అనిశ్చితికి తెర పడేదెప్పుడు?

19 Jul, 2021 00:02 IST|Sakshi

పొరుగున ఉన్న నేపాల్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఇప్పుడప్పుడే తెర పడేలా లేదు. దురదృష్టవశాత్తూ – అనిశ్చితి, నేపాల్‌ ప్రభుత్వం – ఈ రెండూ కొద్దికాలంగా పర్యాయపదాలైపోయాయి. ఎప్పటికప్పుడు ఓ కొత్త ప్రధాని, ఓ కొత్త ప్రభుత్వం. ఎవరొచ్చినా మూణ్ణాళ్ళ ముచ్చట వ్యవహారం. మావోయిస్టుల హింసాకాండ, నేపాల్‌ రాజరిక వ్యవస్థల నుంచి దశాబ్దం పైచిలుకు క్రితం బయటపడ్డ నేపాల్‌ ఇప్పటికీ సుస్థిరత కోసం చీకటిలో గుడ్డిగా తడుముకుంటూనే ఉండడం ఒక విషాదం. ఆరేళ్ళ క్రితం 2015లోనే నేపాల్‌లో కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయినా ఇప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వివిధ పార్టీల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో రాజకీయ నేతలు అక్కడ కలసి పనిచేసే పరిస్థితులే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే నేపాల్‌లో రాజకీయం ఎప్పటికప్పుడు మారుతోంది. ప్రభుత్వాలు పడిపోతున్నాయి. పాలకులు తరచూ మారిపోతున్నారు. ఒక దశలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందా అన్న అనుమానం కలిగేలా పరిణామాలు సాగుతున్నాయి. పార్టీల అంతర్గత కుమ్ములాటల మధ్య గద్దెనెక్కిన తాజా దేవ్‌బా సర్కార్‌ బలమూ పార్లమెంట్‌లో అంతంత మాత్రమే కావడంతో సుస్థిర ప్రభుతపై అనుమానాలు అలాగే ఉన్నాయి. 

కాస్తంత వెనక్కి వెళితే, మొన్నామధ్య దాకా కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రభుత్వం సాగింది. దేశాధ్యక్షురాలు విద్యాదేవి అండతో ఓలీ గద్దెనెక్కారు. అస్తుబిస్తుగా ఉన్న అధికారాన్ని చేతిలో ఉంచుకుంటూనే, ప్రతినిధుల సభను రద్దు చేయించారు. ప్రధానిగా పదవిలో కొనసాగుతూ, ఎన్నికలకు వెళ్ళేందుకు సన్నద్ధమయ్యారు. ఇంతలో, నేపాల్‌ సుప్రీమ్‌కోర్టు రంగంలోకి దిగడంతో కథ మారింది. రద్దయిన ప్రజాప్రతినిధుల సభను అయిదు నెలల్లో రెండోసారి పునరుద్ధరిస్తూ, అయిదుగురు సభ్యుల నేపాల్‌ సుప్రీమ్‌ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. ప్రధాని ఓలీ రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, ప్రతినిధుల సభను రద్దు చేశారని పేర్కొంది. ఆ సుప్రీమ్‌ తీర్పుతో ఓలీ గద్దె దిగాల్సి వచ్చింది. మిగిలిన పార్టీలకు మరో మార్గం లేకపో వడంతో నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ అధినేత షేర్‌ బహదూర్‌ దేవ్‌బా ఈ జూలై 13న ప్రధానమంత్రి అయ్యారు. అలా ఏడున్నర పదుల వయసున్న దేవ్‌బా అచ్చంగా అయిదోసారి ప్రధాని పీఠమెక్కారు. ఆ మధ్య ఓలీ పాలనలో దెబ్బతిన్న నేపాల్‌ – భారత సంబంధాలు దేవ్‌బా వల్ల సర్దుకుంటాయని ఆశ. కానీ, అసలు ఆయన ఆ పదవిలో ఎంత కాలం ఉంటారన్నదీ అనిశ్చితంగానే ఉంది.  

ఓలీలో అంతకంతకూ పెరిగిన నియంతృత్వ పోకడలతో పోలిస్తే దేవ్‌బా మధ్యేవాద రాజకీయ వైఖరి చాలామందికి నచ్చవచ్చు. అయితే విశ్వాసపరీక్షలో నెగ్గి పదవిలో కొనసాగగలిగినా, దేవ్‌బాకు అది ముళ్ళకిరీటమే. ఇప్పటికిప్పుడు ఆయనకు బోలెడు తలనొప్పులున్నాయి. కరోనా మహమ్మారితో నేపాల్‌ అతలాకుతలమైంది. పొరుగు దేశాలైన భారత, చైనాలతో ఆయన ఒకప్పటి కన్నా మరింత సమర్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గతంలో కన్నా ఇప్పుడు నేపాల్‌పై చైనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మరోపక్క చిరకాల మిత్రదేశమైన భారత్‌తో సత్సంబంధాల పునరుద్ధరణకు శ్రమించాల్సి ఉంటుంది. అందుకే, పరిపాలన ఆయనకు నల్లేరుపై బండి నడకేమీ కాదు. 

నిజానికి, ప్రధానిగా దేవ్‌బా కొనసాగాలంటే, నెలరోజుల్లో సభలో బలం నిరూపించుకోవాలి. ఆయన మాత్రం పదవి చేపట్టిన ఆరో రోజైన ఆదివారమే సభలో విశ్వాస తీర్మానానికి సిద్ధపడ్డారు. తుది సమాచారం అందే సమయానికి నేపాల్‌ పార్లమెంట్‌లో విశ్వాస పరీక్ష పర్యవసానాలు వెల్లడి కాలేదు. మొత్తం 275 మంది సభలో ఇప్పుడున్నది 271 మందే. బలపరీక్షలో నెగ్గాలంటే అందులో సగానికి పైగా, అంటే కనీసం 136 ఓట్లు దేవ్‌బాకు అవసరం. ఆయన సొంత పార్టీ ‘నేపాలీ కాంగ్రెస్‌’కున్నవి 61 స్థానాలే. ఆ పార్టీ సంకీర్ణ భాగస్వామి ‘కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (మావోయిస్ట్‌ సెంటర్‌)’కు ఉన్నవి 49 స్థానాలు. ఆయనకు మద్దతునిచ్చే మిగతా పార్టీలవన్నీ కలిపినా సరే అవసరమైన 136 ఓట్ల సంఖ్యకు చేరుకోవడం లేదు. మరోపక్క, ఓలీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన ప్రతిపక్షానికి 121 మంది సభ్యులున్నారు. ఈ పరిస్థితుల్లో ఓలీని వ్యతిరేకిస్తున్న వివిధ పార్టీ వర్గాల మద్దతు దేవ్‌బాకు కీలకం. అది లభిస్తే తప్ప, దేవ్‌బా ఈ పరీక్ష నెగ్గడం కష్టం. నెగ్గినా బొటాబొటీ మద్దతుతో ఎంతకాలం నెగ్గుకొస్తారో చెప్పలేం. ఒకవేళ పరీక్షలో ఆయన ఓడిపోతే, కథ మళ్ళీ మొదటికొస్తుంది. దిగువ సభ రద్దవుతుంది. ఆరునెలల్లో మళ్ళీ నేపాల్‌ పార్లమెంట్‌ ఎన్నికల ప్రహసనం.

నిజానికి, అటు సుప్రీమ్‌ తీర్పుకు ముందు దిగువ సభను రద్దు చేసిన ఓలీకి కానీ, ఇటు న్యాయ స్థానం అండతో గద్దెనెక్కిన దేవ్‌బాకు కానీ ఎవరికీ ప్రభుత్వాన్ని సుస్థిరంగా నడిపేంత మెజారిటీ లేదు అన్నది చేదు నిజం. కాబట్టి, ఎప్పటికైనా మళ్ళీ బంతి ప్రజాతీర్పు కోసం ఓటర్ల ముందుకు రావాల్సిందే. ఇలా తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం ఉంటుందన్నది ఆసక్తికరం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఓటింగే అధికారానికి రాచబాట. కానీ, ప్రజలు స్పష్టమైన తీర్పునిస్తేనే ఎక్కడైనా సుస్థిరమైన పాలన సాధ్యమవుతుంది. వాళ్ళ తీర్పు అస్పష్టంగా ఉంటే, మైనారిటీ ప్రభుత్వాలు, అనిశ్చిత పరిపాలన తప్పవు. దినదిన గండం లాంటి ప్రభుత్వాల వల్ల పరిపాలనా సాగదు. ప్రజలకు మేలూ ఒనగూరదు. ఈసారి ఎప్పుడు ఎన్నికలు జరిగినా నేపాల్‌ ప్రజానీకం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొంటే, ఈ అయోమయ పరిస్థితి కొంత మారవచ్చు. అప్పటి దాకా మూణ్ణాళ్ళ ముచ్చట ప్రభుత్వాలు, పార్లమెంట్‌ సాక్షిగా రాజకీయ ప్రహసనాలు తప్పవు. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు