వలసలపై సమగ్ర దృష్టి

24 Feb, 2021 00:58 IST|Sakshi

ఉపాధి కోసం విదేశాలకు వలసపోయినవారికి ఇక్కడి ఎన్నికల్లో ఓటేసే అధికారాన్ని ఇవ్వొచ్చునా... ఇస్తే అందుకనుసరించాల్సిన విధివిధానాలేమిటని దాదాపు దశాబ్దకాలంగా చర్చిస్తుండగా దేశంలో ఒక రాష్ట్రంనుంచి మరో రాష్ట్రానికి వలసపోయేవారి స్థితిగతుల గురించి ఎవరికీ పట్టకపోవటం వింతగానే అనిపిస్తుంది. కరోనా వైరస్‌ మహమ్మారి మన సమాజంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన అన్ని రకాల నిర్లక్ష్యాలనూ, లోటుపాట్లనూ బాహాటంగా ఎత్తిచూపింది. అందులో అంతర్గత వలస లపై నిర్దిష్టమైన విధానాలు, ప్రణాళికలు లేకపోవటం ఒకటి. నీతి ఆయోగ్‌ దీన్ని సరిచేసే దిశగా తొలి అడుగు వేసింది. ఈ విషయంలో సమగ్ర అధ్యయనం చేసేందుకు నియమించిన కమిటీ సిఫార్సుల ఆధారంగా ఒక ముసాయిదా విధానాన్ని రూపొందించింది. వలస కార్మికులకు ఓటింగ్‌ హక్కులు కల్పించటంతోసహా వారి విషయంలో తీసుకోవాల్సిన ఇతరత్రా చర్యలను ఈ ముసాయిదా సూచిం చింది. కమిటీలో కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ సంస్థల నుంచి ప్రతినిధులు వున్నారు.

వలసలపై అధ్యయనం చేస్తున్న నిపుణులకు కూడా ఇందులో చోటు కల్పించారు. లాక్‌డౌన్‌ విధించాక వలస కార్మికులు ఎన్ని అగచాట్లు పడ్డారో చెప్పే కథనాలు మీడి యాలో నిరుడు విస్తృతంగా వచ్చాయి. స్వస్థలాలను వదిలి పొట్టచేతబట్టుకుని వచ్చినవారికి ఆసరా ఇస్తున్నట్టే, ఉపాధి కల్పిస్తున్నట్టే కనబడిన మహా నగరాలు సంక్షోభం తలెత్తేసరికి వారిని గాలికి వదిలేశాయి. నిర్మాణరంగంతోసహా అనేక రంగాల్లో ఏ కొద్దిమందో తప్ప ఎవరూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించలేదు. ఫలితంగా నిలువనీడలేక, తినడానికి తిండి లేక లాక్‌డౌన్‌ నిబం ధనలను కూడా బేఖాతరు చేసి రోజూ లక్షలాదిమంది నడకదారిన వేలాది కిలోమీటర్ల దూరంలోని తమ తమ సొంత ఊళ్లకు వెళ్లాల్సివచ్చింది. 

అంతర్గత వలసలకు సంబంధించి డేటా వుండాలని, వలస కార్మికుల భద్రతకు, సంక్షేమానికి అదెంతో అవసరమని ఇన్ని దశాబ్దాలుగా ఏ ప్రభుత్వాలూ అనుకోలేదు. ఉపాధి హామీ పథకం, ఒకే దేశం–ఒకే రేషన్‌లాంటి పథకాల కోసం, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సదుపాయాలు వర్తింపజేయటం కోసం వేర్వేరు రంగాలు డేటా సేకరిస్తున్నాయి. కానీ ఆ డేటా ఆయా రంగాలకు ఉపయోగపడటం తప్ప మొత్తంగా ఒక సమగ్ర కార్యాచరణకు తోడ్పడేవిధంగా వుండదు. అందువల్లే ఒకచోట నుంచి ఒకచోటకు ఎంతమంది వలసపోతున్నారో ప్రభుత్వాల దగ్గర గణాంకాలు లేవు. ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతాలకు చెందినవారు ఎంతమంది వున్నారో చెప్పటం కూడా సాధ్యపడటం లేదు. జనాభా లెక్కల సమయంలో వలస కార్మికులు ఎంతమంది వున్నారో చెప్పే గణాంకాలు వస్తాయి.

