‘కొత్త’ ఢిల్లీ 

30 Apr, 2021 00:29 IST|Sakshi

అధికార వికేంద్రీకరణ అవసరం గురించి, ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రాముఖ్యత గురించి గతంతో పోలిస్తే అందరిలోనూ చైతన్యం పెరిగిన వర్తమానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారాలకు కోత పడింది. ఇకపై అక్కడి ముఖ్యమంత్రి కార్యనిర్వాహకపరమైన అన్ని చర్యలకూ లెఫ్టినెంట్‌ గవ ర్నర్‌(ఎల్‌జీ) నుంచి ముందుగా అనుమతి తీసుకోవాల్సివుంటుంది. అసెంబ్లీ అయినా అంతే... ఎలాంటి శాసనాలు చేయాలన్నా ఎల్‌జీ ముందస్తు అనుమతి అవసరం. అసెంబ్లీ అనుబంధ సభా సంఘాలకు కూడా ఇది వర్తిస్తుంది. గత నెలలో పార్లమెంటు ఆమోదించిన జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాంత (సవరణ) చట్టం మంగళవారంనుంచి అమల్లోకొచ్చింది. ఇక ఢిల్లీలో ‘ప్రభుత్వం’ అంటే ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం కాదు... లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మాత్రమే! అసెంబ్లీ ఇకపై తనకు సంబంధించిన పాలనాపరమైన అన్ని నిబంధనలకు ఎల్‌జీ ఆమోదం పొందాలి. విచారణలైనా అంతే. ఇప్పుడున్న సభా సంఘాలు రద్దవుతాయి. ఎన్నికైన ప్రజా ప్రతి నిధులను సంప్రదించకుండా ఎల్‌జీ ఇకపై సొంతంగా ఏ అధికారినైనా బదిలీ చేయొచ్చు. నిపుణులు చెబుతున్న ప్రకారం ఇకనుంచి ఢిల్లీ మంత్రివర్గం ఎలాంటి ప్రాజెక్టుల్ని అమలు చేయాలన్నా, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలన్నా ముందుగా ఎల్‌జీ అనుమతి తీసుకోవాలి. ప్రజలెన్నుకునే ప్రభుత్వానికి కాకుండా పైనుంచి నియామకం అయిన ఎల్‌జీకే అపరిమితమైన అధికారాలు కట్టబెట్టిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. పార్లమెంటులో ఈ బిల్లు చర్చకొచ్చినప్పుడే విపక్షాలు తీవ్రంగా విమర్శిం చాయి. ప్రజాభిప్రాయానికి ప్రతిబింబంగా వుండే చట్టసభను కాదని, కేంద్రం నిర్ణయించే ఎల్‌జీకే ప్రాధాన్యతనివ్వడం అప్రజాస్వామికమని ఆగ్రహించాయి. చట్టసభలో పాలకపక్షానికి మెజారిటీ వుండొచ్చు. తనకు తోచిన ఏ నిర్ణయానికైనా ఆమోదముద్ర వేయించుకోవచ్చు. ఏ నిర్ణయమైనా ప్రజలకు నచ్చేలా, వారి శ్రేయస్సుకు, సంక్షేమానికి దోహదపడేలా వుండటం ముఖ్యం.

కరోనా వైరస్‌ మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన వర్తమానంలో అధికార వికేంద్రీకరణ అవసరం అందరికీ బాగా తెలుస్తోంది. ముఖ్యంగా మరణమృదంగం మోగిస్తున్న ఢిల్లీలో ఎక్కడికక్కడ నిర్ణ యాలు తీసుకోలేని అశక్తత బయటపడుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే సీఎంల సమావేశంలో చేతులెక్కి మొక్కి అడగవలసివచ్చింది. ప్రతి దానికీ ‘పైనుంచి’ ఆదేశం రావాలని, ప్రతి అడుగుకూ ‘పైవారి’ అనుమతి అవసరమని అనుకుంటే ఒక్కటీ ముందుకు కదలదు. ప్రతి అంచెలోనూ ఎవరి అధికారాలేమిటో, పరిమితులేమిటో నిర్ణయించటం... సొంత చొరవతో పనిచేసేలా ప్రోత్సహిం చటం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం. అందువల్ల అన్ని వ్యవస్థలూ చురుగ్గా తయారవుతాయి. కొత్త ఆలోచనలు, ఆచరణ రూపుదిద్దుకుంటాయి. వాటివల్ల అంతిమంగా మంచే తప్ప చెడు జర గదు. ఢిల్లీ విషయమే తీసుకుంటే... అక్కడ కేజ్రీవాల్‌కు ముందు చాలా ప్రభుత్వాలొచ్చాయి. అవి జన సంక్షేమ పథకాలు అమలు చేశాయి. జనం మెచ్చినప్పుడు అవి తిరిగి అధికారంలోకొచ్చిన సంద ర్భాలున్నాయి. కానీ ఏ ఒక్కరూ అక్కడి విద్యా సంస్థలను ఇప్పుడున్నంత అద్భుతంగా తీర్చి దిద్ద లేదు. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఎంతో నిబ్బరంతో, ఆత్మ విశ్వాసంతో చదువు కుంటూ ఔరా అనిపిస్తున్నారు. కలిగినవారి పిల్లలతో పోటీపడి ఉన్నత శ్రేణి విద్యాసంస్థలకు ఎంపిక వుతున్నారు. అలాగే బస్తీ క్లినిక్‌లు వచ్చాయి. సాధారణ ప్రజానీకానికి సకాలంలో మంచి వైద్య సల హాలు లభిస్తున్నాయి. వారు ప్రాథమిక దశలో నిర్లక్ష్యం చేసి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదం తప్పుతోంది. కానీ ఇవే ప్రతిపాదనలను ఎల్‌జీ అనుమతి కోసం పంపి, ఆయనడిగే వివర ణలకు జవాబిచ్చి, ఆమోదం కోసం ఎదురుచూస్తే ఎన్నాళ్లు పడుతుంది? తాము పంపిన ఫైళ్లపై ఎల్‌జీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని కేజ్రీవాల్‌ లోగడ వివిధ సందర్భాల్లో ఆరో పించారు. అందులో టీచర్ల బదిలీలు, వారి పదోన్నతులు వగైరాలు వున్నాయి. ఇక ప్రజా సంక్షేమ పథకాలు సైతం వేచిచూడటంలోనే వుండిపోతే ఎన్నికైన ప్రభుత్వం తాను అనుకున్నది సాధించ గలుగుతుందా? హామీలను నెరవేర్చగలుగుతుందా? ఈసారి జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలు ఎలావుంటాయి? తాము గెలిస్తే ఫలానా పథకాలు, కార్యక్ర మాలు అమలు చేస్తామని హామీ ఇవ్వాలా లేక వాటికోసం ఎల్‌జీని ఒప్పిస్తామని హామీ ఇవ్వాలా? 

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కొలువుదీరి వుంటుంది గనుక... అక్కడ విదేశీ రాయబార కార్యా లయాలు, అతి కీలకమైన పాలనా కేంద్రాలు వుంటాయి గనుక దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో సమానంగా అక్కడుండే ప్రభుత్వానికి అధికారాలు కట్టబెట్టడం అసాధ్యమన్న వాదనతో విభేదించే వారు ఉండకపోవచ్చు. ప్రజా భద్రత, పోలీసు, భూ సంబంధ అంశాలు మినహా మిగిలిన అంశాల్లో ఢిల్లీ అసెంబ్లీ చట్టాలు చేసుకోవచ్చని రాజ్యాంగంలోని 239 ఏఏ అధికరణ చెబుతోంది. అయినా ముఖ్యమంత్రికీ, ఎల్‌జీకి గతంలో వివిధ అంశాలపై వివాదాలేర్పడటంతో ఎవరి అధికారాలేమిటో సుప్రీంకోర్టు తెలిపింది. కేబినెట్‌ సలహాలు, సూచనలతోనే ఎల్‌జీ నడుచుకోవాలంటూనే... ఏ నిర్ణ యాన్నయినా ఆయన తనకున్న రాజ్యాంగదత్తమైన అధికారాలతో వ్యతిరేకించవచ్చని తెలిపింది. ప్రతి దానిలోనూ జోక్యం తగదన్నది. ఈ విషయంలో మరింత స్పష్టతనీయాల్సింది పోయి కొత్త చట్టం పూర్తిగా ఎల్‌జీకే అధికారాలు కట్టబెట్టింది. ఈమాత్రం దానికి ఇక అక్కడ ప్రభుత్వం ఎందుకు... అసెంబ్లీ ఎందుకు?

మరిన్ని వార్తలు