చైనాపై చతుర్భుజ వ్యూహం.

25 May, 2022 01:07 IST|Sakshi

జపాన్‌ రాజధాని టోక్యో రెండు రోజులుగా పలు కీలక ఘట్టాలకు వేదికైంది. చతుర్భుజ కూటమి (క్వాడ్‌) దేశాల తాజా సదస్సులో ప్రాంతీయ భద్రతపై మాటలు, ‘క్వాడ్‌’ ఫెలోషిప్‌ల లాంటి చేతలతో పాటు ‘ఇండో – పసిఫిక్‌ ఆర్థిక చట్రం’ (ఐపీఈఎఫ్‌) అనే కొత్త ఆర్థిక కూటమి తెరపైకొచ్చింది. చైనాకు ముకుతాడు వేసి, ఈ ప్రాంతంలో తన ప్రాబల్యం పెంచుకోవడానికే అయినా, 13 దేశాలతో అమెరికా శ్రీకారం చుట్టిన ఈ ఐపీఈఎఫ్‌ భారత్‌ సహా వివిధ దేశాలకు తెరుచుకున్న ఓ కొత్త కిటికీ. అలాగే, ‘క్వాడ్‌’ను పట్టించుకోని ఇండో– పసిఫిక్‌లోని చిన్న దేశాల మద్దతును కూడగట్టడం కోసం ఆ ప్రాంతంలో (చైనా) అక్రమ చేపలవేటను అడ్డుకునే సముద్రజల కార్యాచరణ ప్రకటించారు. అంటే, ఇప్పటి దాకా మానవతా సాయం, టీకాలు, వాతావరణ మార్పులు, సరఫరా వ్యవస్థల లాంటి సాధారణ అంశాలే అజెండాగా ఉన్న ‘క్వాడ్‌’ రూపం మార్చుకుంటోంది. మోదీ మాటల్లో చెప్పాలంటే, ‘క్వాడ్‌’ ఇప్పుడు ఓ చురుకైన వేదికగా మారింది. 

‘క్వాడ్రిలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌’ (క్వాడ్‌) అనే నాలుగు ప్రజాస్వామ్య దేశాల కూటమికి 17 ఏళ్ళ క్రితం అనుకోకుండా బీజం పడింది. 2004లో హిందూ మహాసముద్రంలో చెలరేగిన భయంకర సునామీ తరువాత బాధిత ప్రాంతంలో మానవతా దృక్పథంతో సాయం చేయడానికి అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్‌లు ఒక తాటి మీదకు వచ్చాయి. 2007లో అప్పటి జపాన్‌ ప్రధాని షింజో అబే ఈ చతుష్పక్ష కూటమిని లాంఛనంగా స్థిరీకరించారు. ఈ కూటమిలో పాలు పంచుకుంటే చైనాకు కోపం తెప్పిస్తానేమోనని కొన్నేళ్ళ పాటు ఆస్ట్రేలియా తటపటాయించింది. అలా దశాబ్ద కాలం ‘క్వాడ్‌’ నిద్రాణంగా ఉంది. అయితే, పెరుగుతున్న చైనా ప్రాబల్యం పట్ల మారిన వైఖరులను ప్రతిఫలిస్తూ, 2017లో ‘క్వాడ్‌’ పునరుత్థానమైంది. ఇండో – పసిఫిక్‌పై మరింత దృష్టి పెట్టి, చైనాకు ముకుతాడు వేయడానికి ‘క్వాడ్‌’ కీలకమని నిన్నటి ట్రంప్, ఇవాళ్టి బైడెన్‌ ప్రభుత్వాలు గుర్తించాయి. ‘క్వాడ్‌’ నేతల సదస్సు 2021లో తొలిసారి జరిగింది. ఈ మార్చిలో వర్చ్యువల్‌గా భేటీ అయ్యారు. తాజా టోక్యో శిఖరాగ్ర సదస్సు నేతలు భౌతికంగా కలిసిన రెండో భేటీ. 

చైనా పేరెత్తకుండానే, ఆ దేశ విస్తరణవాదాన్ని అడ్డుకొనే చర్యలకు తాజా సదస్సులో ‘క్వాడ్‌’ సమాయత్తమైంది. నిజానికి, తైవాన్‌పై చైనా దాడి ప్రమాదం ఉందని భావిస్తున్న తరుణంలో, చూస్తూ ఊరుకోబోమని అమెరికా రెండు రోజుల క్రితమే హెచ్చరించింది. తాజాగా ‘క్వాడ్‌’ దేశాలు సైతం ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వాలకే తాము కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేయడం చైనాకు పంటి కింద రాయే. అలాగే, చైనాతో దౌత్య, వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ సదస్సులో ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ చురుకైన పాత్ర గమనార్హం. ఈ చతుర్భుజ కూటమి దేశాల తాజా భేటీ, కార్యాచరణ ప్రణాళిక సహజంగానే చైనాకు నచ్చట్లేదు. ‘ఆసియా ప్రాంతపు నాటో కూటమి’ అంటూ ‘క్వాడ్‌’పై ముద్ర వేస్తున్న చైనా తన అసహనాన్ని దాచుకోవట్లేదు. ‘క్వాడ్‌’ సదస్సు వేదికకు దగ్గరలోనే చైనా – రష్యాల జెట్‌ విమానాలు గగనతల గస్తీ నిర్వహించాయని తాజావార్త. రెచ్చగొట్టేలా సాగిన ఈ వ్యవహారాన్ని జపాన్‌ తీవ్రంగా నిరసించింది. 

ఉక్రెయిన్‌పై రష్యా దాడి కూడా తాజా ‘క్వాడ్‌’ నేతల సదస్సులో ప్రస్తావనకు వచ్చింది. చిరకాల మిత్రదేశమైన రష్యాతో భారత్‌కు ఉన్న వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలపై ఒత్తిడి పడింది. అయితే, భారత్‌ మాత్రం తన ప్రయోజనాల్ని వదులుకోకుండానే, ఉక్రెయిన్‌ యుద్ధ వేళ తన అలీన వైఖరినీ, శాంతిస్థాపన ఆవశ్యకతనూ పునరుద్ఘాటించింది. పనిలో పనిగా టోక్యోలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 70 ఏళ్ళుగా అనుబంధం ఉన్న జపాన్‌తో వాణిజ్యం నుంచి భద్రత వరకు అనేక అంశాలు చర్చకు వచ్చాయి. అదే సమయంలో భారత్‌ కోవిడ్‌ టీకా మైత్రి ప్రపంచాన్ని కాపాడిందంటూ భారత్‌ చొరవను దేశాలన్నీ అభినందించాయి. ఉత్సాహం చూపుతున్న దక్షిణ కొరియా, న్యూజిలాండ్, వియత్నామ్‌ లాంటి దేశాలతో భవిష్యత్తులో ‘క్వాడ్‌’ విస్తరించినా, భాగస్వామ్యం పెరిగినా ఆశ్చర్యం లేదు. 

ఈ సదస్సులో ‘క్వాడ్‌’ తన భద్రతా లక్ష్యాలను కానీ, మరో కూటమి ‘ఆకస్‌’ (ఆస్ట్రేలియా – యూకె– యూఎస్‌ల కూటమి) విషయంలో వైఖరిని కానీ స్పష్టం చేయలేదు. ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాముల సరఫరాకై అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం – ‘ఆకస్‌’. గమనిస్తే ఇటు ‘క్వాడ్‌’, అటు ‘ఆకస్‌’, చైనా వాణిజ్య ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన ఆర్థిక కూటమి ‘ఐపీఈఎఫ్‌’ – ఇవన్నీ చైనా బలపడకుండా అమెరికా అనుసరిస్తున్న విస్తృత ప్రపంచ వ్యూహంలో భాగాలే! 

అయితే, వీటి నుంచి మనకు దక్కేది ఏమిటన్నదే భారత్‌కు కీలకం కావాలి. పొరుగున ఉన్న పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్‌లలో మౌలిక వసతుల కల్పన పేరిట వేలు పెడుతున్న చైనా మనకు పక్కలో బల్లెమే. అలాగని చైనా బూచిని చూపెట్టి, మనల్ని తన చంకలో పెట్టుకోవాలన్న అమెరికా వలలో పడితే అమాయకత్వమే. మన దేశ భద్రత, దౌత్య, వాణిజ్య ప్రయోజనాలే గీటురాయిగా వ్యూహాత్మకంగా అడుగులు వేయడమే అవసరం. అటు చైనాతో పాటు అయిదు ఆర్థిక వ్యవస్థల కూటమి ‘బ్రిక్స్‌’లో, ఇటు అమెరికాతో ‘క్వాడ్‌’, కొత్త ఐపీఈఎఫ్‌లలో ఉంటూ సమన్వయం సాధించడం ఎల్తైన తాడు మీద గడకర్ర పట్టుకొని నడవడం లాంటిదే! కానీ తప్పదు! 

మరిన్ని వార్తలు