తోటివారే! తక్కువ చేయకండి!

13 May, 2022 00:11 IST|Sakshi

మనం పెట్టుకున్న నిబంధనలకైనా మానవీయ కోణం తప్పనిసరి. వినియోగదారులను దేవుళ్ళుగా భావించాల్సిన సేవల రంగం సహా అనేక చోట్ల అది మరీ ముఖ్యం. తద్విరుద్ధంగా రాంచీ విమానాశ్రయంలో ప్రైవేట్‌ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ఒక దివ్యాంగ టీనేజ్‌ కుర్రాడి విషయంలో ఇటీవల వ్యవహరించిన తీరు నివ్వెరపరిచింది.

‘తోటి ప్రయాణికుల భద్రతకు భంగకరం’ అనే సాకుతో, హైదరాబాద్‌కు రావాల్సిన ఆ వీల్‌ఛెయిర్‌ కుర్రాడినీ, అతని తల్లి తండ్రులనూ విమానం ఎక్కనివ్వకుండా ఇండిగో సిబ్బంది చూపిన అమానుషత్వం తీవ్ర విమర్శల పాలైంది. మన దేశంలో దివ్యాంగుల పట్ల సరైన రీతిలో సున్నితంగా స్పందిస్తున్నామా? వారినీ సమాజంలో ఓ భాగంగా కలుపుకొని పోతున్నామా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. 

తోటి ప్రయాణికులు సైతం అభ్యర్థిస్తున్నప్పటికీ, అవసరమైతే తామున్నామని ప్రయాణికుల్లోని డాక్టర్లు చెప్పినప్పటికీ ఆ ప్రైవేట్‌ విమానయాన సిబ్బంది పెడచెవినపెట్టడం పరాకాష్ఠ. సోషల్‌ మీడియా వేదికల్లో వైరల్‌ అయిన ఆ సంఘటనపై చివరకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించి చర్యలకు ఆదేశించాల్సి వచ్చింది. ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌’ (డీజీసీఏ) సమగ్ర విచారణకు దిగింది. సదరు ప్రైవేట్‌ విమాన సంస్థ అధిపతులు ‘ఆ క్లిష్ట పరిస్థితుల్లో తమది మంచి నిర్ణయమే’ అని సన్నాయి నొక్కులు నొక్కుతూనే, క్షమాపణ చెప్పారు.

ఆ దివ్యాంగుడికి ఎలక్ట్రిక్‌ వీల్‌ఛైర్‌ ఇస్తామన్నారు. కొంతకాలంగా ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిసారీ మీడియాలో వివాదం రేగడం, పౌర విమానయాన శాఖ రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టడం మామూలైంది. మానవీయత పరిమళించాల్సిన ఆధునిక సమాజంలో ఇవాళ్టికీ ఇలాంటి దుర్విచక్షణ కొనసాగడం విచారకరం. 

నిజానికి, దివ్యాంగుల పట్ల డీజీసీఏ నియమావళి కూడా ఇక్ష్వాకుల కాలం నాటిది. మారిన కాలంతో పాటు కొత్తగా వచ్చిన సమస్యలు, సవాళ్ళకు తగ్గట్టుగా దాన్ని మార్చుకోవాల్సి ఉంది. ప్రవర్తన అదుపులో లేని ప్రయాణికుల గురించి నివేదించమనీ, ప్రమాదకరమైన అలాంటి వ్యక్తులను విమానంలోకి ఎక్కనివ్వవద్దనీ నియమావళిలో ఉండవచ్చు గాక. దాన్ని అడ్డం పెట్టుకొని, అభం శుభం తెలియని దివ్యాంగుడి ప్రయాణం నిరాకరించడం మానవత్వం అనిపించుకోదు. గడచిన కొన్ని దశాబ్దాలుగా దేశీయ, విదేశీ విమానాశ్రయాలు, అలాగే ప్రైవేట్‌ విమానయాన సంస్థలు బాగా పెరిగాయి.

ఫలితంగా, ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు విమానయానం పలువురికి అనువుగా మారింది. అందుబాటులోకి వచ్చింది. అలాగే, ప్రత్యేక అవసరాలుండే దివ్యాంగుల విభాగంలోని ప్రయాణికుల సంఖ్యా పెరిగింది. కానీ, వారు సౌకర్యవంతంగా ప్రయాణించేలా తగిన వసతులు కల్పించడం, సేవలు అందించడం కరవైంది. విమానయాన టికెట్లు బుక్‌ చేసుకుంటున్న ప్పుడు దివ్యాంగులకు లభించే సేవలపై స్పష్టత పూజ్యం. విమానాశ్రయాల్లో, చెక్‌–ఇన్‌ సందర్భాల్లో, బోర్డింగ్‌ నియమాల్లో, విమానాల్లో ఆతిథ్యంలో వారి ప్రత్యేక అవసరాలకు తగ్గట్టు వసతులూ అంతంత మాత్రం. రైళ్ళలోనూ, ప్రభుత్వ రవాణా సదుపాయాల్లోనూ ఇదే పరిస్థితి.  

2011 నాటి జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 2.68 కోట్ల మంది దివ్యాంగులున్నారు. వారిలో 20 శాతం మంది కదలడంలో, ప్రయాణంలో సమస్యలున్నవారే. ప్రయాణ సౌకర్యాలు, బహిరంగ ప్రదేశాలను వారికి కూడా సౌకర్యంగా ఉండేలా మార్చాలని 2015లోనే ప్రభుత్వం ‘యాక్సెసిబుల్‌ ఇండియా’ పేరిట కార్యక్రమం చేపట్టింది. కానీ, ఆ లక్ష్యాలను ఇప్పటికీ అందుకోలేదన్నది చేదు నిజం.

పౌర భవనాలన్నిటినీ దివ్యాంగులకు అనుకూలంగా ఉండేలా చూడాలని 2017లోనే సుప్రీమ్‌ కోర్ట్‌ ఆదేశించింది. ఇవాళ్టికీ అది అమలైంది చాలా కొద్దిగానే! అందుకే, మన తోటివారైన దివ్యాంగుల పట్ల కనీసపు అక్కర, వారి సమస్యలను అర్థం చేసుకొనే సహృదయం పని ప్రదేశాల్లో, ప్రయాణ వసతుల్లో లోపిస్తోందనడానికి తాజా ఇండిగో ఘటన ఓ మచ్చుతునక మాత్రమే. విమానాల్లోనే కాదు... రైళ్ళు, బస్సులు, వినోదశాలలు, చివరకు విద్యాల యాలు, కార్యాలయాల్లో కూడా వారి శారీరక, మానసిక ప్రత్యేకతల రీత్యా ఏర్పాట్లు చేయడం కీలకం కాదా? ఆ మాత్రం చేయడం కనీస మానవ ధర్మం, వ్యవస్థపై ఉన్న బాధ్యత కావా? 

ఆ మధ్య సినీ నటి – దివ్యాంగ నర్తకి సుధా చంద్రన్‌ కృత్రిమ పాదం పట్ల విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది నుంచి అవమానం ఎదురైంది. నెల రోజుల క్రితమే రెండు బ్యాటరీలతో నడిచేదే తప్ప నాలుగు బ్యాటరీలతో నడిచే వీల్‌ఛైర్‌ను అనుమతించబోమంటూ ఓ దివ్యాంగ ప్రొఫెసర్‌ను ఎయిర్‌పోర్ట్‌లో నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఇలాంటి ఉదాహరణలెన్నో. ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకుండా చర్యలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యత.  

తప్పు చేసిన సంస్థలకు భారీ జరిమానాలు విధించాలి. అయితే, ప్రభుత్వ విధానాలు, ఆదేశాలతో పాటు సామాజిక ఆలోచనలో మార్పు మరీ కీలకం. బౌద్ధిక, గ్రహణ సామర్థ్యాల విషయంలో కొందరిలో ఉండే ఇబ్బందుల పట్ల ప్రభుత్వం, సంస్థలు సహానుభూతితో వ్యవహరించే సంస్కారం కావాలి. దివ్యాంగులూ మన లాంటి మనుషులే నన్న భావంతో, మానవీయంగా వ్యవహరించేలా చైతన్యం తేవాలి. అన్నిటికన్నా ముందుగా... ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది మనమే! విమానాల్లో పక్షులు, జంతువులకు కూడా తగిన చోటిచ్చే మనం, మన వ్యవస్థ మన సోదర దివ్యాంగుల్ని లోకువగా చూడడమేంటి? 

మరిన్ని వార్తలు