డేటా పరిరక్షణ ఇంకెప్పుడు?

23 Jan, 2021 00:17 IST|Sakshi

వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం తీసుకొచ్చేందుకు మూడేళ్లుగా మన దేశం ప్రయత్నిస్తుండగా, దాని అవసరం ఎంతవున్నదో తెలియజెప్పేలా వాట్సాప్‌ సంస్థ ఈనెల మొదట్లో తన వినియోగదారులకు పిడుగులాంటి వార్త చెప్పింది. గోప్యతకు సంబంధించి తాము రూపొందించిన కొత్త విధానాన్ని నెల రోజుల్లోపల అంగీకరిస్తే సరేసరి... లేదంటే నిష్క్రమించాల్సి వస్తుందని ప్రకటించింది. నాలుగైదేళ్ల క్రితమైతే ఎవరూ పట్టించుకునేవారు కాదేమోగానీ ప్రస్తుతం దానిపై పెద్దగానే అలజడి రేగింది. ఈలోగా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని తాజా గోప్యత విధానాన్ని తక్షణం ఉపసంహ రించుకోవాలని వాట్సాప్‌కు అల్లిమేటం జారీచేసింది. అటు వినియోగదారుల నుంచీ, ఇటు ప్రభుత్వం నుంచీ ఊహించని స్పందన రావటంతో ఆ సంస్థ వెనక్కు తగ్గింది.

కొత్త విధానం వల్ల వినియోగదారులకు ఏ సమస్యా ఏర్పడదని భరోసా ఇస్తూ మీడియాలో కోట్లాది రూపాయల విలువైన వాణిజ్య ప్రకటనలు విడుదల చేయటంతోపాటు దాని అమలును మే 15 వరకూ వాయిదా వేస్తు న్నట్టు తెలిపింది. వాట్సాప్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని రెండేళ్లక్రితం నిరసనలు వ్యక్తమైనప్పుడు సైతం ఆ సంస్థ ఈమాదిరే ప్రకటనలిచ్చింది. ఒకరినుంచి ఒకరికి వెళ్లే సందేశాలకు పరిమితులు విధించింది. జనాభారీత్యా మన దేశానిది ప్రపంచంలో రెండో స్థానం. అగ్రభాగాన వున్న చైనా రకరకాల శంకలతో అన్ని రకాల సామాజిక మాధ్యమాలకూ తన పౌరులను దూరం వుంచింది. వాటికి బదులు సొంత మాధ్యమాలు ఏర్పాటు చేసుకుంది. కనుక వాట్సాప్‌కైనా, దాని మాతృ సంస్థ ఫేస్‌బుక్‌కైనా ప్రపంచంలో అత్యధిక వినియోగదారులు లభ్యమయ్యేది మన దేశం లోనే. ఫేస్‌బుక్‌కు దాదాపు 25 కోట్లమంది వినియోగదారులున్నారని ఒక అంచనా. వాట్సాప్‌ విని యోగదారులు సంఖ్య 40 కోట్లపైమాటే అంటారు. ఈ వినియోగదారులు వున్నకొద్దీ పెరుగుతారు తప్ప తగ్గేదేమీ వుండదు. అందుకే దీన్ని మరింత లాభదాయకంగా ఉపయోగించుకుందామని వాట్సాప్‌కి అనిపించివుండొచ్చు. 

తమ విధానంలో చేసిన సవరణలు ఏరకంగానూ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించబోవని, కేవలం వ్యాపార సంస్థలకూ, వాటితో లావాదేవీలూ జరిపేవారికే వర్తిస్తాయని వాట్సాప్‌ చెబుతోంది. వాట్సాప్‌ ద్వారా బంధుమిత్రులకు పంపే సందేశాలనూ... వ్యాపార సంస్థలతో జరిపే వ్యవహా రాలనూ వేర్వేరుగా చూడటమే ఈ మార్పు ఆంతర్యమని ‘బుడుగు’ భాషలో చెప్పింది కూడా. కానీ ఈనెల 4న చేసిన ప్రకటనలో ఈ మాదిరి భాష లేదు. వినియోగదారులకు సంబంధించిన ‘కొంత డేటా’ను వారి ఫోన్‌ నంబర్, ప్రాంతం వగైరాలతోసహా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెస్సెంజర్‌ మాధ్య మాలతో పంచుకుంటామని అది ప్రకటించింది. ఇష్టంలేనివారికి తమ యాప్‌ అందుబాటులో వుండదని చెప్పింది. ఆ తర్వాత కలకలం రేగి సర్దిచెప్పే పని మొదలుపెట్టిందిగానీ ఈలోగా జరగా ల్సిన నష్టం జరిగింది. వాట్సాప్‌నుంచి వలసలు మొదలయ్యాయి. మన దేశంలో ఈనెల 5 మొదలై వారంరోజుల్లో దాదాపు 80 లక్షలమంది సిగ్నల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

అలాగే మరో మాధ్యమం టెలిగ్రామ్‌కు కూడా వినియోగదారులు వెల్లువెత్తారు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాలు... అలాగే వాట్సాప్, విచాట్, స్కైప్, ఐమెసేజ్‌ వంటి మెసేజింగ్‌ యాప్‌ల పనితీరుపై మొదటినుంచీ ఐటీ రంగ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనేవున్నారు. డౌన్‌లోడ్‌ సమయంలో ఎడాపెడా అనుమతులిస్తే ప్రమాదమని, ఆ సంస్థలు వినియోగదారుల డేటాను అమ్ముకుంటున్నాయని హెచ్చరిస్తూవచ్చారు. సామాజిక మాధ్యమాలవల్ల భావ వ్యక్తీకరణ విస్తృతి పెరిగి, సామాన్యులు సైతం తమ అభిప్రాయాలు బలంగా చెప్పగలిగేందుకు వీలవుతోంది. కానీ అదే సమయంలో వ్యక్తుల డేటా ఆధారంగా జనం ఏమనుకుంటున్నారో, వారి ఇష్టాయిష్టా లేమిటో... ఏ వయసువారిలో ఎలాంటి అభిప్రాయాలున్నాయో క్షణాల్లో మదింపు వేయగలిగే సాంకే తికత అందుబాటులోకొచ్చింది.

దాన్ని వ్యాపార సంస్థలు మొదలు రాజకీయ పక్షాలవరకూ అందరికీ అమ్ముకుని అనేక సామాజిక మాధ్యమాలు లాభాల పంట పండించుకుంటున్నాయి. బహుశా కేంబ్రిడ్జి ఎనలిటికా(సీఏ) సంస్థ సీఈఓగా పనిచేసే అలెగ్జాండర్‌ నిక్స్‌ 2018లో ఒక స్టింగ్‌ ఆపరేషన్‌లో పట్టుబడకపోతే తెరవెనక సాగే ఈ అనైతిక వ్యవహారం ఎప్పటికీ వెల్లడయ్యేది కాదు. డేటా చౌర్యాన్ని నిరోధించటానికి, వినియోగదారుల వ్యక్తిగత విషయాలు బయటకు పోకుండా  రకరకాల ఫిల్టర్‌లు పెట్టామని ఫేస్‌బుక్‌ అప్పట్లో ప్రకటించినా, వాటిని నిరర్థకం చేసే ఉపకరణాలు కూడా సిద్ధమ య్యాయి. ఇదంతా గమనిస్తే ఈ మాధ్యమాల నియంత్రణకు, జవాబుదారీతనానికి పకడ్బందీ చట్టం అవసరమేనన్న విషయంలో అందరూ ఏకీభవిస్తారు. 

వాస్తవానికి సామాజిక మాధ్యమాల వ్యాప్తి క్రమేపీ పెరుగుతున్న సందర్భంలోనే ప్రభుత్వం వ్యక్తిగత గోప్యత పరిరక్షణకు అవసరమైన చట్టం గురించి ఆలోచించివుండాల్సింది. పదేళ్లక్రితం పౌరుల వ్యక్తిగత డేటాను వారి వేలిముద్రలతో సహా సేకరించి ఆధార్‌ పథకం రూపొందించటానికి ముందే  గోప్యత పరిరక్షణపై దృష్టి పెట్టాల్సింది. ఇప్పుడు తాజా పరిణామాలు ఆ విషయంలో వేగిరం అడుగేయాల్సిన అవసరాన్ని తెలియజెబుతున్నాయి. యూరప్‌ దేశాల్లో వ్యక్తిగత గోప్యత అత్యంత పవిత్రమైనది. దాని తర్వాతే మరేదైనా. వినియోగదారులిచ్చే అనుమతుల్నిబట్టే సర్వీసులు అందజేస్తా మనటం అక్కడ నేరం. నిరాకరించటానికి పౌరులకుండే హక్కును గౌరవించి, వారు కోరిన మినహా యింపునిచ్చి వినియోగదారుగా చేర్చుకోవటం తప్పనిసరి. దాంతో పోల్చి చూస్తే మన వినియోగ దారులకు వాట్సాప్‌ చేసిన హెచ్చరిక ఎంత అసంబద్ధమైనదో, తెంపరితనంతో కూడుకున్నదో తేట తెల్లమవుతుంది. అందుకే వ్యక్తిగత డేటా పరిరక్షణకు సాధ్యమైనంత త్వరగా చట్టం తీసుకొచ్చి, ఏ మాధ్యమమూ ఇష్టానుసారం ప్రవర్తించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవటం అవసరం.  

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు