జాత్యహంకారానికి టీకా లేదా?

22 Sep, 2021 00:17 IST|Sakshi

కాలం మారినా వెనుకటి సహజగుణాన్ని వదులుకోవడం ఎవరికైనా కష్టమే. దానికి ఆభిజాత్యం కూడా తోడైతే ఇక చెప్పేది ఏముంది! రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం కాలగతిలో కుంచించుకుపోయినా, వలస పాలనా వ్యవస్థ తాలూకు ఆలోచనలు, అవశేషాలు బ్రిటన్‌ పాలకులను ఇంకా వదిలిపెట్టినట్టు లేవు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనాకు టీకాలపై బ్రిటన్‌ వైఖరి ఆ అనుమానమే రేకెత్తిస్తోంది. బ్రిటన్‌కు వచ్చే భారతీయ ప్రయాణికుల విషయంలో ఆ దేశం పెట్టిన తాజా నిబంధనలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. భారత్‌లో రెండు డోసుల కోవిషీల్డ్‌ టీకా వేయించుకున్నప్పటికీ, వారెవరినీ రోగ నిరోధక శక్తి ఉన్నవారిగా బ్రిటన్‌లో పరిగణించబోరట. అలాంటి వారు తమ దేశానికి వస్తే 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని బ్రిటన్‌ తాజా షరతు. దీంతో, విద్య, వైద్య, వ్యాపారాది అవసరాల నిమిత్తం బ్రిటన్‌ వెళ్ళే భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులు పలువురికి చిక్కులు తప్పవు. పూర్తిగా టీకాలు వేసుకున్నా సరే, మీ టీకాలు పనికి రావని చెప్పడం అక్షరాలా జాత్యహంకారమే అంటూ విమర్శలు చెలరేగుతున్నది అందుకే.  

టీకా పూర్తిగా వేసుకున్నా సరే భారతీయులు క్వారంటైన్‌లో ఉండాలన్న బ్రిటన్‌ టీకా విధానం ‘పూర్తిగా దుర్విచక్షణ విధానం’ అని భారత ప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్‌ తాజా నిర్ణయానికి తర్కం లేదు. సరికదా కనీసం శాస్త్రీయ కారణాలైనా లేవు. కోవిషీల్డ్‌ టీకా ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడ్డదేమీ కాదు. సాక్షాత్తూ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సహకారంతో తయారైన బ్రిటన్‌ ఉత్పత్తి ఆస్ట్రాజెనెకా టీకాకు అది మరో పేరు. మరో రూపం. ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకాలు సాంకేతిక విజ్ఞానాన్ని బదలాయించడంతో, అక్కడి టీకాకు లైసెన్సు తీసుకొని, ఇక్కడ భారత్‌లో కోవిషీల్డ్‌ పేరిట సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) తయారుచేసింది. అంటే, అది భారత్‌లో తయారైన బ్రిటన్‌ టీకా. పైపెచ్చు, భారత్‌లో తయారైన ఈ కోవిషీల్డ్‌ టీకాలలో 50 లక్షల టీకాలను మళ్ళీ అదే బ్రిటన్‌ అభ్యర్థన మేరకు, ఆ దేశ ఆరోగ్య అవసరాల నిమిత్తం అందజేశాం. వాటన్నిటినీ బ్రిటన్‌ తమ దేశపౌరులకు శుభ్రంగా వినియోగించుకుంది. కానీ, ఇప్పుడు అదే టీకాలు వేసుకున్న భారతీయ ప్రయాణికులను మాత్రం అసలు టీకాలే వేసుకోని వ్యక్తులుగా భావిస్తామంటోంది. ఇది ఏ రకంగా చూసినా అసమంజసం. వలసవాద బ్రిటన్‌ వదిలిపెట్టని జాత్యహంకారానికి నిదర్శనం. 

మరోపక్క టీకా వేసుకున్న భారతీయులకూ, ఇతర దేశస్థులకూ ఈ నవంబర్‌ నుంచి విమాన ప్రయాణ అనుమతులిస్తున్నట్టు అమెరికా ప్రకటించడం గమనార్హం. అమెరికా సహా ఇతర దేశాలు వేటికీ లేని ఈ టీకా దుర్విచక్షణ లేనిపోని భయాలతో బ్రిటన్‌ బుర్రలో మొలవడం ఆశ్చర్యకరం. ఏ దేశానికి ఆ దేశం యథేచ్ఛగా నిర్ణయం తీసుకొనే అధికారాన్ని కాదనలేం. కానీ ప్రపంచమొక కుగ్రామమై, పరస్పరం ఆధారపడ్డ వేళ ఈ వైఖరి సరికాదు. దీన్ని తక్షణమే వదిలిపెట్టాలని మంగళవారం బ్రిటన్‌కు, భారత్‌ స్పష్టం చేసింది అందుకే. బ్రిటన్‌ షరతులు సడలించిందా సరే! లేదంటే ప్రతిస్పందన చర్యలకు భారత్‌ సిద్ధం. బహుశా, బ్రిటన్‌ ఆ పరిస్థితి తీసుకురాకపోవచ్చు. 

కోవిడ్‌ టీకాల ఉత్పత్తిలో ప్రపంచ దేశాల్లో భారత్‌ ముందు వరుసలో నిలిచింది. అంతేకాక, 95కి పైగా దేశాలకు ఎగుమతి కూడా చేస్తోంది. ఇక, ప్రపంచవ్యాప్తంగా 560 కోట్ల డోసుల కోవిడ్‌ టీకాలు వేసినట్టు ఇటీవలి లెక్క. అందులో ప్రతి ఏడింటిలో ఒకటి భారత్‌లో వేసినదే. అలా భారత్‌లో వేసిన డోసుల్లోనూ అత్యధికం కోవిషీల్డ్‌ టీకాలే. ప్రపంచమే అంగీకరించిన ఆ టీకాను వేసుకున్న భారతీయుల్ని తాము మాత్రం అంగీకరించబోమని బ్రిటన్‌ అనడం మూర్ఖత్వానికి పై మెట్టు. కరోనాపై అభివృద్ధి చెందిన దేశాల వైఖరిలో కొన్ని అంశాలు అందరినీ ఇరుకున పెడుతున్నాయి. ముఖ్యంగా, అంతగా అభివృద్ధి చెందని దేశాలపై ఆ వైఖరి దుర్విచక్షణ పూరితంగా కనిపిస్తోంది. మచ్చుకు, చైనా టీకాలు వేటినీ రోగనిరోధకతకు అంగీకారయోగ్యమైనవిగా భావించేది లేదని యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఒక విధానం పెట్టుకుంది. ఆ విధానాన్ని పునరాలోచించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం చైనా వారి సినోవాక్‌ టీకానే ఈయూ అంగీకరిస్తోంది. అదీ ఈయూలో 8 దేశాలే ఆ టీకాకు ఓకే అంటున్నాయి. ఇది సమర్థనీయం కాదు. అత్యవసర వినియోగానికి తాను అనుమతించిన టీకాలన్నిటినీ ప్రయాణికుల విషయంలో గుర్తించాలని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ ఎప్పుడో చెప్పింది. అలా ఆ సంస్థ ఆమోదం పొందిన అధీకృత టీకాలలో చైనా టీకాలూ ఉన్నాయి. అయినా సరే, ఇప్పటికీ ఈయూ లాంటివి చైనా టీకాలను పట్టించుకోవట్లేదన్నది చేదు నిజం.

అలాగే, ఆస్ట్రాజెనెకా తెచ్చుకున్న ఆమోదంతో సంబంధం లేకుండా, అదే టీకాకు కోవిషీల్డ్‌ స్వతంత్రంగా దరఖాస్తు చేసుకొని, ఆరోగ్యసంస్థ గ్రీన్‌సిగ్నల్‌ పొందింది. అంటే, ఆ టీకాను 95 దేశాలకు పైగా ఎగుమతి చేసుకోవచ్చు. ఇవన్నీ తెలిసి కూడా బ్రిటన్‌ ఇప్పుడిలా ప్రవర్తించడం విస్మయం రేపుతోంది. ఇలా కొన్ని టీకాల పట్ల దుర్విచక్షణ వల్ల అనవసరంగా ‘‘రెండంచెల విధానం తయారు అవుతుంద’’న్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవేదన. నిజానికి, అభివృద్ధి చెందిన దేశాలు అనుసరించే ఈ తప్పుడు వైఖరి వల్ల మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో ప్రపంచంలో అసమానతలు పెరుగుతాయి. ఈయూ మొదలు తాజా షరతుల బ్రిటన్‌ దాకా దేశాలన్నీ ఆ కీలక అంశం గుర్తించాలి. తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ఎందుకంటే, ఇది వ్యక్తిగతం కాదు... ఓ మహమ్మారిపై కలసికట్టుగా చేయాల్సిన ప్రపంచ పోరాటం. 

మరిన్ని వార్తలు