ధర్మాగ్రహం

27 Apr, 2021 00:14 IST|Sakshi

దేశంలో కరోనా మహమ్మారి ఇంతగా విజృంభించడానికి ఏకైక కారణం మీరేనంటూ ఎన్నికల సంఘం(ఈసీ)పై మద్రాస్‌ హైకోర్టు సోమవారం చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించని వారుండరు. ఈ విషయంలో మీ అధికారులపై హత్య కేసు పెట్టాలని కూడా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీబ్‌ బెనర్జీ, న్యాయమూర్తి జస్టిస్‌ రామమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహించింది. తగిన ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తారన్న నమ్మకం లేకపోతే వచ్చేనెల 2న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా నిలిపేయాల్సివస్తుందని హెచ్చరించింది. న్యాయవ్యవస్థలో మద్రాస్‌ హైకోర్టుకు పేరుప్రతిష్టలున్నాయి. అది ఇచ్చే తీర్పులను ప్రామాణికమైనవిగా పరిగణిస్తారు. ధర్మాసనం ఆగ్రహించిన తీరు ఈసీ పనితీరుకు అద్దం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ రెండో దశ ఎలా స్వైరవిహారం చేస్తున్నదో సామాన్యులకు కూడా తెలిసినప్పుడు ఈసీకి తెలియదనుకోలేం. కానీ ప్రచార సమ యంలో అనుసరించాల్సిన నియమాలను రూపొందించాలన్న స్పృహ దానికి లేకపోయింది. వివిధ సందర్భాల్లో దాఖలైన పిటిషన్లపై మద్రాస్‌ హైకోర్టు విలువైన ఆదేశాలిచ్చింది. కానీ ఈసీ పట్టనట్టు వుండిపోయింది. అయితే పోలింగ్‌ రోజున ఓటర్లు, పార్టీల ఏజెంట్లు, ఎన్నికల అధికారులు భౌతిక దూరం పాటించాలని, అందరూ మాస్క్‌లు ధరించాలని నిబంధనలు పెట్టింది. ఆ జాగ్రత్తలు సభలు, సమావేశాలు, ర్యాలీల విషయంలో ఏమైందో? కనుకనే పార్టీలు హడావుడి చేసినప్పుడు మీరు ఏ గ్రహం మీద వున్నారని ఈసీని ధర్మాసనం ప్రశ్నించింది. 

నిజానికి ఎన్నికల షెడ్యూల్‌ ఫిబ్రవరి నెలాఖరున ప్రకటించినప్పటికే కేసులు మొదలయ్యాయి. మార్చిలో అవి జోరందుకున్నాయి. ఈనెల ప్రారంభంనుంచి కరోనా ఉగ్రరూపం దాల్చింది. మన దేశంలో ఎన్నికల ప్రచారం తంతు ఎవరికీ తెలియంది కాదు. మామూలు జాతరలకూ, వాటికీ తేడా వుండదు. ప్రజాభీష్టం వ్యక్తం కావాల్సిన ఎన్నికలు ప్రచార హోరుగా పరిణమించాయి. పోటీలుపడి జనాన్ని సమీకరిస్తూ భారీ ర్యాలీలు, సభలూ పెట్టడానికి నేతలు అలవాటుపడిపోయారు. పరస్పర నిందారోపణలు రివాజయ్యాయి. ఈ సంరంభంలో అసలు సమస్యలు మరుగునపడుతున్నాయి. పైగా ఈసారి ఎన్నికల షెడ్యూల్‌ చాంతాడంత వుంది. మార్చి మొదట్లో ప్రచారం ప్రారంభంకాగా అస్సాంలో తొలి దశ పోలింగ్‌ ఆ నెల 27న జరిగింది. ఇతరచోట్ల ఎన్నికలు ముగిసి చాలారోజులైనా బెంగాల్‌ సోమవారంనాటికి ఏడో దశ పూర్తిచేసుకుంది. ఈనెల 29న ఎనిమిదో దశ పోలింగ్‌తో ఎన్నికలు ముగుస్తాయి. మే 2న వెలువడే ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సవాలు సరేసరి. ఒకపక్క పాశ్చాత్య దేశాల్లో కరోనా రెండో దశ స్వైర విహారం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూళ్లు ప్రకటించేనాటికే వాటిపై కథనాలు వెలువడుతున్నాయి. అలాంటి సమయంలో ఇంత సుదీర్ఘమైన షెడ్యూల్‌ విడుదల చేయడం, ఆ తర్వాత ప్రచారం తంతు చూశాకైనా ఆంక్షల గురించి ఆలోచించక పోవడం ఈసీ తప్పిదం. కనీసం కేంద్రమైనా ఈసీ దృష్టికి ఈ విషయం తీసుకురావాల్సింది.

ప్రచారపర్వంలో ఎక్కడా భౌతిక దూరం పాటించడం కనబడలేదు. మాస్క్‌లు పెట్టుకున్నవారు స్వల్పం. జనం సంగతలావుంచి నాయకులే వాటి జోలికిపోలేదు. కరచాలనాలు, ఆలింగనాలు కూడా మామూలే. ఒకరినుంచి ఒకరికి తుంపరల ద్వారా కరోనా వ్యాపిస్తుందని తెలిసినా విచ్చలవిడిగా నినాదాలిస్తూ మద్దతుదారులు ఆవేశంతో ఊగిపోతుంటే వారించినవారు లేరు. దీన్నంతటినీ చోద్యం చూస్తూ వుండిపోయిన ఈసీ కేవలం బెంగాల్‌ ప్రచారం విషయంలో మేల్కొంది. అక్కడెవరూ కరోనా నిబంధనలు పాటించడం లేదంటూ ఈనెల 22న తదుపరి ర్యాలీలు రద్దుచేసింది. అప్పటికే కరోనా కేసులు పెరిగాయి. ముగ్గురు అభ్యర్థులు ఆ వ్యాధికి బలయ్యారు. తమిళనాడు, కేరళ, అస్సాంలలో కూడా కేసుల సంఖ్య ఆందోళనకరంగానే వుంది. వేరే రాష్ట్రాలతో పోలిస్తే భారీగా కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తదితరచోట్ల ఎన్నికలు జరగలేదంటూ కొందరు చేస్తున్న తర్కం సరికాదు. అక్కడ ఇతర కారణాలు అందుకు దోహదపడివుండొచ్చు. అసెంబ్లీల గడువు ముగిసిపోతున్నందున ఎన్నికలు పెట్టాలనుకోవడం సరైందేకావొచ్చు. కానీ అసా ధారణ పరిస్థితుల్లో వాటి గడువు పొడిగించిన సందర్భాలు లేకపోలేదు. వాయిదా సంగతలావుంచి కనీసం ఈసారి డిజిటల్‌ మీడియా ద్వారా, చానెళ్ల ద్వారా మాత్రమే ప్రచారం చేయాలని ఆంక్షలు పెడితే అదొక కొత్త ఒరవడికి నాంది పలికేది. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఈ విషయంలో మెచ్చుకోవాలి. అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పుడు అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేవరకూ నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులను ఆశ్రయించింది. కానీ సాంకేతిక కారణాలతో కోర్టులు దాన్ని తోసిపుచ్చాయి. తిరుపతి  ఉప ఎన్నిక విషయంలోనూ జగన్‌ ఇదే మాదిరి ముందుచూపు ప్రదర్శించారు.  కరోనా కేసులు పెరుగుతున్న తీరు గమనించి తన బహిరంగ సభను రద్దు చేసుకున్నారు. దేశంలో ఇతర నేతలు దాన్ని అనుసరించారు. ఇప్పుడు మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యలు తీర్పులో భాగం కాకపోవచ్చు. కానీ ఈ ధర్మాగ్రహం నూరుశాతం సబబైనది. ఇప్పుడున్న స్థితిలో ఈ మహమ్మారి పంజా నుంచి తప్పించుకోవడమెలా అన్న భయాందోళనలు అందరిలోనూ వ్యాపించిన తరుణంలో న్యాయమూర్తుల ఆగ్రహం అన్ని వ్యవస్థల కళ్లు తెరిపించాలి. బాధ్యతగా మెలగడం, జవాబుదారీతనంతో వుండటం నేర్చుకోవాలి. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు