న్యూఇయర్‌ ‘ఆయుధ పూజ’

1 Jan, 2023 01:05 IST|Sakshi

జనతంత్రం

అర్జునా... జాగ్రత్త! ఏకలవ్యుల బొటనవేళ్లు ఇక మీదట తెగిపోవడం లేదు. వారి వింటి నారి ఝంకారాన్ని విని ఝడుసుకోకు. సూతపుత్ర కర్ణుడి దివ్యాస్త్రాలు పనిచేయకుండా ఏ పరశు రాముడూ ఇప్పుడు శపించలేడు. నీ అరివీరుని ధనుష్టంకారానికి అదిరిపడకు.

ఆయుధమే కదా విజేత ఎవరో విజితుడెవరో నిర్ణయించేది! ఆయుధ ప్రయోగ మంత్రమే కదా విజేతల విజయ రహస్యం! అది దేశాల మధ్య యుద్ధమైనా, సమాజంలోని భిన్నవర్గాల పోరాటమైనా... ఆయుధమే గెలుపు తులాభారం.

కేవలం నాలుగైదు దేశాలు ప్రపంచ రాజ్యాలన్నిటిపై పెత్తనం చేసి వలసపాలన స్థాపించగలిగింది ఆయుధ బలంతోనే. నూటికి ఎనభై మంది పేద ప్రజల జీవితాలతో పిడికెడుమంది శ్రీమంతులు యథేచ్ఛగా ఆటలాడుతున్నదీ సాయుధ గర్వంతోనే!

మారుతున్న కాలంతోపాటు ఆయుధం కూడా తన రూపును మార్చుకుంటున్నది. ఒకనాడది తుపాకీ కావచ్చు. తుపాకుల్లో శ్రేష్ఠమైనదీ కావచ్చు. క్రమంగా విజ్ఞానమే ఆయు ధంగా మారుతున్నది. ఆయుధం పుస్తక రూపాన్ని కూడా సంతరించుకున్నది.

ఆ పుస్తకం కాలానికి తగినట్టు కంప్యూటర్‌ అవతారమెత్తుతున్నది. సాంకేతిక నైపుణ్యాన్ని ఆవాహన చేసుకుంటున్నది. ఆ చదువే ఇప్పుడు పరమాయుధం. చదువే ఇప్పుడు పాశుపతాస్త్రం. చదువే ఇప్పుడు నారాయణాస్త్రం. చదువే ఇప్పుడు బ్రహ్మాస్త్రం!

కాలంతోపాటు నడిపించే ఇంగ్లిషు మీడియం చదువు శ్రీమంతుల కుటుంబాలకే పరిమితం కావడం అన్యాయం కాదా? కాలాన్ని శాసించే కంప్యూటర్‌ చదువు వారి గుప్పిట్లోనే బందీ కావడం సామాజిక దోపిడీ కాదా? నిరుపేదల బిడ్డలు వసతుల్లేని బడుల్లో అరకొర అక్షర జ్ఞానంతో ఇంకెన్నాళ్లు వెనక బాటుతనాన్ని దిద్దుకుంటూనే ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడీ దుర్నీతికి సంకెళ్లు పడుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం విప్లవదీక్షతో ప్రభుత్వ బడుల స్వరూప స్వభావాలను మార్చివేసింది. కార్పొ రేట్‌ స్కూళ్లకు ధీటుగా పేదబిడ్డల చేతికి ట్యాబ్‌లను అంద జేస్తున్నది. కేవలం ట్యాబ్‌లే కాదు సుమా! అత్యంత ఆధునికంగా ఆడియో విజువల్‌ బోధనా పద్ధతులు మేళవించిన బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లవి.

ఆ పెట్టెలో శస్త్ర సంధాన మంత్రోపదేశం ఉన్నది. అర్జునుడి చెవిలో ద్రోణాచార్యుడు చెప్పిన విలువిద్యా రహస్యం ఇక ఏకలవ్యులకు కూడా వినబడబోతున్నది. డిజిటల్‌ డివైడ్‌ అంతం కానున్నది. అక్షర పెత్తందారీతనానికి తెరపడబోతున్నది. సాంకేతిక దోపిడీకి చరమగీతం పాడే సమయం ఆసన్నమవుతున్నది.

అదిగో ఈ ఫోటోలోని బాలిక పరవశాన్ని చూడండి. ప్రభుత్వం అందజేసిన ట్యాబ్‌ను అపురూపమైన ఆయుధంగా భావించి ముద్దాడుతున్న ఆ బాలిక స్పందన చూడండి. పద్మవ్యూహ చక్రబంధంలో అభిమన్యుని ఇరికించిన కురువీరులు అధర్మ యుద్ధంతో అతడిని నిరాయుధునిగా మార్చినప్పుడు... ఏ అదృశ్యశక్తో అతడి చేతికి ధనుర్బాణాలను అందజేస్తే స్పందన ఎలా ఉండేదో?... ఈ ఏకలవ్యుల స్పందన కూడా అలాగే ఉన్నది.

చేతికందిన విల్లంబుల్ని ఎక్కుపెట్టడానికి వారు సిద్ధపడు తున్నారు. చేప యంత్రాలను కొట్టడానికో, చెట్టుమీదున్న పిట్ట కన్నును పొడవడానికో వారు పరిమితం కాబోరు. ఈ లోకపు వెలుగుల్ని దిగంతాల దాకా మండించగల విలుకాళ్లవుతారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వర్గపోరాటం (క్లాస్‌ వార్‌) నడుస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. నిజమే ఇప్పుడిక్కడ స్పష్టమైన వర్గ విభజన ఏర్పడుతున్నది. పేదలంతా ఒకవైపు సమీకృతమవుతున్నారు. సంపన్నవర్గ ప్రయోజనాన్ని కాంక్షించే వారంతా ఒకవైపునకు కదులుతున్నారు.

పేదవర్గాల ప్రజలందరికీ సమానావకాశాలు లభిస్తే, అవకాశాలను అందిపుచ్చుకోగల నైపుణ్యాన్ని ఆ వర్గాలు సంతరించుకుంటే సంపన్నుల పెత్తందారీతనానికి సవాల్‌ ఎదు రౌతుంది. సహజ వనరులపై, రాజకీయ, ఆర్థిక రంగాలపై వారికి ఉన్న పట్టు సడలుతుంది. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు హామీ ఇచ్చింది కేవలం రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే కాదు. ఆర్థిక ప్రజాస్వామ్యం, సామాజిక ప్రజాస్వామ్యం కూడా.

ఈ ప్రజాస్వామ్యాలు విస్తృతమవుతున్న కొద్దీ పేదవర్గాలు అదే నిష్పత్తిలో సాధికారతను సాధిస్తాయి. ఇది మౌలిక సూత్రం. అందువల్లనే ప్రజాస్వామ్యం విస్తృతమవడానికి పెత్తందారీ వ్యవస్థ ఇచ్చగించదనే సంగతి మనందరికీ తెలిసిన సత్యమే. రాజ్యాంగం కల్పించిన అవకాశాలను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న కారణంగానే ఇప్పుడు రాష్ట్రంలో వర్గపోరాటం అనివార్యమయ్యే పరిస్థితి నెలకొన్నది.

పెత్తందారీ వ్యవస్థ వేయిచేతుల కార్తవీర్యార్జునుడి లాంటిది. ఏకకాలంలో ఐదువందల బాణాలను వివిధ లక్ష్యాల పైకి ప్రయోగించగలదు. మనం ఏం తింటే రైటు? ఎప్పుడు పడుకుంటే రైటు? సంప్రదాయాలేమిటి? ఆచారాలేమిటి? వగైరా వ్యక్తిగత విషయాలను కూడా కట్టుబాట్ల పేరుతో పెత్తం దారీ వ్యవస్థ నిర్దేశిస్తుంది. ఏది న్యాయం? ఏది ధర్మం? ఏది అభివృద్ధి? ఏది అరాచకం? అనే విషయాలను ఈ వ్యవస్థ తన వేయిబాహువుల ద్వారా వెల్లడి చేస్తుంది. దీన్నే మనం ఆధిపత్య భావజాలం అంటున్నాము.

దాన్ని మనం నమ్మాలి. సేవ్‌ డెమోక్రసీ పేరుతో హఠాత్తుగా విజయవాడలో ఒక మీటింగ్‌ జరుగుతుంది. పెత్తందారీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తుంది. దానికి జనసేనతోపాటు కమ్యూనిస్టు పార్టీలు రెండూ హాజరవుతాయి. పీపుల్స్‌ డెమోక్రసీ (జనతా ప్రజాస్వామ్యం) పేరుతో జాతీయ అధికార పత్రికను నడుపుతున్న రాజకీయ పార్టీ ఈ హెజిమోనిక్‌ డెమోక్రసీ (పెత్తందారీ ప్రజాస్వామ్యం) సమావేశానికి హాజరు కావడం విచిత్రం. అదే పెత్తందారీ కార్తవీర్యార్జునుడి ప్రత్యేకత.

అదే విజయవాడలో అసందర్భంగా ప్రపంచ తెలుగు రచయితల సభ జరుగుతుంది. ఆ సభలోని వక్తలంతా తెలుగు భాష ప్రాచుర్యంపైన కాకుండా ఇంగ్లిష్‌ మీడియం బోధనపైన దాడిని ఎక్కుపెడతారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇంగ్లిష్‌ మీడియం బోధనను ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా వ్యతిరేకించాయి.

కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో తోక ముడిచాయి. పొలిటికల్‌ ఫ్రంట్‌లో కాల్పుల విరమణ ప్రకటించి ఇప్పుడు కల్చరల్‌ వార్‌ ఫ్రంట్‌ను ఓపెన్‌ చేశాయన్నమాట. పొలిటికల్‌ పార్టీ చేతికి మట్టి అంటకుండా ఆధిపత్య భావజాలం ద్వారా సంస్కృతి పేరుతో కొన్ని మెదళ్లనయినా కలుషితం చేయడమన్నమాట.

మన పెత్తందారీ వర్గం చెప్పుచేతల్లోనే సినిమా రంగం కూడా ఉన్నదనే విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు బామ్మర్ది, ప్రసిద్ధ నటుడైన బాలయ్య షో ఒకటి నడుస్తున్నది. ఆ షోలో అతిథిగా చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబు చేసిన వెన్నుపోటు మహాపాతకంపై పసుపునీళ్లు చల్లి ప్రక్షాళన చేసే ప్రయత్నం ఆ షోలో చేశారు.

ఒకరినొకరు ద్వేషించుకునే చరిత్ర ఉన్న నటులంతా కడుపులో కత్తులు దాచుకొని కౌగిలింతలు ప్రదర్శించడాన్ని ఈ షో ద్వారా జనం వింతగా చూస్తున్నారు. మేమంతా ఒక్కటే, పెత్తందారీ వ్యవస్థకు ప్రమాదం ఏర్పడితే ఒక్కటిగా కదులుతామనే సందేశాన్ని ఇవ్వడానికి ఈ షోను వాడేస్తున్నారని అర్థమవుతున్నది.

పైన పేర్కొన్న మూడు దృష్టాంతాలు దేనికవే యథాలాపంగా జరిగినవి కావు. ఇవన్నీ పేద ప్రజల సాధికారత ఉద్యమానికి వ్యతిరేకంగా, వారికి స్ఫూర్తిగా నిలబడిన వైఎస్‌ జగన్‌ ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన బాణాలే. మూడు విషయాలనే మనం చర్చించుకున్నాము. కానీ పెత్తందారీ కార్తవీర్యార్జునుడికి వేయి చేతులు, వేయి కుంపట్లను రాజేస్తూనే ఉంటాడు. వాటి లక్ష్యం మాత్రం ఒకటే.

సాధారణ ప్రజలను, మర్మం తెలియని కొందరు మేధా వులను బోల్తా కొట్టించడానికి అభివృద్ధి అనే పాచికను ప్రయో గించడం పెత్తందారీ ప్రతినిధులకు అలవాటుగా మారింది. తెలుగుదేశం పార్టీ నగ్నదేహం మీద ఒక దేవతా వస్త్రాన్ని కప్పి దాన్నే అభివృద్ధిగా ప్రచారం చేసుకోవడం చాలామందికి తెలిసిన విషయమే.

అభివృద్ధి అంశంపైన అర్థవంతమై చర్చకు సిద్ధపడితే ఈ ప్రతినిధులు తోక ముడవడం ఖాయం. వీరి అభివృద్ధి అంకంలో మొదటిది అమరావతి ప్రస్తావన. అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందని, దాని వెనకున్న లక్షల కోట్ల స్కామ్‌ను దాచే ప్రయత్నం చేస్తారు. రాజధానే లేని అభివృద్ధి ఏమిటని ప్రశ్నిస్తారు.

పల్లెపల్లెనా, వీధివీధినా వెలసిన పదిహేను వేల రాజధానులు (సెక్రటేరియట్‌లు) ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తుం డగా రాజధాని లేదనే ఆక్రోశమేమిటి? ఈ పదిహేను వేల రాజధానులు జనతా ప్రజాస్వామ్యానికి కొలమానాలైతే, బల హీన వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేని అమరావతి పెత్తందారీ ప్రజాస్వామ్యానికి నిదర్శనం.

మూడున్నరేళ్ల కింద మన ఊరు ఎలా ఉన్నది? ఇప్పుడెలా ఉన్నది? పెత్తందారీ ప్రతినిధులు ఎవరైనా సరే గ్రామ చావడిలో కూర్చొని చర్చించడానికి సిద్ధమా? మండల కేంద్రానికి వెళ్లే అవసరం లేకుండానే సొంత ఊరిలోనే అన్ని వ్యవహారాలు నడిపి స్తున్న సెక్రటేరియట్‌. అక్కడ ఒక్క రూపాయి లంచమడగని కొత్త మార్పు. ఊళ్లో విలేజి క్లినిక్‌.

అక్కడ ఎల్ల వేళలా సిద్ధంగా ఉండే మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టెలిమెడిసిన్‌ ద్వారా అందుబాటులో డాక్టర్‌. కొత్తగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ విధానం. ఈ ఫ్యామిలీ డాక్టర్‌ క్రమం తప్పకుండా మన ఊరికి వచ్చే డ్యూటీ.

ప్రతి గ్రామ పంచాయతీలో రైతు భరోసా కేంద్రం. అక్కడ అందుబాటులో వ్యవసాయ – ఉద్యానవన శాఖలకు సంబం ధించిన అసిస్టెంట్లు. బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు. బుక్‌చేసిన 24 గంటల్లో సర్టిఫైడ్‌ ఎరువులు, విత్తనాలు అందజేసే కియోస్క్‌లు.

వ్యవసాయ పనిముట్లు అద్దెకిచ్చే కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు... ఇవన్నీ ఊరికి ఎప్పుడొచ్చాయో ప్రత్యేకంగా చెప్ప వలసిన అవసరం ఉన్నదా? శిథిలమైపోయిన బడి ‘నాడు–నేడు’ తర్వాత కొత్త కాంతులు పూస్తున్న వైనం మన కళ్లముందే కనిపిస్తున్నది.

బడికెళ్లే పిల్లలకు యూనిఫామ్, బూట్లు, బెల్ట్, బ్యాగ్, పుస్తకాలు ... ఇలా అవసరమైనవన్నీ ప్రభుత్వం సమ కూర్చుతున్న వైనం... పిల్లల్ని బడికి పంపినందుకు అమ్మఒడిలో ఏటా పదిహేను వేలు. పెద్దక్లాసుల పిల్లలకు విద్యాదీవెన, వసతి దీవెన. బీదా–బిక్కి తేడా లేకుండా రాబోయే తరం మొత్తంగా నాణ్యమైన విద్యను అభ్యసించే విధంగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నది. ఇవి కావా అభివృద్ధి రూపాలు?

విద్యారంగానికి సంబంధించి చంద్రబాబు హయాంలో రాష్ట్రం జాతీయ స్థాయిలో 18వ ర్యాంకులో ఉండగా ఇప్పుడు 4వ స్థానానికి ఎగబాకినట్టు ఇండియా టుడే నివేదిక వెల్ల డించింది. ఫౌండేషనల్‌ లిటరసీ, న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌)పై ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ ఇచ్చిన నివేదికలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉన్నట్టు వెల్లడించారు.

విద్యా రంగంలో ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఇతర రాష్ట్రాలకు సూచించారు. పరిశ్రమలు కొత్తవి రావడం లేదనే విషప్రచారం యెల్లో మీడియాలో తరచూ చూస్తున్నాము. ఈ మూడున్నరేళ్లలో 108 భారీ, అతిభారీ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటిద్వారా 75 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

60 వేల మందికి ఈ పరిశ్రమల్లో ఉద్యోగాలొచ్చాయి. ఈ కేటగిరీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏటా సగటున 11 వేల కోట్ల పెట్టుబడులు వస్తే, ఇప్పుడు మూడున్నరేళ్లలో రెండేళ్లను కరోనా కోసేసినప్పటికీ సగటున ఏటా 13 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ లెక్కలు.

సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు 2019 నాటికి ఒక లక్షా ఐదువేల యూనిట్లు ఉంటే ఈ మూడున్నరేళ్లలో వంద శాతానికి పైగా పెరిగి 2,13,826కు చేరుకున్నాయి. ఈ యూనిట్ల ద్వారా పది లక్షల మందికి కొత్తగా ఉపాధి లభించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్స్‌ వెల్లడించిన గణాంకాలు ఇవి.

30 వేల కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులు, తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లు నిర్మాణం కాబోతున్నాయి. సముద్ర తీర ప్రాంత అభివృద్ధి కొత్త పుంతలు తొక్కబోతున్నది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న పద్నాలుగేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పడలేదు.

మూడున్నరేళ్ల కాలంలో వైఎస్‌ జగన్‌ 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని తలకెత్తుకున్నారు. ఈ సంవత్సరం అందులో ఐదు కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు చెప్పండి ఎవరు అభివృద్ధి ప్రదాత? ఎవరు విజినరీ?

కాకపోతే నిరుపేదల సాధికారతకూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారు. ఈ కర్తవ్యాన్ని రాజ్యాంగబద్ధ ధర్మంగా ఆయన పరిగణిస్తున్నారు. రాజ్యాంగ యంత్రాంగాన్ని ఇంతకాలంగా అదుపులో పెట్టుకున్న పెత్తం దారీ వర్గాలకు ఇది సహించడం లేదు. అందుకే పేదవర్గాల మీద పెత్తందారీ వర్గాలు యుద్ధాన్ని ప్రకటించాయి.

పేదవర్గాలకు దన్నుగా నిలబడి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మీద విష రసా యనాల దాడికి పూనుకుంటున్నాయి. ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు పేద వర్గాలు సమాయత్తమవుతున్నాయి. ఈ నూతన సంవత్సరం ప్రభవించే వేళ ఆ వర్గాల ప్రజలు ‘ఆయుధ పూజకు’ సిద్ధపడుతున్నారు.

కార్తవీర్యార్జునుడి వేయి చేతులనూ భార్గవ రాముడు ఒక్క గొడ్డలి వేటుతో నరికేశాడు. పేదవర్గాల ప్రజలు చైతన్యమనే ఆయుధాన్ని విసిరితే పెత్తందార్ల సహస్ర బాహువులూ తెగిపడక తప్పదు.

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు