ఇంకావుంది!

13 Feb, 2024 03:08 IST|Sakshi

ఎక్కడైనా ఎన్నికలు ముగిసి, ఫలితాలు వచ్చాక రాజకీయంగా సుస్థిరత నెలకొంటుందని ఆశించడం సహజం. పాకిస్తాన్‌లో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి. దాయాది దేశంలోని ఇటీవలి 12వ జనరల్‌ ఎలక్షన్‌ ఓటింగ్‌ సరళి, తాజా ఫలితాలు చూస్తే... ఎన్నికలు ముగిశాయి కానీ, అసలు కథ ఇంకా మిగిలే ఉందని అర్థమవుతోంది. చిత్రమేమిటంటే, సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలం లేకపోయినా పాక్‌ మాజీ ప్రధానులు నవాజ్‌ షరీఫ్, ఇమ్రాన్‌ ఖాన్‌లు ఇరువురూ ఎన్నికల్లో తమదే విజయమని ప్రకటించుకోవడం! ఇక, 2018 ఎన్నికల్లో ఇమ్రాన్‌కు అనుకూలంగా వ్యవహరించిన సైన్యం జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ సారథ్యంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణం దిశగా పావులు కదుపుతోంది.

పోలింగ్‌కు ముందూ, తర్వాత నిస్సిగ్గుగా రిగ్గింగ్‌కు పాల్పడి ఎన్నికలను ప్రహస నంగా మార్చిన ఆర్మీ ఇప్పటికీ పగ్గాలను తన చేతుల్లో ఉంచుకొని, ‘హైబ్రిడ్‌’ నమూనా ప్రభుత్వాన్ని నడపాలని చూస్తోంది. కౌంటింగ్‌లో రిగ్గింగ్‌ సాగకుంటే, జాతీయ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ ఇమ్రాన్‌కే వచ్చి ఉండేదని అభిప్రాయం. ఇప్పుడు రెండోస్థానంలో నిలిచిన నవాజ్‌ షరీఫ్‌ గద్దెనెక్కినా, కొత్త సర్కార్‌ సైతం సైన్యం చేతిలో కీలుబొమ్మగానే కొనసాగనుంది.

ఎన్నికల్లో ఓటర్లు ఇమ్రాన్‌ వైపు మొగ్గారన్నది సుస్పష్టం. కానీ ఒకపక్క రకరకాల కేసుల్లో శిక్షలు పడి, కారాగారంలో ఉన్న ఇమ్రాన్‌ రాజకీయ పదవిని అధిష్ఠించడంపై నిషేధం ఎదుర్కొంటున్నారు. పైగా, ఆయన నేతృత్వంలోని పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఎ–ఇన్సాఫ్‌ (పీటీఐ)కు ఎన్నికల చిహ్నమైన క్రికెట్‌ బ్యాట్‌ సైతం ఈసారి దూరమైంది. దాంతో ఆ పార్టీ తరఫున అభ్యర్థులందరూ స్వతంత్రులుగానే గెలిచారు. కాబట్టి ఏదో ఒక రిజిస్టర్డ్‌ పార్టీతో జతకడితే తప్ప... సాంకేతికంగా చూసినా, చట్టపరంగా చూసినా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు.

ఏ ఇతర పార్టీతోనూ కలిసేందుకు పీటీఐ ఇష్టపడక పోవడం పెద్ద ఇబ్బంది. మరోపక్క ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కోసం వివిధ పార్టీల మధ్య చర్చోపచర్చలు సాగుతున్నాయి. పీటీఐ పక్షాన గెలిచిన వారిలో కొందరు ఇప్పటికే గోడ దూకుతున్నట్టు వార్త. వేరొకపక్క ఎన్నికల్లో రిగ్గింగ్, కౌంటింగ్‌ ప్రక్రియలో తప్పులు సహా పలు అక్రమాలు జరిగాయంటూ పలువురు కోర్టుకెక్కుతున్నారు. వెరసి, జాతీయ ఎన్నికలు ముగిసి, ఫలితాలు వచ్చాయన్న మాటే కానీ... పాకిస్తాన్‌లో పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. 

ఎన్నికల ఫలితాలు, చివరకు వాటి పర్యవసానాలు ఏమైనప్పటికీ... ఒకరకంగా ఈ ఎన్నికల్లో అసలైన విజేతలు సాధారణ పాకిస్తానీ ప్రజలు. సర్వశక్తిమంతమైన సైన్యం ఆ దేశంలో ప్రజా స్వామ్యం వేళ్ళూనుకోకుండా చేయడంలో పేరుమోసింది గనక ఎన్నికలు తూతూమంత్రమనీ, ప్రధాని ఎవరు కావాలన్నది మిలటరీ ముందే నిర్ణయించేసిందనే భావన నెలకొంది. అందుకు తగ్గట్టే, గతంలో సైన్యంతో సత్సంబంధాలు లేకపోవడంతో 1999లో పదవీచ్యుతుడైన నవాజ్‌ షరీఫ్‌ సరిగ్గా ఎన్నికల వేళకు ప్రవాసం నుంచి పాక్‌కు తరలివచ్చారు.

వస్తూనే ఆయనపై ఆరోపణలన్నీ గాలికి పోయాయి. అలాగే ఒకప్పుడు సైన్యం సాయంతో గద్దెనెక్కి, ప్రస్తుతం దాని కరుణాకటాక్షాలకు దూరమైన ఇమ్రాన్, ఆయన పార్టీ అరెస్టులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పాక్‌లో అధికార వ్యవస్థకు పర్యాయపదంగా మారిన సైన్యం ఎన్నికల్ని రిగ్‌ చేయాలని చూసింది. ఇన్నింటి మధ్య కూడా ప్రజలు ధైర్యంగా ఓటేశారు. ప్రజాస్వామ్య ఆకాంక్ష పట్ల ఆశలు రేకెత్తించారు. 

ఇమ్రాన్‌ను పోటీకి దూరంగా ఉంచి, ఆ పార్టీని గద్దెనెక్కకుండా చేయాలన్న ఆర్మీ వ్యూహాలను ప్రజలు తిరస్కరించారు. తెర వెనుక నుంచి ఆడించేది ఆర్మీయే అని అంతర్జాతీయంగా అందరూ అనుకున్నా సామాన్యులకు నిన్న మొన్నటి వరకు ఆర్మీ పట్ల గౌరవం ఉండేది. కానీ, ప్రస్తుతం సైనిక జోక్యం పట్ల ప్రజలు సుముఖంగా లేరని తాజా ఎన్నికల ఫలితాలు తొలిసారిగా నిరూపించాయి. జాతీయ అసెంబ్లీలో నేరుగా ఎన్నికలు జరిగే 266 స్థానాల్లో ఎక్కువ సీట్లను ఇమ్రాన్‌ పార్టీ సమర్థించిన స్వతంత్రులే గెలిచారు. అతిపెద్ద పక్షంగా నిలిచారు.

తర్వాతి స్థానాల్లో నవాజ్‌ షరీఫ్‌ ‘పాకిస్తాన్‌ ముస్లిమ్‌ లీగ్‌ – నవాజ్‌’ (పీఎంఎల్‌–ఎన్‌), బిలావల్‌ భుట్టో ‘పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ’ (పీపీపీ) నిలిచాయి. హంగ్‌ పార్లమెంట్‌ ఏర్పడినా ప్రజాతీర్పు ఇమ్రాన్‌ వైపుందనేది స్పష్టం. దాన్ని తోసిపుచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. పీఎంఎల్‌–ఎన్, పీపీపీ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి కట్టాలని చర్చలు చేస్తున్నారు. పీటీఐ సైతం తమ సమర్థనతో గెలిచినవారంతా పార్లమెంట్‌లో కలసి కట్టు కూటమిగా నిలిచేందుకు ఏం చేయాలా అని చూస్తోంది. ఏమైనా, ఇప్పటికే పలు సంక్షోభాల్లో కూరుకుపోయిన పొరుగుదేశం దీర్ఘకాలిక రాజకీయ అనిశ్చితిలో కొనసాగడం వాంఛనీయం కాదు.  

రాగల రోజుల్లో సైన్యం పర్యవేక్షణలో పీఎంఎల్, పీపీపీల మధ్య కొత్త కూటమి ఏర్పాటుకై బేర సారాలు తప్పవు. పరస్పర ప్రయోజనాలే ప్రాతిపదికైన ఆ సర్కారైనా ఎంత స్థిరంగా ఉంటుందో ఊహించలేం. పాకిస్తానీ పెద్దలు ఇకనైనా ప్రజల భావావేశాలను గ్రహించాలి. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేముంది! ‘గులామీ న మంజూర్‌’ (బానిసత్వాన్ని సమర్థించబోము) అని వినిపిస్తున్న నినాదాల్నీ, మంగళవారం నుంచి పీటీఐ చేపట్టదలచిన నిరసనల్నీ కొట్టేయలేం.

‘ప్రజాస్వామ్య విక్రయానికి విపణి సిద్ధమైం’దన్న విమర్శల్ని నిజం చేస్తే అంత కన్నా ఘోరం లేదు. పేరుకు మిగిలిన ప్రజాస్వామ్యం, ఎన్నికల తర్వాత సైతం అనిశ్చితి నెలకొనడం... పాకిస్తాన్‌ ప్రజల పాలిట శాపం. సరిహద్దు సమస్యలు, మరోమారు తలెత్తిన మతపరమైన హింసాత్మక తీవ్రవాదం, ఆర్థికరంగ సంక్షోభం నేపథ్యంలో ప్రస్తుతానికి పాక్‌ కథ సశేషమే! 

whatsapp channel

మరిన్ని వార్తలు