మృత్యువు పడగనీడలో...

26 Feb, 2022 00:25 IST|Sakshi

రెండు రోజులుగా రష్యా ముప్పేట దాడితో అట్టుడుకుతున్న ఉక్రెయిన్‌నుంచి వస్తున్న సమాచారం భయోత్పాతం కలిగిస్తోంది. ఉన్నత చదువుల కోసం తమ పిల్లలను అక్కడికి పంపిన తల్లిదండ్రు లకూ, వారి బంధువులకూ ఆ పరిణామాలు కునుకు లేకుండా చేస్తున్నాయి. యుద్ధ సమయాల్లో మొదట మాయమయ్యేది మానవీయత. కొన్ని కిలోమీటర్ల ఆవలి నుంచీ లేదా ఆకాశం నుంచీ బాంబుల మోత మోగించేవారికి తమ చర్యల పర్యవసానంగా ఎన్ని ప్రాణాలు మట్టిలో కలుస్తా యన్న కనీస విచక్షణ ఉండదు. అందుకే ఈ పోరులో చిక్కుకున్న విద్యార్థులను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకురావడం ముఖ్యం. కాస్త జాప్యం చోటుచేసుకున్నా ఆ దిశగా చర్యలు ప్రారంభం కావడం సంతోషించదగ్గ అంశం. విద్యార్థులందరినీ క్షేమంగా చేర్చడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం హర్షించదగ్గది.

ఈ నెల 15న కేంద్రం ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటినుంచి అక్కడుంటున్న విద్యార్థుల్లో ఒక రకమైన భయానక వాతావరణం అలుముకుంది. వారి కుటుంబాలు సైతం ఇక్కడ కలవరపడుతూనే ఉన్నాయి. ఏడెనిమిది రోజుల ముందే చెప్పినా చాలామంది విద్యార్థులు కదల్లే దనీ, ఇందుకు కేంద్రాన్ని తప్పుపడతారేమిటనీ కొందరు వాదిస్తు్తన్నారు. విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలపై అవగాహన లోపమే ఈ వాదనలకు మూలం. ఉక్రెయిన్‌లోని కొన్ని విశ్వవిద్యాలయాలు దేశం వదిలివెళ్లడానికి విద్యార్థులను అనుమతించలేదు. అలా నిష్క్రమించదల్చుకున్నవారికి ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ అసాధ్యమని మెలికపెట్టాయి. ఒకపక్క కరోనా మహమ్మారి పేరుతో రోగులతో నేరుగా మాట్లాడే విధానాన్ని నిలిపేసిన విశ్వవిద్యాలయాలు విద్యార్థుల ఆన్‌లైన్‌ చదువులకు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చిందో అర్థం కాదు. యుద్ధం రానే రాదన్న భరోసాతో ఉన్న విద్యార్థులు లేకపోలేదు. కానీ అలాంటివారిని సైతం ఒప్పించడం అవసరమని సకాలంలో గుర్తించలేకపోవడం వైఫల్యమే. విద్యార్థులనుంచి వస్తున్న ఈమెయిల్స్‌ చూశాక మన రాయబార కార్యాలయం విశ్వవిద్యాలయాలతో మాట్లాడిన మాట వాస్తవం. కానీ అందువల్ల పెద్దగా ప్రయో జనం లేదని గుర్తించినప్పుడు వేరే మార్గాల్లో చర్యలు తీసుకోవాల్సింది. ముఖ్యంగా అక్కడి ప్రభుత్వం ద్వారా విశ్వవిద్యాలయాలకు తగిన సూచనలు వెళ్లేలా చూడాల్సింది. ఆ విషయంలో విఫలమైన పర్యవసానంగా దాడులకు అయిదారు రోజుల ముందునుంచీ విద్యార్థులు యుద్ధ భయంతోనే తరగతులకు హాజరు కావాల్సివచ్చింది. కొన్ని విశ్వవిద్యాలయాలు హాస్టళ్లలో ఉండేం దుకు అనుమతించాయి. అనేక వేలమంది అండర్‌ గ్రౌండ్‌ మెట్రో కేంద్రాల్లో, బంకర్లలో కాలక్షేపం చేస్తున్నారు. కానీ కర్ఫ్యూ పడగనీడలో... సైరన్ల మోతతో... చెవులు చిల్లులుపడే బాంబు పేలుళ్లతో నగరాలన్నీ అట్టుడుకుతున్నప్పుడు పిల్లలు ప్రశాంతంగా ఉండగలరా? చదువులపై శ్రద్ధ పెట్టగలరా?

సంక్షోభాలు తలెత్తినప్పుడు వికృతంగా కనబడే దుర్లక్షణం లాభాపేక్ష. బాధితుల దుస్థితిపైగానీ, వారి కోసం ఇక్కడ కొట్టుమిట్టాడే కుటుంబాల ఆరాటంపైగానీ కనీస సానుభూతి లేకుండా విమాన యాన సంస్థలు వ్యవహరిస్తున్నాయి. సాధారణ సమయాల్లో రూ. 30,000 మించని విమానం టిక్కెట్‌ ధర పాపం పెరిగినట్టు పెరుగుతూ పోవడాన్ని ఏమనాలి? కొంతవరకూ అదనపు రుసుము వసూలు చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ ధర కాస్తా లక్షదాకా ఎగబాకటం ఏం నీతి? ఈ విషయంలో సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే చాలామంది ఈపాటికే వెనక్కి వచ్చి ఉండేవారు. టికెట్‌ ధర పెరగటంతో వెనుకాడినవారు కొందరైతే, అంత వ్యయం భరించలేక ఉండిపోయినవారు మరికొందరు. ఉక్రెయిన్‌లాంటి చోట చదివేవారంతా సంపన్నవర్గాలవారని భావించటం పొర పాటు. మన ప్రైవేటు కళాశాలలు వసూలు చేసే మొత్తంలో మూడో వంతు మాత్రమే అక్కడి విశ్వవిద్యాలయాలు వసూలు చేస్తున్నాయి. ఎలాగైనా మెడిసిన్‌ చేసి వైద్యులుగా గుర్తింపు తెచ్చు కోవాలన్న తపనే మన విద్యార్థులను ఆ దేశానికీ, మరికొన్ని ఇతర దేశాలకూ చేరుస్తోంది. 

తాజాగా రష్యా–ఉక్రెయిన్‌లు చర్చలకు సుముఖంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. మంచిదే. అదే సమయంలో రష్యా కీలక వెబ్‌సైట్లపై అమెరికా సైబర్‌ దాడి చేసిందని అంటున్నారు. ఇలాంటి దుందుడుకు చర్యలు శాంతియుత వాతావరణం ఏర్పాటుకు దోహదపడవు. మన ప్రభుత్వాలు విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం సంతోషించదగ్గ పరి ణామం. ఈ సందర్భంలో మన విద్యావ్యవస్థను పీడిస్తున్న లోటు పాట్లను సరిచేయాల్సిన అవస రాన్ని గుర్తించాలి. ఏటా 8 లక్షలమంది ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. అందుకోసం 2,800 కోట్ల డాలర్లు (రూ. 2,10,000 కోట్లు) వ్యయం చేస్తున్నారు. ఇందులో 600 కోట్ల డాలర్లు (రూ. 45,000 కోట్లు) కేవలం ఫీజుల రూపంలో విదేశీ విశ్వవిద్యాలయాలకు సమర్పించుకుంటు న్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలవుతున్నా, ‘ఆత్మనిర్భర భారత్‌’ నినాదం వినబడి ఎనిమి దేళ్లవుతున్నా ఉన్నత విద్యారంగం ఇంకా మూలుగుతూనే ఉంది. ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల మాట అలావుంచి దేశ జనాభా నిష్పత్తికి తగినట్టు వైద్యులను రూపొందించేలా మన కళాశాలల సంఖ్య పెంచితే వేరే దేశాలపై మన విద్యార్థులు ఆధారపడే పరిస్థితి ఉండదు. వైద్య విద్య, చికిత్స మన దేశంలో ఇంత ఖరీదైన వ్యవహారంగా మారవు. పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అవు తుంది. వైద్యరంగం శక్తిమంతంగా రూపొందుతుంది. పాలకులు ఆలోచించాలి. 

మరిన్ని వార్తలు