సమాచార లోపం సరికాదు

15 Sep, 2020 05:21 IST|Sakshi

దేశం ఇంకా కరోనా వైరస్‌ మహమ్మారి గుప్పెటనుంచి బయటపడని వేళ... ఆర్థిక సంక్షోభం పర్యవ సానంగా కోట్లాదిమంది ఉపాధి అవకాశాలు అడుగంటుతున్న వేళ... 18 రోజుల పార్లమెంటు వర్షా కాల సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. పార్లమెంటు లోపలా, వెలుపలా కనబడుతున్న దృశ్యాలు గమనిస్తే ముందు జాగ్రత్త చర్యలు ఎంత పకడ్బందీగా అమలవుతున్నాయో అర్థమవు తుంది. పార్లమెంటు రెండు సమావేశాల మధ్య వ్యవధి ఆర్నెల్లు మించరాదన్న రాజ్యాంగ నిబంధన వుంది గనుక అది ముగుస్తున్న తరుణంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది సభ్యులు గుమిగూడే పరిస్థితులు తలెత్తకుండా ఉభయ సభలూ చెరో పూట సమావేశమ య్యేలా ఏర్పాట్లు చేశారు. తక్కువ వ్యవధిని కారణంగా చూపి ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. అయితే సభ్యులడిగే ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు అందుబాటులో వుంటాయని ఉభయ సభల అధ్యక్షులూ ప్రకటించారు. కానీ తొలిరోజే  వలస కార్మికుల మరణాలపై తమ వద్ద ఎలాంటి డేటా లేదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ జవాబివ్వడం దిగ్భ్రాంతి కలిగి స్తుంది. అంతేకాదు... రాష్ట్రాలవారీగా ఎంతమంది వలస కార్మికులకు ఉచిత రేషన్‌ వగైరాలు అందాయో చెప్పలేమని తెలిపింది. 

కరోనా విపత్తుతో గత మార్చి 24 నుంచి దేశమంతా లాక్‌డౌన్‌ విధించారు. కొన్నాళ్లపాటు పౌరుల కదలికలను పూర్తిగా స్తంభింపజేస్తేనే కరోనా కట్టడి సాధ్యమని ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ దాన్ని అమల్లో పెట్టేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సక్రమంగా లేకపోవడంతో వలస జీవులు ఒక్కసారిగా కష్టాల్లో పడ్డారు. ఉపాధి పోయి, గూడు చెదిరి ఏం చేయాలో తోచక, ఎలా పొట్ట నింపుకోవాలో అర్థంకాక అయోమయంలో పడ్డారు. ఉన్నచోటే వుంటే దిక్కులేని చావు చస్తామన్న భయంతో స్వస్థలాలకు పోవడానికి నిర్ణయించుకున్నారు. లాక్‌డౌన్‌ వల్ల సమస్త కార్యకలాపాలూ స్తంభించిపోవడంతో వీరంతా నడకదారిని ఎంచుకోక తప్పలేదు. వీరిలో వలస కూలీలు, కార్మికులు, చిన్నా చితకా వ్యాపారులు వున్నారు.

ఇలా మొత్తం కోటి నాలుగు లక్షల అరవై ఆరువేలమంది స్వస్థ లాలకు వెళ్లారని కార్మిక శాఖ చెబుతోంది. అధికంగా ఉత్తరప్రదేశ్‌కు 32.5 లక్షలమంది వలస కార్మి కులు తిరిగిరాగా, ఆ తర్వాత స్థానంలో బిహార్‌(15 లక్షలమంది), పశ్చిమబెంగాల్‌(13.38 లక్షల మంది) వున్నాయి. 63లక్షలమందికిపైగా వలస జీవుల్ని ప్రత్యేక రైళ్ల ద్వారా చేరేశారని కూడా ఆ శాఖ వివరించింది. అయితే లాక్‌డౌన్‌ మొదలైన నెల తర్వాత మాత్రమే ఈ ప్రత్యేక రైళ్లు నడిపారని మరిచిపోకూడదు. అనేకానేక కారణాలవల్ల ఈ సదుపాయాన్ని వినియోగించుకోలేనివారు కూడా నడవక తప్పలేదు. ఇలాంటివారంతా ఎన్నో యాతనలు పడ్డారు. కొందరు ఆకలిదప్పులకు తట్టుకో లేక మరణించారు. మరికొందరు రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకుని చనిపోయారు. గాయాలపాల య్యారు. కొన్ని సందర్భాల్లో వారు వెళ్లే దారిలో తారసపడిన వాహనాలెక్కి, అవి ప్రమాదాలపాలవ డంతో మరణించినవారున్నారు. మహారాష్ట్రలో రైల్వే ట్రాక్‌పై ఆదమరిచి నిద్రపోతూ 17మంది వలసకూలీలు చనిపోయారు. సుదూర ప్రాంతం నడిచిన కారణంగా ఒంట్లో సత్తువ కోల్పోయి మృత్యువాత పడిన ఉదంతాలున్నాయి. ఈ వలస జీవులకు పేరూ ఊరూ లేకపోవచ్చు. కానీ మహా నగరాల, పట్టణాల నిర్మాణం, వాటి మనుగడ వీరిపైనే ఆధారపడివుంటుంది. ఆకాశ హర్మ్యాల నిర్మాణంలో, రహదారుల నిర్మాణంలో, పారిశుద్ధ్యంలో, వ్యాపారాల్లో, ఫ్యాక్టరీల్లో, సంపన్నులు, మధ్యతరగతి వర్గాల ఇళ్లల్లో వీరు లేకపోతే అన్ని కార్యకలాపాలూ స్తంభించిపోతాయి. వలస కార్మి కుల శ్రమ విలువ జీడీపీలో పది శాతమని గణాంకాలు చెబుతున్నాయి. ఏ రిజిస్టర్‌లోనూ, రికార్డు ల్లోనూ చోటు దొరకని ఈ అభాగ్యులు సంక్షోభం ముంచుకొచ్చేసరికి ఎవరికీ కాకుండా పోయారు. 

