ఆక్స్‌ఫాం నివేదిక.. చేదు నిజాలు

26 Jan, 2021 01:33 IST|Sakshi

ఏటా విడుదలయ్యే నివేదికల్లో ప్రపంచవ్యాప్తంగా వున్న ఆర్థిక అసమానతలనూ, వాటి పర్యవసానంగా ఏర్పడే ఇతరత్రా అంతరాలనూ ఆక్స్‌ఫాం ఏకరువు పెడుతుంది. ఏడాదిగా ప్రపంచాన్ని కరోనా వైరస్‌ మహమ్మారి పట్టి పీడిస్తోంది గనుక ఈసారి నివేదిక మరింత గుబులు పుట్టించేదిగా వుంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్లు్యఈఎఫ్‌) సదస్సు సందర్భంగా ఆక్స్‌ఫాం నివేదికలు విడుదలవుతుంటాయి. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణలు మామూలు గానే అన్ని దేశాల్లోనూ వ్యత్యాసాలు పెంచాయి. కానీ సంక్షోభం తలెత్తినప్పుడు, విలయం విరుచుకు పడినప్పుడు ఇక చెప్పేదేముంటుంది? కొన్ని నెలలక్రితం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) సంస్థ ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై నివేదిక వెలువరిస్తూ తీవ్రమైన ఒత్తిళ్ల ఫలితంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ తలకిందులు కాబోతున్నాయని, కోట్లాదిమంది పేదరికంలోకి జారుకునే ప్రమాదం వున్న దని హెచ్చరించింది.

ఆ నివేదిక వచ్చాక మన దేశంతో సహా అనేక దేశాలు సంక్షోభాన్ని అధిగమిం చటం కోసం ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాయి. అట్టడుగు వర్గాలకు చేయూతనందించే అనేక పథ కాలు రూపొందించాయి. వేరే దేశాల మాటెలావున్నా మన దేశంలో మాత్రం వాటివల్ల పెద్దగా ఫలితం రాలేదని తాజా ఆక్స్‌ఫాం నివేదిక తెలియజెబుతోంది. భారత్‌ను అసమానత అనే వైరస్‌ పట్టి పీడిస్తున్నదని, పర్యవసానంగా సంపన్నులు మరింత సంపద పోగేసుకోగా, అంతో ఇంతో పొట్ట పోషించుకునేవారు సైతం ఉపాధి కోల్పోయి కొత్తగా దారిద్య్రంలోకి జారుకున్నారని నివేదిక వ్యాఖ్యా నించటం గమనించదగ్గది. 

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కాలంలో ఆ వైరస్‌ను కొందరు ‘సోషలిస్టు వైరస్‌’గా చమత్కరిం చారు. ధనిక, పేద తేడా లేకుండా అందరినీ అది కాటేసిందని, దాని పర్యవసానంగా అందరూ ఒక్క లాగే ఇబ్బందులు పడ్డారని అనుకున్నారు. సంపన్నుల్లోనూ ఆ వ్యాధి వచ్చినవారూ, మరణించిన వారూ వుండొచ్చు. కానీ ఆ వర్గానికి అందుబాటులో వుండే ఆధునిక వైద్య సౌకర్యాలు ఇతరులకు లేవు. అలాగే వారికుండే ఆర్థిక వెసులుబాటు ఇతరులకు వుండదు. ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలతో పాటు జెండర్‌ మొదలుకొని అనేకానేక అంశాల్లో వుండే అసమానతల వల్ల మనలాంటి సమాజాల్లో ఏర్పడే ఏ సంక్షోభాలైనా వాటిని మరింత పెంచుతాయి. అందువల్లే భిన్న రంగాలను శాసిస్తున్న మోతుబరులు లాక్‌డౌన్‌ కాలంలో తమ సంపద అపారంగా పెంచుకుంటే సాధారణ పౌరులు మాత్రం బతుకు భయంతో తల్లడిల్లారని ఆక్స్‌ఫాం నివేదిక ఎత్తిచూపుతోంది. మన దేశంలో లాక్‌డౌన్‌ సమయంలో భాగ్యవంతుల సంపద 35 శాతం పెరగ్గా లక్షలాదిమంది సాధారణ పౌరులు జీవిక కోల్పోయారని గణాంకాలంటున్నాయి.

నిరుడు మార్చి మొదలుకొని ఇంతవరకూ వందమంది శత కోటీశ్వరుల సంపద 12,97,822 కోట్ల మేర పెరగ్గా... ఒక్క ఏప్రిల్‌ నెలలోనే ప్రతి గంటకూ 1,70,000 మంది చొప్పున సాధారణ పౌరులు ఉపాధి కోల్పోయారని నివేదిక వెల్లడిస్తోంది. అంటే శత కోటీశ్వరులు వున్న సంపదను కాపాడుకోవటమే కాదు... దాన్ని మరిన్ని రెట్లు పెంచుకోలిగారు.  కరోనా ప్రమాదం ముంచుకొచ్చాక మన దేశంలో కఠినమైన లాక్‌డౌన్‌ అమలైంది. అది ప్రభుత్వాల సంసిద్ధతను పెంచటంతోపాటు, వైరస్‌ వ్యాప్తిని నియంత్రిస్తుందని అందరూ ఆశించారు. కానీ ఆ రెండు అంశాల్లోనూ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. ఇటలీవంటిచోట్ల మన మాదిరిగా వలస కార్మికుల సమస్య లేదు గనుక లాక్‌డౌన్‌ అక్కడ సమర్థవంతంగా అమలైంది.

మన దేశంలో మాత్రం పనిలేక, ఆకలిదప్పులకు తట్టుకోలేక భారీ సంఖ్యలో వలస కార్మికులు స్వస్థలాలకు నడక దారిన తరలివెళ్లటం మొదలుపెట్టారు. వారిని ఎక్కడికక్కడ నిలువరించటానికి పోలీసులు ప్రయత్నించటం, వారి కళ్లుగప్పి గమ్యస్థానాలు చేరడానికి సాధారణ ప్రజానీకం ప్రయత్నించటం కొన్ని నెలలపాటు మన దేశంలో నిత్యం కనబడిన దృశ్యం. దారిపొడవునా ఆ క్రమంలో బలైనవారెందరో! దానికితోడు సరైన పోషకాహారం లభించక, జాగ్రత్తలు పాటించటం సాధ్యంకాక ఎందరో కరోనా బారినపడ్డారు. ఎన్నో రాష్ట్రాల్లో వైరస్‌ కేసుల సంఖ్య చూస్తుండగానే పెరిగి కలవరపరిచింది. ఆ మహమ్మారి కాటేసిన దేశాల వరసలో అమెరికా తర్వాత మనదే రెండో స్థానం. కోటీ 6 లక్షలమందికిపైగా జనం కరోనా బారిన పడితే 1,53,525 మంది మరణించారు. కానీ ప్రాణాలు నిలబెట్టుకున్నవారి స్థితిగతులు దుర్భరంగా మారాయని ఆక్స్‌ఫాం నివేదిక చాటుతోంది. 

త్వరలో 2021–22 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫాం నివేదికలోని అంశాలు పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వపరంగా చేయాల్సివేమిటో ఆలోచించటం అవసరం. లాక్‌డౌన్‌ పర్యవసానంగా ఏర్పడ్డ సంక్షోభాన్ని అధిగమించటానికి ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలు ఏమేరకు ప్రభావం కలిగించాయన్నది కూడా సమీక్షించాలి. నిరుడు ఏప్రిల్‌–నవంబర్‌ మధ్య కేంద్ర ప్రభుత్వ వ్యయం వాస్తవ గణాంకాల ఆధారంగా లెక్కేస్తే తగ్గిందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

అంతక్రితం సంవత్సరం అదే కాలంతో పోలిస్తే ఈ ఎనిమిది నెలలకాలంలో ప్రభుత్వ వ్యయం 4.7 శాతం పెరిగినట్టు కనబడుతున్నా, 6 శాతంకన్నా ఎక్కువగా వున్న ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నాక ఆ వ్యయం గణనీయంగా తగ్గిన వైనం వెల్లడవుతోంది. విద్య, వైద్యం, ఉపాధి వగైరా రంగాలన్నిటా ఇప్పటికే వున్న వ్యత్యాసాలను కరోనా అనంతర పరిస్థితులు ఎన్ని రెట్లు పెంచాయో ఆక్స్‌ఫాం నివేదిక తేటతెల్లం చేస్తోంది. ఈ రంగాల్లో ప్రభుత్వ వ్యయం అపారంగా పెరిగితే తప్ప... నేరుగా ప్రజానీకం చేతుల్లో డబ్బులుండేలా చర్యలు తీసుకుంటే తప్ప ఈ వ్యత్యాసాలు ఆగవు. సంక్షోభాలకు మూలం ఎక్కడుందో తెలుసుకుని సకాలంలో నివారణ చర్యలు తీసుకున్నప్పుడే సమాజం సజావుగా సాగు తుంది. లేనట్టయితే అది అశాంతిలోకి జారుకుంటుంది. 

మరిన్ని వార్తలు