కాంగ్రెస్‌లో ఖర్గే హవా!

20 Oct, 2022 00:20 IST|Sakshi

అందరూ ఊహించినట్టే కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో సీనియర్‌ నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే ఘనవిజయం సాధించారు. 137 ఏళ్ల కాంగ్రెస్‌ చరిత్రలో అధ్యక్ష పదవికి ‘నిజమైన’ ఎన్నిక జరగటం ఇది ఆరోసారి. హైకమాండ్‌ సంస్కృతి, దాని అండదండలతో రాష్ట్రాల్లో వేళ్లూను కున్న ముఠాలు కాంగ్రెస్‌కు పెను భారమై అది అవసాన దశకు చేరువవుతున్న వేళ ఈ ఎన్నికలు జరిగాయి. గతంలో ‘బయటి వ్యక్తులు’ పార్టీ అధ్యక్షులైన సందర్భాలున్నా అవి అధికారంలో ఉండగా జరిగినవే. విపక్షంలో ఉంటూ, గాంధీ కుటుంబసభ్యులు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొం టున్నా ‘బయటి వ్యక్తి’ అధ్యక్షుడు కావటం ఇదే తొలిసారి. పార్టీ సారథ్యం కుమారుడు రాహుల్‌ చేతుల్లోనే ఉండాలని అధినేత సోనియాగాంధీ తాపత్రయపడ్డారు.కొద్దికాలం అధ్యక్ష పీఠంపై ఉన్న రాహుల్‌ తీరా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం పొందాక అందుకు నైతికబాధ్యత వహించి తప్పుకున్నారు. ఆ తర్వాత చాన్నాళ్లపాటు ఆయన్ను బతిమాలటం, బుజ్జగించటం చేశారు. కానీ అవి ఫలించకపోవటంతో విధిలేక కేవలం ఆర్నెల్లపాటు మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చూస్తానని సోనియా ప్రకటించారు. అది జరిగి కూడా మూడేళ్లు దాటిపోయింది. ఇన్నాళ్లకు ఎన్నికలు నిర్వహించటం, సుదీర్ఘ అనుభవం, స్వతంత్ర భావాలు ఉన్న దళిత నాయకుడు ఖర్గే అధ్యక్షుడు కావటం మెచ్చదగ్గ పరిణామం. అయితే ఆయనను గాంధీ కుటుంబసభ్యులు స్వతంత్రంగా పని చేయనిస్తారా, వెనకనుంచి శాసించే విధానాలకు స్వస్తిపలుకుతారా అన్నది మున్ముందు గానీ తెలి యదు. సమస్యలు తలెత్తినప్పుడు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటున్నారన్న అభిప్రాయం కలగక పోతే మొత్తం వ్యవహారం మొదటికొస్తుంది. ఆయన కీలుబొమ్మ అధ్యక్షుడిగా మిగిలిపోతారు. 

అధ్యక్ష ఎన్నికలు ఏ పరిస్థితుల్లో జరిగాయో, వాటి తీరుతెన్నులేమిటో అందరికీ తెలుస్తూనే ఉంది. ఈ పదవికి గాంధీ కుటుంబ వీరవిధేయుడిగా ముద్రపడిన రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ను అనుకున్నారు. సీఎం పదవినుంచి వైదొలగటం తప్పనిసరని తేలాక ఆయన చిన్న సైజు తిరుగుబాటు ప్రకటించటం పార్టీని సంక్షోభంలో పడేసింది. ఆ తర్వాతే ఖర్గే పేరు తెరపైకొచ్చింది. ఈ ఎన్నికల్లో ‘అధికారిక అభ్యర్థి’ ఎవరూ లేరని రాహుల్‌ ఒకటికి రెండుసార్లు చెప్పినా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. అనధికార అధికారిక అభ్యర్థి ఖర్గేయేనని కాంగ్రెస్‌ శ్రేణులకు లోపాయి కారీగా సందేశం వెళ్లిపోయింది. అందుకే ఆయనపై పోటీపడిన శశిథరూర్‌కు ఎక్కడా పెద్దగా ఆదరణ దొరకలేదు. ఆఖరికి ఉత్తరకుమారులుగా, జీ–23 నేతలుగా ముద్రపడినవారు సైతం ఆయన వెనక లేరు. తమలో ఒకరు పోటీచేస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా వారిలో అత్యధికులు మౌనంగా ఉన్నారు. మిగిలినవారు ఖర్గే అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించి తమ వీర విధేయత చాటుకున్నారు. థరూర్‌కు ద్వితీయశ్రేణి నేతల్లో ఒకరిద్దరు మాత్రమే మిగిలారు. ‘అనుభవానికి’ పట్టం కట్టాలంటూ కొందరు నేతలు ప్రకటించి, పోటీనుంచి తప్పుకోమని పరోక్షంగా థరూర్‌కు సూచించారు. ఇవన్నీ గుర్తించబట్టే ఈ ఎన్నికల్లో తనకు సమానావకాశం లేకుండా పోయిందని ఆయన వాపోయారు. పార్టీలో ఇకపై మీ పాత్రేమిటన్న ప్రశ్నకు జవాబుగా ఆ సంగతిని ఖర్గే, సోనియా నిర్ణయిస్తారని ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగానే రాహుల్‌గాంధీ నోరుజారటం గమనిస్తే థరూర్‌ ఆరోపణలో వాస్తవముందని తేలుతుంది.

