మళ్లీ ముదురుతున్న కరోనా

25 Feb, 2021 00:23 IST|Sakshi

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి ముప్పు తప్పినట్టేనని దాదాపు అందరూ ఆశిస్తున్న సమయంలో అది కొత్త రూపాల్లో అలుముకుంటున్నదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. దీన్ని కరోనా రెండో దశగా భావించవచ్చునా లేదా అన్నది నిపుణులు నిర్ధారించాకే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఏడు రోజుల సగటు తీసుకుంటే కరోనా వైరస్‌ వ్యాప్తి శాతం పెరిగిన సూచనలు కనిపిస్తున్నాయి. గత సెప్టెంబర్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా 98,000 వరకూ వుండగా, ఆ తర్వాత అది తగ్గుముఖంలో వుంది. ఈ నెల 11న కొత్త కేసుల నమోదు అత్యల్పంగా...అంటే 10,988 మాత్రమే వుండగా ఆ తర్వాత మళ్లీ క్రమేపీ పెరగటం మొదలుపెట్టాయి.

ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్‌లలో కేసుల శాతం శరవేగంగా పెరగటం వల్ల జాతీయ సగటులో అది ప్రతిఫలిస్తోంది. మరికొన్ని రాష్ట్రాల్లో స్వల్ప సంఖ్యలోనైనా అంతక్రితం కన్నా కేసులు పెరుగుతున్నాయి. మొత్తంగా గత 24 గంటల్లో కొత్త కేసులు 30 శాతం పెరిగాయని తాజా సమాచారం. అందుకే కొత్త కేసుల సంఖ్య బాగా పెరుగు తున్న రాష్ట్రాల్లో కరోనా టీకాల జోరు  పెరగాలంటూ కేంద్రం లేఖలు రాసింది. అలాగే దీనికి సంబంధించి రెండో దశ వచ్చే సోమవారం నుంచి ప్రారంభమవుతుందని వివరించింది. ఈసారి 60, అంతకన్నా ఎక్కువ వయసున్నవారికి టీకాలందిస్తారు. 

కొత్తగా బయటపడుతున్న కేసులను పూర్తిగా విశ్లేషించాకే వ్యాధి కారక వైరస్‌ పాతదా, కాదా అనేది తేలుతుంది. ఉత్పరివర్తనం వైరస్‌ ప్రధాన గుణం. ఒకపక్క దాన్ని ఎదుర్కొనడానికి అవసరమైన టీకా తయారీ ప్రక్రియ కొనసాగుతుండగానే ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తున్నకొద్దీ ఏ వైరస్‌ జన్యు అమరికైనా మారిపోతుంటుంది. మహారాష్ట్రలో బ్రిటన్‌కు చెందిన రెండు రకాల వైరస్‌లు–ఎన్‌440కె, ఈ484కె రకం కనబడ్డాయి. ఈ రకాలే కేరళ, తెలంగాణలనుంచి వచ్చిన శాంపిల్స్‌లో కూడా వున్నాయని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) డెరైక్టర్‌ జనరల్‌ చెబుతున్నారు. ఇవిగాక బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో బయటపడిన మరో రెండు రకాల కరోనా వైరస్‌లు కూడా ఇతరచోట్ల కనబడ్డాయి. ఇప్పుడు పెరిగిన కేసుల్లో ఈ రకం వైరస్‌ల శాతమెంతో ఇంకా తేల్చాల్సివుంది.

అలాగే వాటి వ్యాప్తి ఎంత వేగంతోవుందో కూడా చూడాల్సివుంది.  బ్రిటన్‌లో బయటపడిన కరోనా కొత్త రకాలకు మౌలికమైన కరోనా వైరస్‌తో పోలిస్తే 25 నుంచి 40 శాతం అధికంగా వ్యాప్తి చెందే గుణం వున్నదని నిపుణులు తేల్చారు. వైరస్‌ రూపం మార్చుకుంటే దానివల్ల రోగుల్లో కనబడే లక్షణాలు మారతాయి. కరోనా నియంత్రణకు వినియోగిస్తున్న టీకాలు ఈ కొత్త రకాలను ఎదుర్కొనేంత సమర్థత కలిగివున్నాయా లేదా అన్నది తేలాల్సివుంది. అయితే మన శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంపొందించటం టీకా చేసే పనిగనుక వైరస్‌ కొత్త రూపంలో వచ్చినా ఆ వ్యవస్థ తన పని తాను చేస్తుందని నిపుణులు చెబుతారు. కానీ ఎన్‌440కె రకం వైరస్‌ మాత్రం రోగ నిరోధక వ్యవస్థకు దన్నుగా వుండే ప్రతిరక్షక కణాలను బేఖాతరు చేసిందని తాజాగా బయటపడింది.

అంటే ఇప్పుడు రూపొందించిన టీకాకు అది లొంగలేదని అర్థం. ఆ వైరస్‌ రకం జన్యు అమరిక ఎలావుంది... ఇప్పుడు లభ్యమయ్యే ఇతర టీకాలకైనా అది లొంగే స్థితిలో వుందా లేదా అన్నది మరిన్ని పరిశోధనలు చేస్తే తప్ప తేలదు. అందుకోసం విస్తృతమైన డేటా అవసరమవుతుంది.  ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, మరికొన్ని ఇతర రాష్ట్రాలకు కేంద్రంనుంచి ప్రత్యేక బృందాలు వెళ్లాయి గనుక అవి ఆ పనిలో వుంటాయి. వివిధ జంతువుల్లో వుండే వందలాది రకాల కరోనా వైరస్‌లలో మనుషులకు సోకే గుణమున్న వైరస్‌లు ఏడు రకాలని నిపుణులు తేల్చారు. మనుషుల్లో తొలి కరోనా వైరస్‌ను 1965లో కనుగొన్నాక, వాటివల్ల వచ్చే వ్యాధుల తీవ్రత, అందు వల్ల కలిగే ప్రమాదాలూ పెరుగుతూనే వున్నాయి. కోవిడ్‌–19 అటువంటిదే. దానివల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 లక్షలమంది మరణించారు.  

తాజా పరిణామాలు గమనించాక కరోనా వైరస్‌ విషయంలో ఇంతక్రితంలాగే జనమంతా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరని అర్థమవుతుంది. వైరస్‌ బెడద తొలగి పోయిందని చాలామంది ఇప్పటికే భావించటం మొదలుపెట్టారు. బయటికెళ్లినప్పుడు పాటిం చాల్సిన ముందుజాగ్రత్తల్ని గాలికొదిలేస్తున్నారు. మాస్క్‌లు ధరించటం, శానిటైజర్‌ వాడటం తగ్గింది. వేడుకలు, ఉత్సవాలు, ఊరేగింపులు కూడా జోరందుకున్నాయి. భౌతిక దూరం పాటిస్తున్న జాడ లేదు. బయటపడ్డాయంటున్న కొత్త రకం వైరస్‌ రకాల లక్షణాల గురించి విన్నాకైనా ఈ విషయంలో అప్రమత్తత అవసరం.

ఏ రాష్ట్రంలోనైనా కేసులు పెరుగుదల కనబడుతున్నదంటే అక్కడినుంచి రాకపోకలు ఎక్కువగా వుండే ఇరుగుపొరుగు రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోక తప్పదు. ఒకసారి అనుభవమైంది గనుక ముందునుంచీ జాగ్రత్తలు తీసుకుంటేనే లాక్‌డౌన్‌ల బెడద తప్పుతుంది. ఈ లాక్‌డౌన్‌ల విషయంలోనూ కొన్ని చేదు అనుభవాలున్నాయి గనుక ఎక్కడెక్కడ నిబంధనలు కఠినం చేయాలి... ఎక్కడ ఏమేరకు మిన హాయింపులివ్వొచ్చునన్న అంశంలో ప్రభుత్వాలు విచక్షణాయుతంగా ఆలోచించాలి. తక్కువ నష్టంతో మెరుగైన ఫలితాలు సాధించటంపై దృష్టి పెట్టాలి. కేంద్రం మార్గదర్శకాలు అందుకు తగ్గట్టు వుండాలి. 

మరిన్ని వార్తలు