భయం పోయి భరోసా రావాలి!

22 Jun, 2021 00:51 IST|Sakshi

రుతుపవనాలు ఈసారీ సకాలంలోనే పలుకరించి వెళ్లాయి. మళ్లీ వర్షాలు లేక తెలుగునాట రైతాంగం దిగాలుగా ఉంది. ఆందోళన చెందాల్సిన పని లేదు, వర్షాలున్నాయని వాతావరణ విభాగం చెబు తోంది. ప్రస్తుతం గాలులు బలహీనంగా ఉండి వర్షాలు కాస్త ఆలస్యమవుతున్నాయే తప్ప. రైతులు నిశ్చింతగా సాగుకు సన్నద్ధం కావొచ్చని భరోసా ఇస్తున్నారు. అయిదారు రోజుల్లోపే గాలులు బలపడి వర్షాలు కురియవచ్చంటున్నారు. వ్యవసాయ శాఖా నింగి చూపులతో, వాన కోసం నిరీక్షి స్తోంది. ఈ క్రమంలో రైతాంగం గ్రహించాల్సింది ఒకటే! రుతుపవన గమనంపైన, కారణమయ్యే గాలులపైన ‘వాతావరణ మార్పులు’ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మనిషి విపరీత చేష్టల వల్ల పుట్టే పలు కాలుష్యాలు, కర్బన ఉద్గారాలు, భూతాపోన్నతి వంటివి ఈ మార్పులకు కారణం! ఫలితంగా వర్షాల రాకలో అనిశ్చితి నెలకొంటోంది. గడచిన అయిదారు సంవత్సరాల అనుభవాల్ని పరిశీలించినా... వర్షరుతువే కాస్త వెనక్కి జరిగిన భావన కలుగుతోంది. జూన్‌ రెండో భాగం, జూలై మాసాల్లో రావాల్సిన వర్షాలు జూలై రెండో భాగం, ఆగస్టు... ఒకోసారి సెప్టెంబరు నెలల్లో భారీగా కురుస్తున్నాయి. ఇటీవల ఏడాది పొడుగునా అడపా దడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. తేమ శాతం పెరిగి వర్షాలకు డోకా ఉండటం లేదు, ఎటొచ్చీ వానలు కురిసే సమయమే సరిగా లేక రైతు గందరగోళానికి గురవుతున్నాడు. ఇదంతా వాతావరణ మార్పు ప్రభావమే! రైతాంగం ఈ వాస్తవాన్ని గ్రహించి పంటల ఎంపిక, విత్తే సమయం, భరోసా ఇచ్చే గట్టి వర్షాల వరకు వేచిచూడటం, అంతర పంటలు తదదితరాల్లో వ్యూహాలు–ఎత్తుగడలను మార్చుకోవాల్సి ఉంది. వ్యవసాయ శాఖ అప్రమ త్తమై రైతులతో నిరంతర సంపర్కం జరపాలి. గరిష్ట ప్రయోజనం కలిగేలా సూచనలు, సలహాలి వ్వాలి. కానీ, వాస్తవంలో అలా జరగటం లేదు. అందుకే రైతులిప్పుడు ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా తొలకరి వానల మురిపెంతో పంట విత్తిన వారు విత్తనం, తమ శ్రమ... రెంటినీ నష్ట పోవాల్సి వస్తోంది. మరో నాలుగయిదు రోజులు వర్షాలు రాకుంటే... ఎండవేడికి విత్తనం మట్టిలో మాడిపోతుంది. మళ్లీ విత్తుకోవాల్సి వస్తుంది. ఇదంతా నష్టమే! తెలంగాణలో ఇప్పటిరవకు 2.20 లక్షల ఎకరాల్లో విత్తనం వేస్తే, అందులో 1.79 లక్షల ఎకరాలు వాణిజ్య పంటైన పత్తి వేశారు.

వాతావరణ మార్పుల్లో భాగమైన ‘లానినో’, నైరుతి రుతుపవనాలతో స్థూలంగా మనకు వర్షాలు బాగానే పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సీజన్‌ సగటు వర్షపాతం 566 మిల్లీమీటర్లు కాగా గత యేడు 720 మి.మీ కురిసింది. తెలంగాణలో సాధారణ వర్షపాతం 720.4 మి.మీ కాగా నిరుడు 1043.4 మి.మీ పడింది. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి. అంతకు ముందు, ‘ఎల్‌నినో’ ప్రభావం వల్ల ప్రతికూల పరిస్థితి ఉండి, వర్షాలు కురవక కరువు తలెత్తింది. బంగాళఖాతంలో పేరుకుపోయిన మృతికపొరల్ని తవ్వితీసి, జరిపిన ఓ అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. దక్షిణాసియా దేశాల్లో దీర్ఘకాలంగా రుతుపవన క్రమం, వాతావరణ మార్పు ప్రభావంపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు, తేమ పెరిగి ఎక్కువ విడతలు అధిక, అసాధారణ వర్షాలే కురుస్తున్నట్టు నిర్ధారించారు. ఈ తేడాల్ని రైతులు, వ్యవసాయ నిపుణులు, ప్రభుత్వాధికారులు గుర్తించాలి. అప్పుడే, తగిన చర్యలకు ఆస్కారం. ఈ యేడు కూడా జూన్‌ 3న కేరళ తీరం తాకిన నైరుతి రుతుపవనాలు అత్యంత వేగంగా రెండు తెలుగు రాష్ట్రాలను చేరాయి. 4, 5 తేదీల్లో ఏపీని, 6, 7 తేదీల్లో తెలంగాణను తాకి వర్షాలు కురిపించాయి. రుతుపవనాలు సకాలంలో వచ్చినా, ‘యాస్‌’ తుఫాన్‌ వల్ల మేఘాలు వేగంగా కదిలి ఇక్కడ పెద్దగా పడలేదు. ఉత్తరాదిలో భారీగా కురిసాయి. ఈ తేడాలే కాకుండా వాతావరణ మార్పుల వల్ల రుతు పవనాలు, వాటి గమనం, వర్ష తీవ్రత ఎక్కువ ప్రభావితం అవటం ప్రమాదకరం! వేసవి సౌర ధార్మికతకే నైరుతి రుతుపవనాలు సున్నితంగా ప్రభావితం అవుతాయనేది తప్పుడు భావన అని శాస్త్రీయంగా రుజువైంది.

భౌగోళిక స్థితిని సాంకేతికంగా చెప్పడం కాకుండా వాతావరణ విభాగం లోతైన అధ్యయనాలు జరపాలి, విశ్లేషణలు చేయాలి. రాగల పరిస్థితుల ప్రభావాలను వివరిస్తూ  రైతులకు ఉపయుక్త సమాచారం నిరంతరం ఇవ్వగలగాలి. దాని ఆధారంగా వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు రైతును అప్రమత్తం చేసి, చైతన్యపరచాలి. ఏ ‘వాతావరణ మండలం’లో ఎంత వర్షపాతం ఉంటుంది? ఏం పంటలు వేసుకోవాలి? ఎప్పుడేం చర్యలు? చెప్పాలి. వ్యవసాయ విస్తరణాధికారుల వ్యవస్థను పటిష్టపరచాలి. ఇంతకుమునుపు రైతు చైతన్యయాత్రలు జరిగేవి. ఇప్పుడవన్నీ కాగితాల్లోనే! ఏమంటే, మేం రైతుబంధు పనుల్లో ఉన్నామనో, రైతుభీమా వ్యవహారాల్లో ఉన్నామనో అంటారు. తొలకరికే పులకించిపోయే రైతు ఆశతో విత్తనాలు అలుకుతాడు. సాలు (సాగు యోగ్య స్థితి) వచ్చిందా చూసుకోడు! కనీసం 3 అంగుళాలైనా తడవకుండా, నీరు నేలలో ఇంక కుండా విత్తనాలకు రక్షణ ఉండదు. కొన్నాళ్లు వర్షం జాప్యమైనా... విత్తనాలుగానో, చిన్నపాటి పిలకలుగానో మాడి మసై పోతాయి. విత్తనంతోపాటు రైతు శ్రమ, వ్యయం ఇక గాలికే! ఆర్థికంగా దెబ్బతింటాడు. వాతావరణ విభాగం పరిశీలనలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల పరిశోధనలు, ప్రభుత్వ శాఖల ప్రణాళికలు... వెరసి రైతును ఆదుకోవాలి. రుతుపవన సమాచారం నుంచి సరైన మార్కెట్‌ ద్వారా పంట నగదుగా రైతుల చేతికి వచ్చే వరకు చేయూత ఇవ్వాలి! అప్పుడే మన వ్యవసాయం రైతన్న రాజ్యం! మనదేశం రైతాంగ భారతం! 

మరిన్ని వార్తలు