RRR Naatu Naatu Oscars 2023: చెయ్యెత్తి జైకొట్టిన ఆస్కార్‌

14 Mar, 2023 00:27 IST|Sakshi

అనుకున్నదే అయింది. ఆశించినది దక్కింది. ప్రతిష్ఠాత్మక అకాడెమీ అవార్డుల (ఆస్కార్‌) విశ్వ వేదికపై భారతీయ సినిమా వెలుగులీనింది. తెలుగు సినిమా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ తొలిసారిగా మన వెండితెరకు ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో కీర్తి కిరీటధారణ చేసింది. హాలీవుడ్‌లో సినీ శిఖరమని భావించే ఆస్కార్‌ను పూర్తి స్వదేశీ నిర్మాణంతో అందుకోవాలన్న భారతీయ సినిమా దీర్ఘకాల స్వప్నం నెరవేరింది.

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌గానూ మన దక్షిణ భారతీయురాలు అనాథ ఏనుగు సంరక్షణపై తమిళనాట తీసిన చిత్రమే (కార్తికీ గొంజాల్వెజ్‌ తొలియత్నం ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’) ఆస్కార్‌ సాధించింది. వెరసి కమర్షియల్‌ సినిమానే కాదు, కదిలించే డాక్యుమెంటరీతోనూ విదేశా లతో పోటీపడగలమని ఒకటికి రెండు ఆస్కార్‌ ప్రతిమల సాక్షిగా 95వ అకాడెమీ అవార్డుల ప్రకటన నిరూపించింది. ప్రధానంగా అమెరికన్ల వ్యవహారమైన ఆస్కార్‌ కోటలో మన సినిమా పాగావేసింది.

రెండు విభిన్న పార్శా్వలకు ప్రతీకగా, మూడు విభాగాల్లో ఆస్కార్‌ తుది జాబితాకు నామినేటై, అందులో ఏకంగా రెండింటిలో పురస్కార విజేతగా నిలవడం భారతీయ సినిమా కనివిని ఎరుగని విషయం. ఇది యావద్భారత సినీ ప్రపంచం రొమ్ము విరుచుకొనే సమయం. శతాధిక వసంత భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షర లిఖిత సందర్భం. స్వాతంత్య్రం సిద్ధించే నాటికి వివిధ భాషల్లో ఏటా 283 ఫీచర్‌ ఫిల్మ్స్‌ తీస్తున్న మన భారతీయ చిత్ర పరిశ్రమ ఇవాళ ఏటా 2 వేల సినిమాలకి ఎదిగింది.

మూకీల రోజుల్లోనే విదేశాలకు వెళ్ళిన మన సినిమాకు ఉత్తమ విదేశీ చిత్ర విభాగమంటూ 1956లో కొత్త కేటగిరీ పెట్టినప్పటి నుంచి గత 67 వత్సరాలుగా ఆస్కార్‌ అందని ద్రాక్షపండే. ఇన్నేళ్ళలో మన సినిమాలు మూడే తుది జాబితా దాకా వెళ్ళినా, ఒక్క ఓటుతో అవార్డు మిస్సయిన మదర్‌ ఇండియా (1957), ఆ తర్వాత మీరా నాయర్‌ ‘సలామ్‌ బాంబే’ (1988), ఆమిర్‌ఖాన్‌ ‘లగాన్‌’ (2001)– ఏవీ అవార్డు తేలేకపోయాయి. ఇప్పటికి వేరే కేటగిరీలోనైతేనేం ఆ కోరిక తీరింది.

ఆస్కార్‌ మనకు మరీ కొత్త కాదు. విదేశీయులు తీసిన చిత్రాల్లో మనం ఆస్కార్‌ అందుకోవడం అటెన్‌బరో ‘గాంధీ’ (1982) నుంచి ఉంది. ‘ప్యాసా’, ‘ఆమ్రపాలి’, ‘గైడ్‌’లకు పనిచేసిన కాస్ట్యూమ్‌ డిజైనర్‌ స్వర్గీయ భానూ అతయ్యా ‘గాంధీ’తో తొలి భారతీయ ఆస్కార్‌ విజేతయ్యారు. ఆ పైన గౌరవంగా ఇచ్చే జీవన సాఫల్య పురస్కారాన్ని దిగ్దర్శకుడు సత్యజిత్‌ రాయ్‌ (1991) అందుకున్నారు. ఇక, భారత్‌లోని పట్టణ ప్రాంత పేదరికంపై విదేశీయులు తీసిన ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ (2008) సంగీత దిగ్గజం రెహమాన్‌కు రెండు (బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్, ఒరిజినల్‌ స్కోర్‌) ఆస్కార్లు తెచ్చింది. పాటకు రెహమాన్‌తో కలసి గీత రచయిత గుల్జార్‌ గౌరవం పంచుకున్నారు. 

అదే చిత్రంలో బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌కు మరో ఇద్దరితో కలసి రసూల్‌ పూకుట్టి విజేతగా నిలిచారు. షార్ట్‌ ఫిల్మ్‌లకొస్తే – ఉత్తరప్రదేశ్‌ నేపథ్యంలో తీయగా 2018లో ఆస్కార్‌ గెలిచిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘పీరియడ్‌. ఎండ్‌ ఆఫ్‌ ఎ సెంటెన్స్‌’కు నిర్మాతల్లో ఒకరు భారతీయ వనిత గునీత్‌ మోంగా. అయితే, దర్శకురాలు విదేశీయురాలు. ఇలా ఇప్పటిదాకా అన్నీ విదేశీ భాగస్వామ్యంలో మనవాళ్ళు ఎగరేసిన జెండాలు. తొలిసారి పూర్తి స్వదేశీ దర్శక, నిర్మాణాలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఎలిఫెంట్‌’ రెండూ ఆస్కార్లు తేవడం మరువలేని ఘనత. 

బ్రిటీషు పాలనా కాలపు నేపథ్యంలో వేర్వేరు కాలఘట్టాలకు చెందిన పోరాటయోధుడు అల్లూరి, ఆదివాసీ ముద్దుబిడ్డ కొమురం భీమ్‌ కలిస్తే ఎలా ఉంటుందనే కాల్పనిక కథ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తెరపై సినిమాటిక్‌ భావోద్వేగాలకు పరాకాష్ఠ. అసలు చరితను సైతం ఆలోచింప జేయనివ్వని రాజమౌళీంద్రజాలం. కీరవాణి బాణీలో నృత్యప్రధాన గీతం ‘నాటు నాటు’ దేశదేశాల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. దానికి చంద్రబోస్‌ కూర్చిన తేటతెలుగు మాటలు, ప్రేమ్‌ రక్షిత్‌ సమకూర్చిన స్టెప్పులు, రెండు నెలల కఠోరసాధన– 20 రోజుల షూటింగ్‌తో జూనియర్‌ ఎన్టీఆర్‌ – రామ్‌చరణ్‌ల సమన్వయ నృత్య విన్యాసం – అన్నీ కలిసొచ్చాయి. 

ఆస్కార్‌ విజేతల్ని నిర్ణయించే 9 వేల పైచిలుకు సభ్యుల్నీ ఊపేశాయి. భారతదేశం తరఫున ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో అధికారిక ఎంట్రీగా గుజరాతీ ‘ఛెల్లో షో’ వెళ్ళినా, అది తుదిపోరు దాకా చేరుకోనే లేదు. ఆ మాట కొస్తే, గత 21 ఏళ్ళలో ఏ ఇతర భారతీయ ఎంట్రీ తుది 5 చిత్రాల జాబితాలో నిలవలేదు. ఈసారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అమెరికన్‌ డిస్ట్రిబ్యూ టర్‌ వేరియన్స్‌ ఫిల్మ్స్‌– రాజమౌళి బృందం పట్టుదలగా ‘ఫర్‌ యువర్‌ కన్సిడరేషన్‌’ క్యాంపెయిన్‌లో 14 కేటగిరీల్లో సినిమాను ప్రమోట్‌చేసింది. ప్రచారమూల్యం మాటెలా ఉన్నా, చివరకు ఒక కేటగిరీలో ఆస్కార్‌ కల నిజమైంది. తుది జాబితా నాటికే ‘నాటు నాటు’పై పెరిగిన అంచనాలు ఫలించాయి. 

పాపులర్‌ హాలీవుడ్‌ ఎంట్రీలను పక్కకు నెట్టి మరీ మన ‘నాటు నాటు’ ఈ ఘనత సాధించింది. ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్, క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డ్‌లూ వరించేసరికి తెలుగు పాటకు విశ్వకీర్తి దక్కింది. క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డ్‌ ఈ చారిత్రక ఫ్యాంటసీకి, న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ వారి బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డ్‌ రాజమౌళికీ దక్కాయి. ఇంతకన్నా గొప్ప పాటలు, సినిమాలొచ్చాయన్న కొందరి సన్నాయి నొక్కులు సినిమా జోరు, అవార్డుల హోరులో కలసిపోయాయి.

‘ఈ నక్కలవేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దలుకొడదాం పద’ అని ఈ చిత్రంలో ఓ హీరో డైలాగ్‌. అవును. రాజమౌళి బృందం ఇప్పుడుఅంతర్జాతీయ అవార్డుల కుంభస్థలాన్ని బద్దలుకొట్టింది. పక్కా ప్రణాళికతో అడుగేస్తే అసాధ్యమే లేదని మన ఫిల్మ్‌ మేకర్స్‌లో నమ్మకం కలిగించింది. వ్యాపారంలోనూ, వ్యవహారంలోనూ కొత్త తలు పులు తెరిచి, కొత్త ఎత్తులు చూపిన మన సినిమాకు స్వాగతం. అందుకు ఇది ఓ శుభారంభం.

మరిన్ని వార్తలు