అనుభవాన్ని మించిన గురువు లేరని నానుడి. దీర్ఘకాలం అధికారానికి దూరమైనా కాంగ్రెస్‌ దీన్ని గుర్తించలేకపోయింది. ఎన్నడూలేని విధంగా అత్యంత బలహీన స్థితిలో పడ్డామని తెలిసినా సోనియా, రాహుల్‌ పాత పద్ధతులకు స్వస్తి చెప్పలేకపోయారు. పదవులపై వ్యామోహం లేదంటూనే తెరచాటుగా పావులు కదిపే విధానాలు వదులుకోలేదు. జవాబుదారీతనం లేకుండా పెత్తనం చెలా యించటం, బెడిసికొట్టిన పక్షంలో సంబంధం లేనట్టు ఉండిపోవటం రాహుల్‌ ఇన్నాళ్లుగా చేసిన పని. దాని పర్యవసానంగానే పార్టీ అస్తవ్యస్థమైంది. వయసురీత్యా ఖర్గే వృద్ధాప్యంలో ఉన్నారు. ఈ వయసులో చురుగ్గా తిరిగి పార్టీని పరుగెత్తించటం ఎంతవరకూ సాధ్యమన్న ప్రశ్న ఉండనే ఉంది. కాంగ్రెస్‌ సీనియర్లలో సగం మంది, అనుబంధ సంస్థల నాయకగణంలో 70 శాతంమంది పనికి మాలిన సరుకని ఏడేళ్లక్రితం అప్పట్లో పార్టీ నేత సందీప్‌ దీక్షిత్‌ వ్యాఖ్యానించారు. ఏ పదవికైనా గాంధీ కుటుంబానికి విధేయతే గీటురాయిగా మారడంవల్ల వచ్చిపడిన ఉపద్రవమిది. ఖర్గే ముందు సంస్థాగతంగా చాలా సవాళ్లున్నాయి. పార్టీ వర్కింగ్‌ కమిటీకి ఎన్నికలు నిర్వహించాలి. పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ తదితరాలను పునరుద్ధరించాలి. అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌ గఢ్‌లలో ముఠా పోరు ముదిరింది. స్వరాష్ట్రమైన కర్ణాటకలో మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌ వర్గాలు నువ్వా నేనా అన్నట్టున్నాయి. విపక్షంలో ఉన్న తెలంగాణ, కేరళ, పంజాబ్‌ తదితరచోట్ల కుమ్ములాటలు ఆగటం లేదు. ఇవన్నీ రాహుల్‌ ‘భారత్‌ జోడో యాత్ర’ గాలి తీస్తున్నాయి. వీటన్నిటిపైనా గాంధీ కుటుంబ ప్రమేయంలేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసు కోవటం సాధ్యమేనా అన్నది పెద్ద ప్రశ్న. ఇక బీజేపీ దూకుడు సరేసరి. ఏం చేసైనా ఎన్నికల్లో నెగ్గాలని చూడటం, ఓడినపక్షంలో ఫిరాయింపుల పాచిక వాడటం దాని నైజం. సంక్షోభ సమయాల్లో ప్రద ర్శించే చాకచక్యతే నాయకత్వ పటిమను నిగ్గుతేలుస్తుంది. ఖర్గే దాన్ని ఏ మేరకు చూపగలరో వేచిచూడాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు