వ్యాప్తి నివారణలో పౌరుల ‘కోవిడ్‌ సముచిత ప్రవర్తన’ (సీఏబి) చాలా ముఖ్యం. ఎంతగా అవగాహన కల్పించినా ప్రజలు పట్టించుకోనపుడు కట్టడి చేయడ మొక్కటే మార్గం.

కానీ, గత సంవత్సరం అనుభవం దృష్ట్యా ఏ కట్టడైనా ఆర్థిక వ్యవస్థ నిర్వహణ–వైరస్‌ వ్యాప్తి నియంత్రణ మధ్య సమతూకం పాటిస్తూ సాగాలనేది విజ్ఞత. కట్టడిని చిట్టచివరి ఆయుధంగా ఉపయోగించాలని, క్షేత్ర పరిస్థితుల్ని బట్టి ఎవరికి అవసరమైన తరహాలో వారు కట్టడి విధించుకోవాలనీ ప్రధాని మోదీ గత నెల 20న రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. ఈ మూడు వారాల్లో 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏదో రూపంలో కట్టడి నీడలోకొచ్చాయి. 16 రాష్ట్రాలు పూర్తిస్థాయి కట్టడి, పది రాష్ట్రాలు పరిమిత కట్టడిని అమలు చేస్తున్నాయి. మంచి ఫలితాలనే ఇస్తోంది. కేసులు ఎక్కువ ఉన్న పది దేశాల్లో వైరస్‌ వ్యాప్తిపై అధ్యయనం జరిపిన ‘కేర్‌’ క్రెడిట్‌ సంస్థ, భారత్‌లో కట్టడి బాగా పనిచేస్తోందని. కేసులు తగ్గుతున్నాయని వెల్లడించింది.

కోవిడ్‌ రెండో ఉధృతిలో పల్లెలు అల్లాడుతున్నాయి. గ్రామీణభారతం క్రమంగా కరోనా కోరల్లోకి జారుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అసాధారణ మరణాలు నమోదవుతున్నాయి. సర్కారు లెక్కలకెక్కని చావులూ ఉంటున్నాయి. వైద్య సదుపాయాలు, ఉపశమన చర్యలు పెద్దగా లేవు. ప్రస్తుత కట్టడి సమయాన్ని సానుకూలంగా మలచుకొని ప్రభుత్వాలు టీకా ప్రక్రియ వేగిరం చేయాలి. వైద్య పరీక్షల వ్యవస్థ బలోపేతం చేసి, ఆస్పత్రుల్లో సదుపాయాల్ని పెంచాలి.

ఆక్సిజన్‌ సరఫరా మెరుగుపరచాలి. కట్టడితో ఉపాధికోల్పోయి అల్లాడే పేద–బడుగు కుటుంబాలను ఆదుకునే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. రోగనిరోధకత పెంచే పౌష్టికాహారాన్ని సామాన్యులకు అందించాలి. పౌర సమాజం కూడా చేతనతో తమ వంతు సహకారం అందించాలి. అత్యవసరమైతే తప్ప గడప దాటొద్దు. బయటకొచ్చినా.. మాస్క్‌ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. చేతుల్ని శుభ్రపరచుకోవాలి. కట్టడి నష్టాలను పరిమితం, ప్రయోజనాలను విస్తృతం చేసుకోవాలి. అందరి భద్రత కోసం ఇది ఉమ్మడి బాధ్యత!  

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు