‘అణు’ పల్లవి!

23 Sep, 2022 00:13 IST|Sakshi

కొన్ని మొదలుపెట్టడం సులభమే. ముగించడమే కష్టం. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇప్పుడు ఆ సంగతి బాగా తెలిసొచ్చినట్టుంది. సరిగ్గా 7 నెలల క్రితం ఫిబ్రవరి 24న లక్షన్నర పైగా సైనికులతో, వివిధ మార్గాల ద్వారా ఉక్రెయిన్‌పై ‘ప్రత్యేక సైనిక ఆపరేషన్‌’కు సిద్ధమైనప్పుడు ఆ దేశాన్ని లొంగ దీసుకోవడం ఆయన సులభమనుకున్నారు. తీరా అమెరికా, ఐరోపాల ఆర్థిక, సైనిక అండదండలతో ఉక్రెయిన్‌ ఎదురుదెబ్బకి దిగేసరికి పీటముడి పడింది.

పాశ్చాత్యలోకం నుంచి ముప్పు ఉందంటూ, 3 లక్షల మందితో పాక్షిక సైనిక సమీకరణకు సిద్ధమవుతున్నట్టు బుధవారం పుతిన్‌ చేసిన ప్రకటన మొదట అనుకున్న వ్యూహం విఫలమైందనడానికి స్పష్టమైన సంకేతం. జాతిని ఉద్దేశించి టీవీలో ప్రసంగిస్తూ, అణుదాడులకు సిద్ధమన్న ఆయన మాట ఇప్పుడు ప్రపంచ దేశాల్ని కలవరపెడుతోంది. ఇవి ఉత్తుత్తి మాటలు కావనడంతో ఆయన బెదిరింపు ధోరణి బాధ్యతారహితమనీ, ఐరాస నిబంధనావళికి విరుద్ధమనీ అమెరికా అధ్యక్షుడు ఖండించాల్సి వచ్చింది. వెరసి, అంతులేని కథగా సాగుతున్న ఉక్రెయిన్‌ అంశం మళ్ళీ ఒక్కసారిగా అందరిలో వేడి పెంచింది. 

అణ్వస్త్ర దేశాల్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాతో పాటు రష్యా ఒకటి. అణుయుద్ధం చేయరాదంటూ ఈ జనవరి 3న రష్యా సహా ఆ దేశాలన్నీ సమష్టి ప్రకటన చేశాయి. ఆ తర్వాతే ఉక్రె యిన్‌పై పుతిన్‌ ఆకస్మిక దాడి ఆరంభించారు. సమయానికి తగ్గట్టు మాటలు, చేష్టలు మార్చేయడం సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నాన్ని ఇప్పటికీ జీర్ణం చేసుకోలేకపోతున్న ఈ మాజీ రష్యన్‌ గూఢ చారికి మంచినీళ్ళ ప్రాయం.

ఉక్రెయిన్‌లో తాము పట్టు బిగించిన తూర్పు, దక్షిణ ప్రాంతాలపై దృష్టి నిలపడానికి ఆ మధ్య కీవ్, ఖార్కివ్‌ల నుంచి రష్యా సేనల్ని ఉపసంహరించుకున్నారు. తీరా ఈ నెల మొదట్లో ఉక్రెయిన్‌ మెరుపుదాడితో ఈశాన్యంలో దెబ్బతిని, సైన్యం తిరోగమించింది. ప్రతీకారంతో రగిలిపోతున్న పుతిన్‌ ‘అణు’పల్లవి అందుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలి సారి సైనిక సమీకరణకూ దిగారు. అదేమంటే సోవియట్‌లా రష్యా విచ్ఛిత్తికీ కుట్ర జరుగుతోందన్నారు. 

ఒక పక్క ఇలా సమరం చేస్తూనే, మరోపక్క ఉక్రెయిన్‌లో తమ స్వాధీనంలోకి వచ్చిన కీలక ప్రాంతాల్లో రష్యన్‌ సమాఖ్యలో చేరికపై ప్రజాభిప్రాయ సేకరణలు జరిపించాలని పుతిన్‌ ప్రయత్నం. ఆ కంటితుడుపు రిఫరెండమ్‌ల వెనుక ఉద్దేశం, వచ్చే ఫలితం ఇట్టే ఊహించవచ్చు. వాటిని అడ్డుపెట్టు కొని, ఉక్రెయిన్‌లో పట్టుబిగించిన ప్రాంతాలను కలిపేసుకొని ముందరికాళ్ళకు బంధం వేయాలని రష్యా వ్యూహం.

గురువారం ఐరాస భద్రతామండలి సైతం రిఫరెండం ప్రతిపాదనల్ని ఖండిస్తూ, కనుచూపు మేరలో యుద్ధానికి ముగింపు కనపడకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, యుద్ధభూమిలో ఎక్కడ, ఎవరిది, ఎంత పైచేయి అన్నది పక్కనపెడితే ఉక్రెయిన్‌కు సైతం భరించ లేని ఉక్కపోత ఉంది. అమెరికా, ఐరోపా దేశాల అండ చూసుకొని బరిలో నిలిచిన ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీకి సైతం ఇప్పుడు తగిలిన దెబ్బలతో తత్త్వం తలకెక్కుతోంది. బుధవారం ఐరాస సర్వప్రతినిధి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తమ దేశ శాంతిభద్రతల పరిరక్షణకు అంతర్జాతీయ సమాజం పంచసూత్రాలు పాటించాలని ఆయన అభ్యర్థించడం అందుకు తాజా ఉదాహరణ. 

ఉక్రెయిన్‌ బాధ... ప్రపంచపు బాధగా భావించాలనేదే ఇప్పటికీ జెలెన్‌స్కీ ధోరణి. చిత్రం ఏమిటంటే, ఆంక్షల వల్ల రష్యాపై పెద్దగా ప్రభావం పడకపోయినప్పటికీ, పాశ్చాత్య ప్రపంచం మాత్రం అదే మంత్రాన్ని నమ్ముకున్నట్టుంది. తాజాగా 8వ విడత ఆంక్షలను రష్యాపై విధించింది. నిజానికి, పలు పాశ్చాత్య ఆహార, వస్తూత్పత్తి బ్రాండ్లు తమ భూభాగాన్ని వీడినా, రష్యా సొంత బ్రాండ్లు సృష్టించుకుంటోంది. చైనా నుంచి సరకుల సరఫరా సాగుతుండడంతో ఆ విధమైన నొప్పి కూడా తెలియడం లేదు.

రష్యా నుంచి గ్యాస్‌ సరఫరాకు ఆంక్షలు పెట్టి, పాశ్చాత్య ప్రపంచమే ఇరు కున పడింది. ఐరోపా, అమెరికాలతో పోలిస్తే రష్యాలోనే ద్రవ్యోల్బణం తక్కువగా ఉంది. నిజానికి, రష్యా గడపలోకొచ్చి ‘నాటో’ రెచ్చగొట్టడం వల్లే పుతిన్‌ దూకుడు చూపారు. కానీ, అరకొర వ్యూహం, అతిగా బలాన్ని అంచనా వేసుకోవడంతో తంటా వచ్చింది. ‘నాటో’కు ముకుతాడు వేయాలన్న వ్యూహం ఫలించకపోగా, బలహీనపడుతున్న కూటమి ఫిన్లాండ్, స్వీడన్‌ లాంటి కొత్త చేరికలతో బలం పుంజుకుంది. లేని ప్రాసంగికతను సమకూర్చుకుంది. ఇది పుతిన్‌ వ్యూహాత్మక తప్పిదమే! 

పరిమిత యుద్ధంతో సైనిక లక్ష్యాలు సాధించాలని మొదలుపెట్టిన పుతిన్‌ వెనక్కి రాలేనంత దూరం వెళ్ళారు. ఈ ప్రక్రియలో తడబడి కిందపడ్డా, తనదే పైచేయిగా చూపాలని తాపత్రయపడు తున్నారు. నిన్నటి దాకా ‘నిస్సైనికీకరణ’ అన్న రష్యా ఇప్పుడు సమష్టి పాశ్చాత్య ప్రపంచంపై యుద్ధం అంటోంది. అతివాద జాతీయతతో పుతిన్‌ రేపిన ఈ యుద్ధం రష్యా యుద్ధమనే రంగు అద్దుకుంది. కానీ, ఇప్పటికే వేల సంఖ్యలో సైనికుల్ని కోల్పోయిన రష్యాలో తాజా సైనిక సమీకరణ యత్నంపై వందల మంది నిరసనకు దిగారు. మొదట నల్లేరుపై బండి నడక అనుకున్న ఉక్రెయిన్‌పై విజయం ఇప్పుడు పుతిన్‌కు ముగింపు తెలియని పీడకలగా మారింది.

ఈ పరిస్థితుల్లో ఈ గాయపడ్డ పులి ఎలాంటి దుందుడుకు చర్యలకు దిగుతుందో? ఐరాసను ఆడిస్తున్న పాశ్చాత్య ప్రపంచం సైతం భేషజాలతో అగ్నికి ఆజ్యం పోసే కన్నా, సామరస్య పరిష్కారానికి కృషి చేస్తే మేలు. ఇటీవల సమర్కండ్‌లో పుతిన్‌ను కలిసినప్పుడు భారత ప్రధాని చెప్పినట్టు ప్రపంచంలో ‘‘సమరానికి ఇది సమయం కాదు.’’ కరోనా అనంతర క్లిష్టపరిస్థితుల్లో కావాల్సింది శాంతి, సామరస్యం, సౌభాగ్యాలే! 

మరిన్ని వార్తలు