సాహితీ రంగవల్లికలు

2 Jan, 2023 00:29 IST|Sakshi

ఇది ధనుర్మాసం. ముగ్గుల మాసం. మకర సంక్రాంతి వరకు ముంగిళ్లలో ముగ్గుల వ్రతాన్ని మహిళలు అప్రతిహతంగా కొనసాగిస్తారు. క్రీస్తుపూర్వం పదిహేనో శతాబ్ది ప్రాంతంలో ఆర్యులు అడుగు పెట్టే నాటికే, సింధులోయ నాగరికత పరిఢవిల్లిన చోట ముగ్గులు ఉండేవనేందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ లెక్కన ముగ్గులు పురాణాల కంటే ప్రాచీనమైనవి. కచ్చితంగా చెప్పుకోవాలంటే, వేదకాలం నాటివి. ముగ్గులు ఆదిమ చిత్రకళా రూపాలు. సింధులోయ ప్రాంతంలోనే కాదు... గ్రీకు, ఈజిప్టు శిల్పాల్లోనూ ముగ్గుల ఆనవాళ్లున్నాయి.

ముగ్గులను సంస్కృతంలో రంగవల్లిక అంటారు. సౌరసేని ప్రాకృతంలోని ‘రంగౌలి’ అనే మాట నుంచి ఈ సంస్కృత పదం పుట్టింది. హిందీ, ఉర్దూల్లో ‘రంగోలి’ అంటారు. వాల్మీకి రామా యణంలోని యుద్ధకాండలో ‘ఏకశృంగో వరాహస్త్వం’ అనే వర్ణన ఉంది. సింధులోయ నాగరికత ప్రాంతంలో దొరికిన ముగ్గులలో ఒంటికొమ్ము వరాహరూపం ఈ వర్ణనకు సరిపోతుంది. అంతే కాదు, హరప్పా ప్రాంతంలో దొరికిన వాటిలో ఊర్ధ్వపుండ్రం, త్రిశూలం, అగ్నిగుండం, శివలింగం తదితర రూపాలలోని మెలికల ముగ్గులూ ఉన్నాయి. 

సున్నపురాతి నుంచి తయారుచేసిన ముగ్గుపిండితోనూ, వరిపిండితోనూ ముగ్గులు వేయడం ఇప్పటికీ అన్ని చోట్లా వాడుకలో ఉన్న ప్రక్రియ. పురాణకాలంలో కర్పూరంతో రంగవల్లులను తీర్చి దిద్దేవారట! నన్నయ మహాభారతం ఆదిపర్వంలో ‘అంగుళలనొప్పె కర్పూర రంగవల్లులు’ అని వర్ణించాడు. వారణావతంలోని లక్క ఇంట్లో ఉండటానికి కుంతీసమేతంగా పాండవులు వస్తున్న ప్పుడు వారికి స్వాగతం పలకడానికి వారణావతపుర వాసులు ఇంటింటా ముంగిళ్లలో కర్పూరంతో ముగ్గులు వేశారని నన్నయ వర్ణన.

‘చిత్రవర్ణాతిశయ నూత్న రత్న చిత్రి/తాంగ రంగవల్లి సురగాంగణముల’ అంటూ శివపురంలోని రంగురంగుల రంగవల్లులను నన్నెచోడుడు ‘కుమారసంభవం’లో వర్ణించాడు. సీతాదేవి చేత జనక మహారాజు ముగ్గులు వేయించాడట! ‘సంతానపరుడమ్మ జనక మహాముని/ తా ముద్దు కూతురిని తా జేరబిలిచి/ ఆవుపేడ తెచ్చి అయినిళ్లు అలికి/ గోవుపేడ తెచ్చి గోపురాలు అలికి/ ముత్యాలు చెడగొట్టి ముగ్గులేయించి’ అని జానపద గీతం ఉంది.

‘పలనాటి వీరచరిత్ర’లో శ్రీనాథుడు ముత్యాల ముగ్గులను వర్ణించాడు. ‘కస్తూరి చేతను కలియ గనలికి/ ముత్యాల తోడ ముగ్గులను బెట్టి/ కర్పూర ముదకంబు కలిపి ముంగిటన్‌’ అంటూ సంక్రాంతి సమయంలో ఆనాటి ముగ్గుల వేడుకను కళ్లకు కట్టాడు. క్రీడాభిరామంలో వినుకొండ వల్లభరాయడు ‘చందనంబున గలయంపి చల్లినారు/ మ్రుగ్గులిడినారు కాశ్మీరమున ముదమున/ వ్రాసినా రిందు రజమున రంగవల్లి/ కంజముల దోరణంబులు గట్టినారు’ అంటూ చందనంతో కళ్ళాపి చల్లి ఆపైన ముగ్గులు వేసిన వైనాన్ని వివరించాడు. ‘బోటి గట్టిన చెంగల్వపూవుటెత్తు/ దరు పరిణతోరు కదళి మంజరియు గొనుచు/ బోయి గుడినంబి విజనంబు జేయ జొచ్చి/ మ్రొక్కి వేదిక బలు వన్నె మ్రుగ్గు బెట్టె’ అంటూ శ్రీకృష్ణదేవరాయలు తన ‘ఆముక్తమాల్యద’లో ఆలయాల్లో ముగ్గులు వేసే ఆనాటి ఆచారాన్ని వర్ణించాడు.  

ఆ«ధునికుల్లో తిరుమల రామచంద్ర ముగ్గువేస్తున్న ముదిత గురించి చక్కని సంస్కృత శ్లోకం రాశారు. ‘రచయంతీ రంగలతాం/ మంగళగాత్రీ సలీలం అంగణకే/ విటజన హృదయాంగణకే/ అనంగజ బాధాం విశాలయతి కునూనమ్‌’. చక్కని అమ్మాయి ముంగిట్లో ముగ్గుపెడుతూ విట జనుల హృదయాలలో మన్మథబాధను విస్తరింపజేస్తున్నదని దీని తాత్పర్యం.

ఈ శృంగార శ్లోకాన్ని ఆయన తన పదమూడేళ్ల ప్రాయంలోనే రాయడం విశేషం. ‘ఉగ్గేల తాగుబోతుకు/ ముగ్గేల తాజ మహలు మునివాకిటిలో’ అంటూ శ్రీశ్రీ తన ‘సిరిసిరిమువ్వ శతకం’లో ముగ్గు ప్రస్తావన తెచ్చారు. నేల మీద ముగ్గులు మనుషులు వేస్తారు గానీ, నీలాకాశం మీద చుక్కల ముగ్గులు వేసేది సాక్షాత్తు భగవంతుడేనని కరుణశ్రీ నమ్మకం. ‘పనిమాలి ప్రతిరోజుప్రాణికోటుల గుండె/ గడియారముల కీలు కదపలేక/ అందాలు చింద నీలాకాశ వేదిపై/ చుక్కల మ్రుగ్గులు చెక్కలేక/ ఎంతశ్రమ యొందు చుంటివో యేమొ స్వామి’ అంటూ దేవుడి కష్టానికి కలత చెందడం ఆయనకే చెల్లింది! 

ముగ్గుతో ముడిపడిన జాతీయాలు, సామెతలు కూడా ఉన్నాయంటే, ముగ్గులు మన సంస్కృతిలో ఎంతగా పెనవేసుకు΄ోయాయో అర్థం చేసుకోవచ్చు. బాగా నెరిసిన తలను ‘ముగ్గు బుట్ట’ అంటారు. ‘ముగ్గులోకి దించడం’ అంటే ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ‘వాయువేగమును మించి, లోకాలను గాలించి, చిటికెలోనే ఉన్న చోటికే వచ్చు. అదేమిటి?’ అనే ΄పొడుపు కథ ఉంది. దీనికి సమాధానం ‘ముగ్గు'. మొదలు పెట్టిన చోటే ముగించడం ముగ్గు కళలో ప్రత్యేకత. ‘మరిగే నూనెలో ముచ్చటైన ముగ్గు. తీసి తింటే కరకరమంటుంది’ అనే ΄పొడుపు కథకు సమాధానం ‘జంతిక’. జంతికలు చూడటానికి మెలికల ముగ్గుల్లాగానే ఉంటాయి కదా! 

భారతీయులకు ముగ్గులు ముదితల వ్యవహారమే గానీ, కొన్ని ఆఫ్రికన్‌ దేశాల్లో ముగ్గులు వేయడం పురుషుల బాధ్యత. ఆఫ్రికన్లు ముగ్గులు వేయడానికి సున్నపురాతి ముగ్గుపిండి, వరిపిండి వంటివేమీ వాడరు. నేరుగా ఇసుకలోనే వేలితో లేదా కర్రపుల్లతో చుక్కలు పెట్టి, చుక్కల చుట్టూ మెలికల ముగ్గులు తీర్చిదిద్దుతారు. ముగ్గుల కళ దేశదేశాల్లో వ్యాపించి ఉన్నా, మన భారతీయ సాహిత్యంలో మాత్రం ముగ్గుల ప్రస్తావన విస్తారంగా కనిపిస్తుంది. అదీ విశేషం! 

మరిన్ని వార్తలు