కానీ అవి కేవలం సంఖ్యాపరంగా అటువంటి కార్మికులు ఎందరో చెప్పడానికి ఉపయోగపడతాయి తప్ప ఆ కార్మికుల కోసం అనుసరించాల్సిన నిర్దిష్టమైన కార్యాచరణ పథక రూపకల్పనకు తోడ్పడవు. వలస కార్మికుల సమస్యలు అనంతం. తమ ప్రాంతం కాని చోటుకూ, తమ భాష మాట్లాడని చోటుకూ వారు వెళ్తారు. వారిని పనిలో పెట్టుకున్నవారు తప్ప మరెవరూ వారికి తెలియదు. పిల్లలకు చదువుల చెప్పించటానికి, అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు ఉచితంగా వైద్యం చేయించుకోవటానికి అడుగ డుగునా వారికి అడ్డంకులు ఎదురవుతుంటాయి. అవసరమైన గుర్తింపు కార్డు లేకపోవటం ఇందుకొక కారణం. కనీసం బ్యాంకు ఖాతా ప్రారంభించాలన్నా వారికి సమస్యే. పని చేసే చోట వారికెదురయ్యే ఇతరత్రా సమస్యలు–కనీస సౌకర్యాలు, భద్రతవంటివి సరేసరి.

చాలా సందర్భాల్లో దళారుల ద్వారా వారు పనిలో కుదురుకుంటారు. ఇస్తామని చెప్పిన వేతనానికి, ఇస్తున్న వేతనానికి మధ్య వ్యత్యాసం వుంటుంది. కానీ నిలదీస్తే న్యాయం దక్కటం మాట అటుంచి, వున్న ఉపాధి పోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వారు అత్యంత దారుణమైన, అమానుషమైన పరిస్థితుల్లో బతుకీడుస్తుంటారు. వలస కార్మికులకు సమగ్రమైన చట్టాలుంటే, వారి విషయంలో వివిధ ప్రభుత్వ శాఖల కర్తవ్యా లేమిటో తెలిపే నియమనిబంధనలుంటే వారు దిక్కులేని పక్షులుగా మారే దుస్థితి వుండదు.

ఇప్పుడు నీతి ఆయోగ్‌ ముసాయిదా పత్రం వలస కార్మికులు దేశ సంపదను పెంచటానికి ఎంత కృషి చేస్తున్నారో గణాంకాల సహితంగా తెలిపింది. వలసల్లో ఇమిడివుండే సంక్లిష్టతలనూ, వారి కెదురయ్యే సమస్యలను పరిష్కరించటానికి ఎలాంటి మార్గాలు అనుసరించాలో పత్రం సూచించింది. వారికి ఓటు హక్కు కల్పించాలన్నది మంచి సూచన. ఇందువల్ల ప్రతి రాజకీయ పార్టీ వారి సంక్షేమం కోసం, వారి హక్కుల్ని రక్షించటం కోసం ఏదోమేరకు కృషి చేయటం ప్రారంభిస్తాయి. వలస కార్మికుల తరఫున అధికారులను కలిసి సమస్యలు పరిష్కరించేలా చూడటంలో చురుగ్గా వుంటాయి.

అంతర్రాష్ట్ర వలసలకు సంబంధించి ఒక నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసి, వలస కార్మికులను నమోదు చేసే విధానం వుంటే కార్మికుల స్వరాష్ట్రంలోనూ, వారు పనిచేసే రాష్ట్రంలోనూ అక్కడి ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవటానికి వీలుంటుందని ముసాయిదా చేసిన సూచన కూడా హర్షించదగ్గది. వలస కార్మికుల శ్రమ ద్వారా ఏటా దేశానికి సమకూరే సంపద ఎంతో తెలిస్తే సమాజానికి కూడా వారి ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది. నీతి ఆయోగ్‌ ముసాయిదాలోని లోటుపాట్లపై అందరి అభిప్రాయాలూ సేకరించి, సాధ్యమైనంత త్వరగా తదుపరి చర్యలు తీసు కోవాలి. వలస కార్మికుల సంక్షేమానికి, వారి భద్రతకూ ప్రభుత్వాలు తగిన యంత్రాంగాన్ని రూపొందించాలి.
 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు