ఇక అంతా వ్యక్తిగతమేనా?

24 Nov, 2021 00:14 IST|Sakshi

స్మార్ట్‌ఫోన్, సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌ లేకుండా జీవితం నడవని పరిస్థితుల్లో... వ్యక్తిగత సమాచార గోప్యత ఓ దేవతా వస్త్రం. సాంకేతికత సాయంతో ఎవరి డేటా అయినా ఇట్టే చేజిక్కించుకోవచ్చన్నది పదే పదే బయటపడ్డ పచ్చి నిజం. సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) సోమవారం ఆమోదించిన ‘వ్యక్తిగత సమాచార భద్రత (పీడీపీ) బిల్లు’ నివేదికకూ, సిఫార్సులకూ ఇప్పుడింత ప్రాధాన్యం అందుకే!

ప్రైవేట్‌ సంస్థలను నియంత్రిస్తూనే, కేంద్రానికీ, సీబీఐ – రా– ఈడీ లాంటి సంస్థలకూ మినహాయింపులిస్తూ, విస్తృతాధికారాలు కట్టబెడుతున్నదీ బిల్లు. రెండేళ్ళ చర్చోపచర్చల తర్వాతా కొన్ని అంశాల పట్ల జేపీసీలోని ప్రతిపక్ష సభ్యులు కొందరు అసమ్మతి తెలిపిందీ అందుకే! అయితేనేం, మెజారిటీ జేపీసీ సభ్యుల అంగీకారం పొందిన ఈ తుది నివేదిక, చేసిన సిఫార్సులు ఈ నెలాఖరున ప్రారంభం కానున్న శీతకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రానున్నాయి.

అసలీ బిల్లు రావడం వెనుక పెద్ద కథే ఉంది. వ్యక్తిగత గోప్యతా హక్కు సైతం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల కిందకే వస్తుందంటూ 2017 ఆగస్టులో ‘జస్టిస్‌ కె.ఎస్‌. పుట్టస్వామి వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం’ కేసులో సుప్రీమ్‌ కోర్టు తేల్చి చెప్పడంతో ఈ బిల్లుకు బీజం పడింది. దేశంలో డేటా భద్రతకు సంబంధించి సమగ్ర విధివిధానాలు రూపొందించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీమ్‌ ఇచ్చిన ఆదేశం దీనికి మూలమైంది.

సుప్రీమ్‌ కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీకృష్ణ సారథ్యంలో పలువురు నిపుణులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పీడీపీకి చట్టం చేయాలని సిఫార్సు చేస్తూ, ముసాయిదాను తయారుచేసింది. మూడేళ్ళ క్రితం 2018లో కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ – సమాచార సాంకేతిక పరిజ్ఞాన (ఐటీ) శాఖకు నిపుణుల కమిటీకి ఆ ముసాయిదాను సమర్పించింది. 2019లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లులో పేర్కొన్న మినహాయింపులపై అభ్యంతరాలు రావడంతో, జేపీసీకి నివేదించారు. మొత్తం 31 మంది సభ్యులతో కూడిన జేపీసీ ఈ బిల్లును లోతుగా పరిశీలించి, విస్తృత చర్చలు సాగించి, రెండేళ్ళ తర్వాత ఇప్పుడు తుది ముసాయిదా నివేదికను అందిస్తోంది. 

జేపీసీలోని కనీసం ఏడుగురు ప్రతిపక్ష సభ్యులు కొన్ని అంశాలలో విభేదించిన ఈ తుది నివేదిక ఎప్పుడో రావాల్సింది. కోవిడ్‌ సహా అనేక పరిణామాలతో అయిదుసార్లు జేపీసీ గడువును పొడిగించారు. దాంతో రెండేళ్ళ సుదీర్ఘకాలం పట్టింది. ఇప్పటికి నివేదిక, సిఫార్సులు వచ్చాయి. వాటిలోని వివరాలన్నీ పూర్తిగా బయటకు రాలేదు. అలాగే ఆ అంశాలన్నీ రేపు పార్లమెంటు చేసే తుది చట్టంలో ఉంటాయా అన్నదీ ఇప్పుడే చెప్పలేం.

అయితే, ప్రాథమికంగా దేశంలోని వ్యక్తుల వ్యక్తిగత డేటా భద్రత కోసం ఓ నియంత్రణ వ్యవస్థను ఈ చట్టం ఏర్పాటు చేస్తుంది. వ్యక్తిగతం, సున్నితం, కీలకం – అంటూ వ్యక్తిగత డేటాను 3 వర్గాలుగా వర్గీకరించి, ప్రతి వర్గానికీ ప్రత్యేకమైన విధివిధానాలు నిర్ణయిస్తారు. భారత పౌరుల డేటాతో వ్యవహారాలు నడిపే దేశ, విదేశీ సంస్థలన్నీ ఈ ప్రతిపాదిత చట్టానికి లోబడాల్సి ఉంటుంది. ఉల్లంఘనలకు పాల్పడితే చెల్లించాల్సిన పెనాల్టీలనూ పేర్కొన్నారు. 

అయితే, అనుమతి లేకుండానే డేటాను వాడుకొనే బిల్లులోని క్లాజు 35 సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాలు ఇప్పటికీ అసమ్మతి తెలుపుతున్నాయి. చరిత్రాత్మక సుప్రీమ్‌ తీర్పు ప్రాతిపదికన శ్రీకృష్ణ కమిటీ పేర్కొన్న ప్రమాణాలకు తగ్గట్టు ఈ బిల్లు లేదని ఓ వాదన. డేటా దుర్వినియోగాన్ని అరికట్టే ‘డేటా రక్షణ ప్రాధికార సంస్థ’ సభ్యుల ఎంపిక విధివిధానాలూ పలచబడ్డాయనేది మరో అభ్యంతరం.

దేశభద్రతతో పాటు కొత్తగా ‘ప్రజాజీవన భద్రత’ మిషతోనూ ప్రభుత్వ సంస్థలు ఈ చట్టం పరిధిలోకి రాకుండా, వ్యక్తిగత డేటాను వాడుకొనే వీలుండడం ఇంకో వివాదాస్పద అంశం. ఇది ఈ చట్టం ఉద్దేశాన్నే నీరుగారుస్తోందన్నది ప్రతిపక్షాల అసమ్మతి స్వరం. ప్రభుత్వాలు తల్చుకొంటే, ‘పెగసస్‌’తో తెలియని నిఘా సాధ్యమైన దేశంలో... ప్రభుత్వసంస్థలకిచ్చే ఈ అతి వెసులుబాటు సైతం దుర్వినియోగం కాదని నమ్మకం లేదు. ప్రతిపక్షాలు, పౌర సమాజం భావన, భయమూ అదే!

ప్రైవేట్‌ సంస్థల నుంచి మన వ్యక్తిగత డేటా లీకు కావడం, వాటిని మూడో వ్యక్తికి అమ్మేయడం లాంటివి దేశంలో అనేకం చూశాం. ఆధార్‌ మొదలు బ్యాంకు ఖాతాల వివరాల దాకా అనేకం అంగట్లో అమ్మకం కావడమూ చూశాం. చట్టం కానున్న ఈ బిల్లు దాన్ని ఏ మేరకు సమర్థంగా అరికడుతుందన్నది ఇప్పుడు కీలకం. అలాగే, వ్యక్తిగత డేటాను ఎక్కడ, ఎలా సురక్షితంగా భద్రపరుస్తారు, దానికి ఎలాంటి ఏర్పాట్లు చేయనున్నారన్నదీ కూలంకషంగా చూడాల్సి ఉంది. ఇది వ్యక్తిగత డేటాకు భద్రత కల్పించే బిల్లు. మరి, గూగుల్‌ మ్యాప్స్‌ లాంటి వ్యక్తిగతేతర డేటా భద్రత మాటేమిటి అంటున్న సైబర్‌ చట్టాల నిపుణుల ప్రశ్నలూ పట్టించుకోవాల్సి ఉంది. 

నేటి డిజిటల్‌ ప్రపంచంలో కీలకమైన ఇలాంటి చట్టం తేవడానికి ఈ మాత్రం చర్చ జరగడం ఆనందదాయకం. ప్రజాస్వామ్యానికి ఆరోగ్యదాయకం. ప్రతిపక్ష అభ్యంతరాలతో ఈ బిల్లు ఇదే రూపంలో, ఈ సమావేశాల్లోనే చట్టం రూపం దాల్చకపోవచ్చు. చట్టం రావడానికి ఇంకొద్ది రోజులు పట్టినా పట్టవచ్చు. అయితేనేం, మంచో చెడో అసలంటూ పీడీపీ మీద చర్చ ఇంతదాకా రావడం మంచిదే. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకు వాటంగా మారే మధ్యవర్తిత్వ హోదాను తొలగించి, సోషల్‌ మీడియా వేదికలుగానే ఈ బిల్లులో పరిగణించాలన్న సంయుక్త పార్లమెంటరీ సంఘం సిఫారసూ కీలకమే. ఆ మేరకు ఈ వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లును స్వాగతించాల్సిందే. లోటుపాట్లను సరిదిద్దేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించే లోగా, ఓ సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పటికిది ఓ ముందడుగు. 

మరిన్ని వార్తలు