ఇది సబబు కాదు

2 Sep, 2020 00:21 IST|Sakshi

గత కొన్ని రోజులుగా ప్రశాంత్‌ భూషణ్‌ చుట్టూ తిరిగిన కోర్టు ధిక్కార వివాదం సోమవారం సుప్రీంకోర్టు ఆయనకు రూపాయి జరిమానా విధించడంతో ముగిసింది. ఆయన పెట్టిన రెండు ట్వీట్లు న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వున్నాయని, ఆయన నేరం చేసినట్టు  నిర్ధారణ అయిందని సర్వోన్నత న్యాయస్థానం గత నెల 13న తేల్చింది. క్షమాపణ చెబితే సరేసరి...లేనట్టయితే శిక్ష తప్పదని చెబుతూ తుది తీర్పును వాయిదా వేసింది. వేయదగ్గ శిక్షపై ఆ నెల 20నుంచి వాదప్రతివాదాలు నడిచాయి. చివరకు విధించిన శిక్ష–రూపాయి జరిమానా లేదా మూడు నెలల జైలు, మూడేళ్లపాటు న్యాయవాద వృత్తినుంచి సస్పెన్షన్‌. జరిమానా చెల్లించడానికే ప్రశాంత్‌ భూషణ్‌  మొగ్గుచూపారు. కేవలం ఈ శిక్షను సమీక్షించమని కోరడానికి తనకున్న హక్కును వినియోగించుకోవడం కోసమే జరిమానా చెల్లిస్తున్నట్టు ఆయన వివరించారు. సుప్రీంకోర్టు సుమోటాగా ఈ కేసు తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే హార్లీ డేవిడ్‌సన్‌ మోటార్‌ సైకిల్‌పై వున్న ఫొటోపై ప్రశాంత్‌ చేసిన వ్యాఖ్య, గత ఆరేళ్లుగా సుప్రీంకోర్టు తీరుతెన్నులపై చేసిన వ్యాఖ్య ఈ వివాదానికి మూలం. సుప్రీంకోర్టును లేదా న్యాయవ్యవస్థ మొత్తాన్ని అప్రతిష్టపాలు చేసే ఉద్దేశం తనకు లేదని ప్రశాంత్‌ వాదిస్తే...తగినవిధంగా స్పందించకపోతే దేశవ్యాప్తంగా న్యాయవాదులకూ, కక్షిదారులకూ తప్పుడు సంకేతం వెళ్తుందని ధర్మాసనానికి నేతృత్వంవహించిన జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా అభిప్రాయపడ్డారు. చూడటానికి ఇది  రూపాయితో సరిపెట్టిన దండనగా కనబడవచ్చు. కానీ న్యాయవ్యవస్థపై విమర్శలు సహించబోమన్న సంకేతాలు పంపింది.

దేశంలోని కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలతో పోలిస్తే న్యాయవ్యవస్థపై సాధారణ ప్రజానీకంలో ఇప్పటికీ గౌరవప్రపత్తులున్నాయి. అడపా దడపా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమైన సందర్భాలు లేకపోలేదు. కానీ మొత్తంగా మిగిలిన రెండింటితో పోలిస్తే అది మెరుగన్న అభిప్రాయమే బలంగా వుంది. అందులో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన న్యాయమూర్తులే ఇందుకు కారణం. నిజానికి బయటవారితో పోలిస్తే వారే అవినీతిని బాహాటంగా ఎత్తిచూపారు. ఇందుకు జస్టిస్‌ కృష్ణయ్యర్‌ మొదలుకొని జస్టిస్‌ కట్జూ వరకూ ఎందరినో ఉదాహరించవచ్చు. న్యాయమూర్తులుగా పనిచేస్తున్నప్పుడూ, రిటైరయ్యాక కూడా వారు ఈ పని చేశారు. న్యాయపీఠంపై వున్నవారిలో కనీసం 20 శాతంమంది అవినీతిపరులని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ వెంకటాచలయ్య చెప్పిన మాటను ఎవరూ మరిచిపోరు. న్యాయమూర్తుల్లో రెండు రకాలవారున్నారని...న్యాయం తెలిసినవారు, కేంద్ర న్యాయమంత్రి తెలిసినవారు అని విపక్షంలో వున్నప్పుడు బీజేపీ నేత స్వర్గీయ అరుణ్‌ జైట్లీ చమత్కరించారు. ‘మేం అధికారంలోకొచ్చాక ఆ ధోరణి పూర్తిగా పోయింద’ని ఆ తర్వాత ఆయన ఎక్కడా చెప్పిన దాఖలా లేదు. అలహాబాద్‌ హైకోర్టుపై పదేళ్ల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి దారితీశాయి.

ఆ వ్యాఖ్యలవల్ల నిజాయితీపరులైన న్యాయమూర్తులపై సైతం నీలినీడలు కమ్ముకున్నాయని, వాటిని వెనక్కి తీసుకోవాలని హైకోర్టు తరఫున పిటిషన్‌ దాఖలైనప్పుడు ‘ఇది స్పందించాల్సిన సమయం కాదు...ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం’ అంటూ ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది.  న్యాయవ్యవస్థ అవినీతిపై ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ మూడేళ్లక్రితం నివేదిక విడుదల చేసినప్పుడు సైతం నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ కేహార్‌ నేతృత్వంలోని ధర్మాసనం అది కోర్టు ధిక్కారం కిందకు రాదని తేల్చిచెప్పింది. 1995లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె. రామస్వామి ఈ విషయంలో ఇంకాస్త ముందుకెళ్లారు. సదుద్దేశంతో, సంయమనంతో న్యాయమూర్తి ప్రవర్తనను లేదా న్యాయస్థానం ప్రవర్తనను కఠిన పదజాలంతో విమర్శించినా కోర్టు ధిక్కారంకాదన్నారు. అయితే అవి న్యాయమూర్తి వ్యక్తిత్వహననానికి, నిష్పాక్షికతను ప్రశ్నార్థకం చేసే స్థాయికి దిగజారకూడదన్నది జస్టిస్‌ రామస్వామి గీసిన లక్ష్మణరేఖ. 

ఇతర వ్యవస్థలకూ, న్యాయవ్యవస్థకూ మధ్య మౌలికంగా వ్యత్యాసం వుంది. మిగతా రెండు వ్యవస్థల్లో పనిచేసేవారు ఇతర వ్యవస్థలపై లేదా తమ వ్యవస్థలపై విమర్శలు చేయలేరు. నిబంధనలు ఒప్పుకోవు. ఒక్క న్యాయవ్యవస్థ మాత్రమే ఎవరిలోపాలనైనా నిశితంగా విమర్శించగలదు. అటువంటి అధికారమూ, హక్కూ వున్న వ్యవస్థ మరీ ఇంత సున్నితంగా వుండటం సబబు కాదు. విమర్శలను మాత్రమే కాదు..ఆ విమర్శలు చేస్తున్నవారెవరో, వారి ఉద్దేశాలేమిటో, అందుకు దారితీస్తున్నవేమిటో కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలాగని న్యాయమూర్తులను బెదిరిస్తే, కించపరిస్తే సహించాలని ఎవరూ చెప్పరు. న్యాయవ్యవస్థతోసహా వ్యక్తులకైనా, వ్యవస్థలకైనా కావలసింది పారదర్శకత, జవాబుదారీతనం. ఆ రెండూ లోపించినా, అవి తగినంతగా లేకపోయినా విమర్శలు రాకతప్పదు. 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌పై సుప్రీంకోర్టులో పనిచేసే యువతి లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో అసలు జరిగిందేమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆమెపై కేసు పెట్టారు. ఢిల్లీ పోలీసు విభాగంలో పనిచేసే ఆమె భర్త, బావలను సస్పెండ్‌ చేశారు. ఆరోపణల్లో పెద్ద కుట్ర వున్నదని జస్టిస్‌ గొగోయ్‌ ఆరోపించారు. తీరా ఏడాది గడిచేసరికి అందరూ ఎవరి ఉద్యోగాల్లో వారు చేరారు. కేసులు రద్దయ్యాయి. పరిస్థితి ఇలా వున్నప్పుడు ప్రశాంత్‌భూషణ్‌ వంటివారు న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని సడలేలా చేస్తున్నారని అనడం సబబేనా? అందుకు బదులు ఆయన వ్యాఖ్యలకున్న ప్రాతిపదికేమిటో వెల్లడిస్తే దిద్దుబాటుకు సిద్ధమని లేనట్టయితే తదుపరి చర్యలు తప్పవని చెబితే బాగుండేది. బార్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో లేదా రిటైర్డ్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కమిటీ వేయాల్సింది.  

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు