‘చిరు’ ప్రయత్నం చేయాల్సిందే!

2 Dec, 2022 02:21 IST|Sakshi

కొన్ని సందర్భాలు ఆగి ఆలోచించుకోవడానికి ఉపకరిస్తాయి. గతాన్ని సింహావలోకనం చేసుకొమ్మం టాయి. భవిష్యత్‌ కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి. ఐరాస ప్రకటించిన ‘అంతర్జాతీయ చిరుధాన్య సంవ త్సరం’ సరిగ్గా అలాంటి సందర్భమే. మన దేశం చొరవతో ఈ ప్రకటన రావడం సంతోషించదగ్గ విషయం.

అదే సమయంలో చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగంలో ప్రపంచమే కాదు... ముందుగా మనమెక్కడ ఉన్నామో పర్యాలోచించుకోవాలి. ఆరోగ్య ‘సిరి’గా పేరు తెచ్చుకున్న విలువైన పోషకాహారానికి మనం నిజంగానే ఆచరణలో విలువ ఇస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. గత నాలుగైదు దశాబ్దాల్లో మన దేశంలో ఈ చిరుధాన్యాల ఉత్పత్తి 2.3 – 2.4 కోట్ల టన్నుల నుంచి 1.9– 2 కోట్ల టన్నులకు పడిపోయిందట. ఈ లెక్కలు కొత్త సంవత్సర కర్తవ్యానికి ఓ మేలుకొలుపు. 

జనవరి 1 నుంచి చిరుధాన్య వత్సరంగా ఉత్సవం జరుపుకొనేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. నిజానికి, 2018లోనే భారత సర్కార్‌ ఆ ఏడాదిని జాతీయ చిరుధాన్య వత్సరంగా తీర్మానించింది. చిరుధాన్యాలను ‘పోషక సంపన్న ఆహారధాన్యాలు’గా అధికారికంగా గుర్తించి, ‘పోషణ్‌ మిషన్‌ అభియాన్‌’లో చేర్చింది. ఆపైన 2023ను అంతర్జాతీయ చిరుధాన్య వత్సరమని ప్రకటించాల్సిందిగా ఐరాసకు ప్రతిపాదన పెట్టింది.

మరో 72 దేశాలు మద్దతునిచ్చాయి. అలా ఈ పోషక ధాన్యాలను ప్రోత్సహించాలన్న మన చొరవ అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తెచ్చుకుంది. చివరకు 2021 మార్చి 5న ఐరాస సర్వప్రతినిధి సభ చిరుధాన్య వత్సర ప్రకటన చేసింది. 

ప్రపంచ పటంపై చిరుధాన్యాలను మళ్ళీ తీసుకురావడానికి ఇది భారత్‌కు మంచి అవకాశం. ఈ పోషకధాన్యాల ఉత్పత్తి, మార్కెటింగ్, ఆ ధాన్యాల ఉత్పత్తులకు సమర్థమైన మార్కెటింగ్‌ వసతులు కల్పించడానికి నడుం కట్టాల్సిన తరుణం. ఈ ‘సిరి’ సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ, భారత జాతీయ వ్యవసాయ సహాయక మార్కెటింగ్‌ సమాఖ్యలు అక్టోబర్‌ మొదట్లో అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి.

ప్రధాని మోదీ సైతం ఆ మధ్య తన రేడియో కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’లోనూ ఈ పోషకధాన్యాల ఉత్పత్తితో రైతులకూ, వినియోగంతో ప్రజలకూ కలిగే లాభాలను ప్రస్తావించారు. ఇవన్నీ వినడానికి బాగున్నాయి. కానీ, ఆచరణలో ఇంకా వెనకబడే ఉన్నాం.

దేశంలో దాదాపు 80 శాతం మెట్టభూములైనా, 20 శాతం మాగాణితో వచ్చే వరి, గోదుమల పైనే ఇప్పటికీ అర్థరహితమైన మోజు! అదనులో రెండు వర్షాలు కురిస్తే చాలు... ఆట్టే నీటి వసతి అవసరం లేకుండానే మంచి దిగుబడినిచ్చే చిరుధాన్యాలు నిజానికి మన శీతోష్ణాలకు తగినవి. వీటి లోనే పోషకాలు ఎక్కువ. అయినా చిరుధాన్యాల్లో పెద్ద గింజలైన జొన్న, సజ్జ, రాగులన్నా, చిన్న గింజలుండే కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, వరిగెల లాంటివన్నా అటు రైతులకూ, ఇటు వినియోగదారులకూ చిన్నచూపే. పండుగపూట పరమాన్నంలా వరి వండుకొని తినగలిగిన తాతల కాలం నుంచి ఇవాళ నీటిపారుదల ప్రాజెక్టులతో పుష్కలంగా వరి పండించగలగడం పురోగతే. ఆ మోజులో మన ఒంటికీ, వాతావరణానికీ సరిపోయే జొన్నలు, సజ్జల్ని వదిలేయడమే చేస్తున్న తప్పు. 

వరి, గోదుమల పంటకాలం 120 – 150 రోజులైతే, సిరి ధాన్యాలు 70–100 రోజుల్లోనే చేతికొ స్తాయి. నీటి వసతి ఆట్టే అవసరం లేని వర్షాధారిత మెట్టభూములు, కొండ ప్రాంతాల్లో ఈ ధాన్యాలను ప్రభుత్వం ప్రోత్సహించాలంటున్నది అందుకే. విదేశాంగ మంత్రి అన్నట్టు ‘కోవిడ్, యుద్ధ వాతావరణం, పర్యావరణ సమస్యలు’ అంతర్జాతీయ ఆహార భద్రతకు సవాలు విసురుతున్న వేళ చిరుధాన్యాల సాగు, వాడకం పట్ల అవగాహన పెంచడం పరిష్కారం. అలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గండం నుంచి గట్టెక్కించడానికీ ఈ ధాన్యాలే మందు. క్రీ.పూ. 3 వేల నాటి సింధునదీ పరివాహక ప్రజల కాలం నుంచి ఇవే తినేవాళ్ళం. ఇవాళ ప్రపంచంలో అనేక రకాలు ముందు మన దేశంలోవే. 

ఇప్పుడు మళ్ళీ ఆ పంటలకు ప్రభుత్వం ఆసరానివ్వాలి. ఈసరికే వాటిని పండిస్తున్న పశ్చిమ రాజస్థాన్, దక్షిణ కర్ణాటక, తూర్పు మధ్యప్రదేశ్‌లలో రైతులకు ప్రోత్సాహకాలివ్వాలి. ఒక నిర్ణీత ప్రాంతాన్ని ఒక నిర్ణీత ధాన్యం సాగుకు కేంద్రంగా మలచడం లాంటివీ చేయవచ్చు. ఆ ప్రాంతీయుల ఆహారంలో ఆ ధాన్యాన్ని అంతర్భాగం చేయగలగాలి.

అందుకు ముందుగా ప్రజలకు వీటి వినియోగాన్ని అలవాటు చేయాలి. ఇక, ఫలానా ధాన్యంతో ఫలానా రోగం పోతుందని స్వతంత్ర ఆహార శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ప్రయోగపూర్వకంగా ఏళ్ళకొద్దీ చెబుతున్నాయి. పరిశోధన లతో వాటిని నిరూపించే బాధ్యత ప్రభుత్వానిది. భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ లాంటివి ఆ పని తలకెత్తుకోవాలి. దాని సత్ఫలితాలు మరిందరిని సిరిధాన్యాల వైపు మళ్ళిస్తాయి. 

భూతాపం పెరిగిపోతున్న వేళ ఎండలు మండేకొద్దీ దిగుబడి పడిపోయే వరి కన్నా వేడిని తట్టు కొని దిగుబడినిచ్చే చిరుధాన్యాలకు ఓటేయడం వివేకం. ప్రపంచంలో సగం మంది పోషకాహారలోప పీడితులు గనక వారికీ ఈ ధాన్యాలే శ్రీరామరక్ష. ఈ వ్యావసాయిక జీవవైవిధ్యాన్ని కాపాడేలా కేంద్రం ‘మిల్లెట్‌ మిషన్‌’ ప్రకటించింది. కర్ణాటక, ఒరిస్సా లాంటివి అందులో దూసుకుపోతు న్నాయి.

రేషన్‌ షాపుల్లో సిరిధాన్యాలను ఇవ్వడం మొదలు దేశంలోని 15 లక్షల స్కూళ్ళు, 14 లక్షల ప్రీస్కూల్‌ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ ధాన్యాలను మధ్యాహ్న భోజన పథకంలో భాగం చేయగలిగితే భేష్‌. ఇలాంటి ప్రాథమిక ఆలోచనల్ని పటిష్ఠంగా అమలు చేస్తే– ఆహార భద్రతలో, పోషకా హార విలువల్లో బలమైన భారతావని సాధ్యం. చిరుధాన్య నామ సంవత్సరాలు సార్థకమయ్యేది అప్పుడే! 

మరిన్ని వార్తలు