నిఘా నేత్రాల నీడలో...

20 Jul, 2021 02:33 IST|Sakshi

కనిపించని కళ్ళేవో గమనిస్తున్నాయి. తెలియకుండానే మాటల్నీ, కదలికల్నీ కనిపెడుతున్నాయి. మన చేతిలోని మొబైల్‌ఫోన్‌ నిజానికి నిఘావాళ్ళ చేతిలో సాధనం. ఈ మాట ఎవరన్నా అంటే, ఉలిక్కిపడతాం. ‘పెగసస్‌’ అనే నిఘా సాఫ్ట్‌వేర్‌తో దేశంలో ప్రముఖుల ఫోన్లు సుదూరం నుంచే హ్యాకింగ్‌కు గురయ్యాయంటూ ఆదివారం వెలువడ్డ కథనాలు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది అందుకే! ఇజ్రాయెలీ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ‘ఎన్‌ఎస్‌ఓ గ్రూపు’ నిఘా టెక్నాలజీని విక్రయిస్తుంటుంది. ఆ సంస్థకు చెందిన నిఘా సాఫ్ట్‌వేర్‌– ‘పెగసస్‌’. దాన్ని వినియోగించుకొని, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతల మొదలు ప్రముఖ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల దాకా అందరి మొబైల్‌ ఫోన్లపైనా నిఘా పెట్టారనేది తాజా ఆరోపణ. తమ పరిశోధనలో ఆ సంగతి బయటపడిందని ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’, ‘గార్డియన్‌’ సహా పలు అంతర్జాతీయ వార్తా సంస్థల కన్సార్టియమ్‌ వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలు వాస్తవ విరుద్ధమనీ, ఈ స్పైవేర్‌ను ఆయా దేశాల ప్రభుత్వాలకు అమ్ముతామే తప్ప, దాన్ని నిర్వహించట్లేదనీ, డేటా వివరాలు తమకు తెలియవనీ ఇజ్రాయెలీ సంస్థ చెప్పుకొస్తోంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ మటుకు ‘పెగసస్‌’ నిఘా సాయంతో పెద్దయెత్తున సాంకేతిక భద్రతా ఉల్లంఘనలు జరిగినట్టు తమ డిజిటల్‌ ఫోరెన్సిక్‌ విశ్లేషణలో బయటపడినట్టు పేర్కొంటోంది. పరస్పర విరుద్ధ వాదనలతో ఈ వివాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్త డిజిటల్‌ నిఘాపై చర్చ రేపుతోంది. 

ఈ నిఘా సాఫ్ట్‌వేర్‌ ‘పెగసస్‌’ మాట కొన్నేళ్ళ క్రితమే తొలిసారిగా వినిపించింది. మళ్ళీ ఇప్పుడు తెర మీదకొచ్చింది. 2019లో ఈ స్పైవేర్‌ను చూసి, ఆ ప్రయత్నాలను నిర్వీర్యం చేసినట్టు సాక్షాత్తూ మెసేజింగ్‌ వేదిక ‘వాట్సప్‌’ సారథే ఒప్పుకున్నారు. దాదాపు 53 కోట్ల మంది వాట్సప్‌ వాడుతున్న దేశం మనది. ఆ ఏడాది డిసెంబర్‌లో సాక్షాత్తూ అప్పటి మన కేంద్ర మంత్రి దేశంలోని అనేక వాట్సప్‌ ఖాతాల సమాచారం హ్యాకింగ్‌కు గురైనట్టు అంగీకరించడం గమనార్హం. ఈసారేమో సాక్షాత్తూ కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, జలశక్తి మంత్రి ప్రహ్లద్‌ జోషీ కూడా ఈ స్పైవేర్‌ బాధితుల జాబితాలో ఉన్నట్టు వార్త. రాహుల్‌ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కూడా 2019 లోక్‌సభ ఎన్నికల వేళ ఇలాంటి బాధితులే కావచ్చనీ కథనం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న  పరిశోధనాత్మక జర్నలిస్ట్‌లకూ, సామాజిక కార్యకర్తలకూ ఈ అవస్థ తప్పలేదు. వాళ్ళందరి డేటా స్పైవేర్‌ వద్ద ఉన్నట్టు బయటపడిందంటున్నారు కానీ, వారి సమాచారం పూర్తిగా హ్యాకింగ్‌ అయిందా, లేదా అన్నది తేలాల్సి ఉంది. 

నిజానికి, ఇంటెలిజెన్స్‌ బ్యూరో సహా అనేక ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు మన దేశంలో అనుమాని తులపై నిఘా పెట్టే వీలుంది. అధికారిక నిఘా ఏమీ పెట్టలేదని ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారు. మరి, ఇప్పుడీ విదేశీ స్పైవేర్‌తో అనధికారికంగా, చట్టవిరుద్ధమైన నిఘా సాగుతోందా అన్నది వెంటనే తలెత్తే ప్రశ్న. దానికి ఇంకా జవాబు రావాల్సి ఉంది. సమాజంలోని ప్రముఖుల ఫోన్లపై తీవ్రవాదుల లాగా ఇలా చట్టవిరుద్ధంగా నిఘా ఏమిటన్నది ప్రతిపక్షాల ప్రశ్న. అలాగే, విదేశీ నిఘావేర్‌ను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వినియోగించిందా, లేదా అనీ విమర్శకులు సూటిగా అడుగుతున్నారు. ఆ ప్రశ్నలు వట్టి అన్యాయమని అంత తేలిగ్గా కొట్టిపారేయలేం.

ఇప్పటికి సుమారు 45 దేశాలు ఈ ‘పెగసస్‌’ స్పైవేర్‌ను వినియోగిస్తున్నట్టు ఓ లెక్క. కానీ, మోదీ సర్కార్‌ మాత్రం తాము అలాంటి సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయలేదంటోంది. నిఘా బాధితుల జాబితాలో పేరున్నట్టు వార్తలొచ్చిన సాక్షాత్తూ కేంద్ర ఐటీ శాఖ మంత్రే సోమవారం లోక్‌సభ సాక్షిగా ఈ మొబైల్‌ నిఘావేర్‌ వివాదాన్ని కొట్టిపారేయడం గమనార్హం. ‘సంచలనం సృష్టించడమే ఈ ఆరోపణల ధ్యేయం. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు చేశారు’ అని ఆయన సభాముఖంగా తేల్చేశారు. ‘సరిగ్గా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ప్రారంభం ముందు రోజునే ఓ వెబ్‌సైట్‌ ఈ నివేదికను లీక్‌ చేయడం యాదృచ్ఛికం కాదు’ అని కూడా మంత్రివర్యులు అనడం కొసమెరుపు. 

ఎవరైనా ఏమైనా ఆరోపణలు చేయవచ్చు. కానీ, వాటికి బలమైన ఆధారాలు ఏవీ అన్నది ప్రభుత్వ, పాలకపక్షాల వాదన. ఆరోపణలకు తగిన ఆధారాలు కోరడం కచ్చితంగా సమంజసమే. దాన్ని తప్పుపట్టలేం. కానీ, తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై సమగ్ర దర్యాప్తు జరపడానికి ఎవరికైనా అభ్యంతరం ఉండనక్కర లేదు. అందులోనూ అధికారంలో ఉన్నవారు చేయాల్సింది అదే కదా! ప్రతిపక్షాలు కోరుతున్నదీ అదే! నిజానిజాల నిగ్గు తేల్చడానికైనా సరే ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే రంగంలోకి దిగాలి. ఒకవేళ ఆరోపణలే గనక నిజమైతే, దేశ పౌరుల ప్రైవేట్‌ డేటాపై ఇలా విదేశీ నిఘాను ఉపయోగించడం దిగ్భ్రాంతికరం. మరీ ముఖ్యంగా మంత్రులతో సహా పలువురు ప్రముఖుల సంభాషణలు, కాంటాక్ట్‌ వివరాలు, ఇ–మెయిల్స్, నెట్‌లో ఏవేం వెతికారనే చరిత్ర, ఫోటోలు, కెమేరా, మైక్రోఫోన్లతో సహా అన్నీ విదేశీ నిఘా నేత్రం కింద ఉన్నాయంటే – అది దేశభద్రతకే పెనుముప్పు. అణుమాత్రమైనా అనుమానం రాకుండా, కనీసం ఆనవాళ్ళయినా లేకుండా తన పని కానిచ్చే ‘పెగసస్‌’ నిఘా నేత్రం విషయంలో వెంటనే అప్రమత్తం కావాల్సింది కూడా అందుకే! తాజా ఆరోపణలన్నీ భారత ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చే ప్రయత్నమని కేంద్ర మంత్రి అన్నారు కానీ, రేపు ఈ ఆరోపణలే గనక నిజమని తేలితే... ఈ దుర్మార్గపు నిఘా ఏ ప్రజాస్వామ్యానికైనా మాయని మచ్చ అని గ్రహించాలి. ఇప్పటికీ నత్తనడక సాగుతున్న ప్రైవేట్‌ సమాచార భద్రత బిల్లును ఇకనైనా చట్టం చేయాల్సిన అవసరాన్ని ఇప్పుడిక అందరూ గుర్తించాలి. 

మరిన్ని వార్తలు