సంగీతమే సమతామంత్రం

23 Aug, 2021 00:00 IST|Sakshi

సంగీతం అనాదికళ. పశుపక్ష్యాదుల ధ్వనులను మనుషులు అనుకరించడంతో సంగీతం పుట్టిందంటారు. భాష కంటే ముందే సంగీతం పుట్టి ఉంటుంది. తన బిడ్డను నిద్రపుచ్చడానికి ఏ ఆదిమ మాతృమూర్తి గళం నుంచో ప్రారంభ స్వరఝరి ప్రవహించి ఉంటుంది. వేదకాలం నాటికి సామగానంతో సంగీతానికి భాషతో చెలిమి కుదిరింది. ప్రపంచంలో పుట్టుకొచ్చిన ప్రతి భాషనూ సంగీతం అక్కున చేర్చుకుంది. అలా పాట పుట్టింది. పనికి పాట తోడైంది. పాట మనిషికి తన బతుకు పయనంలో ఊతమైంది, ఊరటైంది, ఊపిరైంది. ప్రపంచం నలుమూలలా విస్తరించిన సంగీతంలో ఎన్నో శైలీభేదాలు, వాటికి అనుగుణంగా సంగీత సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ఎన్ని సంప్రదాయాలు, ఎన్ని శైలీభేదాలున్నా సంగీతం ఒక్కటే! అందులో ఉండేవి ఆ సప్తస్వరాలే! సంగీతం విశ్వజనీన భాష!

సంగీతం మనసును తేలికపరుస్తుంది. సంగీతం జీవనోత్సాహాన్ని నింపుతుంది. సంగీతం మనుషుల మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః’ అని ఆర్యోక్తి. శ్రావ్యమైన సంగీతానికి మనుషులే కాదు, పశుపక్ష్యాదులూ స్పందిస్తాయి. ఈ సంగతిని ఆధునిక శాస్త్ర పరిశోధనలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. సంగీతాన్ని ఇష్టపడని వారు లోకంలో బహు అరుదు. సంగీతానికి స్పందించని మనిషి అత్యంత ప్రమాదకారి అని జ్యోతిష గ్రంథం ‘ఉత్తర కాలామృతం’ చెబుతోంది. మహాక్రూరులుగా పేరుమోసిన రాక్షసులు సైతం సంగీతాన్ని ఆస్వాదించిన ఉదంతాలు పురాణాల్లో ఉన్నాయి. ఆ లెక్కన సంగీతానికి స్పందించని వాళ్లు, సంగీతాన్ని ద్వేషించేవాళ్లు ఎంతటి కర్కశులో. సంగీతాన్ని ద్వేషించేవాళ్లంతా ఏకమై, జట్టుకడితే వాళ్లనే తాలిబన్లు అంటారు. సంగీతాన్ని ఏవగించుకునేవాళ్లు, పాటను పంజరంలో బంధించాలనుకునేవాళ్లు, గాలిలో స్వేచ్ఛగా ఎగిరే పాటను వేటాడాలనుకునేవాళ్లు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాళ్లు తాలిబన్‌ సోదరులే! 

తాలిబన్లకు తాతల నాటి నాజీలు సంగీతాన్ని నిషేధించలేదు గాని, సంగీతాన్ని తమ హింసాకాండకు పక్కవాద్యంలా వాడుకున్నారు. నాజీ కాన్సంట్రేషన్‌ క్యాంపుల్లో జరిగిన ఘాతుకాల వెనుక ఆ క్యాంపుల్లో వినిపించిన సంగీతం పాత్ర గురించి తెలుసుకున్నాక విచలితుడైన ఫ్రెంచి సంగీతకారుడు, రచయిత పాస్కల్‌ కిగ్నార్డ్‌ తన సంగీత కార్యకలాపాలన్నింటినీ విరమించుకుని, ‘హేట్రెడ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’ అనే పుస్తకం రాశాడు. చరిత్రలోని వివిధకాలాల్లో సంగీతంలో చోటు చేసుకున్న పరిణామాలపై అధ్యయనం జరిపి, మనుషుల ఆలోచనలపైనా భావోద్వేగాలపైనా సంగీతం చూపగలిగే ప్రభావంపై విస్తృత పరిశోధన చేశాడాయన. సంగీతాన్ని ఆస్వాదించలేకపోవడం మానసిక రుగ్మత. ‘మ్యూజికల్‌ ఎన్హెడోనియా’ అనే వ్యాధికి లోనైనవారు సంగీతాన్ని ఆస్వాదించే శక్తిని కోల్పోతారు. ఇంకొందరికి ‘మ్యూజికల్‌ హాల్యూసినేషన్స్‌’– అంటే సంగీతభ్రాంతులు కలుగుతుంటాయి. చుట్టుపక్కల పరిసరాలన్నీ నిశ్శబ్దంగా ఉన్నా, వీరికి చెవులో నిరంతరం సంగీతం వినిపిస్తూ ఉంటుంది. ఏవేవో పాటలు, వాద్యగోష్ఠులు వినిపిస్తూ ఉంటాయి. దీనినే ‘మ్యూజికల్‌ ఇయర్‌ సిండ్రోమ్‌’ అంటారు. ఇవన్నీ నాడీవ్యవస్థ లోపాల వల్ల తలెత్తే మానసిక వ్యాధులు. సంగీతం పట్ల నిరాసక్తత, నిర్లిప్తత ప్రమాదకరంకాని మానసిక రుగ్మత. సంగీతం పట్ల నిరాసక్తత కలిగిన వారు జనాభాలో ఐదుశాతానికి మించి ఉండరని అంచనా. సంగీతం పట్ల ద్వేషం ఎలాంటి వ్యాధి అవుతుందో, దానికి నివారణ మార్గమేమిటో, దానిని నయం చేయగలిగిన చికిత్సా పద్ధతులేమిటో నిపుణులే చెప్పాలి. 

అసలు సంగీతమే చాలా రోగాలను నయం చేస్తుందంటారు. సంగీతంతో వ్యాధులను నయం చేసే ‘మ్యూజిక్‌ థెరపీ’ చికిత్సలు చేస్తున్నారు. సంగీతం సర్వరోగనివారిణి కాకపోయినా, చాలావరకు మానసిక రుగ్మతలను, మానసిక అలజడుల కారణంగా తలెత్తే శారీరక వ్యాధులను నయం చేయగలదని ఆధునిక నిపుణులు కూడా చెబుతున్నారు. మన భారతీయ సంగీతకారుల్లో ముత్తుస్వామి దీక్షితార్‌ తొలిసారిగా ఇలా సంగీతంతో వ్యాధిని నయం చేసినట్లు చెబుతారు. కడుపునొప్పితో విలవిలలాడుతున్న శిష్యుడిని చూసి ఆయన ఆశువుగా ‘తారాపతే బృహస్పతే’ అంటూ గురుగ్రహాన్ని స్తుతిస్తూ కీర్తనను గానం చేశారని, ఆయన గానానికి శిష్యుడు స్వస్థత పొందాడని ప్రతీతి. ఇటీవల మ్యూజిక్‌ థెరపీపై శాస్త్రీయ పద్ధతుల్లో ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. సంగీతం మానసిక అలజడిని దూరం చేస్తుందని, దిగులు గుబులు వంటి ప్రతికూల భావనలను దూరం చేస్తుందని, ఉత్సాహాన్ని నింపి కార్యోన్ముఖులను చేస్తుందని, రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుందని పరిశోధనలు తేల్చాయి. 

సంగీత ప్రపంచంలో ఇదివరకటి చాదస్తాలన్నీ ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. సంగీతంలోని భిన్న సంప్రదాయాలు ‘ఫ్యూజన్‌’ ప్రయోగాలతో పెనవేసుకుంటున్నాయి. సంగీతం తన శాస్త్రీయ పునాదులను పటిష్ఠం చేసుకుంటూనే, మరింతగా విస్తరిస్తోంది. ముక్కపచ్చలారని చిన్నారులు సంగీత ప్రపంచంలో సరికొత్త సంచలనాలను సృష్టిస్తున్నారు. ‘ఇండియన్‌ ఐడల్‌’, ‘సా రె గా మా పా’, ‘ది వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’ వంటి టీవీ మ్యూజిక్‌ షోలే ఇందుకు నిదర్శనం. సంగీతం మరో పదికాలాల పాటు చల్లగా బతుకుతుందనడానికి కొత్తతరం గాయనీగాయకుల శ్రద్ధాసక్తులే తార్కాణం. ఎన్నో సంప్రదాయ కళలు కనుమరుగైపోతున్న తరుణంలో సంగీతం మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా జవసత్త్వాలను పుంజుకోవడం విశేషం. ఈర్షా్య ద్వేషాల సంకుచిత ప్రపంచంలో మనుషుల మధ్య మమతానురాగాలను పదిలపరచడానికి సంగీతమే సమతామంత్రం. 

మరిన్ని వార్తలు