పరిగణించదగ్గ ‘పశ్చాత్తాపం’

27 Jan, 2023 04:30 IST|Sakshi

గతానికీ, వర్తమానానికీ జరిగే అనంతమైన సంభాషణే చరిత్ర అంటాడు చరిత్రకారుడు ఇ.హెచ్‌ కార్‌. చరిత్రలో జరిగిన తప్పిదాలను మార్చలేం. ఆనాటి ఘటనలకు కొత్త రంగు పులమలేం. కానీ తప్పిదాలకు కారకులైన వ్యక్తులైనా, దేశాలైనా, సంస్థలైనా పశ్చాత్తాపపడి క్షమాపణ కోరటం నాగరిక లక్షణం. అమెరికాకు చెందిన జన్యు శాస్త్రవేత్తల బృందం రెండురోజుల క్రితం ఈ పనే చేసింది. తమ వల్లా, తమ మౌనం వల్లా చరిత్రలో జరిగిపోయిన ఘోర తప్పిదాలకు పశ్చాత్తాపపడింది. క్షమాపణ చెప్పింది. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ హ్యూమన్‌ జెనెటిక్స్‌(ఏఎస్‌హెచ్‌జీ) జన్యు శాస్త్రవేత్తలకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ. 8,000 మంది సభ్యులుండే ఈ సంస్థ విడుదల చేసిన 27 పేజీల నివేదిక చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. సంస్థ నియమించిన నిపుణుల కమిటీ ఈ నివేదికను రూపొందించింది. పాత రికార్డులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వివిధ సందర్భాల్లో సభ్యులు చేసిన ప్రకటనలనూ, కళ్ల ముందు ఘోరాలు జరుగుతున్నా తమ శాస్త్రవేత్తలు ఉదాసీనంగా ఉండిపోయిన వైనాన్నీ ఈ నివేదిక బయటపెట్టింది. 

జంతువుల్లోనూ, ధాన్యాల్లోనూ మేలు జాతి రకాలున్నట్టే మనుషుల్లో కూడా వేర్వేరు తరగతుల వారుంటారని, జన్యుపరమైన ఎంపికల ద్వారా ‘అధమ’ రకం వారిని ‘నిరోధిస్తే’ ‘శ్రేష్ఠ మానవజాతి’ రూపొందుతుందని కొందరు ప్రబుద్ధులు 19వ శతాబ్దంలో ప్రతిపాదించారు. ప్రకృతిలో జరిగే పరిణామక్రమానికి ‘సహజ ఎంపిక’ అనే పద్ధతి ఉంటుందని, అన్ని రకాల పరిస్థితులనూ తట్టుకుని నిలబడగలిగే శక్తిమంతమైన జీవులు మాత్రమే మనుగడలో ఉంటాయని డార్విన్‌ చేసిన ప్రతిపాదన అలాంటివారికి ఆయుధమైంది. దీన్నుంచే శ్రేష్ఠ మానవాభివృద్ధి శాస్త్రం(యుజెనిక్స్‌) పుట్టుకొచ్చింది. బ్రిటన్‌లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరున్న ఫ్రాన్సిస్‌ గాల్టన్‌ 1883లో ఈ యుజెనిక్స్‌కు ఊపిరిపోశాడు. యూరోపియన్లలో ఆనాడు ప్రబలంగా ఉన్న ఆధిపత్య భావజాలంలో నుంచి, సాంస్కృతిక భయాందోళనల నుంచి ఈ సిద్ధాంతం పుట్టి ఆ రెండింటినీ మరిన్ని రెట్లు పెంచింది. వేరే జాతుల సంపర్కం తమ జాతి ఉన్నతిని దెబ్బతీస్తుందని శ్వేతజాతీయులు వణికిపోయారు. జన్యు శాస్త్రంలో వెల్లడవుతున్న అంశాల్లో తమకు అనుకూలమైనవి మాత్రమే వెల్లడిస్తూ, ప్రతికూల అంశాలను బయటకు రానీయకపోవడం ద్వారా శాస్త్రవేత్తలు సైతం దీనికి దోహదపడ్డారు. 

అమెరికాలో నల్లజాతీయులను అధములుగా చిత్రించి, వారిని బానిసలుగా వినియోగించుకోవటానికీ, వారిపై దుర్మార్గాలను కొనసాగించటానికీ యుజెనిక్స్‌ దోహదపడింది. నాజీ జర్మనీలో దీన్ని అడ్డం పెట్టుకుని యూదులపై సాగించిన దౌష్ట్యం అంతా ఇంతా కాదు. అక్కడ వేలాదిమందికి సంతాన నిరోధ శస్త్రచికిత్సలు చేయించటం, లక్షలమంది ప్రాణాలు బలిగొనడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. నిజానికి అంతకు చాలా ముందు నుంచే అమెరికాలోనూ ఈ మాదిరి ఉన్మాదమే ఉంది. వివిధ రాష్ట్రాల్లో వేలాదిమంది శ్వేతేతర జాతివారికి, మానసిక రోగులకూ, నేరస్థులకూ ‘చట్టబద్ధం’గా బలవంతపు శస్త్రచికిత్సలు చేశారు. 1926లో ఆవిర్భవించిన ఏఎస్‌హెచ్‌జీ దీన్నంతటినీ సరిదిద్ది జన్యుశాస్త్రానికి విశ్వసనీయత కలిగించాల్సివుండగా అది  గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. కొన్నిసార్లు కళ్లముందు జరిగే దుర్మార్గాలను ప్రోత్సహించేలా మాట్లాడింది. జన్యు శాస్త్రంతో సంబంధంలేని సైకాలజిస్టు ఆర్థర్‌ జెన్సన్, భౌతిక శాస్త్రవేత్త విలియం షాక్‌లీ వంటివారు నల్లజాతీయులు తమ జన్యువుల వల్ల మే«ధాపరంగా అధములని చెప్పినా సంస్థ నోరెత్తలేదు. పరిశోధనల పేరుతో అనైతిక నిర్ధారణలు చేస్తున్నా మౌనంగా ఉండిపోయింది. తమ నిర్వాకం, నిర్వా్యపకత్వం పెను తప్పిదమని ఏఎస్‌హెచ్‌జీ ఇప్పుడు అంగీకరించటం విశేషం. అంతేకాదు...శ్రేష్ఠ జాతి సిద్ధాంతం చాటున సంతాన నిరోధ శస్త్ర చికిత్సలు దండిగా ప్రోత్సహించిన విలియం అలన్‌ పేరిట ఉన్న అత్యున్నత పురస్కారం పేరును మార్చబోతున్నట్టు ప్రకటించింది. జన్యు శాస్త్రంలో విశేష కృషి చేసినవారికి ఏటా ఈ పురస్కారం ఇస్తున్నారు.

రెండు దశాబ్దాలనాడు మానవ జన్యు ప్రాజెక్టు ప్రపంచ జనాభాలో 99.9 శాతం మంది ఒకే రకమైన జన్యు పదార్థం కలిగివున్నారని తేల్చిచెప్పింది. అయినప్పటికీ జాతిపరమైన ఆధిపత్య భావజాలం ప్రపంచంలో ఇప్పటికీ ప్రబలంగానే ఉంది. మన దేశంలో కుల మతాల్లో అది వ్యక్తమవుతుండగా అమెరికా, యూరప్‌లలో రంగు ప్రాధాన్యం పొందుతోంది. ‘మా బ్రీడ్‌ వేరు...మా బ్లడ్‌ వేరు’ అంటూ విర్రవిగేవారికీ, మా మతం అత్యున్నతమైనదని భుజాలు చరుచుకునేవారికీ మన దగ్గర కొదవలేదు. తమది అగ్రవర్ణమని, ఇతరులు అధములనుకునే అజ్ఞానులు ఈనాటికీ దండిగా తారసపడుతుంటారు. ఆ సంగతలా ఉంచి శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించాల్సిన ఏఎస్‌హెచ్‌జీ వంటివి ఎందుకు విఫలమయ్యాయి? సంస్థాగత నిర్మాణాల్లో వైవిధ్యానికి చోటీయకపోవటమే ఈ దుర్గతికి కారణం. ఉదాహరణకు ఏఎస్‌హెచ్‌జీ డైరెక్టర్ల బోర్డులో మైనారిటీ జాతులవారు 2017 నాటికి కేవలం 5 శాతం మంది మాత్రమే. అనంతరకాలంలో ఆత్మవిమర్శ చేసుకున్నాక 2021నాటికి అది 40 శాతానికి పెరిగింది. ఆ తర్వాతే మైనారిటీ జాతుల శాస్త్రవేత్తలకు శిక్షణ కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించటం మొదలైంది. మన దేశంలో ఉన్నతాధికారగణంలో, మీడియాలో ఇప్పటికీ ఆధిపత్య కులాలకే ప్రాధాన్యం ఉంటున్నదని ఇటీవల ఒక సర్వేలో వెల్లడైంది. ఇలాంటివి సరిదిద్దనంతకాలం వికృత పోకడలు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే ఏఎస్‌హెచ్‌జీ పశ్చాత్తాప ప్రకటన అన్ని దేశాల్లోనివారికీ కనువిప్పు కావాలి. 

మరిన్ని వార్తలు