ఆత్మవిశ్వాసమిచ్చే తీర్పు

19 Feb, 2021 00:46 IST|Sakshi

మూడేళ్లక్రితం మన దేశంలో రగుల్కొన్న ‘మీ టూ’ ఉద్యమంలో ఇదొక కీలకమైన మలుపు. పనిచేసేచోట అడుగడుగునా రకరకాల రూపాల్లో వేధింపులు, వివక్ష, అవమానాలు ఎదుర్కొంటూ మౌనంగా కుమిలిపోయే మహిళా లోకానికి ఆత్మసై్థర్యాన్నిచ్చే ఘట్టం. ఎలాంటి సాక్ష్యాధారాలూ లేని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి, తన పరువు దిగజారుస్తున్నారంటూ సీనియర్‌ జర్నలిస్టు ప్రియా రమణిపై కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్‌ వేసిన పరువు నష్టం దావా చెల్లుబాటు కాదని ఢిల్లీ కోర్టు బుధవారం ఇచ్చిన తీర్పు ఎన్నదగినది. ఎంజే అక్బర్‌ పత్రికా సంపాదకుడిగా ఉన్న ప్పుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడేవారని, అసభ్యంగా ప్రవర్తించేవారని పలువురు మహిళలు ఆరోపించారు. అయితే అవన్నీ అబద్ధాలనీ, ఈ అసత్యారోపణలు చేసినవారిపై చట్టపరంగా చర్య తీసుకుంటానని అప్పట్లో అక్బర్‌ హెచ్చరించారు. చివరకు ప్రియా రమణిపై ఢిల్లీ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ‘మీ టూ’ ఉద్యమం తర్వాత మన దేశంలో తొలిసారి బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా సినీ రంగంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి గళమెత్తారు.

ఆ తర్వాత ఫేస్‌బుక్‌ వేదికగా కొందరు మహిళలు తమకెదురైన చేదు అనుభవాలను తెలియజేశారు. అందుకు కారకులెవరో వారి పేర్లతో సహా వెల్లడించారు. అయితే తమ వివ రాలేమిటో, ఆ వేధింపుల స్వభావం ఎటువంటిదో చెప్పకుండా, గోప్యంగా వుండి ఆరోపించే ధోరణి సరికాదని చాలామంది అభిప్రాయపడ్డారు. అది దాదాపు చల్లబడిపోతున్నదని అందరూ అనుకునే సమయంలో ప్రియా రమణి నేరుగా అక్బర్‌ పేరు వెల్లడించి, ఆయన వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల్ని తెలియజేశారు. విచారణ సందర్భంగా అప్పట్లో తన వయసుకూ, ఆయన వయ సుకూ... ఆ సంస్థలో ఆయనకుండే పలుకుబడికీ... తన నిస్సహాయతకూ మధ్య వున్న వ్యత్యాసాన్ని వివరించారు. ఇవి బయటపెట్టడంలో తనకెలాంటి స్వప్రయోజనాలూ, దురుద్దేశాలూ లేవని చెప్పారు. 

ఈమధ్య ‘బ్రాస్‌ నోట్‌బుక్‌’ పేరుతో తన ఆత్మకథను వెలువరించిన ప్రముఖ ఆర్థికవేత్త దేవకీ జైన్‌ 1958లో పాతికేళ్ల వయసులో ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో తనకెదురైన చేదు అనుభవాలనూ, అవి అనంతర కాలంలో తనపై చూపిన ప్రభావాన్ని వివరించారు. ఆ ప్రొఫెసర్‌ అసభ్య ప్రవర్తనను ప్రతిఘటించినందుకు ఉద్యోగం కోల్పోవటంతోపాటు తన ఆత్మ విశ్వాసం ఎలా దెబ్బతిన్నదో తెలిపారు. లైంగిక వేధింపులు ఎదుర్కొనే ప్రతి మహిళా ఇలాంటి దుస్థితిలోనే పడతారు. ఢిల్లీ కోర్టు మేజిస్ట్రేట్‌ అన్నట్టు ఇలాంటి వేధింపులన్నీ మహిళ ఒంటరిగా వున్నప్పుడే జరుగుతాయి. వేధింపులకు పాల్పడే మాయగాళ్లు నలుగురిలో వున్నప్పుడు మర్యాదస్తుల్లా ప్రవ ర్తిస్తారు. మంచివారిలా మెలుగుతారు. అందువల్లే బాధిత మహిళ సహోద్యోగులకు చెప్పడానికి సంశయిస్తుంది. చెప్పినా తననే దోషిగా పరిగణిస్తారన్న భయం ఆమెను ఆవహిస్తుంది. చేస్తున్న ఉద్యోగం పోతుందేమోనని సందేహిస్తుంది. దీర్ఘకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దుర్మార్గాన్ని ‘మీ టూ’ ఉద్యమం బద్దలుకొట్టింది.

దీనికి ముందు మన దేశంలో ఎవరూ ప్రశ్నిం చలేదని కాదు. రాజస్తాన్‌ దళిత మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి కొన్ని స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ వర్మ నేతృత్వంలోని ధర్మాసనం 1997లోనే కీలకమైన తీర్పు వెలువరించింది. పనిచేసేచోట మహిళలకు వేధింపులు ఎదురుకాకుండా వుండటానికి తీసు కోవాల్సిన చర్యలేమిటో వివరిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎలాంటి చేష్టలు లైంగిక వేధింపులకిందికొస్తాయో ఆ మార్గదర్శకాలు వివరించాయి. ఆ తర్వాత పనిచేసేచోట లైంగిక వేధింపుల్ని నిరోధించేందుకు 2013లో ఒక చట్టం వచ్చింది. 

అయితే విషాదమేమంటే చట్టపరంగా ఎన్ని రక్షణలు కల్పించినా వేధింపులూ, వివక్ష సమసి పోలేదు. అటువంటి మహిళలకు ధైర్యాన్నిచ్చే విధంగా సంస్థలు తగిన చర్యలు తీసుకోకపోవటం, ప్రభుత్వాలు సైతం పట్టనట్టు వ్యవహరించటం అందుకు కారణం. రెండున్నర దశాబ్దాలక్రితం జరిగిందంటూ తనపై ప్రియా రమణి చేసిన ఆరోపణలవల్ల పాత్రికేయుడిగా, పత్రికా సంపాద కుడిగా జీవితపర్యంతం సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయంటూ అక్బర్‌ చేసిన వాదనను మేజిస్ట్రేట్‌ రవీంద్ర కుమార్‌ పాండే అంగీకరించలేదు. మీ పరువు కోసం ఒక మహిళ జీవించే హక్కును పణంగా పెట్టలేమని ఆయన వ్యాఖ్యానించారు. వేధింపులు ఎదుర్కొనటమేకాక, ముద్దాయిగా బోనులో నిలబడవలసివచ్చిన బాధితురాలి స్థితిగతుల్ని అవగాహన చేసుకుని ఎంతో పరిణతితో మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఈ తీర్పు ఆహ్వానించదగ్గది.

గత రెండేళ్లుగా ఈ కేసు విచారణ కోసం ప్రియా రమణి 50 సార్లు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లాల్సివచ్చింది. కేసులో ఓడిపోతే చెల్లించాల్సిన పరిహారం సంగతలావుంచి, క్రిమినల్‌ కేసు ఎదుర్కొనాల్సివచ్చేది. కానీ ఆమె నిబ్బరంగా పోరాడారు. ఆమె తరఫు న్యాయవాది రెబెకా జాన్‌ సమర్థవంతమైన వాదనలు వినిపించారు. ఢిల్లీ కోర్టు వెలువరించిన తీర్పు పనిచేసే చోట నిత్యం వేధింపులు ఎదుర్కొంటున్న లక్షలాదిమంది బాధిత మహిళలకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. దోషులను బయటికీడ్చేందుకు దోహద పడుతుంది. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు