ఔషధ రంగ ప్రక్షాళనే మందు!

9 May, 2023 00:26 IST|Sakshi

ఒంట్లో నలతగా ఉండటం మొదలుకొని ఎలాంటి అనారోగ్య సమస్యలొచ్చినా వైద్యుణ్ణి సంప్రదించటం, తగిన మందు వాడి ఉపశమనం పొందటం సర్వసాధారణం. కానీ ‘కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిన చందాన’ ఔషధాలుంటే జనం ప్రాణాలు గాల్లో దీపంగా మిగిలిపోయినట్టే. ఔషధ సంస్థలన్నిటినీ అనలేంగానీ కొన్ని సంస్థలు అందరి కళ్లూ కప్పి నాసిరకం ఔషధాల ఎగుమతులతో లాభాలు గడించేందుకు తహతహలాడుతున్న తీరువల్ల మన దేశం పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటున్నాయి.

ఈ విషయంలో పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆలస్యంగానైనా కేంద్ర ప్రభుత్వం సంకల్పించటం సంతోషించదగ్గ విషయం. ఇకపై ఉత్పత్తుల తయారీ ప్రక్రియలో మంచి విధానాలు (జీఎంపీ) పాటిస్తున్నట్టు ధ్రువపడితేనే ఆ ఉత్పత్తులను విడుదల చేయటానికి అంగీకరించాలనీ, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయాలనీ కేంద్రం నిర్ణయించింది. ఫార్మా ఉత్పత్తుల్లో మన దేశం విశ్వగురు అయిందని రెండు నెలలక్రితం కేంద్ర ఇంధన శాఖ సహాయమంత్రి భగవత్‌ కూబా ఘనంగా ప్రకటించారు.

కానీ ఇక్కడినుంచి ఎగుమతవుతున్న ఔషధాల వాడకంవల్ల పదులకొద్దీమంది మృత్యువాత పడిన ఉదంతాలు ఆ ఘనతను కాస్తా హరిస్తు న్నాయి. నిరుడు ఆఫ్రికా ఖండ దేశం గాంబియాలో దగ్గుమందు సేవించి 70 మంది పసిపిల్లలు మరణించగా, ఉజ్బెకిస్తాన్‌లో 19 మంది పిల్లలు చనిపోయారు. భారత్‌ నుంచి వచ్చిన కొన్ని ఔషధాల ప్రమాణాలు సక్రమంగా లేవని అమెరికా కూడా ప్రకటించింది.

ఔషధాల్లో మోతాదుకు మించి రసాయనాలున్నాయని కొన్నిసార్లు, నిర్దేశిత ప్రమాణాల్లో లేవని కొన్నిసార్లు ఫిర్యాదు లొస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో పంపిన ఔషధాలు పంపినట్టు వెనక్కొస్తున్నాయి. నిజానికి గాంబియాకు ఎగుమతయిన దగ్గు మందు మన దేశంలో విక్రయానికి పనికిరాదని నిషేధించారు! అయినా అది నిరాటంకంగా గాంబియాకు చేరుకుంది. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపమే ఈ దుఃస్థితికి కారణం. దీన్ని ఎంత త్వరగా సరిదిద్దితే అంత మంచిది. 

ఔషధాల్లో వినియోగించే ముడి పదార్థాలు ప్రామాణికమైనవి అవునో కాదో, అవి నిర్దేశించిన పాళ్లలో ఉన్నాయో లేదో తనిఖీ చేయటం, రోగంనుంచి ఉపశమనమిస్తుందని చేసిన ప్రకటనకు అనుగుణంగా ఆ ఉత్పత్తి ఉందో లేదో నిర్ధారించటం నియంత్రణ వ్యవస్థల పని. అలాంటి సంస్థలు మన దేశంలో 38 వరకూ ఉన్నాయి. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ)తో పాటు రాష్ట్రాల్లో పలుచోట్ల ఔషధ పరీక్ష కేంద్రాలు(సీడీఎల్‌) ఉన్నాయి. కానీ ఏదీ సక్రమంగా అమలు కావటం లేదని పలుమార్లు రుజువైంది.

గాంబియాలోనూ, ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్‌లోనూ పసివాళ్ల ప్రాణాలు తీసిన దగ్గు, జలుబు మందులను హరియాణాలోని మైడెన్‌ ఔషధ సంస్థ ఉత్పత్తి చేసింది. ఈ సంస్థ తరచు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. తమ ఫ్యాక్టరీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉందని తన వెబ్‌సైట్‌లో ఆ సంస్థ ఘనంగా ప్రకటించుకున్నా అదంతా ఉత్తదేనని తేలింది. అయినా ఏ నియంత్రణ విభాగం ఆ ఔషధ సంస్థపై చర్య తీసుకోలేకపోయింది. ఇప్పుడు కొత్తగా అమల్లోకి తెస్తామంటున్న జీఎంపీ అయినా సక్రమంగా అమలు చేయగలిగితే మంచిదే.

ఉత్పాదక ప్రక్రియ సక్రమంగా లేకపోతే ఆ ఉత్పత్తులు కాస్తా కొద్ది రోజుల్లోనే దెబ్బతింటాయి. ఔషధాలు రోగం తగ్గించకపోయినా ఎంతోకొంత సరిపెట్టుకోవచ్చుగానీ ప్రాణాలే తీస్తే?! అసలే పౌష్టికాహార లోపం, వాతావరణ కాలుష్యం, విషాహారం తదితరాలు జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. చివరకు ఔషధాలు సైతం ఈ జాబితాలో చేరితే ఇక చెప్పేదేముంది?
 
వాస్తవానికి ఎగుమతి చేసే ఔషధాలకు జీఎంపీ విధానం ఎప్పటినుంచో అమలులో ఉంది. కానీ దాన్ని అమలు చేయటంలోనే అడుగడుగునా నిర్లక్ష్యం కనబడుతోంది. ఔషధాలు ఎగుమతి చేయ దల్చుకున్న ప్రతి దేశమూ తమ ఔషధ సంస్థలు నిర్దిష్టమైన ప్రమాణాలు అమలు చేస్తున్నట్టు నిర్ధారించుకోవాలని గాంబియా విషాద ఉదంతం తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు నెలల క్రితం తెలిపింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

ముడి పదార్థాల నాణ్యత మొదలు కొని కర్మాగారంలోని పరిసరాలు, యంత్రాలు, సిబ్బంది పాటించే పరిశుభ్రత వరకూ సమస్తం సరిగా ఉన్నాయో లేదో చూడటం ఈ మార్గదర్శకాల సారాంశం. ఉత్పత్తి ప్రక్రియలోని ప్రతి దశలోనూ పాటించే విధానాలను నమోదు చేసేందుకు అవసరమైన నమూనాను ఎవరికి వారు రూపొందించుకోవాలనీ, పకడ్బందీ తనిఖీలతో ఇవన్నీ సక్రమంగా అమలయ్యేలా ఎప్పటికప్పుడు చూడాలనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.

కేంద్రం ప్రకటించబోయే జీఎంపీ ఇకపై మన దేశంలో విక్రయించే ఔషధాలకు కూడా వర్తిస్తుందంటున్నారు. మంచిదే. అయితే ఎగుమతయ్యే ఔషధాల విషయంలో చూపిన అలసత్వమే ఇక్కడా కనబడితే అనుకున్న లక్ష్యం నెరవేరదు. కర్మా గారం దాటి బయటికొచ్చే ప్రతి ఔషధమూ అత్యంత ప్రామాణికమైనదన్న విశ్వాసం రోగుల్లో కలగాలి. ఔషధాల తనిఖీ విధానంలో మార్పులు తెస్తే తప్ప దీన్ని సాధించటం కష్టం.

మన దేశంలో ఔషధ తయారీ సంస్థలు దాదాపు 30,000 వరకూ ఉన్నాయి. వీటిని సక్రమంగా తనిఖీ చేయాలంటే ఇప్పుడున్న సిబ్బంది ఏమాత్రం సరిపోరు. కనుక కొత్త నియామకాలపై కూడా దృష్టి పెట్టాలి. అలాగే చాలా ఫార్మా సంస్థలు తమ ఉత్పత్తుల ప్రయోగ ఫలితాల వివరాలను బహిరంగపరచటం లేదు. ఏమాత్రం పారదర్శకత పాటించని ఇలాంటి ధోరణులే కొంప ముంచుతున్నాయి. ఔషధ రంగాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తేనే ఈ పరిస్థితి మారుతుంది. 

మరిన్ని వార్తలు