మయన్మార్‌లో సైన్యం ఆగడం

6 Mar, 2021 00:46 IST|Sakshi

గత నెల 1న మయన్మార్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం హస్తగతం చేసుకున్న సైనిక ముఠా రోజూ వీధుల్లో ఎగిసిపడుతున్న జన కెరటాలను చూసి బెంబేలెత్తుతోంది. ఉద్యమకారులను నియంత్రించే పేరుతో చాలా తరచుగా భద్రతా బలగాలు సాగిస్తున్న కాల్పులు ఆ ముఠా బలాన్ని కాక బలహీనతను పట్టిచూపుతున్నాయి. వివిధ నగరాల్లో కేవలం బుధవారం రోజున 38 మంది పౌరుల్ని భద్రతా బలగాలు పొట్టనబెట్టుకున్న తీరు ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచింది. సరిగ్గా అంతకు మూడు రోజుల ముందు ఆదివారం వేర్వేరు నగరాల్లో కాల్పులు జరిపి 25 మంది ప్రాణాలు తీశారు. సైనిక నియంతల నేర చరిత్ర తిరగేస్తే ఈ దమనకాండ వున్నకొద్దీ పెరుగుతుంది తప్ప ఇప్పట్లో తగ్గదని అర్థమవుతుంది. నిరసనల్లో ముందున్నవారిని ఈడ్చుకొచ్చి కాల్చిచంపటం, ఉద్యమకారుల్ని వేటకుక్కల్లా తరుముతూ ప్రాణాలు తీయటం, రోజూ ఇళ్లపై దాడులు చేస్తూ వందలమందిని నిర్బంధించటం సామాజిక మాధ్యమాల్లో కనబడుతున్నాయి.  ఇళ్లల్లో వున్నవారిని గురిచూసి కాల్చటం, హఠాత్తుగా లోపలికి చొరబడి పౌరుల్ని కొట్టుకుంటూ తీసుకెళ్లి వ్యాన్‌ ఎక్కించటం వంటి ఉదంతాలు నిత్యకృత్యమయ్యాయి. ఆఖరికి గాయపడిన ఉద్యమకారులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను సైతం అరెస్టు చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఉద్యమానికి చెప్పుకోదగ్గ నాయకులంటూ లేరు. వివిధ రాజకీయ పక్షాల నేతలనూ, ప్రభుత్వ వ్యతిరేక దృక్పథం వున్న పాత్రికేయులనూ సైనిక ముఠా జైళ్లపాలు చేసింది. అయినా నిరసనల తీవ్రత తగ్గుతున్న దాఖలాలు లేవు.

గత నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కీలక నేత ఆంగ్‌సాన్‌ సూకీ నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమాక్రసీ(ఎన్‌ఎల్‌డీ) 83 శాతం స్థానాలను గెల్చుకోగా, తమ ఏజెంటుగా వున్న యూనియన్‌ సాలిడారిటీ అండ్‌ డెవెలప్‌మెంట్‌ పార్టీ(యూఎస్‌డీపీ)కి కేవలం 7శాతం స్థానాలు రావటం సైనిక ముఠా జీర్ణించుకోలేకపోయింది. అడ్డగోలు నిబంధనలతో నింపిన రాజ్యాంగం సైతం ఈసారి పార్లమెంటులో తమకు అక్కరకొచ్చే స్థితి లేకపోవటంతో ఎటూ పాలుబోలేదు. ఆ ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం సైన్యానికుండే అధికారాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటుందని సూకీ చెప్పారు. ఎన్‌ఎల్‌డీ మెజారిటీ పెరగటంతో తాము దశాబ్దాలుగా అనుభవిస్తున్న పెత్తనం అంతరిస్తుందన్న భయం సైన్యాన్ని పీడించింది. పర్యవ సానంగా సైనిక కుట్రకు పాల్పడింది. సూకీతో సహా ప్రధాన నాయకులందరినీ గుర్తు తెలియని ప్రాంతాల్లో నిర్బంధించింది. అయితే జనాన్ని తక్కువ అంచనా వేసింది. విద్యార్థులు, ఉపా ధ్యాయులు, వైద్యులు, బ్యాంకర్లు, కార్మికులు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. పైగా వీరంతా రోహింగ్యా ముస్లింలపైనా, ఇతర మైనారిటీలపైనా సైన్యం అమలు చేస్తున్న అణచివేతను ప్రశ్నిస్తున్నారు. వారి ఆందోళనకు కూడా మద్దతిస్తున్నారు.

