కరెన్సీకి కష్టకాలం

9 Mar, 2022 00:35 IST|Sakshi

ఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రకంపనలు ప్రపంచమంతటినీ తాకుతున్నాయి. అక్కడి సెగ ఇక్కడి మన స్టాక్‌ మార్కెట్లు, మదుపరులు, ఆర్థిక విధాన నిర్ణేతలు – ఇలా ప్రతి ఒక్కరికీ తగులుతోంది. రష్యా, ఉక్రెయిన్ల పోరు దీర్ఘకాలం సాగినకొద్దీ భారత ఆర్థిక వ్యవస్థపై భారం పెరగనుంది. ఇప్పటికే స్టాక్‌ మార్కెట్ల పతనం, ఎన్నడూ లేనట్టు డాలర్‌కు 77 రూపాయల స్థాయికి కరెన్సీ విలువ క్షీణించడం, పెరగనున్న చమురు ధరలు వెక్కిరిస్తున్నాయి. కోవిడ్‌ అనంతరం క్రమంగా కోలుకుంటోందని భావిస్తున్న దేశ ఆర్థిక రంగం రాగల రోజుల్లో ఇంకెంత ఒత్తిడికి గురవుతుందోనని ఆందోళన కలుగుతోంది. ద్రవ్యోల్బణం పెరుగుతుండడం మన ఆర్థిక విధాన నిర్ణేతలకు సవాలు కానుంది. 

నిజానికి, రష్యాతో మనం నేరుగా జరిపే వాణిజ్యం మరీ గణనీయమేమీ కాదు. మన ఎగుమతుల్లో 1 శాతమే రష్యాకు వెళతాయి. మొత్తం దిగుమతుల్లో 2.1 శాతమే అక్కడ నుంచి వస్తాయి. అయితే, ప్రపంచ సరకుల మార్కెట్లలో రష్యాది ప్రధాన పాత్ర. కాబట్టి, అక్కడి కుదుపులన్నీ మనపై ప్రభావం చూపక మానవు. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సహజవాయు ఎగుమతిదారు రష్యా. రెండో అతి పెద్ద చమురు ఎగుమతిదారూ ఆ దేశమే. ఆ దేశ జీడీపీలో అయిదోవంతు వీటి పుణ్యమే. ప్రపంచ చమురు దిగుమతుల్లో 12 శాతం రష్యా నుంచే వస్తాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైనప్పటి నుంచి ముడి చమురు ఫ్యూచర్లు 26 శాతం పైగా పెరిగాయి. గత డిసెంబర్‌లో బ్యారల్‌ 70 డాలర్లున్న అంతర్జాతీయ ముడి చమురు ధర ఇప్పుడు దాదాపు రెట్టింపు అయింది. కొద్దివారాల్లో 150 – 200 డాలర్లు చేరుతుందని ఓ అంచనా. పధ్నాలుగేళ్ళలో ఎన్నడూ లేనట్టు ఇలా చమురు ధర పెరిగిపోవడం ఆందోళనకరం. చమురు అవసరాల్లో 85 శాతానికి దిగుమతులపైనే ఆధారపడ్డ దేశం మనది. ఇప్పుడిక ముడిచమురు దిగుమతి ఖర్చు భారీగా పెరుగుతుంది. 

ప్రపంచమంతటికీ ఈ కష్టం తప్పదు. చమురు కోసం రష్యాపై ఆధారపడ్డ పాశ్చాత్య దేశాలు తటపటాయిస్తున్నాయంటే అదీ ఓ కారణం. సహజ వాయువు విషయంలో జర్మనీ అధికంగా రష్యా పైనే ఆధారపడ్డది. యూరప్‌ చమురు సరఫరాల్లో 40 శాతం రష్యావే. అందుకే, రకరకాల ఆర్థిక ఆంక్షల మాట వినబడుతున్నా, ఆ దేశ చమురు దిగుమతులపై మాత్రం నిషేధం విధించలేమంటూ జర్మనీ, నెదర్‌ల్యాండ్‌లు తేల్చేశాయి. కానీ, చమురు అవసరాల్లో 8 శాతానికే రష్యాపై ఆధారపడ్డ అమెరికా మాత్రం పెద్దగా పోయేదేమీ లేదు. అందుకే, ఆ దిగుమతులపైనా తాజాగా ఆంక్షల పల్లవి అందుకుంది. వెరసి, చమురుపై భిన్నాభిప్రాయాలతో పాశ్చాత్య ప్రపంచం చీలిపోయిందనిస్తోంది. 

ఆంక్షల మాటెలా ఉన్నా, అంతర్జాతీయ ముడి చమురు ధరలతో అనివార్యంగా షిప్‌ ఫ్యూయల్‌ ధర పెరగనుంది. నౌకా రవాణా వ్యయంలో సింహభాగం – చమురుకు అయ్యే ఖర్చే. పెరిగే ఆ ఖర్చు ప్రభావం సరకుల రవాణా మీద పడుతుంది. అంటే, సరకుల రేట్లకు రెక్కలొస్తాయి. ఆహార ధరలు పెరుగుతాయి. అలాగే, అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ పెట్రోల్‌ రేట్లు పెంచకుండా ఉగ్గబట్టుకొని కూర్చున్న కేంద్రం ఇక ఏ క్షణంలోనైనా పెట్రోల్‌ రేటు పెంపునూ ప్రకటించక మానదు. పరిస్థితులు ఇలానే ఉంటే, ఇప్పటికే లీటర్‌ వంద దాటేసిన పెట్రోల్‌ ధర రాగల కొద్ది నెలల్లో అంతకు రెండింతలైనా ఆశ్చర్యం లేదని ఓ లెక్క. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా పడిపోతోంది. వెరసి, యుద్ధ క్షేత్రానికి సుదూరాన ఉన్న సామాన్యులూ గాయాల పాలవుతున్నారు. 

ముyì  చమురుకు తోడు వంటనూనెలున్నాయి. ప్రపంచంలో వాణిజ్యమయ్యే సన్‌ఫ్లవర్‌ నూనెలో అయిదింట నాలుగొంతులు రష్యా, ఉక్రెయిన్‌ల ఉత్పత్తే. మన సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతుల్లో 90 శాతం ఆ రెండు దేశాల నుంచే వస్తాయి. ఉక్రెయిన్‌ నుంచి సరఫరా నిలిచిపోతుందనే భయాలతో పామాయిల్, ఆవనూనెల ధరలు ఇప్పటికే పైకి చూస్తున్నాయి. గోదుమలు, మొక్కజొన్న, బార్లీ ప్రపంచ ఎగుమతుల్లోనూ రష్యా, ఉక్రెయిన్లది గణనీయమైన పాత్ర. వాటి రేట్లూ పెరుగుతున్నాయి. మన ఎరువుల దిగుమతుల్లో దాదాపు 17 శాతం పొటాష్, 60 శాతం ఎన్పీకే ఎరువులు రష్యావే. అదీ ఇబ్బందే. అల్యూమినియం, నికెల్, స్టీలు లాంటి లోహాల ప్రపంచ ధరలు పెరుగుతున్నాయి గనక, మన దగ్గరా అదే జరుగుతుంది. ప్రాథమిక వసతి సౌకర్యాల ప్రాజెక్టుల్లో 30 శాతం సామాన్లు రష్యా నుంచే వస్తాయట. అంటే, నిర్మాణ ఖర్చులూ ఎక్కువవుతాయి. ఇదీ ఇక్కడ మనం చేయాల్సిన యుద్ధం.  

ఈ యుద్ధానికి ముందు ఫిబ్రవరిలో ఆర్థిక పునరుత్తేజం కోసం భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) వేసుకున్న లెక్కలు తలకిందులయ్యాయి. క్షీణిస్తున్న రూపాయి విలువతో ఈ ఏడాది ఆసియాలోకెల్లా బాగా దెబ్బతిన్న కరెన్సీ ఇప్పుడు మనదేనట. ఇక, స్టాక్‌మార్కెట్‌ కష్టాలు సరేసరి. ఒక్క సోమవారమే బొంబాయి స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ సూచి ఏకంగా 1,491 పాయింట్లు, అంటే 2.74 శాతం పడిపోయింది. అలా భారత్‌ ఇప్పుడు ఆర్థిక, వాణిజ్య లోటులు రెంటినీ సంబాళించు కోవాల్సిన పరిస్థితి. జాతీయ, అంతర్జాతీయ ధరలు పెరుగుతుండడంతో దేశంలో ద్రవ్యోల్బణంపై తన వైఖరిని భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) పునఃసమీక్షించుకోవాలి. ధరలు ఇలానే పెరుగుతూ పోతే, వృద్ధిపై గట్టి దెబ్బ పడుతుంది. ఆర్బీఐ తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. రూపాయి విలువ మరింత పడిపోకుండా కాపు కాయకపోతే కష్టమే. వృద్ధి స్తంభించి, ద్రవ్యోల్బణం పెరిగిపోయే విచిత్రమైన ‘స్టాగ్‌ఫ్లేషన్‌’ భయాలు చుట్టుముడుతున్న వేళ సత్వర కార్యాచరణే సాధనం. 

మరిన్ని వార్తలు