అవసరమైన అనుబంధం

5 May, 2022 00:16 IST|Sakshi

ఒక్కోసారి చేస్తున్న పని కన్నా అది చేపట్టిన సమయానికే ఎక్కువ ప్రాధాన్యం. ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల, 3 ఐరోపా దేశాల పర్యటన అలాంటిదే. బుధవారంతో ముగిసిపోతున్న ఈ పర్య టనలో భాగంగా ఆయన జర్మనీ, డెన్మార్క్‌ల మీదుగా ఆఖరి మజిలీ ఫ్రాన్స్‌ను సందర్శిస్తున్నారు. ఐరోపాకు గుండెకాయ లాంటి చోట సాగుతున్న ఓ యుద్ధం 70 ఏళ్ళ ప్రపంచ ఆధిపత్య క్రమాన్నే మార్చివేసిన సమయంలో మోదీ అదే ఐరోపాలోని మూడు దేశాల్లో పర్యటించడం విశేషం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సొంత ఇంటికి దగ్గరలో ఐరోపా సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఇదే తొలి సారి. ఉక్రెయిన్‌ యుద్ధం సహా ఆర్థిక, రక్షణ సంబంధాలు అజెండాగా మోదీ పర్యటన సాగింది. 

ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఐరోపాలో అత్యధిక దేశాలు రష్యాకు వ్యతిరేకమైన సమయమిది. కానీ, రష్యాకు చిరకాల మిత్రదేశంగా తాజా యుద్ధంలో భారత్‌ తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. ఈ పరిస్థితుల్లో మన దేశ ప్రధాని రష్యా వ్యతిరేకత బలంగా వినపడుతున్న ఐరోపాలో వివిధ దేశాలలో పర్యటించడం, దేశాధినేతల్ని నొప్పించకుండా మనకు కావాల్సినవి ఒప్పించుకొని రావడం క్లిష్టమే. ఈ ఏడాది తాను జరుపుతున్న ఈ తొలి విదేశీ పర్యటనలోనే ఆ పనిని భుజానికెత్తుకున్నారు మోదీ. అదే సమయంలో ఉక్రెయిన్‌పై ఐరోపా దేశాల అభిప్రాయాలను అర్థం చేసుకొంటూనే, మన వైఖరిని వారికి వివరించడానికి భారత్‌కు దక్కిన మంచి అవకాశం ఇది. ఐరోపా సమాజంతో అనుబంధం పెంచుకొని, భవిష్యత్‌ సహకారానికి పునాది పటిష్ఠం చేసుకొనేందుకు వీలు చిక్కింది. అందుకే శ్రమ అయినప్పటికీ, 65 గంటల్లో 3 దేశాలు చుడుతూ, దాదాపు 25 కార్యక్రమాల్లో పాల్గొన్నారు మోదీ. 

మోదీ మున్ముందుగా సోమవారం వెళ్ళింది – యూరప్‌లో మనకు అతి ముఖ్య భాగస్వామ్య దేశమైన జర్మనీకి. ఆ దేశానికి గత డిసెంబర్‌లో కొత్తగా నియుక్తుడైన ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ యుద్ధ వ్యతిరేకి, సోషల్‌ డెమోక్రాట్‌. రష్యా వ్యతిరేక కూటమిలో చేరాలన్న అమెరికా ఒత్తిడికి మొదట్లో షోల్జ్‌ తలొగ్గనప్పటికీ, చివరకు ఇంధన అవసరాల నిమిత్తం రష్యాపై ఆధారపడడాన్ని తగ్గించుకొని, తమ దేశం పక్షాన ఆర్థిక త్యాగాలు చేయడానికి సిద్ధపడ్డారు. మిలటరీ వ్యయాన్ని భారీగా పెంచాలని నిర్ణయించుకోవాల్సి వచ్చింది. మరోపక్క స్వీడన్, ఫిన్లాండ్‌ లాంటివి మునుపటి వైఖరిని మార్చుకొని, ‘నాటో’లో చేరడానికి ఉద్యుక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మోదీ ఒక పక్క ఆయా దేశాలతో అనుబంధాలు పెంచుకోవడానికీ, అక్కడి వ్యాపారవేత్తలను ఆకర్షించడానికీ, ఎక్కడికక్కడ ప్రవాస భారతీయులను మంత్ర ముగ్ధులను చేయడానికీ మాటల మోళీ చేశారు.
 
ఉక్రెయిన్‌ యుద్ధంలో చివరకు మిగిలేది విధ్వంసం, విషాదమే తప్ప, ఇరుదేశాల్లో ఎవరూ విజేత కాలేరని జర్మనీ రాజధాని బెర్లిన్‌లో మోదీ కుండబద్దలు కొట్టారు. పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణపై భారత, జర్మనీలు సంయుక్త ప్రకటన చేశాయి. మర్నాడు మంగళవారం డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగెన్‌లో ఆ దేశ ప్రధాని ఫ్రెడెరిక్సన్‌తో పునరుత్పాదక ఇంధనం, పవన విద్యుత్, గ్రీన్‌ హైడ్రోజన్, నైపుణ్యాభివృద్ధి, షిప్పింగ్‌ తదితర అంశాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిగాయి. అక్కడ ఆమెతో సంభాషణల్లోనూ ఉక్రెయిన్‌ సంక్షోభ నివారణకు భారత్‌ కృషి చేయాలన్న ప్రస్తావన గట్టిగానే వచ్చింది. ఆమెకు బదులిస్తూ, కాల్పుల విరమణ చేయాలనీ, రష్యా – ఉక్రెయిన్‌లు సంప్రదింపులకు సిద్ధం కావాలనీ మోదీ పిలుపునిచ్చారు. 

బుధవారం ‘నార్డిక్‌–5’ (డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్‌) దేశాల ప్రధాన మంత్రుల రెండో సదస్సులో మోదీ పాల్గొన్నారు. అక్కడా అనివార్యంగా ఉక్రెయిన్‌ ప్రస్తావనే! యుద్ధంపై భారత వైఖరిని మోదీ వివరించినా, ఆ తర్వాత విడుదల చేసిన సమష్టి ప్రకటనలో ‘నార్డిక్‌’ దేశాలు రష్యా దురాక్రమణను దుయ్యబట్టారు. ఇక, పర్యటనలో ఆఖరుగా మోదీ ఫ్రాన్స్‌ సందర్శన మన రక్షణ అవసరాలు, ఇండో– పసిఫిక్‌ అవసరాల రీత్యా కీలకమైనది. కానీ, మోదీ వెళ్ళడానికి ఒక రోజు ముందర రూ. 43 వేల కోట్ల విలువైన ఒప్పందం నుంచి ఓ ఫ్రెంచ్‌ సైనిక సంస్థ తప్పుకుంది. జలాంతర్గాములకు ఫ్రాన్స్‌పై ఆధారపడ్డ మనం కొత్త మార్గాలు చూసుకోక తప్పదు. ఫ్రాన్స్‌ నుంచి అవసరమైన సాంకేతికత తీసుకొని, మనమే సబ్‌మెరైన్లు తయారు చేసుకోవాలి.

కొద్ది వారాలుగా బ్రిటన్, పోలండ్, పోర్చుగల్, నెదర్లాండ్స్, నార్వే సహా పలు దేశాల విదేశాంగ మంత్రులు భారత్‌ను సందర్శించిన నేపథ్యంలో ఆర్థిక, విదేశాంగ సహచరులతో కలసి మోదీ జరిపిన విదేశీ పర్యటన ఆసక్తి రేపడంలో వింత లేదు. కాకపోతే, తిరిగొచ్చే ముందు ఫ్రాన్స్‌లో కొద్దిసేపు ఆగి, కొత్తగా రెండోసారి అధ్యక్షుడైన ‘మిత్రుడు’ మెక్రాన్‌తో సంభాషిస్తున్న మోదీ ప్రవాస భారతీయుల భేటీల్లో చూపిన ఉల్లాసభరిత వాగ్ధాటికే ఎక్కువ పాపులర్‌ కావడం విచిత్రం. వీలు కుదిరినప్పుడల్లా తమ ప్రభుత్వ విజయాలను ఏకరవు పెడుతూ వచ్చారు. వీలు చేసుకొని మరీ మునుపటి కాంగ్రెస్‌ హయాంకీ, ఇప్పటికీ పోలికలు తెచ్చి మరీ రాజకీయ వ్యంగ్య బాణాలు విసిరారు. ఆ సభల్లో మోదీ నామస్మరణ, ‘ట్వంటీ ట్వంటీఫోర్‌ – మోదీ వన్స్‌మోర్‌’ లాంటి రాబోయే ఎన్నికల నినాదాలు సరేసరి. వాటిని పక్కన పెడితే, విస్తరణవాద చైనాతో భారత్‌కు ముప్పుందని భావిస్తున్న తరుణంలో పడమటి ఐరోపాతో బంధానికి ఈ పర్యటన ఉపకరిస్తుందనే ఆశ. మన దేశ ప్రయోజనాల విషయంలో పొరుగువారెవరూ ప్రబోధాలు చెప్పనక్కర్లేదన్న విదేశాంగ మంత్రి జైశంకర్‌ మాట నిజమే కానీ, అవసరం తీర్చే అనుబంధాలూ అవసరమే! 

మరిన్ని వార్తలు