Sakshi Editorial: శస్త్ర చికిత్సే, లేపనాలు సరిపోవు

25 Sep, 2021 00:07 IST|Sakshi

జ్వరం రోగం కాదు. రోగ లక్షణమే! రోగమేదైనా, దాని సంకేతంగా జ్వరం వస్తుంది. జ్వరం తగ్గే మందు మాత్రమే ఇస్తే... రోగం నయం కాదు. రోగాన్ని గుర్తించాలి, చికిత్స చేయాలి, మళ్లీ రాకుండా చూడాలి. అలా జరుగకపోతే అది ప్రాణాంతకంగానూ మరొచ్చు! మహిళలపై అత్యాచారాలు, లైంగిక హింస విషయంలో ఇప్పుడు అనుసరిస్తున్న దోరణి అలాగే ఉంటోంది. సదరు దుర్మార్గాలను వేటికవే ఘటనలుగా చూస్తున్నాం. విడివిడిగా çపరిశీలిస్తున్నాం. పొడిపొడిగా స్పందిస్తున్నాం. ఒక నిందితుడు పోలీసు ‘ఎన్‌కౌంటర్‌’లో చనిపోతేనో, మరో నిందితుడిని రైల్వే ట్రాక్‌పై ‘ఆత్మహత్య’గా చూసో ‘తగిన శాస్తి జరిగిందిలే!’ అని సరిపెట్టుకుంటున్నాం. సమస్య మూలాలపై దృష్టి పెట్టట్లేదు. కారణాల్ని లోతుగా అన్వేషించట్లేదు. ఇంతటి జఠిల సమస్యకు దీర్ఘకాలిక, శాశ్వత పరిష్కారాల్ని కనుక్కోవడం లేదు. నిర్మాణాత్మక ప్రయత్నమే జరగట్లేదు.

పౌరులుగా మనం సరే, దర్యాప్తు సంస్థలు, సమాజ శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, న్యాయపాలకులు.. అందరూ, అక్కడక్కడ ఒకటీ, అరా ‘దిశ’ చట్టం వంటి ప్రయత్నాలు తప్ప నిర్దిష్ట కార్యాచరణే లేదు. అందుకే, ఈ ఘాతుకాలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఇటీవల మహిళలు, బాలికలపై జరిగిన అత్యాచారాలు, లైంగిక దాడులు, హత్యోదంతాల తీరు తెన్నులు గగుర్పాటు కలిగిస్తున్నాయి. ఆయా నేరాలే ఘోరంగా ఉన్నాయంటే, అవి జరిగే తీరు మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఇవి వెలుగు చూస్తున్న కేసులే, ఇంకా రికార్డులకెక్కని దాష్టీకాలెన్నో రెట్లు! భయంగొలిపే వాతావరణం బలపడుతోంది. ప్రమాద సంకేతమేమంటే, అత్యాచారం జరిపి తీవ్రంగా గాయపరచడమో, హతమార్చడమో చేసిన సందర్భాలు అనివార్యంగా వెలుగు చూస్తు న్నాయి. అత్యాచారానికే పరిమితమైన ఘాతుకాల్లో, ఎవరైనా దైర్యం కూడగట్టుకొని పోలీసుస్టేషన్‌ గడప తొక్కిన చోట రికార్డుల్లోకి వస్తున్నాయి. అలా జరక్క, లోలోపల లొంగదీసుకునే, బెదిరించి అత్యాచారాలకు పాల్పడే, నిరవధికంగా–నిరాఘాటంగా లైంగిక హింసను కొనసాగిస్తుండే, నిత్య క్షోభకు గురిచేస్తుండే... వెలుగు చూడని ఉదంతాలెన్నో! ఎందరు వివాహిత మహిళలు, పెళ్లికాని యువతులు, బాలికలు ఆగని కన్నీటితోఅలాంటి మూగవేదనను అనుభవిస్తున్నారో? అదంతా లెక్కలకెక్కని అజ్ఞాత హింస!

ఈ అమానుష హింసకి మూలాలెక్కడున్నాయి? పురుషాధిక్య సమాజంలో మ(మృ)గాడై పుట్టిన పసికందు పెంపకం నుంచి, అప్పుడే మొదలయ్యే లింగ వివక్ష నుంచి, వాడి నడతపై దృష్టి పెట్టని తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం నుంచి, అసహజ వాతావరణం– పరిసరాల వరకు అంతటా మూలాలున్నాయి. స్త్రీల పట్ల పురుషుల దృక్పథంలోనే పెద్ద లోపముంది. లోపభూయిష్ట విద్యా విధానంలో విలువలు కొరవడ్డ ‘చదువు’తో అలవడే కుసంస్కారం నుంచి, నిర్హేతుకమైన నిరుద్యోగిత నుంచి, తిని తిరగడం అలవడ్డ ఆంబోతుతనం వరకు అన్నీ యువతలో హింసా దృక్పథాన్ని పెంచి పోషించేవే!

పేదరికం, ప్రేమరాహిత్యం, కుటుంబ కలహాలు, ఎప్పుడో ఒకటీ, రెండు చిన్న నేరాలు చేస్తే సరిదిద్దని నిర్లక్ష్యపు వ్యవస్థ... ఇవన్నీ దారితప్పిన యువ తలో లైంగిక నేర ప్రవృతిని పెంచేవే! ఉద్రేకాన్ని, ఉన్మాదాన్ని, లైంగిక హింసను ప్రేరేపించేలా బాధ్య తెరుగక తీసే సినిమా, ఓటీటీ–టీవీ సీరియళ్ల ‘విష(య)ం’ కూడా కారణమే! విచ్ఛల విడిగా దొరికే మద్యం, గంజాయి, ఇతర డ్రగ్స్‌  హింసాప్రవృత్తికి ప్రధాన వనరు! వీటికి తోడు.. మార్కెట్‌ ప్రపం చంలో దూసుకువచ్చిన స్మార్ట్‌ఫోన్‌ వ్యసనం, హద్దూ–అదుపూ లేని శృంగార సైట్ల (పోర్న్‌) ప్రభావం మగైనా, ఆడైనా... యువతను తప్పుదారి పట్టిస్తోంది. తెలిసి చేసే ఉద్దేశ్యపూర్వక దురాగతాలు కొందరివైతే, అవగాహన లేక, తెలియకుండా ఉచ్చులో పడేవారెందరో! పిల్లల పట్ల వాంఛతో రగిలే ఉన్మాదుల్ని (పీడోఫైల్‌) గుర్తించి, వారిని సరిదిద్దే వ్యవస్థే మనదగ్గర లేదు.

ఉత్తరప్రదేశ్, హాత్రస్‌లో దళిత యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం జరిపి, రక్తమోడే స్థితిలో ఆమెను పొలాల్లో పారవైచిన దుర్మార్గానికి ఏడాది. చికిత్స పొందుతూ మరణిస్తే.... కుటుం బాన్ని అడ్డుకుంటూ అర్ధరాత్రి బలవంతపు అంత్యక్రియలు జరిపించిన పాలనా వ్యవస్థ మనది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ, రక్షక వలయం మధ్య భయంగా నేటికీ విచారణ హాజరవుతున్న తలిదండ్రులకు, ఇంకెన్నాళ్లో ఈ కన్నీటి వేధన తెలియదు. దాదాపు దేశవ్యాప్తంగా జరిగే ఈ దాష్టీకాలకు కుటుంబ నేపథ్యం, పెరిగిన క్రమం, సామాజిక పరిస్థితులు ఓ కారణమైతే వ్యవస్థాగత లోపాలు మరో బలమైన కారణం!

ప్రభుత్వాల వైఖరి, దర్యాప్తు వ్యవస్థల నిర్వాకం, న్యాయస్థానాల్లో అసాధారణ జాప్యాలు వెరసి దురాలోచనాపరుల్లో భయంలేనితనాన్ని పెంచుతున్నాయి. చట్ట మంటేనో, తీర్పులంటేనో, చివరకు శిక్షలంటేనో భయంతో మాత్రమే ఈ నేరాల్ని నియంత్రించ గలుగుతాం. కానీ, అదే ఉండటం లేదు. ఇదంతా పరిగణనలోకి తీసుకొని ఏపీ ప్రభుత్వం తెచ్చిన ‘దిశ’ చట్టానికి కేంద్రమింకా అనుమతించలేదు. వారు లేవనెత్తిన సందేహాలకు ఏపీ సమాధానా లిచ్చినా, అనుమతి కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. ఈ లోపున ఆ చట్టపు స్పూర్తిని అమలుపరుస్తూ, దిశ యాప్‌ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం, కాలపరిమితితో నేరాల సత్వర దర్యాప్తు–విచారణ జరిపించడం ఆశావహ పరిణామం. వెంటనే అనుమతించి, కేంద్రమీ చట్టాన్ని దేశవ్యాప్తం చేయాలి. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, పౌరసమాజం ముగ్గురూ ఏకతాటిపైకి వచ్చి లైంగిక హింసను శాశ్వతంగా నిర్మూలించే పూనిక వహించాలి. అప్పుడే మహిళకు రక్ష! 

మరిన్ని వార్తలు