బతికుండగానే ఎవరికీ కానివారు మరణించాక మాత్రం ఏం లెక్కలోకి వస్తారు? అందుకే ప్రభుత్వాల దగ్గర వారి మరణాల గురించిన లెక్కలు లేవనుకోవాలి. కనీసం ఆ వలసజీవుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం పనిచేసే సంస్థలనైనా ప్రభుత్వాలు సంప్రదించివుంటే ఏదో మేరకు గణాంకాలు లభ్యమయ్యేవి. అలా మరణించినవారిపై ఆధారపడిన కుటుంబాలకు సాయం అందిం చడం సాధ్యమయ్యేది. ఆ ప్రయత్నం చేస్తామని కూడా చెప్పకుండా తమ వద్ద డేటా లేదన్న సమా ధానం ఇవ్వడం కేంద్రానికి భావ్యం కాదు. రహదారి భద్రత గురించి పనిచేసే స్వచ్ఛంద సంస్థ సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ లాక్‌డౌన్‌లో రోడ్డు ప్రమాదాల బారినపడి మరణించినవారి వివరాలు సేకరించింది. ఆ సంస్థ గణంకాల ప్రకారం 198మంది వలస జీవులు లాక్‌డౌన్‌ సమయంలో రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. మార్చి 25–మే 31మధ్య దేశవ్యాప్తంగా 1,461 ప్రమాదాలు చోటుచేసుకోగా, అందులో 750మంది మరణించారని, మృతుల్లో 198మంది వలసజీవులని సంస్థ డేటా వెల్లడించింది.

అయితే ఇది సమగ్రమైన నివేదికని చెప్పలేం. వనరుల రీత్యా స్వచ్ఛంద సంస్థలకు అనేక పరిమితులుం టాయి. కానీ ప్రభుత్వాలకేమైంది? వలసజీవులు పిల్లాపాపలతో స్వస్థలాలకు నడుచుకుంటూ పోవడం దేశ విభజన తర్వాత భారత్‌లో చోటుచేసుకున్న అతి పెద్ద ఉత్పాతమని సామాజిక రంగ నిపుణులు అభివర్ణించారు. ఎంతమంది వలస కార్మికులు, కూలీలు నడిచిపోయారో చెప్పలేకపో యినా, కనీసం ప్రమాదాల్లో చిక్కుకుని ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో లెక్కలు చెప్పలేని స్థితి వుండకూడదు. ఎందుకంటే చిన్నదో పెద్దదో ప్రతి ప్రమాదమూ సమీప పోలీస్‌స్టేషన్‌లో తప్పని సరిగా నమోదవుతుంది. అందులో చిక్కుకున్నవారు ఎటునుంచి ఎటుపోతున్నారో రికార్డవుతుంది. ఎందరు మరణించారో, గాయపడ్డారో వివరాలుంటాయి. కనీసం ఇప్పుడైనా ఆ డేటాను అన్ని రాష్ట్రాల నుంచి సేకరించి పార్లమెంటుకు సమర్పించడం, బాధిత కుటుంబాలకు పరిహారం అందిం చడం అవసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా