చేతలకు... ఇదే సరైన సమయం!

17 Aug, 2021 00:04 IST|Sakshi

సమయం, సందర్భం ఏదైనా... దాన్ని దేశవాసులకు స్ఫూర్తిదాయక ప్రబోధమిచ్చే అవకాశంగా మలుచుకోవడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిట్ట. అది భారత స్వాతంత్య్ర దినం లాంటి కీలక సందర్భమైనప్పుడు ఇక వేరే చెప్పేదేముంది? భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్ళు నిండి, 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా, ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేశాక, మోదీ గంటన్నర సేపు చేసిన సుదీర్ఘ ప్రసంగం అందుకు తాజా మచ్చుతునక. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేళ దేశప్రగతికి బృహత్‌ ప్రణాళికను ఆయన ఏకరవు పెట్టారు. దేశంలో మౌలిక సదుపాయాల విస్తరణకు ఏకంగా వంద లక్షల కోట్ల రూపాయలతో, అంటే కోటి కోట్లతో ‘ప్రధానమంత్రి గతిశక్తి ప్రణాళిక’ను చేపట్టనున్నట్టు భారీ ప్రకటన చేశారు. 

స్వతంత్ర భారతం శతవసంతాల గడప వద్దకు ప్రయాణించే రానున్న పాతికేళ్ళ కాలాన్ని ‘అమృత ఘడియలు’గా మోదీ అభివర్ణించారు. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, దేశ వాసుందరూ కలసికట్టుగా కృషిచేస్తే, దేశం సర్వతోముఖాభివృద్ధి దిశగా పురోగమిస్తుందని ప్రబో ధించారు. పాతికేళ్ళలో ఇంధన రంగంలో దేశం సొంత కాళ్ళ మీద నిలబడడం.., పట్టణ – గ్రామీణ, స్త్రీ–పురుష భేదాలను రూపుమాపి సమాజంలోని ప్రతి వర్గానికీ అభివృద్ధి ఫలాలు అందేలా చూడడం లాంటి లక్ష్యాలెన్నో నిర్దేశించారు. ఎప్పటికప్పుడు కొత్త నినాదాలు మోదీ మార్కు ప్రసంగ శైలి. 2014లో ‘సబ్‌ కా సాథ్‌... సబ్‌ కా వికాస్‌’ (అందరి అభివృద్ధి) అని నినదించిన ప్రధాని, అయిదేళ్ళ తరువాత 2019 మే 26న ‘సబ్‌ కా విశ్వాస్‌’ (అందరి విశ్వాసం) కూడా దానికి కలిపారు. ఇప్పుడు లక్ష్యసాధనకు ‘సబ్‌ కా ప్రయాస్‌’ (అందరి కృషి) అవసరమని కొత్త నినాదం అందించారు.

ఎర్రకోటపై నుంచి స్వాతంత్య్రదిన ప్రసంగం చేయడం మోదీకి ఇది 8వ సారి. ఎనిమిదేళ్ళుగా ఆయన తమ ప్రభుత్వ విజన్‌ డాక్యుమెంట్‌ను ఉపన్యాసాల్లో సమర్పిస్తూనే ఉన్నారు. ఆ ప్రసంగవత్‌ భవిష్యత్‌ దర్శనం ఏ మేరకు వాస్తవరూపం ధరించిందన్నది వేరే కథ. నిరుటి ప్రసంగంలో ‘ఆత్మ నిర్భర్‌’ (స్వయం సమృద్ధ) ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా ప్రవచించారు మోదీ. ఈసారి ‘ప్రపంచ శ్రేణి’, ‘భావితరం’ ఆర్థిక లక్ష్యాల వైపు దృష్టి సారించమంటూ కొత్త పల్లవి అందుకున్నారు. మౌలిక వసతులు, ఉద్యోగ, ఉపాధి కల్పన దిశగా ఆయన ప్రణాళిక ఉద్దేశాలు మంచివే. కానీ, ఆ లక్ష్యాలను సాధించే నిర్దిష్టమైన వ్యూహరచన ఏమిటన్నదే ప్రశ్న. 2017 నాటి ప్రసంగంలో 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవమైన 2022 కల్లా ‘నవీన భారత’ నిర్మాణాన్ని మోదీ లక్షించారు. తీరా 75వ ఏట అడుగిడిన ఈ ఏటి ప్రసంగంలోనేమో దాన్ని పాతికేళ్ళు జరిపి, శతవసంతాలు నిండే 2047 నాటికి ‘నవీన భారత’ నిర్మాణమన్నారు. కరోనా దేశ ప్రగతిని ఇంత వెనక్కి నెట్టిందా అన్నది బేతాళ ప్రశ్న. 

మోదీ మాటల్లో కొన్ని వివాదాస్పద అంశాలూ లేకపోలేదు. రెండు హెక్టార్ల కన్నా తక్కువ భూమి ఉన్న చిన్న రైతులకు తోడ్పడే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను కొనసాగిస్తామన్నారు. దేశ విభజన వేళ పడ్డ బాధలను గుర్తు చేసుకుంటూ, ఇకపై ఏటా ఆగస్టు 14వ తేదీని (పాకిస్తాన్‌ ఏర్పడ్డ రోజు) ‘విభజన విషాద స్మృతి దినం’గా జరపాలన్న మోదీ ప్రభుత్వ తాజా నిర్ణయం వివాదాస్పదమే. ఆ నిర్ణయం దశాబ్దాల నాటి పాత గాయాలను మళ్ళీ రేపి, అప్పటి విభేదాలకు ప్రాణం పోసే ప్రమాదం ఉంది. ఇక, తాజాగా ఆదివారం మోదీ ప్రకటించిన పథకాల్లో అనేకం పాత ప్రకటనలకే కొత్త రూపాలనే విమర్శను ఎదుర్కొంటున్నాయి. కొన్ని ఏకంగా రెండేళ్ళ క్రితం నాటివి. 2019లో ఎర్రకోటపై నుంచే ఆధునిక వసతి సౌకర్యాల కోసం కోటి కోట్ల ప్రణాళికను మోదీ ప్రకటించారు. దానినే నిరుడు ‘జాతీయ మౌలికసదుపాయాల పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌’ (ఎన్‌ఐపీ) పేరిట రూ. 110 లక్షల కోట్ల ప్రాజెక్టుగా ప్రస్తావించారు. వాటికే ఈ ఏడాది కొత్త రూపంగా కోటి కోట్ల ‘గతిశక్తి ప్రణాళిక’. 

ఇక, సైనిక స్కూళ్ళలో బాలికలకు ప్రవేశం రెండేళ్ళ క్రితమే రక్షణ శాఖ చెప్పినదైతే, ‘జాతీయ ఉదజని కార్యక్రమం’ ఈ ఏడాది బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించినది. రేషన్‌ షాపుల్లో – బడుల్లో విటమిన్లతో బలోపేతమైన బియ్యం పంపిణీ లాంటివి 2019లో అప్పటి ఆహార మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ప్రకటించినది. ఇవన్నీ తవ్వితీసి, మోదీది పాత పథకాల మాటల మోళీ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆ మాటెలా ఉన్నా, మోదీ గత ఏడాది లానే ఈసారీ ‘తీవ్రవాదానికీ, విస్తరణ వాదానికీ’ భారత్‌ వ్యతిరేకమంటూ పాక్, చైనాలపై పరోక్ష విమర్శకే పరిమితమయ్యారు. అంతర్జా తీయ సంబంధాలు, పొరుగున అఫ్గాన్‌ తాజా పరిణామాలతో తలెత్తిన సవాళ్ళపై పెదవి విప్పలేదు. 

ఏమైనా, అధికారంలో ఉండగా ప్రతి క్షణం విలువైనదేనని మోదీ గ్రహించినట్టున్నారు. మిగిలిన మూడేళ్ళలోనే ప్రజల్ని మాటలతో ఉత్తేజితుల్ని చేసి దేశాన్ని ముందుకు నడిపిస్తూ, బీజేపీని మళ్ళీ గద్దెపై నిలపాల్సింది తానే అన్న స్పృహ ఆయనకుంది. అందివచ్చిన ఏ అవకాశాన్నీ ఆయన వదిలి పెట్టనిది అందుకే. మొత్తానికి, శత వసంత స్వతంత్ర భారతావనికి మోదీ స్ఫూర్తిదాయకమైన విజన్‌ అందించారు. ఆ స్వప్నం సాకారం కావాలంటే, ఆయనే అన్నట్టు అందరినీ కలుపుకొనిపోయే ‘సబ్‌కా ప్రయాస్‌’ అవసరం. ముందుగా స్వపక్ష, విపక్షీయులందరినీ కలుపుకొని పోవాల్సింది పాలకుడిగా ఆయనే! అంకెల మోళీతో పాటు ఆచరణాత్మక వ్యూహం కూడా అవసరం. అప్పుడే... మాటలే కాదు, చేతలూ కోటలు దాటగలుగుతాయి. మోదీ మాటల్లోనే చెప్పాలంటే – అందుకు ‘యహీ సమయ్‌ హై, సహీ సమయ్‌ హై, అన్మోల్‌ సమయ్‌ హై’ (ఇదే సమయం, సరైన సమయం, విలువైన సమయం)! 

మరిన్ని వార్తలు