PM Modi US Visit: ఆశలు రేపిన పర్యటన!

28 Sep, 2021 00:14 IST|Sakshi

మూడు రోజులు... 65 గంటలు... 20 సమావేశాలు... విమానంలో మరో 4 భేటీలు... భారత – అమెరికా ద్వైపాక్షిక చర్చలు... ‘క్వాడ్‌’ దేశాల చతుష్పక్ష సదస్సు... ఐరాస 76వ సర్వప్రతినిధి సభలో ప్రసంగం, బహుళపక్ష చర్చలు.. స్వదేశానికొస్తే రెండు కిలోమీటర్ల మేర అభిమానగణ స్వాగతం! భారత ప్రధాని మోదీ తాజా అమెరికా పర్యటన, స్వదేశ పునరాగమనం అనేకానేక ఫొటో అవకాశాల అరుదైన సందర్భం. మీడియాలో కథనాలెలా ఉన్నా ఈ పర్యటనకు ముందు ప్రభుత్వ ప్రకటన చూస్తే, పెద్ద అంచనాల్లేవు. దానికి తగ్గట్టే పర్యటనలో బ్రహ్మాండం బద్దలయ్యే ప్రకటనలేవీ రానూ లేదు. కొన్ని అంశాల్లో మన దేశం కాస్తంత ముందడుగు వేయగలిగిందన్నదే సంతోషం. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలసి చతుర్భుజ కూటమి ‘క్వాడ్‌’ భాగస్వామిగా ముందుకు సాగింది. అలాగే, మారిన పరిస్థితుల్లో అమెరికాతో భారత బంధం మునుపటి కన్నా కాస్తంత దృఢంగా మారింది. ఆ మేరకు గడచిన ఏడేళ్ళలో ఏడోసారి మోదీ జరిపిన తాజా అమెరికా పర్యటన సఫలమే.

ఒబామా, ట్రంప్, ఇప్పుడు బైడెన్‌ – వరుసగా ముగ్గురు అమెరికా అధ్యక్షులనూ కలసిన రికార్డు మోదీది. ఒకరకంగా బైడెన్‌తో తాజా భేటీ, ఐరాసలో ప్రసంగం ఫక్తు లాంఛనాలే. అప్పట్లో ట్రంప్‌తో లాగా వీరి మధ్య స్నేహం వెల్లివిరియనూ లేదు. అయితేనేం, రెండు దశాబ్దాలుగా అనేక అంశాలలో సాంప్రదాయిక వైరుధ్యాలున్న అమెరికాతో భారత భాగస్వామ్యానికి దారి సుగమమైంది. ప్రపంచ పరిణామాలతో... ప్రాంతీయ సుస్థిరత, విశ్వశ్రేయస్సు లక్ష్యంగా ద్వైపాక్షిక బంధాన్ని పునర్‌ నిర్వచిం
చుకొనేందుకు వీలు కలిగింది. రక్షణ రంగంలో సహకారం, ఇండో – పసిఫిక్‌లో సమతూకం, కోవిడ్‌ టీకాలపై పురోగతి, వాతావరణ మార్పును తగ్గించడం లాంటి అంశాలు ముందుకొచ్చాయి.

దూకుడు మీదున్న చైనా ఇప్పుడు ఇండో – పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా ముందున్న పెను సవాలు. అదే సమయంలో చుట్టుపక్కలి ప్రభావశీల దేశాలైన భారత, జపాన్, ఆస్ట్రేలియాలకూ పెరుగుతున్న డ్రాగన్‌ ప్రాబల్యంతో చిక్కుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచ దేశాలకూ, అమెరికాకూ మధ్య రాజకీయ, వ్యూహాత్మక భాగస్వామ్యాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఈ పర్యటనకు ఓ వారం ముందే ఇండో – పసిఫిక్‌లో బ్రిటన్, ఆస్ట్రేలియాలతో ఓ సరికొత్త త్రైపాక్షిక కూటమిగా ‘ఆకస్‌’ను అమెరికా ప్రకటించింది. ‘ఆకస్‌’ నీలినీడలు ‘క్వాడ్‌’పై పరుచుకుంటాయన్న వాదనలు వినిపించాయి. వాటిని తోసిపుచ్చుతూ, చైనాతో సమీకరణాల సమతూకం కోసం ‘క్వాడ్‌’ దేశాలు తమ మధ్య సమన్వయ, సహకారాలపై దృష్టి పెట్టాయి. ఇక, మన దౌత్యబృందమేమో ‘ఆకస్‌’కు ‘క్వాడ్‌’తో కానీ, భారత్‌తో కానీ సంబంధమే లేదని మొదటే చెప్పేసి, జాగ్రత్త పడింది.

‘ఆసియా ప్రాంతపు నాటో’ కూటమి అంటూ ‘క్వాడ్‌’పై ముద్ర వేసి, చైనా అసహనం వ్యక్తం చేస్తుంటే, దానికి అడ్డుకట్ట వేస్తూ చతుర్భుజ దేశాలు తాజా భేటీతో కార్యాచరణలోకి దిగాయి. తమది సైనిక కూటమి కాదనే సమష్టి అవగాహనను ప్రదర్శించాయి. ఇండో – పసిఫిక్‌లో ప్రజా సరకుల రవాణా అనే కీలకమైన, సైనికేతర ఎజెండాను తలకెత్తుకున్నాయి. ఆరోగ్యం, మౌలిక వసతుల అభివృద్ధి లాంటి అంశాలలో చైనాకు ప్రత్యామ్నాయం ‘క్వాడ్‌’ అందిస్తుందనే భావన కల్పించాయి. ప్రాంతాలకు అతీతమైన కోవిడ్‌ కట్టడి, వాతావరణ మార్పు లాంటి విషయాలను తెలివిగా భుజానికి వేసుకున్నాయి. ప్రాంతీయంగా అంగీకార యోగ్యతనూ, ఈ కూటమికి సుస్థిరతనూ సాధించాయి.

భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ వివిధ దేశాల ప్రతినిధులతో భేటీ అవుతూ, స్నేహసంబంధాలను విస్తరించే పనిలో పడ్డారు. కశ్మీర్‌పై మోదీ ప్రభుత్వ విధానాన్ని గతంలో విమర్శించిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తోనూ మన ప్రధాని భేటీ జరిపి, తీవ్రవాద ప్రోత్సాహక పాక్‌ వైఖరి పైన నిప్పులు చెరిగేలా చేశారు. ఎందరున్నారు, ఎంత విన్నారన్నది అటుంచితే, ఐరాస సర్వప్రతినిధి సభలో మోదీ ప్రసంగిస్తూ, చైనా, పాక్‌ పేర్లను ప్రస్తావించకుండానే, అఫ్గాన్‌ సహా అనేక అంశాల్లో వాటి దుర్వ్యవహారాన్ని లేవనెత్తారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మనపై విషం కక్కితే, దానికి చెంపపెట్టు లాంటి బదులిచ్చే హక్కును యువ దౌత్యవేత్త స్నేహా దుబే రూపంలో భారత్‌ చక్కటి అవకాశంగా వాడుకుంది. అంతర్జాతీయ దౌత్యనీతిపైనే కాక, అమెరికాతో వాణిజ్య బంధాలపైనా దృష్టి పెట్టింది. మోదీ అయిదు సుప్రసిద్ధ సంస్థల సీఈఓలతో విడివిడిగా సమావేశమయ్యారు.

కానీ, ఎప్పటికప్పుడు ప్రాధాన్యాలు మార్చుకోవడం అమెరికా నైజం. అందుకే, సాంకేతిక, సైనిక రంగాల్లో విశ్వప్రమాణాల కోసం పాశ్చాత్య ప్రపంచంపై ఆధారపడుతూనే, మనల్ని దౌత్య ఆయుధంగా వాడుకొని వదిలేసే ప్రమాదం లేకుండా జాగ్రత్తపడాలి. వాణిజ్యం నుంచి ఇమిగ్రేషన్‌ దాకా  పెద్దన్న నుంచి స్పష్టమైన ప్రయోజనాలు పొందడం కీలకం. అయితే, విచిత్రంగా తాజా పర్యటనను సైతం మోదీ ఘనతకు ప్రతీకగా వాడుకోవాలనే ప్రయత్నమూ కనిపించింది. ఐరాసలో మోదీ తనదైన ధోరణిలో ఛాయ్‌వాలా ఆత్మకథ రికార్డును వెయ్యిన్నొకటోసారి వినిపించారు. ఇక, విమానం ఎక్కగానే మోదీ తన శరీరాన్ని గమ్యస్థానపు టైమ్‌జోన్‌కు తగ్గట్టు మార్చుకొని, నిరంతరాయంగా పనుల్లో మునిగిపోతారంటూ అధికార వర్గాల స్తోత్రపాఠాలు సరేసరి. వీటి బదులు విశ్వవేదికపై భారత్‌కు ఒనగూరిన ప్రయోజనాలనూ, అఫ్గాన్‌ – చైనా చిక్కుల మధ్య భవిష్యత్‌ కార్యాచరణ మార్గాన్నీ చెబితే ఉపయోగం. తద్వారా మోదీ ప్రాచుర్యం, భారత ప్రతిష్ఠ మరింత పెరుగుతాయి. ఈ చిన్న లాజిక్‌ మిస్సవడమే ఆశ్చర్యం! 

మరిన్ని వార్తలు