క్రాంతి – సంక్రాంతి

15 Jan, 2023 00:57 IST|Sakshi

జనతంత్రం

‘అగ్రికల్చర్‌ ఈజ్‌ అవర్‌ కల్చర్‌’ అని గర్వంగా చెప్పు కునే జాతి మనది. వ్యవసాయం మన జీవన విధానం అనే నానుడి కూడా ఉన్నది. వ్యవసాయేతర  వృత్తులు కూడా ఒకనాడు వ్యవసాయానికి అనుబంధంగానో, దాని చుట్టూనో అల్లుకున్నవే కావడం ఈ నానుడికి కారణం. కనుకనే మన జీవన గమనంలో ఇప్పటికీ అడుగడుగునా వ్యవసాయ సంస్కృతి తొంగి చూస్తున్నది. పలకరిస్తున్నది. ఆటలో, పాటలో, పలకరింపులో, వేడుకలో, వంటలో, విందులో, పండుగలో... ఇలా ప్రతి ఉత్సాహంలో, ఉద్వేగంలో, ఉత్తేజంలో వెన్నంటే నడుస్తున్న మన మేనిఛాయ వ్యవసాయం.

వ్యవసాయ జీవితపు శిరస్సుపై ప్రకృతీ, పర్యా వరణాలు అందంగా అలంకరించిన శిరోభూషణం – పట్టుకుచ్చుల పంచరంగుల తలపాగా సంక్రాంతి పండుగ. ఈ పండుగ హరిదాసులు పాడే ఒక పాట. గాలిపటాలు, కోడి పుంజుల ఆట. రంగవల్లుల రంగుల చిత్రం. గొబ్బెమ్మల ఆరోగ్య తంత్రం. తృప్తిపడిన జీవి తపు నర్తనోత్సవం. ఒక్క మానవ జీవితపు ఉల్లాసమే కాదు... సమస్త ప్రకృతి పర్యావరణ శక్తుల సమష్టి సెలబ్రేషన్‌ సంక్రాంతి.

దేశంలోని ప్రధాన వ్యవసాయాధార రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. ఇప్పటికీ ఎక్కువమంది ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయరంగంపై ఆధారపడుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమైనది. వ్యవసాయ అనుబంధ రంగాలు రాష్ట్ర సంపదకు చేర్చుతున్న వాటా కూడా దేశ సగటుతో పోలిస్తే ఎక్కువే. మకర సంక్రాంతి పండుగ వైభవం కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ. ఇక్కడే ఇప్పుడు సంక్రాంతి శోభతో ముడిపడిన ఒక రాజకీయ యుద్ధమేఘం ఆవహించి ఉన్నది. సంక్రాంతి స్ఫూర్తిని రగిలించే రాజకీయం ఒకవైపు, దహించే రాజకీయం ఒకవైపు మోహ రించి ఉన్నాయి.

ప్రజా జీవితాల్లోకి పాలనా కాంతుల సంక్రమణం చేయించిన సంక్రాంతి రాజనీతి ఒకవైపు – ఆ క్రాంతిని కబళించాలని చూస్తున్న రాహు, కేతు పన్నాగం మరో వైపూ నిలబడి తలపడేందుకు సిద్ధపడుతున్నాయి. ముక్కారు పంటలతో అలరారిన ముప్ఫై మూడువేల ఎకరాల హరితావరణాన్ని బీడుగా మార్చి, ప్రకృతి గుండెల్లో కాంక్రీట్‌ గునపం గుచ్చాలని చూస్తున్న రాజకీయ పెత్తందార్లు ఒకపక్కన నిలబడ్డారు. ప్రతి పల్లెకూ పట్టాభిషేకం చేసి రాజధానిగా గౌరవించి, పంట చేనుకూ, రైతుబిడ్డకూ రాచ మర్యాదను కల్పించిన ప్రజానాయకుడు మరోపక్కన నిలబడ్డాడు. తల్లీ సంక్రాంతీ, పుష్యలక్ష్మీ నీవే తీర్పు చెప్పాలి!

జంధ్యాల పాపయ్యశాస్త్రి రచించిన అజరామర కావ్యం ‘పుష్పవిలాపం’ గుర్తుకొస్తున్నది. ‘‘నేనొక పూలమొక్క కడ నిల్చి, చివాలున కొమ్మ వంచి గోరా నెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్లు విప్పి ‘మా ప్రాణము తీతువా’ యనుచు బావురుమన్నవి,కృంగిపోతి’’ అంటాడు. బావురుమనడమే కాదు, చివర్లో ఆ పూమొగ్గలన్నీ మనుషుల్ని శపించాయని కూడా అంటాడు. 

‘ఓయీ మానవుడా... బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి? అందమును హత్యచేసెడి హంతకుండ! మైలపడిపోయె నోయి నీ మనుజ జన్మ’ అన్నాయట! పాపయ్యశాస్త్రి సొంత జిల్లా  గుంటూరులోనే ముప్ఫై మూడు వేల ఎకరాలను బీడు చేసినప్పుడు ఎన్ని లక్షల పూబాలలు ఎన్ని రకాల శాపనార్థాలు పెట్టి ఉంటాయో!

మన పెత్తందార్ల ముఠామేస్త్రీ చంద్రబాబును ఇప్పుడు కొందరు ‘బోల్సోనారో ఆఫ్‌ ఆంధ్రా’ అని పిలుస్తున్నారు. నిజానికి అలా పిలవడం తప్పు. బోల్సోనారోనే ‘చంద్రబాబు ఆఫ్‌ బ్రెజిల్‌’గా పిలవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉండే పెత్తందార్లందరూ అభివృద్ధి పేరుతో ముద్దుగా పిలుచుకునే దోపిడీ మోడల్‌ను అనుసరించడంలో బోల్సోనారో కంటే చంద్రబాబు ఇరవయ్యేళ్లు సీనియర్‌. ఈ మధ్యకాలంలో అపు రూపమైన అమెజాన్‌ అడవులను వందల కిలోమీటర్ల పర్యంతం నరికివేసి, ప్రాణవాయువును సైతం లూటీ చేయడానికి తెగబడిన ఘనుడు బోల్సోనారో. ఎన్నికల్లో ఓడిపోయినా ఒప్పుకోకుండా కబ్జాకోరుతనంతో కాలు దువ్వి ‘ట్రంపరి’తనాన్ని ప్రదర్శించడాన్ని కూడా ప్రపంచం గమనించింది.

అటువంటి బోల్సోనారోలకు గురుపాదులు మన బాబు. వీరి అభివృద్ధి మోడల్‌ సిద్ధాంతం ప్రకారం డబ్బే పెట్టుబడి. అధికారం దానికి అండ. ఈ రెండూ ఉన్న వారు సమస్త సహజ వనరుల్నీ, మానవ శ్రమనూ యథేచ్ఛగా దోపిడీ చేయవచ్చు. నదుల్ని కలుషితం చేయవచ్చు. కొండల్ని పిండి చేయవచ్చు. అడవుల్ని నరికేయవచ్చు. కాంక్రీట్‌ అరణ్యాలను నిర్మించవచ్చు. మానవ శ్రమను, మేధను కారుచౌకగా కొనేయవచ్చు. ఫలితంగా ఇబ్బడి ముబ్బడిగా సంపద సృష్టి సాధ్యమవుతుంది. ఈరకంగా అభివృద్ధి సాధిద్దామంటారు మన బాబులు, ప్రపంచవ్యాప్తంగా ఉండే వారి బాబులు కూడా!

ఇది అమానవీయమైన అభివృద్ధి అనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా చాలా నమూనాలు ముందుకొస్తున్నాయి. సుస్థిర అభివృద్ధి నమూనా ఒకటి. మానవ వికాసానికి అవసరమైన మేరకు సహజ వనరుల్ని హేతుబద్ధంగా వాడుకొని వాటిని భవిష్యత్‌ తరాల అవసరాలకోసం కూడా మిగిల్చే పద్ధతులను ఈ నమూనా అనుసరిస్తుంది. మానవ శ్రమను, మేధను వనరులుగా కాక పెట్టుబడి గానే గుర్తించాలన్న ఆలోచనలు కూడా ముందుకు వస్తున్నాయి. వీటి సారాంశం ఒక్కటే – ఈ ప్రపంచం అందరిదీ, సమస్త జీవరాశిది. ఈ తరాలకే కాదు భవిష్యత్తు తరాలకు కూడా చెందినది. మానవ జాతి సమష్టిగా సృష్టించుకునే సంపద కూడా అందరికీ చెందినది. సంపద సృష్టి – పంపిణీ హేతుబద్ధంగా ఉండాలి. ఇది ప్రజాహితమైన, పర్యావరణ హితమైన అభివృద్ధి మోడల్‌.

ఈ రెండో రకమైన అభివృద్ధిలోనే నిజమైన జనక్రాంతి ఇమిడి ఉన్నది. అసలైన సంక్రాంతి దాగి ఉన్నది. ఈ సంక్రాంతికి సంకెళ్లు వేయాలంటుంది బోల్సోనారో – బాబు అభివృద్ధి మోడల్‌. ఈ సంక్రాంతులు జనజీవితమంతా పరుచుకోవాలంటుంది ప్రత్యా మ్నాయ అభివృద్ధి మోడల్‌. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి మోడల్‌కు చంద్రబాబు, రెండో మోడల్‌కు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం వహిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. వారిద్దరి విధాన నిర్ణయాల బేరీజుతోనే ఈ అంచనాకు రావచ్చు.

వేల ఎకరాల్లో విస్తరించిన పచ్చందనాలకు ఉరి బిగించే చంద్రబాబు అభివృద్ధి నమూనాను వైఎస్‌ జగన్‌ తిరస్కరించారు. రాజధాని వికేంద్రీకరణకు నడుం కట్టారు. జనసాధికారతలో వికేంద్రీకరణ అనేది తొలి అడుగు. ఆ వికేంద్రీకరణను మరింత విప్లవాత్మకం చేసి పదిహేను వేల మినీ రాజధానులను ఆయన సృష్టించారు. పేద ప్రజల పురోగతికి అత్యవసరమైన నాణ్య మైన విద్య, వైద్యాలను ధనికులతో సమానంగా ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. వ్యవసాయ రంగానికి అవసరమైన ఉపకరణాలు ఇంటి ముంగిటకొచ్చాయి. నడివయసు మహిళలు కూడా ప్రభుత్వ ‘చేయూత’తో చిన్నచిన్న వ్యాపారాలు చేయగలుగుతున్నారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు పెద్దపెద్ద అడుగులు వేస్తు న్నాయి. ఈ పరిణామాల ప్రభావం సంక్రాంతి పండుగపై కూడా పడింది.

పల్లెపల్లెనా సంక్రాంతి శోభ పరుచుకున్నది. పండుగ షాపింగ్‌లతో పట్టణాలు కళకళలాడుతున్నాయి. బట్టలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, వాహనాల కొనుగోళ్లు కొత్త రికార్డులు నెలకొల్పాయి. పండుగలకు పల్లె టూళ్లకొచ్చే జనం కూడా పాత రికార్డులను బద్దలు కొట్టారు. మూడేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురవడం, ఒక్కటంటే ఒక్కటైనా కరువు మండలం లేకపోవడం పల్లెటూళ్లలో పండుగ కాంతిని ద్విగుణీకృతం చేసింది. ధాన్యానికి గిట్టుబాటు ధర దొరకలేదన్న మాట వినిపించడం లేదు. అమూల్‌ డెయిరీ ప్రవేశంతో రాష్ట్రంలో మళ్లీ సహకార పాడి వ్యవస్థ జవజీవాలు పుంజుకున్నది.

పొలం నుంచి రైతునూ, సముద్రం నుంచి మత్స్య కారుణ్ణి, అడవి నుంచి గిరిజన బిడ్డను వేరుచేయని సుస్థిర అభివృద్ధి మార్గాలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్నది. పరిశ్రమల పేరిట కార్పొరేట్‌ పెద్దలకు కట్టబెట్టడానికి ఎక్కడా చారెడు పొలం లాక్కోలేదు. పైగా రైతు భరోసాతోపాటు ఆర్బీకేల ద్వారా బతుకు భరోసాను కూడా రైతులకు కల్పిస్తున్నది. గనుల తవ్వకం పేరిట గిరిజనుల్ని తరిమేయలేదు. గిరిజన రైతులకు అన్నివిధాల అండగా నిలబడి వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తున్నది. గత్యంతరం లేక గంజాయి ఉచ్చులో చిక్కుకున్న వారిలో పరివర్తన తీసుకు వస్తున్నది. మత్స్యకారులు దూర దేశాలకు వలస పోకుండా అనేక చర్యలు తీసుకున్నది. ఆధునిక మైన ఫిషింగ్‌ హార్బర్లను నిర్మిస్తున్నది. ఈ పరిణా మాలన్నీ నేటి సంక్రాంతి పండుగ కాంతులీనేందుకు కారణమవు తున్నాయి. కొత్త కాంతితో, కొత్త క్రాంతితో సంక్రాంతి మెరుస్తున్నది.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు