బెంగాల్‌ బెబ్బులి జాతీయ స్వప్నం

2 Dec, 2021 02:27 IST|Sakshi

‘యూపీఏనా? అదెక్కడుంది? ఇప్పుడది గత చరిత్ర!’ ఇది కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ గురించి ఏ ప్రత్యర్థి బీజేపీనో అన్న మాట కాదు. బీజేపీకి బద్ధశత్రువుగా యూపీఏతో కలసి నడచిన తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్య. మహారాష్ట్రలో శరద్‌ పవార్‌తో బుధవారం నాటి భేటీ అనంతరం మమత వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం.

కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దె దించడానికి కాంగ్రెస్‌ సత్తా సరిపోవట్లేదనేది ఈ బెంగాల్‌ బెబ్బులి మాటల సారాంశం. ఎనిమిది నెలల క్రితం మార్చి 31న బీజేపీపై ఐక్యపోరాటం అవసరమంటూ కాంగ్రెస్‌ సహా 15 ప్రతిపక్షాలకు లేఖలు రాసిన దీదీ ఇప్పుడు రూటు మార్చారు. జాతీయ స్థాయిలో పగ్గాలు పట్టాలని ఆమె భావిస్తున్నట్టు ఇటీవలి పరిణామాలతో తేటతెల్లమవుతోంది. 

శివసేన, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) నేతలను కలుసుకొనేం దుకు 3 రోజుల ముంబయ్‌ పర్యటనకు వచ్చారు మమత. ‘దేశంలోని ఫాసిజమ్‌ వాతావరణాన్ని ఎదుర్కోవాలంటే, బలమైన ప్రత్యామ్నాయం అవసరం’ అన్నారామె. ‘పోరాడాల్సిన వారు (కాంగ్రెస్‌) సమర్థంగా పోరాడకపోతే ఏం చేయాలి’ అనడం ద్వారా కాంగ్రెస్‌తో సంబంధం లేని కొత్త ప్రతిపక్ష కూటమి వాదనను పరోక్షంగా తెరపైకి తెచ్చారు.

మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో పొత్తున్న ఎన్సీపీ నేత పవార్‌ సైతం ప్రతిపక్షాలకు బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరమని పునరుద్ఘాటిం చారు. అంటే ఇప్పుడున్న నాయకత్వం బలంగా లేదనీ, దానికి బదులు మరొకటి రావాలనీ ఆయన కూడా స్థూలంగా అంగీకరించారన్న మాట. ఇన్నాళ్ళుగా ప్రతిపక్షాలకు పెద్దన్నలా ఉంటున్న కాంగ్రెస్‌కు ఇది ఊహించని ఎదురుదెబ్బ. ‘రాజకీయాల్లో నిరంతరం శ్రమించాలి. విదేశాల్లో రోజుల తరబడి గడిపితే కుదరదు’ అంటూ రాహుల్‌పై మమత బాణాలు సంధించడం గమనార్హం. 

కాంగ్రెస్, తృణమూల్‌ సంబంధాలు దెబ్బతిన్నాయనడానికి ఇలాంటి ఎన్నో సూచనలున్నాయి. ఈ నవంబర్‌లో మమత 4 రోజులు ఢిల్లీలో పర్యటించారు. అక్కడ మోదీని కలిశారే తప్ప, కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాను కలుసుకోలేదు. సరికదా... అసంతృప్త కాంగ్రెస్‌ నేతల్ని కలిశారు. పైపెచ్చు, ఆమె ఢిల్లీలో ఉన్నప్పుడే మేఘాలయ కాంగ్రెస్‌ శాఖ నిట్టనిలువునా చీలింది.

మాజీ సీఎం ముకుల్‌ సంగ్మా వచ్చి తృణమూల్‌ గూటిలో చేరారు. ఒక్క సంగ్మానే కాదు... ఇటీవల ఢిల్లీలో కీర్తీ ఆజాద్, అశోక్‌ తన్వార్, యూపీలో లలితేశ్‌ త్రిపాఠీ, గోవాలో లుయిజిన్హో ఫలీరో, అస్సామ్‌లో సుస్మితా దేవ్‌– ఇలా హస్తం వదిలేసి, దీదీ చేయి పట్టుకున్నవాళ్ళు సమీప గతంలో అనేకులున్నారు. వారిని ఆపి, అసంతృప్తిని తీర్చలేక కాంగ్రెస్‌ నిస్సహాయంగా మిగిలిపోయింది. 

భావసారూప్య శక్తులన్నీ జాతీయస్థాయిలో కలసివచ్చి, సమష్టి నాయకత్వం పెట్టుకోవడం మంచిదే. కాంగ్రెస్‌ నేతృత్వంలో యూపీఏ పేరిట ఇంతకాలం జరిగింది ఒకరకంగా అదే. కానీ, ఇప్పుడు టీఎంసీ లాంటివి కొత్త ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయంటే, అది కాంగ్రెస్‌ నాయకత్వ వైఫల్యమే. దాదాపు 135 ఏళ్ళ వయసున్న కాంగ్రెస్‌కు ఏకంగా 18కి పైగా రాష్ట్రాల్లో బలమైన ఉనికి ఉంది. ఇప్పటికీ దేశంలో ప్రధాన ప్రతిపక్షం అదే.

అయితే, ప్రస్తుతం పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ – ఈ 3 రాష్ట్రాల్లోనే ఆ పార్టీ అధికారంలో ఉంది. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలో, జార్ఖండ్‌లో ద్వితీయశ్రేణి భాగస్వామిగా కొనసాగుతుండడం చేదునిజం. దేశంలో 3 నుంచి 3.5 కోట్ల మంది కార్యకర్తలు ఇప్పటికీ కాంగ్రెస్‌కు ఉన్నారని లెక్క. జాతీయ స్థాయిలో అంత బలం, బలగం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతోంది. నాయకత్వ లేమి, రాహుల్‌ అపరిపక్వత, పార్టీలో అసంతృప్తి దాన్ని బీజేపీకి దీటుగా నిలపలేకపోతున్నాయి. ఫలి తంగా ప్రతిపక్షంలో శూన్యత ఏర్పడింది. అదే ఇప్పుడు మమతకు కలిసొచ్చేలా ఉంది. 

రాగల మూడు నెలల్లో పార్టీ రాజ్యాంగాన్నీ, చివరకు పేరును కూడా జాతీయ స్థాయికి తగ్గట్టు మార్చే యోచనలో టీఎంసీ ఉంది. కానీ, జాతీయస్థాయి విస్తరణకు దీదీ వద్ద సమగ్రవ్యూహమే ఏమీ ఉన్నట్టు లేదు. ముప్పుతిప్పలు పెట్టిన బీజేపీపై వ్యక్తిగత లెక్కలు తేల్చుకోవడమే ధ్యేయంగా కనిపిస్తోంది. తగ్గట్టే ఇప్పుడు బీజేపీ పాలిత త్రిపుర, గోవాలలో సైతం తృణమూల్‌ బరిలోకి దిగింది.

ఈ గందరగోళంలో బీజేపీ కన్నా కాంగ్రెస్‌కే దెబ్బ తగులుతోంది. 2016లో కేవలం 3 స్థానాలున్న బెంగాల్‌లో ఇవాళ బీజేపీ దాదాపు 70 సీట్లకు ఎదిగింది. కానీ, గత పదేళ్ళలో అక్కడి కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతల్లో అధికభాగం దీదీ వైపు వచ్చేశారు. గతంలో బీజేపీతో, కాంగ్రెస్‌తో దోస్తీ మార్చిన తృణమూల్‌ నిజానికి సిద్ధాంతాల కన్నా దీదీ ఛరిష్మాపై ఆధారపడుతున్న సంగతీ మర్చిపోలేం. 

రెండు సార్లు ఎంపీ, వరుసగా మూడుసార్లు బెంగాల్‌ సీఎం అయిన దీదీకి కావాల్సినంత అనుభవం ఉంది. పోరాటానికి కావాల్సిన దూకుడూ ఉంది. బెంగాల్‌లో ఈ ఏటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించిన ఘనతా ఉంది.  కానీ, మోదీకి, మమత పోటీ అవగలరా? అసలు కాంగ్రెస్‌ లేని ప్రతిపక్షం సాధ్యమా? అలాంటి కూటమి విజయం సాధిస్తుందా? బెంగాల్‌ బయట తృణమూల్‌ విస్తరణవాదం బీజేపీనేమో కానీ, ప్రతిపక్షాలనే దెబ్బతీసేలా ఉంది.

అసలు జాతీయ స్థాయిలో 2014తో పోలిస్తే, 2019లో టీఎంసీకి సీట్లు తగ్గాయనీ, కాబట్టి జాతీయ వేదికపై దాని బలం ఏమంత గొప్పగా లేదనీ కొందరు గుర్తుచేస్తున్నారు. అయినా, పాలకపక్షంతో పోరాడాల్సిన ప్రతిపక్షాలు కొత్త నాయకత్వం కోసం కలహించుకుంటే ఏమవుతుంది? పిట్ట పోరు, పిట్ట పోరు... పిల్లి తీరుస్తుంది. 

>
మరిన్ని వార్తలు