ఎట్టకేలకు క్వాడ్‌ శిఖరాగ్రం

12 Mar, 2021 01:18 IST|Sakshi

దాదాపు పద్నాలుగేళ్ల క్రితం ఒక ప్రతిపాదనగా మొదలైన చతుర్భుజ కూటమి (క్వాడ్‌) దేశాల భావన ఇప్పుడు శిఖరాగ్ర సమావేశం వరకూ వచ్చింది. శుక్రవారం తొలి శిఖరాగ్రం జరగబోతోంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సభ్య దేశాలుగా వున్న ఈ కూటమిపై మొదట్లో చైనా శంకలకు పోయింది. అది తనకు వ్యతిరేకంగా పురుడుపోసుకున్న కూటమి అని, దక్షిణ చైనా సముద్ర జలాల్లో తన ఆధిక్యతను తగ్గించేందుకు జపాన్, అమెరికాలు ఏకమై భారత్, ఆస్ట్రేలియాలను కూడా కలుపు కొని రూపొందించిన వ్యవస్థ అని భావించింది. కానీ తాజాగా జరగబోయే శిఖరాగ్ర సమావేశానికి ముందు బుధవారం చేసిన ప్రకటనలో చైనా కొంత వెనక్కి తగ్గిన దాఖలా కనబడుతోంది. ఈ ప్రాంతంలో శాంతిసుస్థిరతలకు దోహదపడేలా... ఇక్కడి ప్రయోజనాలను పరిరక్షించేలా, పార దర్శకంగా, అందరినీ కలుపుకొనిపోయే రీతిలో క్వాడ్‌ వుండాలని కోరుకుంటున్నట్టు ప్రకటించింది. మూడేళ్లక్రితం ప్రతిపాదన స్థాయి దాటి సంస్థాగత రూపం సంతరించుకోవటం మొదలైనప్పుడు చైనా ఇందుకు భిన్నంగా స్పందించింది. ‘ఇది కేవలం పతాకశీర్షికలకెక్కడానికి చేస్తున్న ప్రయత్నం. సముద్రంలో కొట్టుకొచ్చే నురుగలాంటిది. కనుమరుగు కావటానికి ఎంతో కాలం పట్టదు’ అని వ్యాఖ్యానించింది. మొత్తానికి తొలిసారి క్వాడ్‌ దేశాల అధినేతలు ఆన్‌లైన్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనబోతున్నారు. దక్షిణాసియాలో, హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా అడుగులేయాలని నిర్ణయించుకున్నప్పటినుంచి మన దేశం క్వాడ్‌పై ఆసక్తి చూపటం మొదలుపెట్టింది. ముఖ్యంగా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌(బీఆర్‌ఐ) పేరిట యూరేసియా, హిందూ మహా సముద్ర తీర ప్రాంతాలను కలిపే బృహత్తర ప్రాజెక్టుకు చైనా రూపకల్పన చేయటం, అది మన వ్యూహాత్మక ప్రాంతాలను ఒరుసుకుంటూ వుండటంతో మన దేశం అప్రమత్తమైంది. అలాగని కేవలం చైనా వ్యతిరేకత ఒక్కటే క్వాడ్‌కు ప్రాతిపదికగా వుండటం సమ్మతం కాదని మన దేశం తెలిపింది. యూపీఏ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ ఆ సంగతిని స్పష్టంగానే చెప్పారు. మూడేళ్లక్రితం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆ మాటే అన్నారు. ఇండో–పసిఫిక్‌ భావన కేవలం భౌగోళిక పరమైనదే తప్ప, వ్యూహాత్మకమైనది కాదని వివరించారు. ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకోని దీన్ని రూపొందించటం లేదని తెలిపారు. అయితే చైనా వ్యవహారశైలి క్రమేపీ మారుతూ వస్తోంది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో, తూర్పు లద్దాఖ్‌లో, హాంకాంగ్, తైవాన్‌ తదితరచోట్ల దాని దూకుడు పరో క్షంగా క్వాడ్‌కు మళ్లీ ప్రాణం పోసింది.

బైడెన్‌ వచ్చాక కూడా క్వాడ్‌కు అమెరికా మంచి ప్రాధాన్యత ఇస్తోంది. అమెరికా రక్షణ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నవారు తొలుత నాటో ప్రధాన కార్యాలయం కొలువుదీరిన బ్రస్సెల్స్‌ సంద ర్శిస్తారు. అందుకు భిన్నంగా కొత్త రక్షణమంత్రి ఆస్టిన్‌ లాయిడ్‌ క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సమావేశంపైనే శ్రద్ధపెట్టారు. ఆ వెంటనే శిఖరాగ్ర సదస్సు తేదీలు ఖరారయ్యాయి. ప్రపంచంపై ఆధిపత్యానికి చైనా ప్రయత్నిస్తున్నదని, దాన్ని సకాలంలో కట్టడి చేయకుంటే ముప్పు కలుగు తుందని అమెరికా నమ్ముతోంది. ఇలాంటి అభిప్రాయమే క్వాడ్‌లోని ఇతర దేశాలకు కూడా వుంది. జపాన్‌కు దక్షిణ చైనా సముద్ర జలాల్లో, ఆస్ట్రేలియాకు పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో ఆ దేశంతో సమస్యలున్నాయి. భౌగోళికంగా చూస్తే అమెరికాకు చైనాతో సమస్యల్లేవు. కానీ మొత్తంగా తన ఆధిపత్యానికి ఆ దేశం ఎసరు పెట్టవచ్చునని అమెరికా ఆందోళనలో వుంది. ట్రంప్‌ ఏలుబడి పుణ్యమా అని యూరొపియన్‌ యూనియన్‌(ఈయూ) తన తోవ తాను చూసుకుంది. నాటో కూటమి కొనసాగాలంటే దానికయ్యే వ్యయం భరించాలని ట్రంప్‌ అప్పట్లో చెప్పటం ఈయూ దేశాలకు ఆగ్రహం కలిగించింది. ఇదే అదునుగా ఈయూతో చైనా సన్నిహితమైంది. బైడెన్‌ వచ్చే లోపు ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలను మొన్న జనవరిలో ముగించి, సూత్రప్రాయమైన అవగాహనను కుదుర్చుకుంది. ఇలా ఎక్కడికక్కడ తలనొప్పిగా మారిన చైనాపై అమెరికాకు ఆగ్రహం వుండటంలో ఆశ్చర్యం లేదు.

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచటానికి అవసరమైన నిధులు సమీకరించటం, కీలక సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు, వాతావరణ మార్పులు వంటి అంశాలు క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సులో చర్చకు రాబోతున్నాయి. వీటితోపాటు ఇండో–పసిఫిక్‌ దేశాల భద్రతకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా సమీక్షిస్తారు. ఇక్కడే మన దేశం ఆచి తూచి అడుగేయటం ఉత్తమం. చైనాతో మనకు సమస్యలున్న మాట వాస్తవమే. మొన్న వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనికులు రెచ్చిపోయి, అకారణంగా ఘర్షణలకు దిగి మన జవాన్లను పొట్టనబెట్టుకున్నా మన దేశం సంయమనం చూపింది. ఆ దేశంతో ఎంతో ఓపిగ్గా పలు దఫాలు చర్చలు జరిపి ఆ సమస్యకొక పరిష్కారాన్ని సాధించగలిగింది. ఇతర అంశాల విషయంలో కూడా ఈ వైఖరే మన దేశానికి మేలు చేస్తుంది. అమెరికా–పూర్వపు సోవియెట్‌ యూనియన్‌ల మధ్య దశాబ్దాలపాటు సాగిన ప్రచ్ఛన్న యుద్ధం పర్యవసానాలు అందరికీ అనుభవమే. ఆ రెండు దేశాలతోపాటు వాటి వెనక సమీకృతమైన దేశా లన్నీ అప్పట్లో అభివృద్ధి ప్రాజెక్టులపై కన్నా భద్రతపై ఎక్కువ కేంద్రీకరించాల్సివచ్చింది. ఆ పరిస్థితి మరోసారి తలెత్తకూడదు. క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సు అందుకు అనుగుణమైన నిర్ణయాలు తీసు కోవాలని ఆశించాలి. 

మరిన్ని వార్తలు