తమిళనాట స్టాలిన్‌ ఏలుబడి

8 May, 2021 02:16 IST|Sakshi

సుదీర్ఘమైన ఎదురుచూపులు ఫలించాయి. మొన్నటి ఎన్నికల్లో డీఎంకేను సునాయాసంగా విజయ తీరాలకు చేర్చిన ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ శుక్రవారం 33మంది మంత్రులతో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తమిళనాట సుదీర్ఘకాలంగా సాగుతున్న రెండు పార్టీల వ్యవస్థ చెక్కుచెదరలేదని ఈ ఎన్నికలు నిరూపించాయి. ఇది ఒక రకంగా బీజేపీకి మాత్రమే కాదు... కాంగ్రెస్, వామపక్షాలకు సైతం ఇబ్బందికరమే. కేబినెట్‌ ప్రమాణస్వీకారం తర్వాత  కరోనా రోగుల కుటుంబాలకు తక్షణం రూ. 2,0000 చొప్పున, వచ్చే నెల మరో 2,000 ఇచ్చే ఫైలుపై స్టాలిన్‌ తొలి సంతకం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందే వారికయ్యే ఖర్చును సీఎం బీమా పథకం ద్వారా తిరిగి చెల్లిస్తారు. అలాగే మహిళలు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించారు. ఆఖరుసారి పదేళ్లక్రితం రాష్ట్రంలో అధికార పీఠం అందుకున్న పార్టీని ఈ స్థాయికి తీసుకెళ్లడం సామాన్యం కాదు. తండ్రి కరుణానిధి నీడలో సుదీర్ఘకాలం మనుగడ సాగించవలసి వచ్చిన స్టాలిన్, ఆయన కనుమరుగయ్యాక పార్టీని తన భుజస్కంధాలపై మోయాల్సివచ్చింది. అవతలి పక్షంలో విస్తృత ప్రజాదరణ వున్న జయలలిత సైతం కరుణానిధికి ముందే కన్నుమూశారు. ఆమె ఆరోగ్యంగా కొనసాగివుంటే స్టాలిన్‌ ఇంతటి విజయం సాధించేవారా అన్న ప్రశ్న ఎటూ వుంటుంది. అయితే ఇప్పుడెదురైన సవాళ్లు కూడా తక్కువేమీ కాదు. అధికార అన్నాడీఎంకేతో చేతులు కలిపిన బీజేపీ చాలా జాగ్రత్తగా పావులు కదిపింది.

జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే సమష్టిగా వుంటుందని, ప్రభుత్వాన్ని చివరికంటా నడుపుతుందని ఎవరూ అనుకోలేదు. బీజేపీ ఆ పని చేయించగలిగింది. అన్నా డీఎంకే పాలనకు పెద్దగా వ్యతిరేకత లేకుండా ఆ పార్టీ పెద్దలు సహకరించారు.  ఆ కూటమి డీఎంకే కూటమిని ఈ స్థాయిలో సవాలు చేయగలదని ఎవరూ అనుకోలేదు. రాష్ట్ర స్థాయిలో అన్నా డీఎంకేకు చెప్పుకోదగ్గ జనాకర్షణ కలిగిన నాయకులు లేకపోవడం, ఆ పార్టీ మాజీ సీఎంలు పళనిస్వామి, పన్నీరుసెల్వం మధ్య ఆధిపత్య పోరు యధా తథంగా వుండటం ఆ కూటమికి వున్న ప్రధాన సమస్యలు. అయితే ఆ అధిపత్య పోరును జయ ప్రదంగా అధిగమించి ఎన్నికలు ప్రకటించేనాటికి పార్టీకి ఏకైక నాయకుడిగా పళనిస్వామి తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నారు.  అయినా కూడా వరసగా పదేళ్లపాటు అధికారంలో వుండటం వల్ల అన్నాడీఎంకేపై ఆమేరకు జనంలో వ్యతిరేకత వుంది. బీజేపీ తన వాటాకింద 60 స్థానాలివ్వాలని పట్టుబట్టింది. కానీ కేవలం 20 సీట్లకు అది పరిమితమయ్యేలా అన్నాడీఎంకే ఒప్పించగలిగింది అలా వచ్చిన సీట్లలో కేవలం నాలుగు మాత్రమే అది గెలుచుకోగలిగింది. మరో పార్టీ పీఎంకే సైతం నాలుగు మాత్రమే సాధించింది. చివరకు ఎలాగైతేనేం ఆ కూటమి 66 స్థానాలు సాధించింది. 

తమిళనాడులో బీజేపీ నేతృత్వంలోని హిందుత్వ శక్తుల్ని కాలు పెట్టనీయరాదన్న డీఎంకే ఏకైక ఎజెండా పాత మిత్రులందరినీ శిబిరంనుంచి జారకుండా కాపాడింది. ఎన్నికల్లో కూడా డీఎంకే కూటమికి అదే ఉపయోగపడింది. దీంతోపాటు నీట్‌ పరీక్షలను కేంద్రం బలవంతంగా రుద్దిందన్న అభిప్రాయం ఏర్పడటం, జీఎస్‌టీ చిక్కుముడులు సైతం అన్నాడీఎంకే కూటమిని దెబ్బతీశాయి. ఫలితంగా జనం డీఎంకే కూటమికి భారీ మెజారిటీనిచ్చి అధికారాన్ని అప్పగించారు. నిజానికి సీట్ల పంపకాల్లో డీఎంకే కూటమి పక్షాల మధ్య కూడా బాగా విభేదాలు తలెత్తాయి. తాము కోరుకున్న సీట్లకూ, కేటాయించినవాటికీ ఎక్కడా పొంతన లేకపోవడంతో బీసీకే, ఎండీఎంకేవంటి చిన్న పక్షాలు మాత్రమే కాదు...కాంగ్రెస్, వామపక్షాలు సైతం డీఎంకేపై ఆగ్రహంతో వున్నాయి. అందుకే విజయం సాధించాక కూటమి సారథిని ప్రశంసించడానికి బదులు తమిళ ప్రజలను మాత్రమే ఆ పార్టీలు అభి నందించాయి. అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి. కాంగ్రెస్‌ పార్టీ తనకు కేటాయించిన 25 స్థానాల్లో 17 మాత్రమే సాధించగలిగింది. అంతేకాదు... పుదుచ్చేరిలో ఆ కూటమి విజయం సాధించలేకపోయింది. అఖిల భారత ఎన్నార్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి అసెంబ్లీలోని 30 స్థానాల్లో 16 గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అవసరమైన సంఖ్య కన్నా ఒకే ఒకటి అదనంగా వచ్చినా.. గెలిచిన ఆరుగురు స్వతంత్రుల్లో అత్యధికులు ఆయనకే మద్దతు పలుకుతారు గనుక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సమస్యలేమీ వుండవు. 

తమిళనాట స్టాలిన్‌ ప్రభుత్వం ఆచితూచి అడుగులేయాల్సివుంటుంది. ఉదయభానుడిగుర్తుతో గతంలో పలు దఫాలు పాలించిన డీఎంకేకు పాలనానుభవం తక్కువేమీ లేదు. అయితే ఇన్నాళ్లూ అన్నాడీఎంకేకు సహకరించిన మాదిరి డీఎంకే కూటమి సర్కారుకు కేంద్రం సాయపడకపోవచ్చు. అందువల్ల ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో మునుముందు అనేక అవరోధాలను స్టాలిన్‌ అధిగమించాల్సివుంటుంది. అలాగే రోజుకు దాదాపు 15,000 కరోనా కేసులు వస్తున్న నేపథ్యంలో దాన్ని నియంత్రించడం కూడా ఆయనకు పెను సవాలే. జనాభాకు అవసరమైన కరోనా వ్యాక్సిన్లను కేంద్రం నుంచి సాధించడం, రోగుల సంఖ్యకు దీటుగా లేని బెడ్‌ల సంఖ్య పెంచడం స్టాలిన్‌ ముందున్న తక్షణ కర్తవ్యాలు. అయితే బెడ్‌లు పెంచినంత మాత్రాన సరిపోదు. అందుకు తగినట్టు వైద్యులనూ, నర్సింగ్‌ సిబ్బందిని కూడా నియమించాలి. ఈ తక్షణ, దీర్ఘకాలిక సవాళ్లను స్టాలిన్‌ ఎలా అధిగమిస్తారో, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎంత సమర్థవంతంగా నడుపుతారో మున్ముందు చూడాలి. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు