స్త్రీ జాతికి శుభవార్త!

15 Jul, 2022 00:06 IST|Sakshi

అవును. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్‌ అన్నట్టు ఇది స్త్రీ జాతికి శుభవార్త. తక్కువ వెలతో, అందరికీ అందుబాటులో ఉండే దేశీయ టీకా గనక భారత మహిళా లోకానికి మరీ మంచివార్త. గర్భాశయ ముఖద్వార (సర్వికల్‌) క్యాన్సర్‌పై విజయానికి మనమిప్పుడు మరింత చేరువయ్యాం. దేశంలోనే తొలి ‘క్వాడ్రివలెంట్‌ హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ వ్యాక్సిన్‌’ (క్యూహెచ్‌పీవీ)కి భారత డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ మంగళవారం ఆమోదం తెలిపారు. పుణేకు చెందిన ప్రసిద్ధ ‘సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ దేశీయంగా వృద్ధిచేస్తున్న ఈ ‘సర్వావ్యాక్‌’ టీకా ఈ నవంబర్‌ కల్లా అందుబాటులోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆడవారికి తరచూ వచ్చే క్యాన్సర్లలో నాలుగోదీ, 15 నుంచి 44 ఏళ్ళ మధ్య భారతీయ మహిళలను పట్టిపీడిస్తున్న క్యాన్సర్లలో రెండోదీ అయిన సర్వికల్‌ క్యాన్సర్‌ నుంచి తప్పించుకోవడం ఇప్పుడిక మన చేతుల్లోనే ఉంది. 

మన దేశంలో ఏటా 1.23 లక్షల పైచిలుకు మంది ఆడవారు ఈ మాయదారి రోగం బారిన పడుతుంటే, సగం మందికి పైగా (67 వేల మంది) ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే, యుక్తవయసుకు రాకముందే ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలందరికీ హెచ్‌పీవీ టీకానిస్తే గర్భాశయ క్యాన్సర్‌ను సమూలంగా దూరం చేయవచ్చని సౌమ్య లాంటి శాస్త్రవేత్తల మాట. హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) అనేది లైంగికంగా వ్యాపించే కొన్ని వైరస్‌ల సమూహం. ఎక్కువ రిస్కుండే హెచ్‌పీవీల వల్ల క్యాన్సర్‌ వస్తుంది. నూటికి 95 సర్వికల్‌ క్యాన్సర్లు ఈ హెచ్‌పీవీ పుణ్యమే. సాధారణంగా గర్భాశయద్వార క్యాన్సర్‌ బయటపడేందుకు 15 నుంచి 20 ఏళ్ళు పడుతుంది. కానీ, వ్యాధినిరోధకత బాగా తక్కువగా ఉన్న స్త్రీలలో అయిదు నుంచి పదేళ్ళలోనే ఇది రావచ్చు. హెచ్‌ఐవీ లేని వారి కన్నా ఉన్నవారిలో ఈ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఆరు రెట్లు ఎక్కువ. అయితే, క్రమం తప్పకుండా తరచూ పరీక్ష చేయించుకొంటే, ముందుగానే రోగ నిర్ధారణ, చికిత్స జరిగి బయటపడవచ్చు. తొమ్మిది నుంచి 14 ఏళ్ళ లోపు ఆడపిల్లలు టీకా వేయించుకుంటే, ఈ వ్యాధి రాదని డబ్ల్యూహెచ్‌ఓ లెక్క. 

మన దేశంలో అభివృద్ధి చేస్తున్న కొత్త టీకా కాకుండా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన మరో 4 టీకాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఆ టీకాలకు మన దేశంలో ఒక్కో వ్యక్తికీ కనీసం రూ. 5 వేల నుంచి 8 వేల దాకా ఖర్చవుతుంది. కానీ, మన దేశవాళీ కొత్త టీకా అంతకన్నా చాలా తక్కువకే దొరకనుంది. నిజానికి, పుణేలోని సీరమ్‌ సంస్థ చేస్తున్న ఈ టీకా ప్రయోగాలు 2019 నుంచి నాలుగేళ్ళుగా జరుగుతున్నాయి. 12 ప్రాంతాల్లో 9 నుంచి 26 ఏళ్ళ మధ్య వయసులోని 2 వేల మందికి పైగా వ్యక్తులపై ఈ టీకాను ప్రయోగించి చూశారు. మూడు విడతలుగా ఈ ప్రయోగాలు సాగాయి. వైరస్‌ నిరోధకతకు అవసరమైన ప్రాథమికస్థాయి కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ ఈ టీకా ప్రభావశీలమని ప్రయోగాల్లో తేలింది. టీకా వేసుకున్నవారిలో నూటికి నూరు మందిలో అద్భుత వ్యాధినిరోధకత అభివృద్ధి చెందినట్లూ, అంతా సురక్షితంగా ఉన్నట్లూ ఫలితాలు రావడం విశేషం.  

ప్రపంచంలో ప్రతి లక్ష మంది మహిళలనూ ప్రమాణంగా తీసుకుంటే, 18 ఏళ్ళ వయసుకే భయపెడుతున్న ప్రాణాంతక రోగమిది. అందుకే, అభివృద్ధి చెందిన దేశాలు గత 15 ఏళ్ళుగా రకరకాల సర్వికల్‌ క్యాన్సర్‌ టీకాలు వాడుతున్నాయి. ఇక, మన దేశంలో ఎప్పుడు లెక్కతీసినా కనీసం 4 లక్షల మందికి పైగా మహిళలు ఈ రోగపీడితులే. 30 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ అయిదేళ్ళకోసారి ఈ గర్భాశయద్వార క్యాన్సర్‌ పరీక్ష చేయించుకోవాలని ఆరోగ్యశాఖ మార్గదర్శకం. వసతుల లేమి, అవగాహన లోపంతో ఆచరణలో అది జరగడమే లేదు. అందుకే, ఇప్పుడు దేశీయంగా టీకా అభివృద్ధి ఓ పెనుమార్పు తేనుంది. 15 ఏళ్ళ లోపు ఆడపిల్లల్లో నూటికి 90 మందికి 2030 నాటికల్లా హెచ్‌పీవీ టీకాలతో రక్షణ కల్పించాలని డబ్ల్యూహెచ్‌ఓ లక్షిస్తున్న వేళ ఈ చొరవ సమయానికి అంది వచ్చింది. 

నిజానికి, ప్రాణాంతక క్యాన్సర్ల నుంచి రోగులను రక్షించేంత ప్రాథమిక వసతులు నేటికీ మన దేశంలో లేవు. దేశంలో సగటున ప్రతి 10 వేల మంది క్యాన్సర్‌ రోగులకూ కేవలం ముగ్గురు రేడియేషన్‌ ఆంకాలజిస్టులే ఉన్నారన్నది కఠోర వాస్తవం. ఈ పరిస్థితుల్లో చికిత్స కన్నా నివారణ ప్రధానం గనక, ఈ కొత్త టీకా ఉపయోగకరం. సర్వికల్‌ క్యాన్సర్‌ టీకాలను కూడా దేశ సార్వత్రిక టీకాకరణ కార్యక్రమంలో భాగంగా చేర్చాలని 2018లోనే టీకాకరణపై జాతీయ సాంకేతిక సలహా బృందం సూచించింది. కానీ, మెర్క్, గ్లాక్సో లాంటి బహుళ జాతి ఔషధ సంస్థల అంతర్జాతీయ టీకాలు ఖరీదైనవి కావడంతో ఆ పని జరగలేదు. అంతర్జాతీయ టీకాల ఆధిపత్యానికి గండికొడుతూ ఇప్పుడు దేశవాళీ చౌక రకం టీకా వచ్చింది గనక, ఆ బృహత్కార్యానికి వీలు చిక్కింది. 

ప్రతి 8 నిమిషాలకూ ఓ మహిళను సర్వికల్‌ క్యాన్సర్‌ బలితీసుకుంటున్న మన దేశంలో మహిళా ఆరోగ్య సంరక్షణలో ఈ కొత్త టీకా ఓ చరిత్రాత్మక పరిణామం. ప్రభుత్వం బరిలోకి దిగితే కనీసం 5 కోట్ల మంది బడి వయసు పిల్లలకు ఇది తక్షణం ఉపయుక్తం. దీని గురించి యువతుల్లో, తల్లితండ్రుల్లో చైతన్యం తేవాలి. కౌమారంలోనే ఈ టీకాలు తీసుకొనేలా ప్రోత్సహించాలి. సర్వికల్‌ క్యాన్సర్‌పై విజయం సాధించాలి. ఇప్పటికే, కరోనా వేళ టీకాల అభివృద్ధి, తయారీల్లో సాధించిన పురోగతితో మన దేశాన్ని ‘టీకాల రాజధాని’ అంటున్నారు. ‘సర్వావ్యాక్స్‌’ లాంటి కొత్త టీకాలు ఆ పేరును నిలబెడతాయి. మరిన్ని కొత్త టీకాల పరిశోధన, అభివృద్ధికి వసతులు కల్పించి, మన శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం పాలకుల కర్తవ్యం.  

మరిన్ని వార్తలు