నాలుగైదేళ్లక్రితం దేశంలో మతతత్వాన్ని, జాతీయవాదాన్ని రెచ్చగొట్టి రోహింగ్యాలను తుడిచి పెట్టేందుకు సైన్యం మారణహోమాలకు పాల్పడింది. ఊళ్లకు ఊళ్లు తగలబెడుతూ, వేలాదిమందిని ఊచకోత కోసింది. ఇందుకు ప్రైవేటు ముఠాల సాయం కూడా తీసుకుంది. దురదృష్టమేమంటే అప్పుడు తమ పార్టీ ప్రభుత్వానికి మార్గదర్శకత్వం వహిస్తున్న సూకీ సైన్యం ఆగడాల గురించి నోరెత్తలేదు. పైగా అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ముందు హాజరై వారిని వెనకేసుకొచ్చారు. కనీసం రోహింగ్యాల పేరెత్తడానికి కూడా ఆమె సిద్ధపడలేదు. తనను రోహింగ్యాల ఏజెంటుగా ప్రచారం చేస్తున్న బౌద్ధ మిలిటెంటు గ్రూపుల ప్రచార హోరును చూసి, సైన్యం ఆగ్రహానికి గురికావలసివస్తుందని భయపడి ఆమె చూసీచూడనట్టు వూరుకున్నారు. కానీ ఇప్పుడు వీధుల్లో కొచ్చిన ఉద్యమకారులు అలాంటి వివక్ష పాటించటం లేదు. తమపై ఇప్పుడు సాగుతున్న సైనిక అకృత్యాలు రోహింగ్యాలపై అమలైన అణచివేతకు కొనసాగింపుగానే చూస్తున్నారు. ఇది సైనిక పాలకులకు మాత్రమే కాదు... మళ్లీ వారి చెరలో పడిన సూకీకి సైతం ఊహించని పరిణామం. పదిహేనేళ్లు ఆమె నిర్బంధంలో వున్నప్పుడు ప్రజానీకం ఆమెకు అండదండలందించారు. ప్రజా స్వామ్యం కోసం, ప్రత్యేకించి ఆమె కోసం రోడ్లపైకొచ్చి నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు వారి ఏకైక ఎజెండా ప్రజాస్వామ్య పునరుద్ధరణే. ఈ క్రమంలో సైనిక పాలకులు కల్పిస్తున్న అన్ని అడ్డంకులనూ ఎదుర్కొంటున్నారు.

అంతర్జాతీయంగా మయన్మార్‌ పోరాటానికి మద్దతునిస్తున్నవారికి ఇప్పుడొక ధర్మసంకటం ఏర్పడింది. రోహింగ్యాల ఊచకోత సమయంలో ప్రభుత్వానికి మార్గదర్శకత్వం వహిస్తూ, సైన్యాన్ని వెనకేసుకొచ్చిన సూకీని దూరం పెడుతూ... ఉద్యమానికి మద్దతునీయటం ఎలాగన్నది వారిని వేధి స్తున్న ప్రశ్న. మయన్మార్‌లో భారీయెత్తున పెట్టుబడులు పెట్టిన చైనా, ఆ దేశంతో మరింత సాన్నిహిత్యం కోసం ఉవ్విళ్లూరుతున్న రష్యా స్వప్రయోజనాల కోసం సైనిక పాలకుల ఆగడాలను గుడ్లప్పగించి చూస్తున్నాయి. వారి చర్యలను ఖండించే భద్రతా మండలి తీర్మానాన్ని నీరుగార్చటంతో పాటు మానవహక్కుల మండలిలో తీర్మానం చేయకుండా అడ్డుకున్నాయి. మయన్మార్‌ ప్రజాస్వామ్య ఉద్యమానికి మద్దతుగా నిలిచేందుకు ఎక్కడికక్కడ తమ ప్రభుత్వాలపై ప్రపంచ ప్రజానీకం ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే సైనిక పాలకులు దారికొస్తారు. 

మరిన్ని వార్తలు